మానస వీణ-40 - అచ్చంగా తెలుగు

 మానస వీణ-40

గోవిందరాజు సుభద్రాదేవి


   ఆలోచనలతో, తల నొప్పితో మానస అటూ ఇటూ తిరుగుతోంది. ఎంత వింతగా ఉంది? తన కన్న తల్లితండ్రులు ఎవరో తెలుసుకోవాలని తనకి ఊహ వచ్చినప్పటినుంచి ఎంత ఎదురు చూసింది? ఎంత ఏడ్చింది?ఎంత మానసిక క్షోభ పడి నిదురలేని రాత్రులు ఎన్ని గడిపింది? ఇపుడు... ఇపుడు... వాళ్ళు తన ముందర ఉన్నారు. ఎంతో ప్రేమతో తనని దగ్గరకి తీసుకుని అణువణువుని పరిశీలించి, మళ్లీ ఎక్కడ మాయమవుతానో అన్న భయంతో హత్తుకుంటున్నరు. సంతోషం, దుఃఖంతో సతమతమవుతున్న వీళ్లను చూస్తుంటే వాళ్ళు కూడా తన కోసం కళ్లలో వత్తులు వేసుకుని చూసిన కాలం ఎంత దుర్భరంగా వుండి ఉంటుందో తను అర్థం చేసుకోగలదు. ఇది నిజమా, కలా? ఒకవేళ కల అయితే మెలుకువ వస్తే భరించగలదా? ఉహు... అమ్మో, ఆ ఆలోచనే దుఃఖం తెస్తోంది. అయితే మరి ఈ శుభ సమయంలో తాను ఎందుకు అనిరుధ్  కోసం పరితపిస్తోంది? అసలు తనకి అనిరుధ్ ఏమవుతాడు? తను ఒక్కరోజు మాట్లాడకపోతే ఏదో దిగులు ఆవరిస్తుంది. మనసులో ఎక్కడో శూన్యం ఆవరిస్తుంది. బాగా ఆలోచిస్తే తనకంటే ఆప్తులు ఎవరూ లేరు తనకి. అన్నీ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. తనకి ఏ కొత్త ఆలోచన వచ్చినా అతనితో చెప్పి అతని విశ్లేషణ కూడా పరిగణలోకి తీసుకునే తను ముందరికి అడుగేస్తుంది. ఇంతలా గుర్తు వస్తున్నాడు, అమ్మా నాన్న పక్కన ఉండగా... ఏంటీ విచిత్రం? వీళ్లకంటే  అనిరుధ్ తనకి ఎక్కువా? ఎక్కువే అని మనసు చెప్తోంది. అదేమి కాదులే.  ఇపుడేగా అమ్మా, నాన్న గారు నా జీవితంలోకి వచ్చారు. ఆ బంధం ముడిపడానికి సమయం పడుతుంది. కానీ అనిరుధ్ త‌నకు బాల్య మిత్రుడు కదా...

    అయినా అనిరుధ్ ఆలోచనలు వదలడం లేదు మనసుని. ఒకరోజు సన్నగా వాన చినుకులు పడుతున్నాయి. తను గుడినుంచి వస్తోంది.  అనిరుధ్ ఎదురు పడ్డాడు.

"వానలో ఎక్కడ నుంచి?" అన్నాడు తనని చూసి.

"అదే ప్రశ్న నిన్నూ ఆడిగితే?" అంది.

"సునీల్ తెలుసుగా నీకు?"

"ఆ తెలుసు. ఏమైంది?"

"ఆ సునీల్ ఒక సమాజిక కార్యకర్త. ఎవరికి ఏ సాయం కావాలన్నా పరిగెత్తుతాడు. టైం, వీలు లేకపోవడం, తన వల్ల కాదని చెప్పడం, నేను ఇప్పటివరకూ చూడలేదు. నిజంగా సునీల్ ఓ గొప్ప వ్యక్తి అనిపిస్తాడు నాకు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, డబ్బులు నీళ్లలాగా ఖర్చుపెడతాడు. కొంతమంది తిరిగిస్తారు,  కొంతమంది ఇవ్వరు. అయినా పట్టించుకోడు. నీకూ పరిచయం చేస్తాను. ఉపయోగపడతాడు."

"నాకా?"

"ఆ...  ఏ సమయంలో ఎవరి సాయం అవసర మవుతుందో ఎవరూ చెప్పలేరు."

"మరి ఏడీ, అతను?"

