భగవంతుని తత్వం - అచ్చంగా తెలుగు

 భగవంతుని తత్వం

రచన: సి.హెచ్.ప్రతాప్అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ।। 6 ।।

(భగవద్గీత 4 వ అధ్యాయం, 6 వ శ్లోకం)

నేను పుట్టుకలేని వాడనూ, సమస్త ప్రాణులకూ ప్రభువునూ, సర్వ జీవుల హృదయాలలో సదా నివసించువాడను, సమస్త ప్రాణకోటి చేసే కర్మాచరణమును వారి హృదయాలలో కొలువై వుండి, సాక్షీభూతుడనై వాటిని గమనించేవాడను,నాశములేని వాడినై ఉండి కూడా, ఈ లోకంలో నేను, నా దివ్య శక్తి యోగమాయచే ప్రతీ యుగములో ధర్మ సంరక్షణార్ధం అవతరిస్తూ వుంటాను.

భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడన్న అభిరాయంపై వివిధ రకాలైన అభిప్రాయాలు లోకంలో ప్రాచుర్యం పొంది వున్నాయి.కొందరు నిరాకార, సర్వ వ్యాపి, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే నమ్మకాన్ని, కలిగి ఉంటారు. అద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుడు నిస్సందేహంగా సర్వ జీవులలో హృదయస్థానంలో జ్ఞాన జ్యోతి వలె ప్రతిష్టుడై వుంటాడు. భగవంతుడు కచ్చితంగా ఆశరీరుడు, నిరాకారుడే కానీ, అంతమాత్రాన, ఆయన అదే సమయంలో, ఒక రూపము తీసుకోలేడని కాదు. భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి, ఆయనకి తన సంకల్పం చే, ఒక స్వరూపంతో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుడు కేవలం నిరాకారుడు అనేది ఒక అసంపూర్ణ ప్రతిపాదన. అదే విధంగా కొందరు భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు అని కూడా అభిప్రాయం వ్యక్తం చెస్తూ వుంటారు. ఇది కూడా ఒక అసంపూర్ణ ప్రతిపాదన ,పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వ శక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి, రెండు అస్థిత్వాలున్నాయి - వ్యక్తిగత స్వరూపం, మరియు నిరాకార అస్తిత్వం. నిజానికి, జీవాత్మకి కూడా రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు ఎవరికీ దేహ రూపంలో కాని భౌతిక రూపంలో కాని కనిపించదు. అదేవిధంగా మరణానంతరం ఉపాధి కోసం అది మరొక శరీరాన్ని  స్వీకరిస్తుంది. ఈ విధమైన చక్రభ్రమణం ఒక సారి కాదు, అసంఖ్యాకమైన సార్లు - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతర మవుతూ, మారుతూ ఉంటుంది. సూక్షమైన ఆత్మకే, ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు, సర్వ శక్తిమంతుడైన భగవంతునికి కూడా ఆ శక్తి ఉంటుందనేది శాస్త్రం స్పష్టంగా చెబుతోంది., అందరూ అంగీకరించాల్సిన సత్యం. భగవానుడు ఈ శ్లోకంలో తన స్వీయ రూపంలో అవసరం పడినప్పుడల్లా అవతరిస్తానని చెప్పి వున్నాడు.సాధారణజీవులు మార్చినట్లు ఆయన తన దేహాన్ని మార్చడు.అవతరించినప్పుడల్లా తన అంతరంగిక శక్తి ద్వారా తన దివ్య శరీరం తోనే అవతరిస్తాడు.భౌతిక జగత్తు యొక్క కల్మషముతో ప్రభావితం కాకుండా తన దివ్యరూపంతోనే అవతరిస్తాడు.

***

No comments:

Post a Comment

Pages