అనసూయ ఆరాటం -17 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం -17 

చెన్నూరి సుదర్శన్ 



ఆదిరెడ్డి “పని మానేసి హైద్రాబాదుకు పోతాన” అని అనంగనే మానయ్య బిత్తర పోయిండు. అదృట్టం కొద్దీ అంతకు ముదు రోజే కన్కయ్యచ్చి మానయ్యకు, ఆదిరెడ్డికి రావాల్సిన పైసలన్నీ సుక్త ఇచ్చిపోయింది మంచిదైంది.  

అదే పొద్దుమూకి సామానంత సదురుకొని హైద్రాబాద్‌కు బస్సెక్కిండు ఆదిరెడ్డి.. 

కూకట్‌పల్లిల దిగి సక్కంగ సురేందర్ ఇంటికి పోయిండు. ఇంకా అందరు పండుకునే యాల్ల కాలేదు.  

అదిరెడ్డిని నెలకోపాలి సురేందర్  ఇంటికి వచ్చుడు మామూలే.

ఇంట్ల ఫోను కూసి “ఎప్పుడు పెట్టిచ్చినవ్ మామయ్యా..” అని ఎంతో సంబురంగ అడిగిండు.

“వారమైతాంది రెడ్డీ. ఇవ్వాల రేపు ఇంట్ల ఫోన్ తప్పనిసరి అయ్యింది. నువ్వైతే కాళ్ళు రెక్కలు కడుక్కొని రా.. ఇద్దర కలిసి బువ్వ తిందాం” అన్నడు సురేందర్. 

ఆనాత్రి బువ్వ తిన్నంక వంటిల్లంతా సదిరి ప్రమీల సదువుకోబట్టింది. అప్పటికే పిల్లలు తిని పండుకున్నరు. 

“అత్తమ్మా.. ఏమో..సదువుతానవ్..” ఆచ్చర్యంగ అడిగిండు ఆదిరెడ్డి.

“మీ అత్తమ్మ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల బి.ఏ. చేత్తాంది” అని సిన్నంగ నవ్వుకుంట అన్నడు సురేందర్.

“గ్రేట్ మామయ్యా.. గిట్ల ఆడోల్లను సదివిచ్చుడు శాన గొప్ప సంగతి” 

“సరే గాని నీ సంగతి చెప్పవ్.. నీ పని బాగానడ్తాందా..” 

“మామయ్యా.. నన్ను కాంతయ్య రమ్మన్నడు” అని జీతం సంగతంతా చెప్పిండు ఆదిరెడ్డి. 

ప్రమీల, సురేందర్ సంబుర పడ్డరు. హైద్రాబాదులనే పని చేసుడంటే ఎవలకు సంబురముండది?.. మీదికెల్లి జీతం డబల్.. డబల్ కాబట్టె. 

తెల్లారే కన్కయ్యకు ఫోన్ చేసిండు ఆదిరెడ్డి. అవతలకెల్లి కన్కయ్య ‘హలో’  అనంగనే..

“నమస్తే సార్.. నేను ఆదిరెడ్డిని. మా సురేందర్ మామయ్య ఇంటికి వచ్చిన కూకట్‌పల్లికి” 

“ఈ ఫోన్ మీమామయ్యదా.. సంతోషం. మీ మామయ్యను అడిగిన్నని చెప్పు. ఏం సంగతి.. అంతా మంచే గదా..” 

కన్కయ్యకు ఎట్ల చెప్పాల్నో.. అని కొంచెం సేపు తటపాయించిండు అద్దిరెడ్డి. కాని చెప్పక తప్పదు కదా.. మానయ్య సుత ఫోన్ల చెప్పి ఉంటడు. నేనే చెప్పాలని సూత్తాండేమో..! అసలు సంగతి అడుగుత లేడని జర సేపు 

దంపట్టిండు.

“హాలో.. ఆదిరెడ్డీ.. మాట్లాడవ్..” అడిగిండు కన్కయ్య.

“సార్.. మీకు ఎట్ల చెప్పాల్నా.. అని తకమికయితాన”

“ఏం సంగతి చెప్పూ..”

“సార్.. నేను మీతాన పని మానేద్దామనుకుంటాన. ఏ.సీ.లు ఫిట్టింగులు చేసే పని దొరికింది. హైద్రాబాదులనే పని” ఏమంటడో.. ఏందో..! అని పానం బిగబట్టి ఇనబట్టిండు ఆదిరెడ్డి.

“చెప్పా చెయ్య కుండ పని మానెత్త ఎట్ల రెడ్డీ..!”

“నువ్వు చెప్పిన  ఇక్మతే కదా.. సార్. ఎవ్వలలెక్కువిత్తే వాల్ల దగ్గర పని చెయ్యాలని. మీకు మస్తు మంది దొరుకుతరు” కొంచెంధైర్నంగనే అన్నడు ఆదిరెడ్డి.

కన్కయ్య నవ్విండు అవతల పక్క.

“అయితే నా పద్దెం నాకే అప్పజెప్తానవన్న మాట. సరే కానియ్యి. ఒకరు బాగుపడ్తమంటే అడ్డం పడేటోన్ని గాను. ఇంతకూ నువ్వు చేసేది కాంతయ్య దగ్గర్నా..” 

“అవును సారూ. కాంతయ్య నీకు తెలుసా..”

"కాంతయ్య నేను దోస్తులమే.. నాకు నాత్రే కాంతయ్య చెప్పిండు. నీ పని తనం నచ్చిందట. నిన్ను తీసుకుంటానని.. నా దగ్గరికి ఇంకో పిలగాన్ని పంపిచ్చిండు”

“గట్లనా సర్..”  ఆదిరెడ్డి సుత చిన్నంగ నవ్విండు. “నామీద గుస్సా వత్తదని భయపడ్డ”

“గుస్సా ఎందుకత్తది ఆదిరెడ్డీ.. నువ్వు కట్టబోతువు.. మీదికెల్లి నీ తక్దీర్ సుత బాగున్నది.. అన్నట్టు చెప్పుడు మర్సిన. నువ్వు చిట్ ఫండ్ కంపెనీల లాటరీ కట్టినవా? “

“ఔ సార్.. ఒక రూపాయి కట్టిన.. వచ్చే టప్పుడే. టిక్కట్లన్నీ అయిపోయినై ఒక్కటే ఉన్నదని నాకు అంటగట్టిండ్లు. నిన్న రాత్రే డ్రా తీసుంటరనుకుంట” 

“డ్రా తీసిండ్లు.. నీకు బండి వచ్చిందని మానయ్య చెప్పిండు” 

“ఆ..!” అని నోరు తెర్సిండు ఆదిరెడ్డి. 

“నీకు కారెటేత్తమన్నరట చిట్టీ వాల్లు. పోయి ముందుగాల బండి తెచ్చుకో.. బస్సులల్ల తిరుగుడు కంటే బండి మీద పోవుడు టైం కలిసత్తది. బండి నడుపత్తదా.. “ అడిగిండు కన్కయ్య. 

“జహీరాబాదుల నేర్సుకున్న సార్. లైసన్సు సుత తీసుకున్న. మా మామయ్యను తీస్కపోయి బండి తెచ్చుకుంట” 

“నువ్వు అఖండుడివి రెడ్డీ.. సరే పోయిరా పైలం..” అని ఫోన్ పెట్టేసిండు కన్కయ్య.

“నమస్తే సర్.. ఉంటా” అని ఆదిరెడ్డి సుత అట్ల ఫోన్ పెట్టేసిండో లేదో..” మామయ్యా.. నాకు లాటరీల సైకిల్ మోటర్ తగిలింది” అని గట్టిగ కీసు పిట్ట లెక్క కేకేసిండు. 

కుర్సీల కూకున్న సురేందర్ లేచి వచ్చి ఆదిరెడ్డిని అమాంతం కావలిచ్చుకున్నడు. 

“పున్నం నాడు పుట్టినవ్ కదా అల్లుడూ.. అందుకే తక్దీర్ తన్నుకత్తాంది” అని.. వటింట్లున్న ప్రమీలను పిల్సి చెప్పిండు. అప్పటికే ఆ మాటలిన్న ప్రమీల శక్కర డబ్బ తోటి వచ్చింది. పిరికెడు శక్కర తీసి ఆదిరెడ్డి నోట్లె పోసింది. 

ఆవ్వాల శనివారం కాలేజీకి సెలవు పెట్టిండు సురేందర్. 

ఆదిరెడ్డి, సురేందర్ కలిసి జహీరాబాదుకు బస్సుకు పోయి వచ్చేటప్పుడు కొత్త రాజదూత్ సైకిలు మోటరు మీద వచ్చిండ్లు. 

తెల్లారి ఐతారం..

సురేందర్ దగ్గరుండి ఆదిరెడ్డికి సైకిలు మోటరు నడుపుడు ఇంకా బాగా ప్రాక్టీసు చేయించిండు. సిటీల బండి నడుపుడంటే మాటలు కాదు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages