త్రివిక్రమావతారం - 1 - అచ్చంగా తెలుగు

 త్రివిక్రమావతారం - 1

శ్రీరామభట్ల ఆదిత్య 


ఇంద్రుడు మొదలైన దేవతలను తిరిగి స్వర్గం చేర్చడానికి శ్రీమహావిష్ణువు ఇంద్రుడికి తమ్ముడై 'ఉపేంద్రుడి'గా అదితికశ్యపులకి జన్మించాడు.

అసురరాజైన బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడని తెలిసి అక్కడికి వామనుడు వెళ్ళాడు. ఉపేంద్రుడైన వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల భూమి దానం ఇవ్వమని అడగడం, బలి చక్రవర్తి సరేనని ఆ మూడు అడుగుల భూమిని ఇస్తానని మాట ఇవ్వటం జరిగిపోయాయి. అలా వామనుడు తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చవడం కోసం త్రివిక్రముడుగా మారాడు. ఆ త్రివిక్రమావతారాన్ని పోతనామాత్యల వారు తన ఆంధ్ర మహా భాగవతంలో అత్యద్భుతంగా వర్ణించారు.


అసురరాజైన బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోసాడని గ్రహించాడు వామనుడు. అందరూ చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి, మెల్లిగా ఇంత ఇంత చొప్పున ఎదగటం ఆరంభించాడు. కొద్ది సమయంలోనే చాలా పొడుగు ఎదిగాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. ఆపైన మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత ఇంకా చంద్రమండలం అన్నీ దాటేసాడు. ఇదివరకు తన మహాభక్తుడు పసిపల్లవాడైన ధ్రువుడు ఉండే ధ్రువ మండలం కూడా దాటేసాడు. సప్తలోకాలనూ దాటేస్తున్నాడు. మహర్లోకాన్ని మించిపోయాడు. సత్యలోకం కన్నా పైకి ఇంకా పైకికి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయి ప్రకాశిస్తున్నాడు. ఇంతలోనే ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో కదా శ్రీమన్నారాయణుడు.


వామనుడు బ్రహ్మాండమంత పెరిగి నిండిపోతుంటే, ఆకాశాన ఉండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా మారిపోయాడట. ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి సూర్యభగవానుడు గొడుగులా, తర్వాత శిరోరత్నంలా, తర్వాత మకరకుండలంలా, తర్వాత కంఠాభరణంలా, ఆ తర్వాత బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట ధగధగ మెరిసే కంకణంలా, అతర్వాత మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిగజ్జెలా, చివరికి పాదపీఠంలాగా ఉన్నాడట.


ఈ విధంగా శ్రీమహావిష్ణువు త్రిగుణాత్మకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశమూ, స్వర్గమూ, దిక్కులూ, దిక్కుల మధ్య ప్రదేశాలూ, సముద్రాలూ, చరాచరములైన సమస్త ప్రాణులూ తానే అయ్యాడు. క్రమంగా భూలోకాన్ని అంతా అతిక్రమించాడు. భువర్లోకమూ, సువర్లోకమూ, మహార్లోకమూ, జనోలోకమూ, తపోలోకమూ, దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగిపోయాడు. అన్నిచోట్ల మూలమూలలలో సందుసందులలలో నిండిపోయాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమినీ, పిక్కలలో పర్వతాలనూ, మోకాళ్ళలో పక్షులను, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్నీ, రహస్యాంగంలో ప్రజాపతులనూ, పిరుదులలో రాక్షసులనూ, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్తసముద్రాలనూ, వక్షంలో నక్షత్రసమూహాన్నీ, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని మరియు సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులూ, తలలో స్వర్గలోకాన్ని, తలవెంట్రుకలలో మేఘాలనూ, ముక్కుపుటాలలో వాయువునూ, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త ఛందస్సునూ, నాలుకలో వరుణునీ, కనుబొమ్మలలో కార్యాకార్యాలనూ, రెప్పలలో రేయింబవళ్ళనూ, ఫాలభాగంలో కోపాన్నీ, క్రింది పెదవిలో లోభాన్నీ, స్పర్శలో కామాన్ని, రేతస్సులో జలాన్నీ, వీపులో అధర్మాన్నీ, అడుగులలో యజ్ఞాలనూ, నీడలో మరణాన్నీ, నవ్వులో మాయావిశేషాలనూ, రోమాలలో సస్యాలనూ, నరాలలో నదులనూ, గోళ్ళలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మనూ, ప్రాణాలలో దేవర్షిగణాలనూ, శరీరంలో చరాచర సకలప్రాణులనూ, ఇమిడించికొన్నాడు. ఆయన మేఘంవలే మ్రొగే పాంచజన్యమనే శంఖంతో, శారంగమనే ధనస్సుతో, సుదర్శనమనే చక్రముతో, కౌమోదకి అనే గదాదండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంపపొదులతో ప్రకాశిస్తున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలుతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నాల మొలనూలుతో, పీతాంబరంతో, వైజయంతీమాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడూ, జయుడూ, విజయుడూ మొదలైన పరిచారకుల సమూహం చుట్టూచేరి ఉంది. 


( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages