అనసూయ ఆరాటం - 18 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 18 

చెన్నూరి సుదర్శన్ 


కాంతయ్య మాట ప్రకారం సోమారం పనిల చేరిండు ఆదిరెడ్డి. బాలనగర్‌ల ఆఫీసు. 

రాంబాబు టికాన బోయిన్ పల్లిల. అక్కడికే మారిండు ఆదిరెడ్డి. ఇద్దరు కలిసి వంట చేసుకొని తిని బాలనగర్ ఆఫీసుకు బయలెల్లేటోల్లు. పగటీలి టిఫిన్ల తోటి సరిపెట్టుకునేటోల్లు. మల్ల రాత్రికి టికానకచ్చినంకనే వంట.

కాంతయ్య నిత్తె పొద్దుగాల ఏ.సీ.లు ఎక్కడెక్కడ ఫిట్టింగులు చెయ్యాల్నో ఆర్డర్ కాపీలు ఇచ్చేటోడు. ఆటోల సామానేసుకొని పోయి ఫిట్టింగులు సేసి తిరిగి ఆఫీసుకచ్చి రిపోర్టు చేసేటాల్లకు రాత్రి ఏడు, ఎనిమిదయ్యేది. 

బండి ఉండుడు ఆదిరెడ్డికి తోడెం ఆరాం దొరికింది. బండి మీద రాంబాబు, తను ఆఫీసుకచ్చి బండి ఆఫీసు గేటులోపల పెట్టేటోడు.  ఇద్దరు కలిసి  పనికి పోయేటోళ్ళు. తిరిగి వచ్చి బండి మీద మల్ల బోయినపల్లికి. 

 ఒక్కో రోజు నాలుగైదు ఏ.సీ.లు సుత ఫిట్టింగులు చేసేటోల్లు. మూన్నెల్లల్ల ఆదిరెడ్డి పని పురంగ నేర్సుకున్నడు.

కాంతయ్యకు నమ్మకం కుదురింది. ఆదిరెడ్డికి చేతి కిందకు సారంగం అనే వేరే పిలగాన్నిచ్చిండు. ఆదిరెడ్డి సంతంగ సారంగంను తీసుకొని పనికి పోవుడు మొదలు పెట్టిండు. రాంబాబు చేతికింద ఇంకో పిలగాడు.

సారంగంకు వంట  పని రాదు. ఆదిరెడ్డి ఒక్కడే చెయ్యాలె.. పనికి పోయచ్చి మల్ల వండాలె. బగ్గ యాట్టకు రాబట్టింది. నాలుగు పైసలు చేతిల ఆడేటాల్లకుకు నాలుగు రకాలుగ ఆలోసనలు మదిల మెదలబట్టినై. నెల, నెలా పైసలు పంపుడు.. తనిక్కడ చెయ్యి కాల్సుకునుడు.. అనసూయ అక్కడ తన మీద బెంగటిల్లుడు.. ఇదంతా మంచిగ లేదనుకున్నడు. ఆకరికి అనసూయను, అనిమిరెడ్డిని, జయమ్మను హైద్రాబాదుకు తీస్కరావాలని డిసైడ్ సేసుకున్నడు. 

అనిమిరెడ్డి పదోది బొటాబొటిగ పాసైండు. జయమ్మ ఏడోది పాసైంది. వాల్లను ఇక్కడనే సదివియ్యొచ్చను కున్నడు. 

ఓపాలి వీలుసూసుకొని సురెందర్ దగ్గరికి పోయి తన మన్సులున్న మాట బైట పెట్టిండు. 

సురేందర్ ఇచ్చంత్ర పోయిండు. ఆదిరెడ్డి పెద్ద బుధ్ధికి మెచ్చుకున్నడు. 

“ఆదిరెడ్డీ.. పైసలకేమైనా తక్లీబైతే నేను సూసుకుంట. ముందుగాల  సౌలతెంబడి ఒక ఇల్లు తీసుకో.. అటెన్కనే మన ఊరికి పోయి అందరిని తీసుకరా..” అని సలహా ఇచ్చిండు సురేందర్. 

***

  సికింద్రాబాదు దగ్గర వారాసిగూడల ఒక చిన్న పోర్షన్ ఇల్లు కిరాయకు తీసుకున్నడు ఆదిరెడ్డి. 

ములుగు పోయి పోలీసు రాజయ్య, బతుకమ్మ ముందల అనసూయను కూకోబెట్టి విషయం చెప్పి ఒప్పించ్చిండు. 

“తాతా.. గుడిసె అయితే ఇట్లనే ఉండనియ్యిండ్లి. ఏదినం ఎట్లుంటదో ఎవ్వలకెరుక. దేవుడు సల్లంగ సూత్తె అక్కడనే ఉంటమేమో..! అయినా మా పెండ్లిల్లు మీ చేతుల మీదుగనే ఇక్కడనే జరుగాలె” అన్నడు ఆదిరెడ్డి. రాజయ్య, బతుకమ్మల కండ్లల్ల నీల్లూరినై.

“సరే రెడ్డీ.. పిల్లను మేము సూడాల్నా.. నువ్వే సూసుకుంటవా..” అని రాజయ్య అడిగేటాల్లకు.. సిగ్గు పడుకుంట మూడు మెలికలు తిరిగిండు ఆదిరెడ్డి. 

“ఎట్లైనా సరే.. తాతా” అనెటాల్లకు అందరు నవ్విండ్లు.

ఇంటికి పెద్దోడు బుధ్ధిమమంతుడైనందుకు బతుకమ్మ సంబుర పడుకుంట దీవెనలిచ్చింది. సంగతంతా తెలుసుకొని వాడంతా మురిసి పోయింది. అనసూయ కట్టాలు గట్టెక్కినయని అంతా ఖుషైండ్లు. 

“దుకాన్లకు పోయి బుచ్చయ్య తాతకు, సమ్మయ్య తాతకు మనం పోతానమని ఒక మాట చెవు లేసిరా కోదుకా.. లేకుంటే మర్యాద నిపించుకోదు” అని బతిలాడి ఆదిరెడ్డిని దుకాన్లకు పంపిచ్చింది అనసూయ. ముక్కిర్సుకుంటనే దుకాన్లకు పోయి సంగతంతా చెప్పిండు ఆదిరెడ్డి. 

“సరే.. మంచిది. మరి నాకొడుకు పెట్టిన జాగల పని చెయ్యకుంట దెంకపోయినవట కదా” అని బుచ్చయ్య ఒక మాట మీదేసిండు. గిందుకే వీల్ల తానకు రావద్దనుకున్న. వీల్లకేమెరుక.. పట్నం సంగతి అని మన్సులను కున్నడు ఆదిరెడ్డి. 

జవాబేమీ ఇయ్యకుంటనే ఇంటికి మర్రిండు.   

ఒక మంచి రోజు సూసుకొని పట్నం బైలెల్లిండ్లు. 

“అనసూయా.. సంకురాత్రి పండుగకు తప్పకుండా రావాలె..”  అన్కుంట ఆవాడ సక్కుబాయి అనసూయ గద్మ పట్టుకొని బతిలాడింది.. అప్పాలు సేసుడు మావల్ల ఏమైతదన్నట్టు.

“తప్పకుండ వత్త” అని అనసూయ మాటిచ్చింది.

సాగదోలేటోల్ల ఏడ్పు మొకాల్లు జరంత సేపు ఇప్పుకున్నై. కొస వాడ దాకా వచ్చిన వాల్ల కొస కొంగులు కంట్లె నీళ్ళు తుడ్సుకోని , తుడ్సుకోని.. తడ్సి ముద్దైనై.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages