ఎన్నారై మూర్తి - అచ్చంగా తెలుగు

ఎన్నారై మూర్తి

(మా నర్సాపురం కథలు)

భావరాజు పద్మిని


శ్రీ వీరవేంకట సుబ్రహ్మణ్య వాసుదేవ సూర్యనారాయణ మూర్తి... అమెరికా వెళ్లొచ్చాకా ఎన్నారై మూర్తయిపోయాడు మా నర్సాపురంలో.


"గోదారినీళ్లు దోసిట్లో పుక్కిటబట్టి తాగుతా పెరిగిన మూర్తికి అదేంటో, ఇప్పుడు 'మినరల్ వాటర్' తప్ప పడట్లేదు. రాయ్ పేట వీధుల్లోని మట్టిలో పొర్లుతా, ఒకపక్క ముక్కుచీవిడి కారుతా ఉంటే, మరోపక్క తొడుక్కున్న లాగూ జారతా  ఉంటే, దేన్ని సవరించుకోవాలో తెలీక మెలికలు తిరుగుతా ఇచిత్రపు ఏషాలేసిన మూర్తికి ఇప్పుడు 'డస్ట్ ఎలర్జీ' అంట!"


"హ్హహ్హహహ...."


"గాడిద మీద కూర్చుని ఊరేగుతా, గేదెల్ని, పందుల్నీ దొరికిన కర్రపుల్లతో అదిలిస్తా, వాన పడ్డప్పుడు మురుక్కాలవలో కాగితపు పడవలొదిలి నోరు తెరుచుకు చూస్తా ఉండే మూర్తికి... ఏండోయ్, ఇంటన్నారా... ఇప్పుడు మా నరసాపురం 'డర్టీ ప్లేస్' ఐందంట!"


"హ్హహ్హహహ...."


వలంధర రేవులో రావిచెట్టు కిందున్న సిమెంట్ కుర్చీలో కూర్చుని, సూరిగాడి మాటలు ఇంటా పగలబడి నవ్వుతా ఉన్నారు అతని జతగాళ్లు సుడిగాలి రాజు, రవి. 


"అద్సర్లేగానీ, ఇక్కడంత లెవెలు పోయే ఎన్నారైల కష్టాలు చెప్తా, ఇనండి!" అంటా వచ్చి వోళ్ల పక్కన్జేరాడు చదువుకని అమెరికాయెళ్లి, అక్కడ ఉండలేక తిరిగొచ్చేసిన కృష్ణ. 


"ఊరుకోవోయ్, నోట్లోకి పదివేళ్లెల్లేంత సంపాయిస్తా చల్లగదుల్లో కూకుని, తెల్ల దొరసానుల్ని జూస్తా ఉండే వోళ్లకేం కట్టాలుంటాయ్! మరీనూ!" తీసి పారేసాడు సూరిగాడు.


"మరదేరా తెలీనితనవంటే! గోదారన్ని కష్టాలుంటాయ్ వోళ్లకి, కొన్ని సూట్లో, కొన్ని బూట్లో కుక్కుకుని, కొన్నిటికి టైతో ఉరేసీసి దర్జాగా తిరుగుతా ఉంటారు. ఒకటొకటే చెప్తా ఇనండి." అంటన్న కృష్ణ మాటలకి ఆసక్తిగా ముందుకొంగారు గాలిరాజు, రవి. సుడిగాల్లాగా ఊళల్లో వార్తలన్నీ మోసుకొస్తా ఉంటాడని రాజును అంతా గాలిరాజంటారు నేస్తగాళ్లంతా.


"ఒరేయ్, అమెరికా ఎళ్లినోడు మన దృష్టిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. కానొరే, ఈళ్లు అక్కడ నానా తిప్పలు పడతా, బెండకాయలు ధరెక్కువని క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లూ తింటా డాలరు డాలరూ కూడబెడతారా... ఏనుగు మింగిన ఎలగపండులా, ఒక్కసారి ఇండియా వచ్చెళ్తే అయ్యన్నీ అయిపోతయ్ రా! అంతే కాదు, క్రెడిట్ కార్డుల మీద మూడేళ్లకి సరిపడా అప్పులౌతయ్!"


"నిజవే గురూ! ఓసారి ఎన్నారై మూర్తి ఇవే చెప్పుకుని, కప్పలా బావురుమన్నాడు! ఏం ఖర్చులవీ, ఐబాబోయ్!" అంటా నోరు తెరిచేసాడు గాలిరవి.