"చెప్పానుగా. వాళ్ళింటి పక్కన ఒక కుటుంబంలో ఆడపిల్లలు,  వాళ్ళ తండ్రి కాపురం ఉంటారు. తల్లి చనిపోయి ఏడాదయింది. వాళ్లకి చదువు తక్కువ. ఒక అమ్మాయి కుట్టుమిషన్ నడుపుతోంది. ఇంకో అమ్మాయి సేల్ గర్ల్ గా ఒక బట్టల షాప్ లో పని చేస్తోంది. తండ్రి కి అనారోగ్యం, ఊబకాయం.  మాట్లాడితే కళ్ళు తేలేస్తుంటాడు. సునీల్ హాస్పిటల్ లో చేర్చి వస్తుంటాడు. ఎన్నిసార్లు యిలా అయినా ఏమీ అనుకోడు. నాకు సునీల్ ని చూస్తే ఆశ్చర్యం గా ఉంటుంది. ఇలాంటివి ఎన్నో... ఎన్నో ఉన్నాయి. సరేలే. నువు చెప్పు ఎక్కడ నుంచి?"

  "గుడినుంచి ఈరోజు శనివారం కదా. వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం" అంది నవ్వుతూ.

"సరే. నేను ముందర నిన్ను దించుతాను, వాన పెద్దగా వస్తోంది. ఆ బస్టాండ్ కిందకి వెళదాము బాగా తడిసిపోతున్నావ్ నువు" అంటూనే చేయి పట్టుకుని లాక్కెళ్లాడు.

నిజంగానే వాన పెద్ద దయ్యింది. అయితే  ఆ చల్లని వాతావరణంలో అనిరుధ్ పక్కనే నిలబడడం ఏదో హాయినిస్తోంది. ఎంతసేపైనా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తోంది మనసుకి. అంతే... ఆ ఆలోచనకే నవ్వు వచ్చింది.

"అరె. ఏంటీ నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? నాకూ చెప్పవా?"

"ఏమీలేదు. ఈ రోజు వాతావరణం బాగుంది కదా? "

"ఔను."

"పద కొంచెం వాన తగ్గింది. ఔనూ.. నీకు మొక్కజొన్న కంకులు ఇష్టమేనా? అక్కడ చూడు...నిప్పుల మీద కాలుస్తున్నారు. తింటావా? "

"తింటాను... మరి నువ్వు?"

"మొక్కజొన్న కంకులు. మిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఎక్కువగా ఆడవాళ్లు ఇష్టపడతారని నా ఉద్దేశం" అన్నాడు నవ్వుతూ.

"అదేమీ కాదులే. కానీ చిన్నచిన్న నిప్పు రవ్వలు పటపట మంటూ శబ్దం చేస్తూ ఉండగా, గుండ్రంగా కంకిని తిప్పి, కాలుస్తూ ఉంటే ఒక మంచి వాసన వస్తుంది... బాగుంటుంది."

"తిను, ఇంకా బాగుంటుంది" అంటూ తన చేతిలో ఉన్న వేడి వేడి కంకి ని ఆకుల మధ్యలో పెట్టి ఇవ్వడం ఒక  తీపి జ్ఞాపకముగా తన మనసులో చోటు చేసుకుంది. ఆ రోజు రుచి ఎపుడూ మళ్లీ కలగలేదు ఎన్నిసార్లు తిన్నా... అనుకుం.ది

   అయ్యో! ఎంతసేపు అతని ఆలోచనల్లో ఉండిపోయానో కదా! అసలెందుకు తను కాల్ లిఫ్ట్ చేయడం లేదు? స్విచ్ ఆఫ్ ఎందుకైంది? ఏమీ జరగలేదుకదా అనిరుధ్ కి? ఏమన్నా అయితే తాను భరించలేదు. ఇంకోసారి ప్రయత్నించి చూద్దామనుకుని అనిరుధ్ కి కాల్ చేసింది.

రింగ్ అవుతోంది... రింగవుతోంది...

తియ్యడే? ఫోన్ తియ్యడేంటి?

మళ్ళీ చేసింది... నెమ్మదిగా అనిరుధ్ కాల్ అటెండ్ అయ్యాడు, హలో అంటూ. "హలో అనిరుధ్... ఎలా ఉన్నావ్? ఎక్కడున్నావ్? ఏమి చేస్తున్నావ్? బానే ఉన్నావు కదా! నీకేమి కాలేదుకదా! అసలు ఎందుకు కాల్ తీయలేదు నాది? స్విచ్చాఫ్ ఎందుకు చేశావ్? నేనెంత ఆందోళన పడ్డానో తెలుసా అనిరుధ్?"

"బాబోయ్ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావ్. నన్ను మాట్లాడిస్తావా లేదా?"

"ఎందుకు నీ గొంతు నీరసంగా ఉంది చెప్పు ఏమైంది? చెప్పు నాకు కంగారుగా ఉంది." గొంతు జీరబోయింది.

"మానసా. ఏంటి ఇలా నువు బెంబేలు పడుతున్నావ్? నువ్వేనా నాకు తెలిసిన మానసవి? నాకేం కాలేదు కానీ, కొన్ని సంఘటనలు జరిగినాయి. ఊహించనివి. కంగారు పడకు. వాటిని ఎంక్వయిరీ చేస్తున్నాము."

"అయ్యో ఏమి జరిగింది?"

"చెప్పానుగా. అంత ప్రమాదం ఏమీ లేదు. వచ్చాక నీకు వివరంగా చెప్తాను. అది సరే. నువ్వు ఇన్నిసార్లు నాకు కాల్స్ ఎందుకు చేశావ్? ఏమైంది నీకు? నాతో నీకు ఏదైనా పనుందా? ముందర ఇది చెప్పు."

"ఔను.  ఒక విషయం నీతో చెప్పాలి అని చేసాను."

"ఏంటి అది? చెప్పు బాబూ... నన్ను సస్పెన్స్ లో పెట్టకు."

"ఫోన్ లో చెప్పేది కాదు. నీతో ప్రత్యక్షంగా చెప్పాలి. నువు అమాంతంగా నన్ను..."

"అమాంతంగా.  నిన్నూ... ఊ... చెప్పు!"

"చెప్పను. ఒక గుడ్ న్యూస్ నీతో పంచుకోవాలి అనిరుధ్." 

"ఏంటదీ. చెప్పు... చంపకుండా!"

"లేదు... చెప్పనుగాక చెప్పనుగా!"

"అబ్బా మీ ఆడవాళ్లు భలే  ఆడుకుంటారు కదా మమ్మల్ని."

"ఆహా... అక్కడికేదో మీరు మమ్మలిని ఉద్ధరించినట్టు."

"సరే, రేపు నిన్ను కలుస్తాను. అమాంతంగా నేనేమి చేస్తానబ్బా..?"

"మొద్దబ్బాయివి నువ్వు. నీకు అర్థం కాదులే..."

"ఇదొకటా?"

"అంతే... మరి."

"అదేంటో తెలిస్తేనే. నాకు నిద్ర పట్టేది. నాకు భలే హోమ్ వర్క్ ఇచ్చావు పెట్టేస్తున్నా. బై.."

  కాల్ కట్ అయింది. రేపటివరకూ ఎదురు చూడాలి. చాలా కాలం ఎదురుచూడాలి అనిపించేట్టు ఉంది. ఈ విషయం అనిరుధ్ తో పంచుకోవాలి. తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? తనకి ఒక ఫామిలీ ఉందని తనకీ, తల్లి తండ్రీ బంధువులు ఉన్నారనే సంగతి వింటే అనిరుధ్ కి ఎలా అనిపిస్తుంది? ఎన్నోసార్లు తన ఒంటరితనం షేర్ చేసుకుని అందులోంచి గమ్మత్తుగా బైటకి తీసుకువచ్చేవాడు. అనిరుధ్ మాటలతో మనసు తేలిక పడినప్పుడు, ఆశ్చర్యపోయేది తాను. 

ఇలా ఆలోచిస్తూ... అమ్మ పెట్టిన కమ్మని భోజనం చేసి, "అలసిపోయావు నువ్వు. నా పక్కనే పడుకో" అన్న మాటలకి 'సరే' అంటూ, మొట్టమొదటి సారి అమ్మ స్పర్శని బలంగా అనుభూతిస్తూ, వాటేసుకుని నిశ్చింతగా నిదురలోకి జారుకుంది మానస.

******

    పొద్దున్నే  భూషణం గారికి సీరియస్ గా ఉందని కబురు వచ్చింది.

      తప్పనిసరిగా అమ్మా నాన్నలకి సర్ది చెప్పి... వాళ్ళని బలవంతంగా బయలుదేరదీసి,  వాళ్ళ అయిష్టం, బాధ, కోపం అర్థం చేసుకున్నాకా, వాళ్లతో వెళ్లడం ఈ చివరి ఘడియలో తన బాధ్యత అనిపించింది మానసకు.    

"నాకూ ఉంటుంది... చాలా బాధ. ఇన్నేళ్లు నేను అనాధ గా బతికాను. అందరూ ఉన్నా , ఒంటరిగా, అవమానాలు, నిరాదరణల మధ్య పెరిగాను. అయినా మనం మానవత్వం, మనిషితనం పోగొట్టుకోకూడదు. ఇది నేను నేర్చుకున్న సంస్కారం" అంటూ నచ్చచెప్పి వాళ్ళని బయలు దేరతీసింది మానస.

    తన తాతయ్య స్వయానా తనని హతమార్చమని పురామాయించినవాడు. అమ్మానాన్నలకి బిడ్డని దూరం చేసినవాడు.  తను చూడ్డానికి గుమ్మంలో  అడుగు పెట్టింది.

***

No comments:

Post a Comment

Pages