చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 18 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 18

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 18

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

ఆంగ్ల మూలం : The moonstone castle mistery 

నవలా రచయిత : Carolyn Keene

 (ప్రమాదానికి లోనైన పడవనుంచి నాన్సీ, జార్జ్ లు అతికష్టంమీద న్యాయవాదిని గట్టుకి చేర్చారు. ఆ చీకటి ప్రాంతంలో సాయం కోసం వారు కేకలేస్తుండగా, నదిలో అటు వైపు వస్తున్న పడవ గట్టుకి వస్తుంది.  ఆ పడవలో వచ్చిన యువకుడు, యువతి వారిని తిరిగి ఊళ్ళోకి చేరుస్తారు. స్పృహ తప్పిన వీలర్ని ఆసుపత్రిలో చేర్చారు, వారంతా పరిచయాలు చేసుకుంటారు.  మాటల మధ్యలో అమీ అన్న యువతి  జోడిన్ అన్న అమ్మాయి గురించి చెబుతుంది.  తరువాత ......)

"ఆమె ప్రస్తుత తల్లిదండ్రులు పక్క పట్టణంలోని దత్తత సమాజంనుంచి ఆమెను తెచ్చుకొన్నారని నేను నమ్ముతున్నాను."


  "నేను మనఃపూర్వకంగా ఆమెను కలవాలని అనుకొంటున్నాను" అంది నాన్సీ.  "మేము యిక్కడ ఉన్నప్పుడే, మీరు మాకు పరిచయం చేయగలరా?" 


  దురదృష్టవశాత్తూ ఆమె, ఆమె సోదరి మరునాడు ఉదయాన్నే సెలవు విడుపుగా పట్టణం వదిలి వెళ్తున్నట్లు అమీ చెప్పింది.  "కానీ జోడీ మిమ్మల్ని కలవటానికి యిష్టపడుతుంది.  మీరు నాకు తెలిసినట్లు ఆమెకు చెప్పండి.  మీ అమ్మాయిలంతా కలవాలన్నది నా సూచన."  


ఈ సమాచారంతో నాన్సీ ఆనందించింది.  తప్పనిసరిగా ఆమె జోడీ ఆరంస్ట్రాంగ్ ని కలవాలని నిర్ణయించుకొంది.


ఆ సమయానికి కారు మోటెల్ కు చేరుకొంది.  వీలర్ పట్ల వారు చూపించిన దయాగుణానికి, తమను ఆదుకొన్నందుకు జార్జ్, నాన్సీలు ఆర్ట్, అమీలకు ధన్యవాదాలు తెలిపారు.  


  "క్షమించండి.  మేము మిమ్మల్ని మళ్ళీ చూడలేము" అంది నాన్సీ.  "మీ సెలవులను అద్భుతంగా గడపండి."


   "అలాగే గడుపుతామని నేను ఖచ్చితంగా చెప్పగలను" అమీ చెప్పింది.  "ఆర్ట్  యిక్కడ ఉండకపోవటం కూడా చాలా దురదృష్టం.  అతని సెలవుదినాల్లో ఆఖరి రోజు యివాళే!  న్యూయార్క్ నగరంలోని తన వైద్య పాఠశాలకు అతను రేపే వెళ్ళిపోతున్నాడు."  


జార్జ్, నాన్సీ తాము వేసుకొన్న రెయినుకోట్లను దయతో యిచ్చిన దాతలకు తిరిగి యిచ్చారు.  తరువాత మోటెల్ నడవలోకి వాళ్ళు వెళ్ళారు.


  బెస్ మార్విన్ వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది.  "అయ్యో! మీకేమైంది?  మీరిద్దరూ పూర్తిగా తడిసిపోయారు?"


   ఒక కుర్చీలోంచి లేచిన మిసెస్ థాంప్సన్ మురికి బట్టల్లో ఉన్న అమ్మాయిల వద్దకు వచ్చింది.  "బెస్, నేను మీ గురించి చాలా ఆందోళన పడ్డాం."


