చరిత్రలో వసూలు చేసిన వింతైన పన్నులు - అచ్చంగా తెలుగు

చరిత్రలో వసూలు చేసిన వింతైన పన్నులు

Share This
చరిత్రలో వసూలు చేసిన వింతైన పన్నులు

అంబడిపూడి శ్యామసుందర రావు 




పాలకులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయటము అనేది సర్వ సాధారణమైన విషయము. ఎటొచ్చి కొంతమంది పాలకులు వసూలు చేసే పన్నులు ప్రజలను ఇబ్బంది పెట్టవు, లేదా హింసించవు. పాలకులు ఈ పన్నులను ప్రజాహిత కార్యక్రమాలకు ఖర్చు పెడతామని చెపుతూ వసూలు చేస్తారు. ప్రముఖ తత్వ వేత్త బెంజిమన్ ప్రాంక్లిన్ చెప్పినట్లు జీవితములో రెండే రెండు విషయాలు నిజమైనవి ఒకటి చావు రెండవది పన్నులు. అంటే ప్రజలకు పన్నులు కట్టటము తప్పని సరి అని అర్ధము. చరిత్ర ఈ విషయాన్నీ అనేక సార్లు నిజము అని రుజువు చేసింది.
మనము తుగ్లక్ వసూలు చేసిన వింతైన పన్నుల (జుట్టు పైన, మరో రాజు ఆడవారి స్తనాల పైన) గురించి విన్నాము. ఇలాంటి క్రూరమైన పన్నులు లేదా పన్నులు వసూలు చేయటంలో హింస
అవలంబించిన పాలకులు చరిత్రలో దుర్మార్గులుగా మిగిలిపోయారు. కొన్ని దేశాలలో అటువంటి చర్యల వలన విప్లవాలు కూడా వచ్చినాయి. అలాగే ప్రపంచములో వివిధ దేశాలలో పాలకులు చాలా వింతైన రకరకాల పన్నులను వసూలు చేసిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అటువంటి కొన్ని వింతైన పన్నుల గురించి తెలుసుకుందాము. ఈ వింతైన పన్నులలో మగవాళ్ళు పెంచే గడ్డాల పైన, పెట్టుకొనే టోపీలపైనా విసర్జించే మూత్రము పైన ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము.
.
1.గడ్డాలపైనా పన్ను :- 1698లో రష్యన్ చక్రవర్తి జార్ పీటర్ ద గ్రేట్ రష్యన్ సమాజాన్ని వెస్ట్రానైజ్ (ఆధునీకరణ) చేయటానికి గడ్డాలపైనా పన్ను పాశ్చాత్య నాగరికత అలవాటు చేయటానికి విధించాడు. చరిత్రకారుల దృష్టిలో జార్ చక్రవర్తి గడ్డాలు పెంచటం కాలము చెల్లిన ఫ్యాషన్ అని భావించే వాడట. బాగా డబ్బున్న పౌరులు గడ్డాలను ఉంచుకోవాలంటే వాళ్ళు 100 రూబుళ్ళు పన్ను కట్టాలి.కానీ బీద వారి గడ్డాలపై దయ తలచి సంవత్సరానికి రెండు కోపెక్ (రూబుల్ లో వందో వంతు) పన్ను విధించేవాడట.పన్ను చెల్లించినవారికి ఒక రాగి టోకెన్ పన్ను కట్టినట్లు గా ఋజువుగా ఇచ్చేవారట.ఈ టోకెన్ పై ఒక వైపు ఒక వ్యక్తి పటము గడ్డము తో,"గడ్డము అనేది అమితమైన భారము" అనే వాక్యము ఉండేది .గడ్డము ఉండి పన్ను కట్టని వారిని బలవంతముగా బంధించి వారికి బలవంతముగా గడ్డము గీకించి పంపించేవారు. అనుకోని ఊహించని పరిమాణాల వలన గడ్డాలు హోదాకు, ఆస్తికి, చిహ్నాలు గా మారినాయి. చివరకు ఈ ఫలవంతము కానీ, నిష్ప్రయోజనము అయిన ఈ పన్ను వసూలు కార్యక్రమము 1772 లో ముగిసింది.
2. మూత్రము :-ఈ అనుచితమైన పన్ను ప్రాచీన రోమ్ లో ప్రవేశపెట్టబడింది. ఎందుకంటే ఆ రోజుల్లో మూత్రాన్ని చాలా విలువైనదిగా భావించేవారు. మనిషి మూత్రములో అమ్మోనియా ఎక్కువగా ఉండటం వలన ట్యానింగ్ లాండరింగ్ వూల్ ప్రొడక్షన్ ,రోమన్ లు వాడే ఉలెన్ టోగోస్ అనే డ్రస్సులు క్లీన్  చేయటానికి మరియు పళ్ళు శుభ్రము చేసుకోవటానికి వాడేవారు.ఇన్ని ఉపయోగాలు ఉండటం వల్ల వ్యాపార సంస్థలు మూత్రాన్ని లాభాల కోసము సేకరించటం మొదలుపెట్టాయి. ఇది గమనించిన రోమన్ చక్రవర్తులు నీరో,వెస్పేషియన్ వంటి వారు ఎవరైతే పబ్లిక్ యురీనల్స్ నుండి మూత్రాన్ని సేకరిస్తున్నారో వారిపై పన్ను విధించటం మొదలుపెట్టారు. ఈ పన్ను"పెక్యునియా" అనే ఒక లాటిన్ పదము ఉత్పత్తికి కారణమయింది. పెక్యునియా అంటే "డబ్బు కంపు కొట్టదు" అని అర్ధము.
3.సబ్బు :-1700దశకంలో ఇంగ్లాండ్ లో సబ్బు విలాసవంతమైనదిగా ఉండేది. అందుచేత 1712 లో ఆ దేశములో సబ్బు పైన పన్ను విధించారు. అది 141 ఏళ్ళు కొనసాగింది. సబ్బు తయారీదారుల నుండి వారు తయారు చేసిన సబ్బులపై భారీగా పన్ను వసూలు చేసేవారు. చాలా మంది ఈ పన్ను కట్టలేక ఈ పన్ను తప్పించుకోవటానికి విదేశాలకు వెళ్ళిపోయేవారు. సబ్బు తయారీదారులపైనా పన్ను వసూలు చేసే అధికారులు నిఘా వుంచి సబ్బు తయారీ పరికరాలను, సామాగ్రిని రాత్రులందు తాళాలు వేసి ఉంచేవారు. అంటే సబ్బు ఉత్పత్తి దారులు పన్ను ఎగ్గొట్టటానికి దొంగ తనముగా సబ్బులు తయారుచేస్తారేమో అని అనుమానంతో ఈ విధముగా తాళాలు వేసి ఉంచేవారు. ఈ పన్నులకారణముగా సబ్బు ఖరీదు పెరిగి సబ్బు ఒక విలాసవంతమైన వస్తువుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయింది. 1853 లో అప్పటి ప్రధాని విలియం గ్లాడ్ స్టోన్ సబ్బు మీద పన్ను తొలగించేంతవరకు సబ్బు సామాన్యులకు అందుబాటులోకి రాలేదు.
4. వంట నూనె:- పురాతన ఈజిప్టు ఫారోలు అనేక రకాల పన్నులతో పాటు వంటనూనెలపై కూడా పన్ను విధించేవారు. ఈ రకమైన పన్ను చరిత్రలో ఇదే మొదటిదిగా చెప్పవచ్చు పన్ను వసూలు చేసేవారు ఇంటింటికి తిరుగుతూ పౌరులు వంట నూనెను మళ్లి మళ్లి వాడుతున్నారా లేదా అని తనీఖీలు చేసేవారు. ఎవరైనా ఇంటి యజమానులు తప్పు చేస్తున్నట్లు తెలిస్తే వారిని సీరియస్ గా వార్ణింగ్ ఇచ్చి తాజా నూనె కొని వాడమని సలహా ఇచ్చేవారు. పన్ను ఎగవేతకు మరణ శిక్షలాంటి శిక్షలు ఉండేవి.ఈ పన్ను పంట స్థాయిలోనే వసూలు చేసి ఫారోకు చెల్లించేవారు.
5. పిరికితనానికి పన్ను :- ఏదేదో పొరపాటున విన్నాము అనుకుంటున్నారా కాదు, నిజమే. మధ్య యుగము నాటి నైట్స్ (యుద్ధ యోధులు) గురించి వినే ఉంటారు. అప్పట్లో అది గౌరవ ప్రదమైన ఉద్యోగము కానీ ఒక యోధుడు ఇంకో యుద్దములో పాల్గొనటానికి ఇష్టపడకపోతే ఈ పన్నును అతనిని నుండి వసూలు చేసేవారు. ఈ పన్నును 1100 లో ఒకటవ కింగ్ హేన్రి .మొదలు పెట్టాడు. ఈ పన్నును ఆసరా చేసుకొని కొంతమంది ఈ పన్ను కట్టి యుద్ధాలకు వెళ్లే వారు కాదు తరువాత కింగ్ జాన్ ఈ పన్నును దుర్వినియోగము కూడా చేసాడు ఎలాగంటే యుద్దాలు లేని రోజుల్లో కూడా యోధులనుండి ఈ పన్నును వసూలు చేసేవాడు 13 వ శతాబ్దము నాటికి ఈ పన్ను యోధులపైనా మామూలు పన్ను లాగ అయింది ప్రాన్స్ జర్మనీలలో కూడా ఇలాంటి పన్ను ఉండేది. 14 వ శతాబ్దము నాటికి ఈ పన్ను చాలా దేశాల్లో విస్తరించింది. ఆ విధముగా మధ్య యుగములో యుద్ధ యోధులను ఈ రకమైన పన్నులతో బాధించేవారు.
6.కిటికీలు :- కిటికీలపై పన్నును మొదటిసారిగా ఇంగ్లాండ్ లో 1696లో గుట్టు చప్పుడు కాకుండా ధనవంతుల నుండి వసూలు చేసేవారు. అప్పటి నుండి ప్రభుత్వము తన ఆదాయాన్ని పెంచుకోవటానికి ఈ పన్ను వసూలు చేసేది సాధారణముగా బీదవారి ఇంట్లో ఒకటి గాని రెండు గాని కిటికీలు ఉంటాయి కానీ ధనవంతుల ఇళ్లలో డజన్ల కొద్దీ కిటికీలు ఉంటాయి. కాబట్టి 10 కన్నా ఎక్కువ కిటికీలు ఉన్నవారు 10 షిల్లింగులు పన్ను కట్టాల్సి వచ్చేది.  అంతే కాకుండా గోడలకు ఉండే ఓపెనింగ్స్ కు కూడా పన్ను విధించేవారు ఈ పన్నును తప్పించుకోవటానికి భవనాల యజమానులు కిటికీలను మూసేసేవారు. దీనివల్ల గాలి వెలుతురూ సరిగా ఇంటిలోకి రాకపోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడేవి. చివరికి 1851 లో ఈ పన్నును తొలగించారు. 
7.బ్రహ్మచారులు పై పన్ను:- ప్రాచీన రోమ్ లో ఎవరైనా బ్రహ్మచారులుగా ఉండిపోదలిస్తే దానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. 9 AD లో ఆగస్టస్ అనే రోమన్ చక్రవర్తి (మొదటి రోమ్ చక్రవర్తి)పెళ్లికాని మగవారిపై ఈ పన్ను విధించాడు.38 ఏళ్ళు ఆపైన వయస్సు కలిగిన వారిపైన మరియు పెళ్లి అయి పిల్లలు లేని వారి పైన ఈ పన్ను వసూలు చేసేవాడు.ఈ రకమైన పన్ను వసూలు చేయటము లో
ఉద్దేశ్యము వివాహ బంధాన్ని బలపరచి అక్రమ సంబంధాలను నిరోధించటమే.అంతే కాకుండా బ్రహ్మచారులు బహిరంగ క్రీడలలో పాల్గొనటా న్ని నిషేదించేవారు. ఈ పన్ను చాలా మటుకు విజయవంతమైంది. ఇతర సమాజాల్లో కూడా దీనిని అమలు పరిచేవారు. ఒట్టోమన్ సామ్రాజ్యము 15 వ శతాబ్దములో ఇటువంటిదే వసూలు చేసేవారు. ఇంగ్లాండ్ కూడా 1695లో పిల్లలు లేని మగవారి పైన బ్రహ్మచారుల పైనా పన్ను వసూలు చేసేది. 1919లో దక్షిణ ఆఫ్రికాలో బ్రహ్మచారులపైనా పన్ను విధించేవారు. బ్రహ్మచారులు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కంటారని ఈ
పన్ను వసూలు చేయటంలో ఉద్దేశ్యము.1941 నుండి 1990 వరకు సోవియట్ యూనియన్ లో పిల్లలు లేని జంటల పైన 6% పన్ను విధించేవారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రము, 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు లేని జంటలపైన సంవత్సరానికి ఒక డాలర్ చొప్పున నేటికీ పన్ను వసూలు చేయటము ఆశ్చర్యకరమైన విషయము. 
8 టోపీలు:- ఈ పన్నును పిటి ద యంగర్ ఇంగ్లండ్ లో 1784లో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటానికి ప్రవేశపెట్టాడు ఈ పన్ను తలపైన ధరించి టోపీ విలువను బట్టి వసూలు చేసేవారు. ఖరీదైన టోపీల కైతే అంటే టోపీ బాగా ఎత్తుగా ఉంటే రెండు షిల్లింగులకన్నా ఎక్కువగా వసూలు చేసేవారు. అదే తక్కువ రకము టోపీలకైతే నాలుగు షిల్లింగుల కన్నా తక్కువగా ఉండేది ఎత్తు తక్కువగా ఉండే ఫ్లాట్ టోపీలకైతే (టోపీ ఖరీదు నాలుగు షిల్లింగులకన్నా తక్కువగాఉన్నా) పన్ను మూడు పెన్నీలుగాఉండేది టోపీల లోపలి లైనింగ్ కు రెవెన్యూ స్టాంప్ అతికించేవారు. అటువంటి స్టాంప్ లేని టోపీలు ధరించేవారి నుండి భారీగా ఫైన్లు వసూలు చేసేవారు కొన్ని సందర్భాలలో ఎవరైనా ఈ రెవిన్యూ స్టాంప్ ఫోర్జరీ చేస్తే వారికి మరణ శిక్ష కూడా విధించేవారు ఈ పన్నును 1811 లో రద్దు చేశారు. 

ఇవండీ వింత పన్నుల గాథలు...

No comments:

Post a Comment

Pages