విమర్శ - 'తిమ్మ' శబ్దం - అచ్చంగా తెలుగు
 'తిమ్మ' శబ్దం - గురించి కొద్దిగా 

- కర్లపాలెం హనుమంతరావు 



తెలుగు భాషలో బహు విస్తృతంగా వినిపించే పదం  ' తిమ్మ ' . 

తిమ్మన్న, తిమ్మప్ప, తిమ్మకవి,  తిమ్మయ్య, తిమ్మరాజు, తిమ్మ శెట్టి, తిమ్మక్క, తిమ్మమ్మ, తిమ్మాంబ అందు  స్త్రీ పురుషుల పేర్లే కాకుండా  తిమ్మాపురం, తిమ్మసముద్రం  తరహా  స్థలవాచకాలూ వినిపిస్తుంటాయి.

ఇహ ,తిమ్మిని బ్రహ్మిని చేయడం – అనీ, , రమ్మన్నారు తిమ్మన్న బంతికి- అనీ, తిండికి తిమ్మరాజు - పనికి పోత రాజు- అనీ  .. ఇట్లాంటి  జాతీయాలకైలే కొదవే లేదు.  

 

ఆంధ్రసామ్రాజ్యానికి కన్న దేశం మధ్యలో ఉండే విద్యా నగరం రాజధాని అయినప్పటి బట్టి  ఈ తిమ్మశబ్దానికి కన్నడ ప్రత్యయాలు చేర్చిన పదాలు కూడా వాడుకలోకి వచ్చాయి . తిమ్మరాజునే కన్నడంలో  తిమ్మరుసు అని వ్యవహరించారు. రాజు అనే శబ్దంలోనుంచి 'అరసు' అనే కన్నడరూపం పుట్టింది. తిమ్మశబ్దం వైకృతదేశ్య మిశ్రమం  అయిన ' తిరుమల' శబ్దంలో నుంచి పుట్టిన దేశీయ  తెలుగు పదం . దీని వ్యుత్పత్తిని గురించి శబ్దరత్నాకరములో కొన్ని వివరాలున్నాయి .

 

తిరుమల+డు=తిమ్మడు అయింది (శబ్దరత్నా కరం). ఇట్లాగే  తిరుమల + అప్పడు=తిమ్మప్పడు . 

 

ఈ తిమ్మప్పడు అనేది సింహాద్రిఅప్పడులాంటి పదమే. కాకమాని మూర్తికవి తన రాజవాహన విజయములో 'కొండ మీది తిమ్మప్పనివంటి కావ్యపతి యబ్బుట యబ్బుర' మని రాసిన  పద్యం శబ్దరత్నాకరం   ఉదాహరించిందే . 

 

తిరుమల అనే పదం  వేంకటాచలం అనే పదానికి   పర్యాయపదంగా చాలా  కాలంనుంచి వాడుకలో వుంది. అళియ రామరాయల మేనల్లుడూ కొండవీడు పరిపాలకుడూ  అయిన సిద్ధి రాజు తిమ్మభూపాలుడు తన పరమయోగి విలాసంలో ( 9-వ ఆశ్వాసం) 

 

'ధరగల తిరుపతు లొకకడ, 

వరుసకొని ముకుందమూర్తి వర్గము నత డ 

చ్చెరువుగ నుతించె నెడ నెడ

దిరుమల దేవరను దిరిగి తిరిగి పొగడుచున్' అని రాశాడు . 

తిరుపతి  పదం  విష్ణుక్షేత్రానికి పర్యాయ పదం.

 

'వినుము తల్లి నూట యెనిమిది తిరుపతు 

లందు నెన్న వేంకటాచలంబు

 రంగధామమును గరంబు సన్నుతి గాంచు 

గ్రహములందు శశీయు రవియు బోలె.”

. అని నాలుగో  ఆశ్వాసంలో రాశాడు . (శబ్దరత్నాకరము.)

 

తెలుగులో తిరుపతి, తిరుమల అనే పదాలు రెండూ  పర్యాయ పదాలుగా చాల కాలం  నుంచి వాడుకలో ఉన్నవే. తెలుగు దేశానికీ, అరవ దేశానికీ తిరుపతికొండ సరిహద్దని అంటారు. తిరుపతిలోని ప్రజలందరికీ తెలుగే మాతృభాషగా వుండి తిరుమలలోనుంచి తిమ్మశబ్దం పుట్టింది.  కొండమీది కోతులకు  తిమ్మడనే పేరు స్థిరపడింది . 

( కీ.శే దిగవల్లి వేంకట శివరావు గారి ' కథలు - గాథలు'  ఆధారంగా ) 


No comments:

Post a Comment

Pages