"అంతేకాదొరేయ్! ఇదేశాలు ఎల్లినోడు 'ఆపద్ధర్మ ఎటియం' ఐపోతాడు‌. కుటుంబంలో, స్నేహితుల్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా డబ్బులడగడానికి మొదట ఈడే గుర్తొస్తాడు. పాపం ఇంత దూరంలో మనోళ్లు కష్టాల్లో ఉన్నారు కదా అని చాలావరకు వోళ్లు సాయం చెయ్యాలనే అనుకుంటారు. కానీ ఓ పక్క విదేశాలు ఎళ్లడానికి తీసుకున్న లోన్లనీ, తెలుగు సంఘాలనీ, గుళ్లూ గోపురాలని, కుటుంబ ఖర్చులనీ, అన్ని పక్కలా సర్దుబాటు చేసుకుంటా ఉండే సరికి, ఎక్కడ్నుంచీ తేవాలో తెలీక తికమక పడతారు. ఇవ్వలేదంటే అందర్లో చెడ్డపేరు, ఇస్తే క్యూలో ఎనకమాలే ఇంకోళ్లు తయారు... అందుకే ఇచ్చీఈనట్టిస్తే గోల్లేదు!"


"ఔన్రా బావా. మొన్నామజ్జ మన వీర్రాజు గారి బామ్మర్దికి ఏదో ఆపరేషన్ జెయ్యాలని ఎన్నారై మూర్తిని పాతికవేలడిగితే ఐదువేలే పంపాడని, ఎవరి దగ్గరో తిడతా ఉంటే ఇన్నాను" అన్నాడు గాలిరాజు. 


"అసలొరే, అత్తారబత్తంగా పెరిగి, ఏ పనీ చేయనోళ్లందర్నీ అమెరికా పంపేస్తే, దెబ్బకి దార్లో పడతారు. అక్కడేదో సుఖవంటారు గానీ, పనోళ్లుండరూ, పాడూ ఉండరొరే! ఇక్కడున్నప్పుడు తాగిన కాఫీగ్లాసు తీసి అటు పెట్టనోడు కూడా అక్కడ వంటొండుకుంటా, గిన్నెలు కడుక్కుంటా, బట్టలారేస్తా ఉంటే చూడొరే, భలే సరదాగా ఉంటది. ఇంక చలికాలం వచ్చిందంటే ఇంటితోపాటు, మంచు గప్పిన కార్లు తుడుచుకోడానికే జీవితాలు చాలవు. పీత కష్టాలు పీతవనీ...!" అంతా ఇంటా ఉంటే, మరింత ఉత్సాహంతో‌ చెబుతా పోసాగాడు కృష్ణ.


"పీతా నేదూ నత్తా నేదూ... అందరలాగే ఉంటారా ఏంది? జాయిగా మారాజుల్లా అక్కడ కూకోని, ఇల్లూ వాకిలీ కొంటా, ఒక్కో మెట్టే ఎదుగుతా ఉంటారు. ఎన్నారై మూర్తివి ఎన్ని ఫొటోవులు, ఈడియోలు చూళ్లేదూ? రంగద్దాలు, శుభ్రంగా ఉండే పరిసరాలు... స్వర్గంలా ఉంటాది. అసలయ్యన్నీ కాదురా! సుబ్బరంగా అమెరికా పోయినోడివి అక్కడే ఉండక, నువ్వెందుకు తిరిగొచ్చినట్టు?" ఉడుకాపుకోలేక ఇక నేరుగా బాణం సంధించాడు సూరిగాడు‌.


"ఆ మాట నిజవే! స్వర్గమేరోయ్... కానీ త్రిశంకు 

స్వర్గం.‌ ఇక్కడ పెళ్లిళ్లూ, శుభాలు జరిగినప్పుడు 'నేను వెళ్లలేకపోయానని' బాధ! అయినోళ్లెవరైనా అనుకోని కష్టాలు పడ్డప్పుడు, కాలం చేసినప్పుడు కనీసం 'కడసారి చూపుకు నోచుకోలేకపోయామని' బెంగ! పోనీ వచ్చినప్పుడన్నా అందర్నీ చూసి పోదామంటే, షిర్డి, తిరపతి, కాశీ లాంటి‌ పుణ్యక్షేత్రాలకే వారం పదిరోజులెగిరిపోద్ది. అటుపైన మిగతా రోజుల్లో సగం హైదరాబాద్ ట్రాఫిక్లో అయిపోద్ది. ఈళ్లు కలుద్దామన్నా ఆళ్లు ఖాళీలేదంటారు.‌ ఆళ్లకి ఖాళీ ఉండేపాటికి ఈళ్లు సగం తీరిన ఆశలతో మళ్లీ తిరుగు ప్రయాణానికి ఇమానంలో ఉంటారు. ఒరేయ్! అక్కడ జాయిగా ఉండక ఎందుకు తిరిగొచ్చానంటావా? అడిగావుగాబట్టి  అసలు సంగజ్జెబుతా ఇను." అంటూ కృష్ణ ఒక్క క్షణం ఆగి, అందరి ముఖాల్లోకి చూసాడు. అతనేం చెప్తాడో అన్న ఉత్సుకత అందరిలో!


"ఒరేయ్! నాకెందుకో అక్కడున్నంతకాలం పరాయి చోట ఉన్నట్టే ఉండేదిరా! అక్కడ గాలిలో ఏదో వెలితి, శూన్యం. ఇక్కడలా ప్రశాంతంగా, పవిత్రంగా అనిపించీది కాదు. ఎన్ని దర్జాలున్నా మనసులో ఏదో లోటు. కారణమేంటా అని చాన్నాళ్లు ఆలోచించగా, ఆలోచించగా తెలిసింది... నా దేహం అక్కడుంది కానీ, నా ఆత్మ‌ఇక్కడే ఈ‌నర్సాపురం గోదారొడ్డున, ఈ మట్టిలో, ఈ ఊరి పరిసరాల్లోనే ఉండిపోయిందిరా! మడిసొక చోట, మనసొకచోట అన్నట్టు ప్రాణమొప్పక ఇక తిరిగొచ్చేసాను! కలోగంజో ఇక్కడే సంపాయించుకు తింటా గానీ ఆ పేకమేడలు నాకొద్దురా!"


ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం! తర్వాత అప్రయత్నంగా చప్పట్లు చరిచాడు సూరిబాబు. అతనితో శృతి కలిపారు మిగతా ఇద్దరూ. 


ఈళ్ల సందట్లో ఈళ్లుండగా కిసకిసా నవ్వుతా అక్కడికొచ్చాడు గోదారొడ్డున టీ అమ్ముకునే ప్రభు! 


"ఏట్రోయ్! ఏటానవ్వు? ఏటైందేటి? మాకూ చెప్తే మేవూ నవ్వుతాం గదా!" అడిగీసాడు అసలే కడుపునొప్పి ఆపుకోలేని సుడిగాలిరాజు.


"మరండీ... అహ్హహ్హ... మరేమోనండీ.... హమ్మోయ్... అహ్హహ్హ... ఇదిన్నారాండీ..."


"వురేయ్, నవ్వన్నా చెప్పు, చెప్పన్నా నవ్వరా బాబూ! నీ ఇకికలకి గోదారమ్మలో చేపలు జడుసుకుంటాయ్! ఏటో చెప్పేడువ్!" ఇసుక్కున్నాడు సూరిబాబు.


"ఇందాకల ఇటేపెళ్తూ ఎన్నారై మూర్తి గురించి మీ మాటలిన్నానండి! అహ్హహ్హ!"


"అయితే...!?"


"ఆళ్లబ్బాయి అమెరికాలో ఏదో అల్లరి చేస్తే ఉండబట్టలేక రెండు దెబ్బలేసాట్టండి! ఎంటనే ఆడు పోలీసోల్లకి ఫోన్జేత్తే, కేసెడతాం, జైల్లో ఏత్తాం అని బెదిరించి, మొదటిసారి గనక ఇడిసారంటంటి. ఆ దాటున బయపడిపోయి, సొంతపిల్లల్ని ఓ దెబ్బేసైనా దార్లో పెట్టుకోడానికి కూడా స్వేచ్ఛలేని అమెరికా మనకెందుకని తిరిగొచ్చేత్తన్నారంటండి!"


"అయితే...!?"


"అయితేటుందండీ! ఇందాకల మీరన్నట్టు ఎన్నారైమూర్తి గోరికి ఇకా లంకమేత, గోదారీతేనండోయ్! ఆఁయ్!"


ప్రభు మాటలకి పగలబడి నవ్వసాగారు మిత్రులంతా! 


'ఎలాగైతేనేం, ఇంకో వలసపక్షి తన గూటికి చేరబోతోంది, ఇక ఎన్నారై మూర్తి నర్సాపురం మూర్తవడమే తరువాయి' మనసులో అనుకుంటా సంతృప్తితో నిట్టూర్చాడు కృష్ణ.


(ఈ కథ, ఇటువంటి కథ వ్రాయమని నన్ను ప్రోత్సహించిన నా ప్రియ స్నేహిత 'సంగీత' కి‌ అంకితం)

No comments:

Post a Comment

Pages