శాంతిసౌభాగ్యాలు ప్రసాదించే శరన్నవరాత్రులు - అచ్చంగా తెలుగు

శాంతిసౌభాగ్యాలు ప్రసాదించే శరన్నవరాత్రులు

Share This

 శాంతిసౌభాగ్యాలు  ప్రసాదించే శరన్నవరాత్రులు

-సుజాత.పి.వి.ఎల్ 


వసంత కాలం మరియు శరదృతువులలో వాతావరణం సౌర ప్రభావపరంగా ఉంటుంది. అందుకే ఈ కాలం చాలా ముఖ్యమైన సంధి కాలమనే చెప్పాలి. దుర్గామాతను పూజించడానికి ఈ రెండు కాలాలు చాలా పవిత్రమైన కాలాలుగా భావిస్తారు. దుర్గాదేవి శక్తి రూపంలో వెలసిన దేవత. మహిషాసురమర్దిని అయిన దుర్గామాతను పూజించే పండుగే దసరా. దుర్గాదేవిని తొమ్మిది రోజులపాటు పూజించడాన్ని దుర్గా నవరాత్రులు అంటారు.


దశహర అంటే దశకంఠుడైన రావణాసురుణ్ని శ్రీ రామచంద్రుడు వధించిన రోజు. ఇది వాడుక భాషలో దసరా అయింది. నవరాత్రి పండుగ అంటే తొమ్మిది రాత్రుల పండుగ. చివరి రోజు విజయదశమిని కలుపుకొని పది రోజుల పండుగ అయింది. ఈ పది రోజులు మహిషాసురమర్దిని అయిన దుర్గామాతను రోజుకో రూపంలో కొలుస్తారు. నిజానికి నవరాత్రుల్ని సంవత్సరoలో ఐదు సార్లు జరుపుకుంటారు. వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి , పౌష్య నవరాత్రి మరియు మాఘ నవరాత్రులు.


వసంత నవరాత్రి: వసంత ఋతువులో తొమ్మిది రూపాల శక్తిమాతను ఆరాధించే తొమ్మిది రోజుల పండుగ. దీన్ని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు.


ఆషాడ నవరాత్రి: ఈ ఆషాడ నవరాత్రి చాలామందికి తెలియకపోవచ్చు అందుకే దీన్ని గుప్త నవరాత్రి పేరిట పూజిస్తారు. ఆషాడ మాసంలో అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తారు. ఆషాడ శుక్ల చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలం. అందుకే ఈ మాసంలో అమ్మవారికి ఆషాడ నవరాత్రులు చేస్తారు.


శరన్నవరాత్రులు: అన్ని నవరాత్రులలో ఇవి అతి ముఖ్యమైనవి. శరత్ ఋతువులో( అంటే శీతాకాలం ప్రారంభం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో) తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాలుగా పూజిస్తారు.


పౌష్య నవరాత్రి: పుష్య మాసంలో చంద్రుడు పౌష్య శుక్ల పక్షంలో పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలం. ఈ నవరాత్రిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో దుర్గా మాతను పూజిస్తారు.


మాఘ నవరాత్రి: మాఘ మాసంలో మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షంలో చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే సమయంలో జరుపుకుంటారు.


భారతదేశ ప్రాచీన వాజ్మయంలో ఒక్కొక్క యుగమునకు ఒక్కొక్క ప్రాముఖ్యం చెప్పబడింది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క విశేషం కనపడుతుంది. అంతేకాక ఒక్కో మాసంలో విశేషములు ఒక్కో తీరుగా ఉంటాయి. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుండి శరత్కాలం ప్రారంభం కావటం ఈ మాసం విశేషం. ఈ కాలం ఆహ్లాదకరమైనదైనా, సంధి కాలం అగుటవలన ధాతు వైషమ్యము సంభవించి దీర్ఘకాలిక వ్యాధులతో గాని, తాత్కాలిక వ్యాధులతో గానీ ప్రజలు అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీని నుండి బయటపడి సుఖం పొందుటకు దుర్గాదేవిని పూజించాలి. ఎందుకంటే సృష్టించిన ప్రాణులను రక్షించి కాపాడేది ఆ జగజ్జననే కదా! సమస్త వ్యాధులను పోగొట్టేది అకాల మృత్యువుని హరించేది అయిన ఆ దేవిని మనసారా పూజిస్తే కలియుగమున కలుగే కల్మషములు హరించుకుపోతాయి. దుర్గామాత అగ్రగణ్య, పరమేశ్వరి, జగజ్జనని- అచింత్యమగు గొప్ప రూపముతో విరాజిల్లు శ్రీ శైలపుత్రి. లోకోద్ధరణకి ఆ దేవి ఆవిర్భవించిందని శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడింది.సుందర రాజీవలోచన అయిన ఆ దేవి సింహాన్నిఅధిష్టించి చతుర్భుజములు గలదై, శంఖ చక్ర గదా పద్మములు ధరించినదై, రక్తాంబరధారిణియై, దివ్యమాల శోభితయై అవతరించింది.


