శ్రీరాముని చేతిలో హతుడైన "శంభుకుడు" - అచ్చంగా తెలుగు

శ్రీరాముని చేతిలో హతుడైన "శంభుకుడు"

Share This

శ్రీరాముని చేతిలో హతుడైన "శంభుకుడు"

అంబడిపూడి శ్యామసుందర రావు


మర్యాద రాముడు ధర్మ పరిపాలకుడు అయిన శ్రీరాముడి గురించి విమర్శించటానికి రెండే రెండు అంశాలు ఉన్నాయి మొదటిది సీతమ్మవారిని అడవులకు పంపటం, రెండవది తపస్సు చేసుకుంటున్న శుద్రుడైన శంభుకుడిని వధించటం (కారణాలు ఏమైనా) ఈ రెండు వాల్మీకి రామాయణములో లేనివి.

శంభుకుడి గురించి వాల్మీకి రామాయణములో ఉండదు. ఉత్తర రామాయణము లో 74, 75, 76 వ సర్గలలో సమగ్ర వివరణ ఉంది. కవిరాజుగా పేరుగాంచిన త్రిపురనేని రామస్వామి గారు శంభుక వధ అనే నాటకాన్ని రచించి శంభుకుడికి పాపులారిటీ సృష్టించారు. ధర్మావతారుడుగా పూజలందుకునే రాముడు మహా తపస్సు చేస్తున్న శంభుకుణ్ని కేవలం శూద్రుడైన నేరానికి గాను నిస్సంకోచంగా వధించాడనటం ఈ నాటకం ఇతివృత్తం. అలాగే ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు కూడా రామాయణ విషవృక్షం అనే నవల విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్షము అనే కావ్యానికి ప్రతిగా వ్రాసింది. ప్రస్తుతము శంభుకుడి వధ గురించి తెలుసుకుందాము.

శంభుకుడు రాక్షసుడు, ప్రజాకంటకుడు కాకపోయినప్పటికీ శ్రీరాముడు తపస్సు చేసుకుంటున్న శంభుకుడిని వధించటానికి అప్పటి పరిస్థితులు కారణాలు గురించి తెలుసుకుందాము. ఆనాటి యుగ ధర్మం అంటే త్రేతాయుగ ధర్మ ప్రకారం ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే ఆ రాజ్యంలో అకాల మరణాలు ఉండవు. ఒకవేళ అకాల మరణాలు సంభవిస్తే ఆ రాజ్యంలో ఎక్కడో అధర్మం యుగ ధర్మానికి భిన్నముగా జరిగిందని అర్ధం. శ్రీరాముడు తన రాజ్యాన్ని ధర్మ యుక్తంగా పరిపాలిస్తున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు దుఃఖిస్తూ అకాల మృత్యువుకి లోనైన తన కుమారుడి కళేబరం తీసుకువచ్చి రామునికి చూపిస్తాడు."ఓ శ్రీరామ నేనే పాపం చేశానో నా కుమారుడు ఇలా అకాల మృత్యువుకి లోనైనాడు, నా పాపంతో పాటు ఈ రాజ్యానికి రాజువైన నీ దోషము కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఇతర రాజ్యాలలో ఎటువంటి అకాల మరణాలు లేవు. నీ ఈ రాజ్యంలో నీ దృష్టికి రాకుండా ఎక్కడో అధర్మం జరిగి ఉండవచ్చు, కాబట్టి నీవు ఆ అధర్మాన్ని నిర్మూలిస్తే ఇది కేవలం అకాల మృత్యువు కనుక నా పుత్రుడు తిరిగి బ్రతుకుతాడు. నీవు ఈ పని చేయకపోతే నేను, నా భార్య ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాము" ఆని ఆ వృద్ద బ్రాహ్మణుడు శ్రీరాముని సమక్షంలో విలపించాడు.

"ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటున్న శంబూకుని తపస్సు వలన ఈ బాలుని మరణం ఎలా సాధ్యం నాకు ఇది సమంజసం అనిపించడం లేదు" అన్న శ్రీరాముని మాటకు గురువు వశిష్ఠుడు "ఇది కార్యకారణ సంభందాల కోసం ఆలోచించే సందర్భం కాదు వంశగురువుగా నేను చెబుతున్నాను శాస్త్ర ప్రకారమే ఇది న్యాయం అని నేను నమ్ముతున్నాను. నీవు ధర్మము తప్పిన వారిని వధించు "అని అంటాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి యుగ ధర్మాలను వివరిస్తు ఈ బాలుడికి అకాల మృత్యువు ఎలా వచ్చిందో చెపుతాడు “కృత యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సులను ఆచరించడానికి యోగ్యులు, వారికి మాత్రమే ఉపదేశముండును. ఇతర మూడు వర్ణముల వారికి ఆ అర్హత లేదు.త్రేతాయుగములో బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపశ్చర్యలకు యోగ్యులే అవడంతో వారి ఇరు వర్ణముల వారూ సమానులుగా ఉంటారు. ఈ యుగములో, ఇతర వర్ణముల వారికి తపస్సు చేయుటకు అనుమతి, ఉపదేశం ఉండదు రాబోయే ద్వాపర యుగములో బ్రాహ్మణ క్షత్రియులతో పాటు వైశ్యులకు కూడా అర్హత కలిగి వారు కూడ తపస్సు చేయవచ్చు.

భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే |

అధర్మః పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మనః || (ఉత్తరకాండ 74వ సర్గ – 27వ శ్లోకము)

కాబట్టి యుగ ధర్మమును ఆచరించి నీ రాజ్యము అంతటా సంచరించి ఎవరైనా అధర్మమును ఆచరిస్తూ ఉంటే వారిని ఒక రాజుగా సంహరించి ధర్మమును నిలబెట్టుము. తద్వారా అకాల మృత్యువు బారిన పడిన బాలుడు పునర్జీవుతుడు కాగలడు.” అని నారద మహర్షి చెపుతాడు.

అది విన్న రాముడు తన రాజ్యమంతటా తిరుగుతూ శంబూకుని వద్దకు చేరెను. అక్కడ శంబూకుడు తల్ల క్రిందులుగా చెట్టుకు వ్రేలాడుతూ క్రింద అగ్నిని ఉంచుకొని తీవ్ర తపస్సును చేస్తున్నాడు. రాముడు శంభుకుని దగ్గరకు వచ్చి “ఓ వ్రత నిష్ఠాగరిష్ఠుడా నేను దశరధ కుమారుడైన శ్రీ రాముడిని నీవు ఎంతో ధన్యుడవు. తపోవృద్ధుడా నీ జన్మ ఎట్టిది? నీ శక్తి సామర్ధ్యములు చాలా ధృడమైనవిగా కనిపిస్తున్నాయి. కావున కుతూహలముతో ఈ విధంగా అడుగుతున్నాను నీవు ఈ ఘోర తపస్సు ఏమి ఆశించి ఎందుకు చేయుచున్నావు? నీకు కావలసిన వరమేమి? స్వర్గ భోగములు కావలెనా, లేక వాటికి మించినవా తెలుపుము ” అని అడుగుతాడు. దానికి శంబూకుడు “శ్రీరామా నేను శూద్రుడను నా పేరు శంబూకుడు. ఈ శరీరముతోనే దివ్యత్వమును పొందగోరుచున్నాను. నేను దేవలోకమును జయింపదలచి ఇట్టి ఉగ్రతపస్సును పూనుకుంటిని, నా పలుకులు నిజము” అని తెలియజేస్తాడు.

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు. కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు. ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. . కానీ, కొందరు రాక్షసులు స్వర్గాన్ని, దేవతలను జయించాలని తపస్సులు చేసారు.మరి, శంభుకుడు స్వార్ధపూరితమైన చెడ్ద మరియు అసహజమైన కోరికలతో తపస్సును మొదలుపెట్టాడు. ఏ జీవి శరీరంతో స్వర్గానికి వెళ్ళడం వీలు కాదు. అది ప్రకృతి నియమం. ఈ జన్మలో చేసిన తపస్సు, యజ్ఞం, లేక ఏ ఇతర సత్కార్యం వల్ల వచ్చిన పుణ్యంతో మరణానంతరం మాత్రమే స్వర్గానికి వెళ్లగలరు. ఈ ప్రకృతి నియమాన్ని భంగం చేస్తూ శంబూకుడు తపస్సు చేయడం లోక వ్యవస్థకు హానికరం అందుకే అకాల మరణం వంటి ఉత్పాతాలు కాబట్టి రాముడు శంభుకుడిని వధించాడు ఆ క్షణమునే, అకాల మృత్యువుబారిన పడిన బ్రాహ్మణుడి కుమారుడు, తిరిగి జీవితుడయ్యాడు. అయితే, అంత కఠోర తపస్సు చేసిన శంభూకుడు, రాముని చేతిలో హతమారి, స్వర్గస్థుడయ్యాడు. ఆ విధంగా చూసుకున్నా కూడా, శ్రీ రామ చంద్ర మూర్తి చేతిలో మరణం, శంభూకుడికి స్వర్గ ప్రాప్తిని చేకూర్చింది.

