సజ్జన సాంగత్యం - అచ్చంగా తెలుగు

సజ్జన సాంగత్యం

 
సి హెచ్ ప్రతాప్
 సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే జీవన్ముక్తి:

సాక్షాత్తూ ఆదిగురువైన శ్రీ శంకర భగవానుని దివ్య అవతారమైన ఆది శంకరాచార్యుల వారు రచించిన భజ గోవిందం లోని పై శ్లోకం సత్సంగం యొక్క ప్రాముఖ్యాన్ని అపూర్వం గా వివరిస్తుంది. సత్సంగం అంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం బహు అమూల్యమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలనే సత్సంగం సిద్ధిస్తుంది.సజ్జన సాంగత్యం నిస్సంగత్వం అనగా వివేక వైరాగ్యాలను, నిస్సంగత్వం నిర్మొహత్వం అంటే మాయ నుండి విడిపడిన పరిస్థితి, నిర్మోహత్వం నిశ్చలతత్వాన్ని అనగా మనస్సు చంచలత్వం పొందని స్థితిని ప్రసాదిస్తాయి.ఆఖరుగా నిశ్చలతత్వం జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సాక్షాత్తు దైవ స్వరూపులైన మానవుల లక్ష్యం జీవన్ముక్తి కదా!

మనం నిత్య జీవితంలో చేసే సాంగత్యం పై మన జీవితం, మన ఉన్నతి ఆధారపడి వుంటాయి.అది మన మనస్సును, భవిష్యత్తును మన ఆత్మను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దుర్జన సాంగత్యం లో మనకు దురలవాట్లు అబ్బుతాయి. వారితో కలిసి ఎన్నో పాప కార్యాలు చేస్తాం. తిరిగి వాటిని మనమే అనుభవిస్తూ అంతులేని దుఃఖాన్ని పోగు చేసుకుంటాము. సజ్జన సాంగత్యం మన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పంధాన నడవక పోతే పాప కార్యాల పంకిలంలో పడి చేసిన కర్మల తాలూకూ ఫలితాన్ని అనుభవించడానికి ఎన్ని జన్మలైనా జనన మరణ చక్రభ్రమణం లో కొట్టు మిట్టాడుతునే వుంటాము. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక సద్గురువును ఆశ్రయించడం ఎంతో అవశ్యం. వారు మనకు జీవన్ముక్తిని సాధించే మార్గాన్ని చూపిస్తారు. అందువలన ఆత్మ జ్ఞానాన్ని మనకై మనం వెతుక్కోవల్సిన పని లేదు. సద్గురువులకు త్రికరణ శుద్ధిగా సర్వస్య శరణాగతి చేస్తే చాలు.

ఓ మానవుడా! జ్ఞాన వంతుల ,సద్భుద్ది గల సజ్జనుల సాంగత్యంలో జీవితాన్ని గడుపు. అందువలన వారి జ్ఞానం, నీకు సంక్రమించి నువ్వు కూడా ఉద్ధరించబడతావు. భగవంతుని అపూర్వమైన , అపారమైన కరుణా కటాక్షాలకు పాత్రుడవౌతావు. లేకుంటే నరక ప్రాప్తియే గతి అంటూ శంకర భగవత్పాదులు మానవులకు పై శ్లోకం ద్వారా కర్తవ్య బోధ చేసారు.
సజ్జన సాంగత్యం యొక్క ప్రశస్తిని ఇంతకంటె అద్భుతంగా ఇంకెవరు వివరించగలరు ?

 సత్పురుషుల కొలువు భగవంతుని సాన్నిధ్యంతో సమానమన్నారు పెద్దలు. చెడ్డ వాని స్నేహం పలు సంశయాలకు తావిస్తుంది. సత్పురుషుని స్నేహం మలయమారుతంలా జీవితాన్ని పునీతం చేస్తుంది.

సత్పురుషులంటే ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది  అరిషడ్వర్గాల కల్మషం అంటని పవిత్ర మూర్తులకు ‘సత్పురుషు’లన్న నామం శోభిస్తుంది. వారు పవిత్ర గోదావరి లాంటి వారు. తమ జ్ఞాన ప్రభోదాలతో వారు ఈ సమస్త ప్రపంచాన్నీ అజ్ఞానాంధ కారాన్నుంచి కాపాడగలుగుతారు. సత్పురుష సాంగత్యం అందరికీ మార్గదర్శకం

సత్పురుషుల సాంగత్యం కూడా అలాగే చెడ్డవారిలో మంచితనాన్ని పెంచుతుంది. వారికి స్వపర బేధాలుండవు. అందరినీ సమానంగా ఆదరిస్తారు. మంచి మాటలతో పవిత్ర మార్గంలో పయనించేలా చేస్తారు. భగవంతునిలా దయాగుణం, క్షమాగుణం సత్పురుషులకు ఉంటాయి కనుక వారిని భగవంతునితో సమానులుగా భావించవచ్చు. అందుకే అందరం సత్పురుషులను ఆశ్రయిద్దాం. వారి సాంగత్యంలో మన అరిషడ్వర్గాలను జయించి పునీతుల మై మన జీవితాలను సార్ధకం చేసుకుందాం.

***

No comments:

Post a Comment

Pages