అథాహ మంశభాగేన దేవక్యాః పుత్రతాం శుభే lప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్యాం భవిష్యసి ll


సమస్త భోగములను వరములను ఇస్తూ కోరికలకు అధీశ్వరివగు నిన్ను జనులు ధూప దీపాలతోను. ఉపహారాలతోనూ అర్చిస్తారు. భూలోకమున మానవులు నీకు ఆలయాలను నిర్మించి దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక. కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక మొదలైన నామాలతో నిన్ను పిలుస్తారని శ్రీ మహావిష్ణువు యోగ మాయకు చెప్పి ఆమె ఆవిర్భావమునకు కారకుడయ్యాడు.సోదరి దేవకికి ఆడపిల్ల పుట్టిందని తెలిసిన కంసుడు, ఆ బిడ్డను వధించుటకు ఉద్యుక్తుడయ్యాడు. విష్ణు సోదరి అయిన యోగమాయ కంసుని చేతి నుండి పైకి ఎగిరి శూలాది ఆయుధాలతో కూడిన ఎనిమిది చేతులు గలిగిన రూపముతో కంసుడికి అగుపించింది. అప్పుడు ఆ దేవి దివ్యములగు మాలతోనూ, రత్నాభరణముల చేతను అలంకృతయై ఉన్నది. హస్తములందు ధనశ్శూలములను, బాణములను, చర్మమును, ఖడ్గమును, శంఖమును, చక్రమును, గదను ధరించి ఉంది.

అప్సరసలు, కిన్నెర, కింపురుషులు, చారణులు, గంధర్వులు, యక్షులు, మొదలగు దేవతలు అందరూ గొప్ప గొప్ప ద్రవ్యములతో వచ్చి ఆ దేవిని పూజించారు.

ఆ భగవతి యోగమాయ భూమండలమున వారణాసి మొదలైన ప్రసిద్ధ క్షేత్రములందు అన్నపూర్ణ, భవాని, దుర్గ, కాళీ, భ్రమరాంబ, మీనాక్షి మొదలగు అనేక నామములతో విశ్వ విఖ్యాతి చెందినదై వివిధ దుర్గలుగా ఆరాధింపబడుతుంది. చంద్ర ఘంటా, కుష్మాండా, స్కంద మాతా, కాత్యాయినీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రీయను నవదుర్గలుగా దుర్గాసప్తశతిలో చెప్పబడింది.

శత్రువులను జయింప నిశ్చయించిన వారికి తప్పక విజయం చేకూర్చే మాసము ఆశ్వీయుజ మాసమని పేరుంది.

చంద్రుని కాంతిని అంటే వెన్నెలను శారదా అని అంటారు. జగన్మాతకు శారద అనే పేరున్నది. అందుచేతనే శారదా కాంతులతో విరాజిల్లు ఆ దేవిని-


శారదా శారదాంభోజ వదనాంబుజే l

సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ ll అని స్తుతిస్తారు.


ఆశ్వీయుజ పాడ్యమి నుండి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు, శారదా నవరాత్రులు అని పిలుస్తారు."శరది భవా శారదా" శరత్ కాలమున పుట్టుట వలన ఆమె శారదా దేవి అయినది. మన చదువుల తల్లి శారదాదేవి కనుక ఆ దేవి వాగ్రూపుణి అవుతుంది. అంటే అకారాది క్షకారాంత వర్ణ స్వరూపిణి. ముక్తావళి అనే తర్కశాస్త్ర గ్రంథమునందు శబ్దమును గూర్చి విచీ తరంగ న్యాయమని, కదంబ ముకుళ న్యాయమని రెండు అర్థాలు ఉన్నాయి.


మనం ఒక సముద్రం దగ్గరకు వెళ్ళి చూస్తే అందులో నీటి నుండి గాలికి ఒక అల లేవడం ఎలాగో గమనించే ఉంటాం. ఆ అల ఒడ్డుకు చేరుకునేలోగా మరొక అల దాని వెంట ఉంటుంది. ఇలా అలలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి, ఒడ్డుకు చేరుకుంటూనే ఉంటాయి. దీన్ని విచీ తరంగ న్యాయ మంటారు .


అలాగే ఒక శబ్దం పుట్టి దాని స్పందన మన చెవి వద్దకు చేరగానే దాని వెంట మరొక స్పందన దాని వెంట మరొకటి ఇలా స్వచ్ఛందంగానే వచ్చి చెవికి తగులుతూ ఉంటాయి. ఒక మాల కూర్చబడిన అనేక రకాల పూల మొగ్గలను కదంబ మొగ్గలు అంటారు. ఈ మాలలో అన్నీ ఒకేసారి విచ్చుకుంటాయి. అదే కదంబమాల. దీనినే కదంబ ముకుళ న్యాయం అంటారు. మొదటి న్యాయములో ఒకదాని వెంబడి మరొకటి వస్తూంటుంది రెండవ దానిలో జరిగేది ఒకేసారి జరుగుతుంది. అంటే మొదటి న్యాయo మనకు రెండవది విపరీతం అవుతుంది. ఆకాశంలో శబ్ద స్పందనలు ఎన్నో ఈ కదంబ మొగ్గల వలే ఒకేసారి పడతాయి. ఈ శబ్దములనే అక్షరాలని, మాతృకలు అని అంటారు. ఆ మాతృకా స్వరూపిణియే అంబిక. కాళిదాసు శ్యామలా దండకము జగన్మాతను సర్వ వర్ణాత్మికే అని, జగన్మాతృకే అని స్తుతించాడు మనకు శారదా రూపముగా విజ్ఞానం ఇచ్చేది అంబయే.


సకల రోగ నివారిణిగా రాక్షస భాదను తొలగించిన లోకోపకారిణిగా, సకల విజ్ఞానదాయకంగా ఆ జగజ్జనని ఆవిర్భవించిన ఈ శారదా నవరాత్రులు పరమ పవిత్రమైన రోజులు అందుచేతనే నవరాత్ర పూర్వకముగా ఆ దేవిని మనము ఆరాధిస్తాం. తొమ్మిది రోజుల ఆరాధన అనంతరం ‘దశమి రోజున ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే తప్పక విజయం చేకూరుతుంది’ అని భారతీయుల విశ్వాసం. శ్రీ రామచంద్రుడు ఈ మాసమున ఒకచోట శుద్ధమైన పీఠమును ఏర్పరచి, అందు దేవిని ప్రతిష్టించి శాస్త్ర సమ్మతంగా పూజలు చేసిన తర్వాతనే లంకకెళ్ళి రావణ వధ గావించాడని రామాయణంలో చెప్పబడింది.


దుర్యోధనాదులు పాండవుల అజ్ఞాతవాస భంగము గావించుటకు ఉత్తర గోగ్రహణము కావించగా అర్జునుడు ఉత్తరుని రథసారథిగా చేసుకొని, పాండవులు ఆయుధములుంచిన శమీ వృక్షము వద్దకు వచ్చి, ఆ వృక్షమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి తన ఆయుధము ( గాండీవము) ను తీసుకొని కౌరవులనందరినీ తానొక్కడే జయించి గోవులను నగరములకు మరల్చాడు అర్జునుడికి విజయం ఈ దశమి రోజున కలిగినందున ఆయన పేరు మీదనే ఆశ్వయుజ శుద్ధ దశమికి విజయదశమి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. అందుచేత ఈ విజయదశమి రోజున ప్రారంభించిన పనులకు, విజయం చేకూరుతుందనే విశ్వాసం అందరికీ ఏర్పడింది. అర్జునుడు ముందుగా శమీవృక్షమునకు ప్రదక్షిణ గావించి నమస్కరించి పూజించినందువల్లనే విజయము కలిగినదని ఈ దశమి రోజున శమీ పూజ చేయుట కూడా ప్రత్యేక విశేషంగా చెప్పబడుతుంది.


శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీl


అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీll


శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు. శమీ పాపమును పోగొడుతుంది, శత్రు నాశనము గావిస్తుంది. శమీ అర్జునుడికి ధనుర్భాణములను అందించినది. రామునికి ప్రియమును గూర్చినది.


ఈ శ్లోకమును ఉచ్చరిస్తూ శమీ వృక్షం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు గావించిన వాళ్లు విజయులవుతారు.

***

No comments:

Post a Comment

Pages