శంబూక వధ అన్యాయంగా జరిగింది, అతడు శూద్రుడు కాబట్టి రాముడు చంపాడు అని ఈ కలియుగములో మనం చర్చలు చేసుకోవడము సమంజసము కాదు. ఎందుకంటే ఆ యుగంలోని ధర్మము అది. ఆ యుగములో వారు అటువంటి ఉగ్రతపస్సు చేయడం చేత ధర్మానికి హాని కలుగుతుంది కనుక.శూద్రుడైన శంబూకుడు ఆ యుగ ధర్మముకు విరుద్ధముగా తపస్సు చేయడం వలన వధ జరిగినది కానీ కేవలం శూద్రుడు కావడం కాదు.. రామ రాజ్యంలో ధర్మబద్ధంగా ఉన్న శూద్ర వర్ణం వారు అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు అనే శ్లోకాలు రామాయణములో అనేకం ఉన్నాయి.

రాముడు శబరి ఆప్యాయంగా ఇచ్చిన పండ్లను స్వీకరించారు. గుహుని తక్కువగా చూడలేదు. ఎంతో ఆప్యాయంగా చూశారు. జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాముల వారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు. సనాతనధర్మం అంటరానితనాన్ని ప్రోత్సహించలేదు. సమాజంలోని కొందరు స్వార్ధపరుల వల్ల అంటరానితనం వచ్చి ఉంటుంది. రాముడు అన్నీ వర్ణాల వారిని సుఖశాంతులతో జీవించేలా చూసుకున్నాడు అనేది వాల్మీకి రామాయణంలో రామరాజ్య వర్ణనలో స్పష్టంగా చూడవచ్చును అధర్మవర్తనుడైన ఒక శూద్రుడుని వధించాడు.

అధర్మవర్తనులైన క్షత్రియులనూ సంహరించాడు. అంతకు ముందు పరశు రాముడు కూడా ఎందరో అధర్మపరులైన క్షత్రియులను సంహరించాడు. అలాగే రాముడి ఆదేశానుసారం శత్రుఘ్నుడు అధర్మము చేసిన గంధర్వుడిని సంహరించడం కూడా చూడవచ్చును. అదే రామాయణంలో అధర్మపరుడైన, సాక్షాత్ బ్రహ్మ వంశముకి చెందిన రావణ బ్రహ్మను రాముడు సంహరించాడు ఇవన్నీ రాముడి ధర్మాన్ని కాపాడటానికి చేసినవే తప్ప ఏ వర్ణము పై ఆగ్రహముతో కాదు ఆ విధముగా రాముడు అధర్మపరులైన వారిని సంహరించి పదకొండు వేల సంవత్సరాల రామరాజ్యంలో అన్నీ వర్ణాల వారూ ఆనందముగా సుఖ సంతోషాలతో జీవించారు అనేది ప్రామాణికమైన సత్యం..

రాజ్యాంగాన్ని రాసిన డా. బి.ఆర్ అంబెద్కర్, రాముడి భక్తుడు. ఆయన రాసిన రాజ్యంగ పుస్తకంలోని మొదటి పేజిలో, సీతారాముల ఫోటోను కూడా మనం చూడవచ్చు. అయితే, ఈ శంభూక వధ అంశంపై, అంబెద్కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. dr. ambedkars speeches and writings, అనే పుస్తకం, vol-1, page 61లో ఈ విధంగా ఉంది ‘శిక్షాస్మృతి లేకుండా, చాతుర్వర్ణ్య ఆదర్శం సాకారం కాదని, రామాయణం లోని శంభూకుడిని చంపిన కథ ద్వారా నిరూపించబడింది. కొంతమంది రాముడిని నిందించినట్లనిపిస్తుంది. ఎందుకంటే, కారణం లేకుండా శంభూకుడిని చంపాడని. కానీ, శంభూకుడిని చంపినందుకు, రాముడిని నిందించడమంటే, పరిస్థితిని మొత్తం తప్పుగా అర్థం చేసుకోవడమే. రామ రాజ్యమనేది, చాతుర్వర్ణ్యం మీద ఆధారపడిన రాజ్యం. రాజుగా, రాముడు చాతుర్వర్ణాన్ని నిర్వహించడానికే కట్టుబడి ఉన్నాడు. తన వర్గాన్నిఅతిక్రమించి, బ్రాహ్మణుడిగా ఉండాలనుకునే శూద్రుడైన శంభూకుడిని చంపడం, ఆయన కర్తవ్యం. రాముడు శంభూకుడిని చంపడానికి కారణం ఇదే.’ఆ యుగంలో, రాముడు ఒక

రాజుగా చేసినది సరైనదని, అంబేద్కర్ కూడా తన మనోభావాన్ని వెల్లడించారు.

***

 

No comments:

Post a Comment

Pages