శ్రీశ్రీనివాస శతకము - చింతలపాటి పూర్ణచంద్రరావు - అచ్చంగా తెలుగు

శ్రీశ్రీనివాస శతకము - చింతలపాటి పూర్ణచంద్రరావు

Share This

 శ్రీశ్రీనివాస శతకము - చింతలపాటి పూర్ణచంద్రరావు

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 
కవి పరిచయం:

శ్రీశ్రీనివాసశతక రచయిత చింతలపాటి పూర్ణచంద్రరావు విద్వత్ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి 'పండితరత్నా'పంచాంగకర్త, 'కావ్యభూషణ' బిరుదాంకితులు బహుగ్రంధకర్త చింతలపాటి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. రచయిత ఈ శతకాన్ని తన తండ్రి గారికి అంకితమిచ్చారు. పూర్ణచంద్రయ్య గారు 'విద్వాన్" పట్టభద్రులై కృష్ణాజిల్లాలో ప్రథమశ్రేణి తెలుగు పండితులుగా పనిచేసారు. కవితలోనే కాక ధార్మిక ప్రవచనంలో కూడా నైపుణ్యం కలవ్రు. అనేక సంస్థలలో ప్రసంగించి శ్రోతలను అలరించినవారు. శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులుగా పలు సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
వీరి ఇతర రచనలను గురించి వివరములు లభించలేదు.

శతక పరిచయం:

"శ్రీనివాస" అనే మకుటంతో ఆటవెలదు వృత్తంలో రచింపబడిన ఈశతకంలో నూటపది పద్యాలున్నాయి ఆపైన అష్టొత్తర శతం, సంకీర్తనాపరంగా ఉత్పలమాల చంపకాలు ఓక నక్షత్రమాల ఆపై నివేదనాపంచకం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి.ఈ గ్రంథం భ్క్తి, నీతి శతకాల కోవలోనికి వస్తుంది. భక్తిభావ సమన్వితమైన ఈశతకంలో ప్రతిపద్యంలో కవి ఆవేదనాభరితమైన హృదయ స్వచ్చత ఆర్ద్రత మంచుగా కురిసి అవి ముత్యాలై మెరుస్తుంటాయి.  ఈగ్రంథంలోని పద్యాలు సప్తగిరి మాసపత్రికలోను, ఆరాధన మాసపత్రికలోను ప్రచురింపబడ్డాయి.
ఇప్పుడు ఈశతకంలోని కొన్ని పద్యాలను చూద్దాము

శతకారంభములో సంప్రదాయ బద్ధంగా గణేష ప్రార్థన సరస్వతీ ప్రార్థన, ప్రాచీన కవుల స్మరణ చేసారు.

శ్రీగణాధినాథు సేవించి తొలుదొల్త
శతకరచన సేయ సాహసింతు
లలితభావజాల మలరారునట్లుగా
చిత్తశుద్ధి నిడుము శ్రీనివాస

పలుకులమ్మ పాద పంకేరుహమ్ములన్
మనమునందు దలతు ఘనముగాను
హృద్యమైన పద్య మెదలోన తళుకొత్తు
చింతనమ్మునిమ్ము శ్రీనివాస

శ్రీసతీమతల్లి చిరునవ్వు చిందింప
పరవశించునట్టి పరమపురుష
పద్యకవితచేత పండించి ఫుండెను
చేరికొందు నిన్ను శ్రీనివాస

ఈశతకంలో  కవి పరిపక్వత నాలుగు విధాలుగా కనిపిస్తుంది. పరిశీలకుడు, విశ్లేషకుడు, బోధకుడు, తాత్వికుడు.
ఉదాహరణకు:

ఉన్నవాడెపుడును ఉన్నవాడికె బెట్టు
లేనివాడికిడడు లేశమైన
ఊర్విలోన జనుల ఉపకారభావాల
శీలమిట్టులుండె శ్రీనివాస

అనే పద్యంలో కవి పరిశీలనా తత్త్వం తెలుస్తుంది.అలాగే

వ్యసన పరుని జూచి పరిహసించిరి నాడు
వ్యసనపరుడె నేడు భవ్యగుభుడు
మంచిచెడ్డలన్ని మదిలోని మార్పులే
శ్రీరమా విలోల శ్రీనివాస

అనే పద్యంలో విశ్లేషణ తత్త్వం

ధనముకూడ బెట్టు తలపు మంచిదె కాని
ధర్మమార్గమెపుడు తప్పరాదు
పరులనోళ్ళుగొట్టి పైకంబు గడియించు
చెనటికేమి శిక్ష శ్రీనివాస

అనేపద్యంలో ప్రభోదతత్త్వం అలాగే

అణువునణువులోన నణిగియుండెడి నిన్ను
త్రికరణాలవలన తెలుసుకొనిన
చావుపుటకనెడి జంజాటమును లేక
జీవిముక్తిపొందు శ్రీనివాస

అనేపద్యంలో తాత్త్విక చింతన మనకు దర్శనమిస్తాయి.
కవి యొక్క మధుర భక్తిని చూపే ఈ క్రింది  రెండుపద్యాలు చూదండి

కలుములమ్మ వడిని కరగిపోయెడివేళ
మనమునందు నన్ను మరువకుండ
పచ్చబొట్టు పగిది వదనాన ధరియించు
దీనజన శరణ్య శ్రీనివాస

రామమంత్రమెపుడు రక్షయై చెలువారి
పాపబుద్ధినెల్ల పారద్రోలు
రామభజనసేయు నరులనాలుకకది
చెఱకురసము గాదె శ్రీనివాస

తేటతెలుగులో సూటిగా చదువరుల హృదయాలలో నాటుకునేట్లు రచన చేయటంలో ఈకవి దిట్ట. ఈ పద్యములు చూడండి

కాలుజారెనేని కాయమ్ము గాయమౌ
నోరు జార మనసు నొచ్చు కొనును
జారుపాటులున్న జరుగుబాటుండునా
క్షితి యేరికైన శ్రీనివాస

కులము మతములంచు కుమ్ములాటలు రేపు
కుటిలవర్తనమ్ము పొటమరింప
దానవత్వమిలను తలయెత్తిజనతకు
చేటుతెచ్చుచుండె శ్రీనివాస

మనిషి కట్టుకున్న ఇనుపగోడలెగాని
కులమతాలు లేవు కువలయాన
మంచిమనసుకన్న మతమేది? కులమేది?
మానవాళికిలను శ్రీనివాస

ఈవిధంగా సంఘంలో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలనూరాచకాలను కవి తన శతకంలో ఎత్తి చూపారు.

ఇవేకాక సమయానుసారంగా ఈకవి పలు సామెతలను జాతీయాలను విరివిగా ఉపయోగించారు.
ఇంతచక్కని శతకం అందరూ తప్పక చదవ వలసినది.
మీరు చదవండి మీ మిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages