మహా భారత పర్వాల సంగ్రహ వివరణ (13 నుండి 18 పర్వాలు ) - అచ్చంగా తెలుగు

మహా భారత పర్వాల సంగ్రహ వివరణ (13 నుండి 18 పర్వాలు )

Share This

మహా భారత పర్వాల సంగ్రహ వివరణ (13 నుండి 18 పర్వాలు )

అంబడిపూడి శ్యామసుందర రావు 



పదమూడవ పర్వాన్ని అనుశాసన పర్వము అంటారు ఈ పర్వము అంతా భీష్మ ధర్మరాజుల  సంవాదమే. ఈ పర్వములోనే భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశము చేయబడుతుంది. అనేక ధర్మ రహస్యాలు కూడా ఈ పర్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. భీష్ముడు ధర్మరాజు సందేహాలన్నీ నివృత్తి చేసాక హస్తినా పురము వెళ్ళటానికి అనుమతి ఇచ్చి ఉత్తరాయణము వచ్చాక తన కాలము తీరే సమయానికి రమ్మని ధర్మరాజును పంపిస్తాడు హస్తినకు వచ్చిన ధర్మరాజు దక్షిణాయనము ముగిసి ఉత్తరాయణము మొదలయె సమయానికి కౌరవ పాండవలు, మరియు ఋషులతో భీష్ముని చెంతకు చేరగా భీష్ముడు దృతరాష్ట్రునికి చివరగా సందేశము ఇచ్చి శ్రీకృష్ణుని ప్రాణాలు విడువటానికి అనుమతి కోరుతాడు. బాణాలన్నీ ఒక్కట్టీ విడిపోగా శిరస్సు ఛేదించుకొని బయటకు వచ్చిన ఆత్మ అనంతవాయువులలో కలిసిపోతుంది భీష్ముని పార్థివ దేహానికి అగ్ని సంస్కారము చేసి గంగా నదికి చేరుతారు గంగా తన కుమారుని మరణానికి దుఃఖించగా వ్యాసుడు శ్రీకృష్ణుడు ఆమెను ఓదారుస్తారు అందరు గంగకు పూజలు చేసి వెనక్కి మరలటంతో అనుశాసన పర్వము ముగుస్తుంది. 

పద్నాల్గవ పర్వాన్ని అశ్వమేధిక పర్వము అంటారు. తాతగారి నిర్యాణము ధర్మరాజును తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. ఈ పాపము తొలగటానికి తానూ ఏమి చేయాలనీ పెద్దలను అడిగితె వారు అశ్వమేధ యాగము చేయమని సలహా ఇస్తారు. కానీ యుద్ధము వలన ఖజానా ఖాళీ అయింది కాబట్టి తానూ యాగము ఎలా చేయగలనని పండితులను ప్రశ్నిస్తాడు వారు వెనుకటి యుగములో మరుత్త మహారాజు హిమాలయాల్లో దాచిన అనంత ధనరాశులు భద్రముగాఉన్నాయి కాబట్టి వాటిని తెచ్చుకొని యాగాన్ని నిర్వహించవచ్చు అన్ని ధర్మరాజుకు వ్యాసుడు  సలహా ఇస్తాడు. శ్రీ కృష్ణుడు సుభద్రను తీసుకొని ద్వారక చేరుకొని కురుక్షేత్ర వృత్తాంతాన్ని వసుదేవునికి వివరిస్తాడు.పాండవులు వ్యాసుని సలహా మేరకు హిమాలయాలు చేరుకొని అనంత ధనరాశులను తెస్తారు ఈ లోపు ఉత్తర అశ్వత్థామ అస్త్ర ప్రభావము వలన మృత శిశువును  కంటుంది ఆ సమయానికి అక్కడికి చేరుకున్న శ్రీ కృష్ణుడు ఆ మృత శిశువును బ్రతికించి పరీక్షిత్తు అని నామకరణము చేస్తాడు. అశ్వము వెనుక వెళ్లిన అర్జునుడు అనేక రాజులను జయించి తిరిగి వస్తు  తన కొడుకు భబ్రువాహనుని చేతిలో హతమవగా భార్య ఉలూపి నాగమణి ద్వారా అతడిని బ్రతికిస్తుంది ఈ వృత్తాంతము వసువుల శాపానికి ప్రతిక్రియగా చెపుతారు. అశ్వమేధ యాగము విజయవంతముగా ముగుస్తుంది. ఈ పర్వములోనే శ్రీకృష్ణుడు అర్జునినికి  బ్రాహ్మణా గీత లేదా అనుగీత బోధిస్తాడు శ్రీ కృష్ణుడు వైష్ణవ ధర్మమూ గురించి భగవంతుని భక్తుల గురించి అర్జునికి ఉపదేశించి ద్వారకకు వెళ్లటంతో అశ్వమేధిక పర్వము ముగుస్తుంది

పదిహెనవ పర్వము ఆశ్రమ వాసికా పరము అంటారు ధర్మరాజు దృతరాష్ట్రుడిని గాంధారిని స్వంత తల్లిదండ్రులులా చూసుకుంటున్న,భీముడు అప్పుడప్పుడు చూపించే నిరాదరణ నిష్టురాల వల్ల దృతరాష్ట్రుడు మనస్తాపానికి గురై ఉపవాసాలతో శరీరాన్ని శుష్కింప చేసుకుంటాడు తానూ గాంధారి వానప్రస్థానికి వెళతామని ధర్మరాజుతో చెపుతాడు వ్యాసుని సలహా మేరకు ధర్మరాజు కూడా అంగీకరిస్తాడు.చివరగా దృతరాష్ట్రుడు తన కొడుకులందరికి తర్పణాలు విడిచి ,దానధర్మాలు చేసి గాంధారితో అడవులకు బయలుదేరుతాడు ఆ సమయములో కుంతీ తాను కూడా వారితో వస్తానని చెప్పి పాండవులను దుఃఖంలో ముంచి దృతరాష్ట్రుడు గాంధారి దంపతుల సేవ కోసము వారితో పాటు అరణ్యాలకు బయలుదేరి శతరూప ఆశ్రమానికి చేరి అక్కడ నివాసము ఏర్పరచుకుంటారు వీరితో పాటు విదురుడు సంజయుడు కూడా వెళతారు వీరు వానప్రస్థములో ఉండగా ఒక ఏడాది గడిచాక పాండవులు వారి భార్యలు కౌరవ పత్నులు పెద్దల దర్శనానికి అరణ్యానికి వెళతారు. ఆ సమయములో వారికి వ్యాసుడు కూడా కలుస్తాడు కానీ విదురుడు కనిపించకపోతే ధర్మరాజు విదురుని కోసము అడుగుతాడు వ్యాసుడు విదురుడు అరణ్యాలలో తిరుగు తున్నాడని ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తాడని చెపుతాడు. విదురుని కోసము వెతుకుతున్న ధర్మరాజుకు చెట్టుకు అనుకోని ఉన్న విదురుడు కనిపిస్తాడు దగ్గరకు వెళ్లగా ధర్మరాజు చేతిలో విదురుడు ప్రాణాలను విడుస్తాడు. ధృతరాష్ట్రుని అభ్యర్థన మేరకు వ్యాసుడు చనిపోయిన వారందరిని దేవ లోకాలనుండి రప్పించగా వారు తమతమ ప్రియ బంధువులతో ఆనందముగా గడిపి తెల్లవారగానే వచ్చిన వారందరు గంగా నదిలో అదృశ్యమవుతారు. వ్యాసుని అనుమతితో కౌరవుల భార్యలు కూడ గంగలో మునిగి ప్రాణాలను త్యజించి భర్తలను చేరుకుంటారు.దృతరాష్ట్రుడు ధర్మ రాజుతో మునులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వెళ్లిపొమ్మని చెప్పి వెనకకు పంపుతాడు. కొంతకాలము తరువాత దృతరాష్ట్రుడు,గాంధారి,కుంతీ,అరణ్యములో ఏర్పడ్డ దావలనము వలన ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుంటారు ఈ దావలనము నుండి తప్పించుకున్న సంజయుడు హిమాలయాలకు తపస్సు కోసము వెళ్లినట్లు నారదుడు చెపుతాడు. పాండవులు ఈ మరణ వార్త  విని దుఃఖించి పెద్దలకు చేయవలసిన కర్మకాండలు జరిపి విరక్తులవుతారు అంతటితో ఈ పర్వము ముగుస్తుంది ఈ పర్వము పూర్తిగా దృతరాష్ట్రుడు ఇతరుల వానప్రస్థాన్ని వారి జీవితము ముగింపును వివరిస్తుంది. 

పదహారవ పర్వాన్ని మౌసల పర్వము అంటారు ఈ పర్వంలో శ్రీ కృష్ణుని నిర్యాణము యదు వంశ నాశనము తరువాతి పరిణామాలు వివరించబడతాయి. యుద్ధము అనంతరము 36 సంవత్సరాలు గడిచాక అంటే గాంధారి శాపానికి నియమించిన గడుపు పూర్తి అయినాక ద్వారకకు విశ్వామిత్రుడు ఇతర ఋషులు శ్రీ కృష్ణుని చూడటానికి వచ్చిన సమయములో కొంతమంది యాదవులు సాంబుడికి ఆడ వేషము వేసి ఋషులను పరిహాసము చేయటానికి ఆమె గర్భములో ఉన్నది అడా? మగా? అని అడుగుతారు ,కోపించిన ఋషులు ముసలం పుడుతంది అని అదే యదు వంశ నాశనానికి కారణమవుతందని శపిస్తారు. ఆ మరునాడే సాంబుడు ముసలాన్నీ కంటే ఆవిషయాన్నిఉగ్రసేన మహారాజుకు చెపుతారు అయన  దానిని మెత్తగా చూర్ణము చేసి సముద్రములో కలిపివేయమని ఆదేశిస్తాడు. సముద్ర తీరములో ఆ చూర్ణము ప్రభావము వలన రెల్లు గడ్డి దట్టముగా పెరుగుతుంది సముద్రతీరానికి వచ్చిన యాదవులు మధువు సేవించి ఆకారణముగా వాదులాడుకొని కత్తులుగా మారిన  ఆ రెల్లు గడ్డితో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చనిపోతారు ఆ విధముగా యదువంశము మునుల శాపము వలన నాశనము అవుతుంది. బలరాముడు యోగముతో ప్రాణాలను విడుస్తాడు శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్లి ఆలోచన ముద్రలో శయనిస్తాడు జరా అనే బోయవాడు ముసలం మిగిలిన ముక్కను బాణానికి ములుకుగా వాడి ఆ బాణముతో శ్రీకృష్ణుని బొటనవేలిని  పక్షి కన్నుగా భావించి బాణాన్ని సంధిస్తాడు ఆ బాణము శ్రీకృష్ణుని కాళీ బొటన వేలికి తగిలినవెంటనే శ్రీ స్రేకృష్ణుడు అవతారాన్ని చాలిస్తాడు ఈ వార్త తెలుసుకున్న అర్జునుడు యాదవ స్త్రీలను పిల్లలను తీసుకొని ద్వారకను వదలి  వెళతాడు ద్వారకా సముద్రములో కలిసిపోతుంది. అర్జునుడిపై  దారిదొంగలు దాడి చేస్తే వారిని ఎదుర్కోవటానికి గాండీవాన్ని ఉపయోగిస్తే పనిచేయదు.దొంగలు స్త్రీలను నగలను దోచుకుంటారు శ్రీ కృష్ణ నిర్యాణము తెలుసుకున్న పాండవులకు జీవితమూ మీద ఆసక్తి పోతుంది. 

పదిహేడవ పర్వమును మహాప్రస్థానిక పర్వము అంటారు విరక్తి చెందిన పాండవులు పరీక్షిత్తు ను రాజుగా అభిషేకించి, యుయుత్సుడి ని పరీక్షిత్తు బాగోగులు చూసే భాద్యత అప్పగిస్తారు కృపాచార్యుడే పరీక్షిత్తుకు గురువుగా ఉంటాడు హస్తినాపురం ఇంద్రప్రస్థల మధ్య భేదభావం లేకుండా చూసుకోమని సుభద్రకు ధర్మరాజు చెపుతాడు ఆ తరువాత పాండవులు ద్రౌపది సమేతముగా భూప్రదక్షిణము చేసి ఉత్తరదిక్కుగా ప్రయాణము చేసి అగ్నిదేవుడు ఇచ్చిన గాండీవాన్ని సముద్రములో పడవేయటం ద్వారా వరుణదేవుడికి సమర్పిస్తాడు అర్జునుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు సముద్రములో మునిగిన ద్వారకను చూసి నమస్కరిస్తాడు చివరగా అందరు ఉత్తరాభిముఖంగా గంధమాన పర్వతము దాటి మేరు పర్వతము వైపు ప్రయాణము సాగిస్తారు వీరిని ఒక కుక్క అనుసరిస్తూ ఉంటుంది ఈ ప్రయాణములో ముందు ద్రౌపది పడిపోతుంది ధర్మజుడిని అనుసరిస్తున్న తమ్ముళ్ల లలో భీముడు ధర్మరాజును ద్రౌపది పడిపోవటానికి కారణము అడుగుతాడు ద్రౌపది అందరికి భార్య అయినా ఒక పిసరు ఎక్కువ అభిమానము అర్జునుడి పట్ల ఉండటమే కారణమని చెపుతాడు ఆ తరువాత నకుల సహదేవులు అర్జునుడు వరుసగా పడిపోతే భీముడు కారణము అడుగుతాడు ధర్మరాజు వారికి  తెలవితేటలు,అందము ,సౌర్యము ,ఎక్కువ అనే గర్వము కారణమని చెపుతాడు చివరగా భీముడు పడిపోబోతూ కారణము అడుగుతాడు తిండి మీద ఉన్న అత్యాసయే కారణమని చెపుతాడు   స్వర్గంనుండి దేవేంద్రుడి విమానం ధర్మరాజును సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్లడానికొస్తుంది. అనుసరించి వస్తున్న కుక్క కూడా తనతో రావాలంటాడు ధర్మరాజు. కానీ దేవేంద్రుడు ఒప్పుకోడు అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగ ప్రత్యక్షమయి ధర్మరాజును అభినందిస్తుంది. సర్వదేవతలు ఋషుల అభినందనల మధ్య ధర్మరాజు ఇంద్రవిమానంలో స్వర్గానికి సాగుతాడు.స్వర్గంలో పాండవులు ,కర్ణుడూ కనిపించరు.దుర్యోధనుడు ఆనందంగా కనిపిస్తాడు. ధర్మరాజు తనని తన తమ్ముళ్ల దగ్గరకు తీసుకెళ్ళమంటాడు. ఇక్కడితో మహాప్రస్థానికపర్వం ముగుస్తుంది.

మహాభారతములోని ఆఖరి పర్వము స్వర్గారోహణ పర్వము ధర్మరాజు కోరికననుసరించి ఇంద్రుడు ధర్మరాజు సోదరులు ఉన్నచోటికి పంపిస్తాడు కానీ నరకములో సోదరులు ద్రౌపది భాధ పడతాము చూడటమే కాకుండా నరక లోక బాధలను ప్రత్యక్షంగా చూసి తనకు స్వర్గము అక్కరలకేడని తనవారితో నరకములోనే ఉంటానని చెపుతాడు నిజానికి సోదరులు అందరు స్వర్గానికి చేరారని ధర్మరాజు అసత్య మాడినందుకు దోష పరిహార్దము నరక దర్శనము జరిగిందని ఇంద్రుడు చెపుతాడు ఇంద్రుని ఆదేశం ప్రకారం దేవగంగలో స్నానం చేసి మానుష శరీరాన్ని విడిచిపెడతాడు. స్వర్గంలో ఉన్న ఇతరలోకాలలో ఉన్న అందరు బంధువులను మిత్రులనుకృష్ణార్జునలతో సహా ధర్మరాజు చూడగలుగుతాడు. ఆ విధముగా మహాభారత కథను వ్యాసుడు పరీక్షిత్తు కొడుకైన జనమేయజయ మహారాజుకు చెప్పగా జనమేజయుడు తరువాత ఏమైనది అని అడుగుతాడు దానికి వ్యాసుడు వారి వారి కర్మఫలాలు ముగిసినాక వారు స్వాలోకాలకు నిజరూపాలతో వెళ్లారని చెబుతాడు జనమేజయుడు యాగము ముగించుకొని దానధర్మాలు నిర్వహించి రాజ్యపాలనకై హస్తినాపురం వెళతాడు. ఈ కథను విన్న వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు నైమిశారణ్యములో సౌనకాది మునులకు చెపుతూ ధర్మాన్ని సేవించమన్నవ్యాసుని సందేశముతో స్వర్గారోహణ పర్వము మహాభారత కదా ముగుస్తాయి. 

ఈ విధముగా పద్దెనిమిది పర్వాలలో మహాభారతము అనేక ధర్మసూక్షములతో నీతి సూత్రాలతో,రాజకీయ సూత్రాలతో నేటికి మానవులు పాటించదగ్గ ఆచరించదగ్గ నేర్చుకోదగ్గ అనేక విషయాలతో వివరించబడింది అందుచేతనే మహాభారతాన్ని పంచమ వేదముగా పేర్కొంటారు మహాభారతము తెలుసుకున్నవాడికి తెలుసుకున్నంత జ్ఞానాన్ని అందిస్తుంది కాలాలతో పని లేకుండా ఎన్ని యుగాలైనా భారతము లోని విషయాలు పాటించదగ్గవి.       

***

No comments:

Post a Comment

Pages