 ఏమి జరిగిందో జార్జ్, నాన్సీ త్వరగా వాళ్ళకు చెప్పారు.


మిసెస్ థాంప్సన్  ఆర్ట్ మున్సన్ సలహాను పాటించమని వాళ్ళకు నొక్కి చెప్పింది.  "మీరు మంచం ఎక్కిన వెంటనే నేను మీకు వేడి వేడి కోకో, కుకీలను తెచ్చిస్తాను."  


  "అది చాలా బాగుంటుందని నేను అంగీకరిస్తున్నాను" అంది నాన్సీ.  


  సాయం చేస్తానని చెప్పి,  మిసెస్ థాంప్సన్ తో ఆమె స్వంత వంటగదిలోకి వెళ్ళింది బెస్.  కోకో, కుకీలు సిద్ధం కాగానే, బెస్ వాటిని అమ్మాయిలు కూర్చున్న గదిలోకి మోసుకొచ్చింది.  మంచంపై కూర్చున్న జార్జ్, నాన్సీ వేడిగా, ఉపశమనాన్ని యిచ్చే కోకోను చప్పరిస్తూ జోడీ ఆరంస్ట్రాంగ్ గురించి బెస్ కి చెప్పారు.  


  అకస్మాత్తుగా నాన్సీ, జార్జ్ ల మాదిరిగానే బెస్ క్కూడా అదే ఆలోచన వచ్చింది.  "జోడీ ఆరంస్ట్రాంగే జోనీ హోర్టన్ అని మీరూ అనుకొంటున్నారా?"  ఉద్వేగంతో అడిగిందామె.  


  "ఆమెను చూడటానికి రేపెళ్దాం" అంది నాన్సీ.


@@@@@@@@@@@@@

తమ ముందున్న గూఢచర్యపు పనికి ఉత్తేజితులైన ముగ్గురు అమ్మాయిలు మరునాడు తెల్లవారుఝామునే లేచారు.  వాతావరణ కేంద్రం సూచన ప్రకారం ఆ రోజు వేడిగా ఉంటుందని, అమ్మాయిలు తేలికగా ఉండే నూలు బట్టలను కట్టుకొన్నారు.  


  "నేను చూస్తున్నంత చల్లగా ఈ రోజంతా ఉండాలని కోరుకొంటున్నాను" అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొంటూ అంది బెస్.  "దేని గురించైనా వెతికినప్పుడు వేడెక్కటం మామూలే, కానీ ఆ పని చేయాలని ఆలోచిస్తూంటే నాకు మరింత వేడిగా అనిపిస్తోంది."


నాన్సీ, బెస్ నవ్వారు.  "నేను ఈరోజు ఈతలో పొందిన చల్లదనం కందకంలో లేదని, హోటల్లోని కొలనులోనే అది సాధ్యమని భావిస్తున్నాను!"  


  జార్జ్ మాటలకు బెస్ ఆమెపై తలగడను విసరటం ద్వారా ప్రతిస్పందించింది.  దానికి నవ్వుతూనే, నాన్సీ టాక్సీ కోసం ఫోను చేయటానికి మోటెల్ నడవలోకి నడిచింది.  అల్పాహారం కోసం డైనర్ అన్న హోటలుకి వెళ్ళాలని ఆమె చెప్పింది.  అక్కడ తినటం ముగించాక, నాన్సీ రెండు ఫోను కాల్స్ చేయాలని కోరుకొంది.  వాటిలో ఒకటి ఆసుపత్రికి, మరొకటి  పోలీసు ప్రధాన కార్యాలయానికి.


  "వీలర్ విషయం తెలుసుకోవటానికి, నీ కారు గురించి అడగటానికీనా?" బెస్ అడిగింది.  అవునన్నట్లు నాన్సీ తలూపింది.  ఆసుపత్రి ఫోను లైన్ దొరక్కపోవటంతో నాన్సీ పోలీసు ప్రధాన కార్యాలయానికి ఫోను చేసింది.  ఆమె కారు గురించి యింకా ఏ సమాచారం రాలేదని ఆమె తెలుసుకొంది.  నిట్టూరుస్తూ, ఆమె తిరిగి ఆసుపత్రికి డయల్ చేసింది.  కానీ బిజీ సిగ్నలే సమాధానమైంది.


 "నేను తరువాత అక్కడ ఆగిపోతాను" యువ గూఢచారి తనలో అనుకొంది. 

 

     ఆమె తిరిగి తన స్నేహితుల వద్దకు వచ్చి ఆమె కనుగొన్న విషయాలను నివేదించింది.  తరువాత, "ఆరంస్ట్రాంగులను ప్రస్తుతం కలవటానికి వెళ్ళటం అంటే చాలా పెందలకడ అవుతుంది.  నాకొక ఉపాయం తట్టింది.  విల్లో రోడ్డు యిక్కడకు ఎంత దూరమో తెలుసుకొందాం.  టాక్సీని పిలవటానికి బదులు మనం అక్కడకు కాలి నడకన వెళ్ళవచ్చు.  అదే సమయంలో సీమన్ యింటికి కూడా చూద్దాం."


  "మనం అతన్ని ఎందుకు పిలవకూడదు?" జార్జ్ సూచించింది.


  "మనం అక్కడకు వెళ్ళాక ఏం చేయాలో నిర్ణయించుకొందాం."


  విల్లో రోడ్డు అక్కడనుంచి అరమైలు దూరం మాత్రమేనని నాన్సీ వెయిట్రెస్ నుంచి తెలుసుకొంది.  అమ్మాయిలు నడిచి వెళ్ళటానికే నిర్ణయించుకొన్నారు.  వెంటనే చురుకైన వేగంతో వారు బయల్దేరారు. 


   దారిలో నాన్సీకి అపరిచితుడెవడో పంపిన బహుమతి చంద్రమణి విషయం బెస్ కదిపింది.  "దానిని వివరించటానికి మనకొక్క ఆధారం కూడా దొరకలేదని నువ్వు గుర్తించావా?" 


  "నాకు తెలుసు" నాన్సీ చెప్పింది.  "కానీ త్వరలోనో, తరువాతో ఆ దాత, అతను కావచ్చు లేదా ఆమె కావచ్చు, తమకు తాముగా బయటకొస్తారు."


  ఆ అజ్ఞాతవ్యక్తి ఆమెకు ఆరాధకుడని జార్జ్ తన మిత్రురాలు నాన్సీని ఆట పట్టించసాగింది.  


  "నెడ్ యిక్కడకు వచ్చే వరకు వేచి చూద్దాం.  అతన్ని లొంగదీసుకోవటానికి బహుశా నువ్వు  వల విసరొచ్చు" అందామె.


  నాన్సీ ప్రత్యుత్తరమిచ్చే అవకాశాన్ని పక్కన పెట్టింది.  ఎందుకంటే అదే సమయంలో "ఇదే విల్లో రోడ్డు" అని బెస్ అరవటమే!


  అమ్మాయిలు ఆ వీధిలోకి తిరిగి, పోలీసులు నాన్సీకి యిచ్చిన చిరునామా దగ్గరకు ప్రస్తుతం చేరుకొన్నారు.  ఇరవై నాలుగు నంబరు గల ఆ యిల్లు ఏ కోణంలో చూసినా పాడుబడినట్లుగా కనిపిస్తోంది.  గడ్డి, కలుపు మొక్కలు, ఎవరూ పట్టించుకోని అందమైన పువ్వులు బాగా పొడవుగా పెరిగాయి.  ఆ యింటివాకిట్లో రెండు కుర్చీలు ఈదురుగాలి విసిరేసినట్లు తలకిందులుగా పడి ఉన్నాయి.


(సశేషం)

No comments:

Post a Comment

Pages