లోలకం - అచ్చంగా తెలుగు

 లోలకం

డాక్టర్. బీ. యన్. వీ. పార్థసారథి


భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్సప్రెస్ సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4. 50 కి బయలుదేరింది. అది స్లీపర్ క్లాస్ బోగీ. 6.20 కి ట్రైన్ నల్గొండ స్టేషన్ దాటింది. అప్పటికి అందరూ తమ సామాన్లు ట్రైన్ లో సర్దిపెట్టుకుని రిలాక్స్డ్ గా కూర్చున్నారు. రాంబాబు, అతని భార్య రత్న, ఇద్దరు కూతుళ్లు దసరా శలవలకి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ నగరం చూడటానికి వచ్చి ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళంకి వెళుతున్నారు. వారికి ఎదురుగా విజయనగరం వెడుతున్న మరో కుటుంబం కూర్చున్నారు. వాళ్ళు భార్యాభర్తలు. ట్రైన్ నల్గొండ దాటేసరికి రాంబాబు భార్య రత్న విజయనగరం వెళ్లే జంటతో మాటలు కలిపింది. రాంబాబు కుటుంబానికి వరుసగా మూడు బెర్త్ లు ఒక సైడ్ లోయర్ బెర్త్ వచ్చాయి.   సైడ్ ఎగువ బెర్త్ లో ఒక పాతికేళ్ల కుర్రాడు, బోగీలో ఎగువ బెర్త్ లో ఒక నలభై అయిదేళ్ల ఆరడుగుల వ్యక్తి కూర్చున్నారు. ఆ కుర్రాడు చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని మొబైల్ ఫోన్ లో ఎదో సినిమా చూస్తున్నాడు. ఆ ఆరడుగుల వ్యక్తి మాత్రం మౌనంగా కూర్చుని తన చుట్టూ అంతా పరికించి చూడసాగాడు.   

ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ధారావాహికంగా సాగుతున్న సంభాషణని బట్టి ఆ ఆరడుగులవ్యక్తి కి అర్ధమయ్యిందేమిటంటే ఆ రెండు మధ్యతరగితి కుటుంబాలు. రాంబాబు, రత్న లకి ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద పిల్ల ఉద్యోగం చేస్తోంది. రెండో పిల్ల కాలేజీలో చదువుకుంటోంది. పెద్ద పిల్లకి వివాహం నిశ్చయం అయ్యింది. మరో రెండు నెలల్లో పెళ్లి. వీళ్ళు శ్రీకాకుళంలో వుంటారు. రెండో కుటుంబం భార్యా భర్తలు. పదేళ్ళయింది పెళ్ళై. వారికి పిల్లలు లేరు. వాళ్ళు విజయనగరం లో వుంటారు.

ట్రైన్ గుంటూరు దాటింది. సమయం రాత్రి 9. 40. రాత్రి ఫలహారాలు, భోజనాలు చేసి ప్రయాణీకులు అందరూ బెర్తుల్లో నిద్రకుపక్రమిస్తున్నారు. ఆ ఆరడుగుల వ్యక్తి నాలుగు అరటిపళ్ళు తిని, గ్లాస్ లస్సీ తాగాడు. అతను పోలీస్ ఆఫీసర్. హైద్రాబాదు నుంచి వైజాగ్ కి వ్యక్తిగతమైన పనిమీద వెడుతున్నాడు. అతను చాలా సూటిగా, నిజాయితీగా వుండే వ్యక్తి. సాధారణంగా అతను వ్యక్తిగతమైన పని మీద ట్రైన్ లో వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ఫస్ట్ క్లాస్, లేదా సెకండ్ ఏ సి లోను, కొన్నిసార్లు స్లీపర్ క్లాస్ లోను ప్రయాణిస్తాడు. ఇవాళ అతను స్లీపర్ క్లాస్ లో వెడుతున్నాడు.    

రాంబాబు భార్య రత్న విజయనగరం వెడుతున్న ఆ భార్యా భర్తలతో ఇంకా గలగలా మాట్లాడుతూనే వుంది. ఆమె మాటల్లో నిష్కల్మషం, అభిమానం స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. తన పెద్దకూతురుకి పెళ్లి నిశ్చయమైందన్న సంతోషం ఆమె మాటల్లో వెల్లడవుతోంది. కూతురు పెళ్ళికి తాము చేయించి పెట్టిన బంగారు నగల వివరాలు రత్న విజయనగరం అమ్మాయికి విపులంగా చెబుతోంది. ట్రైన్ విజయవాడ దాటింది. రాత్రి పదకొండు గంటలయింది.

సమయం అర్ధ రాత్రి 2. 15. ట్రైన్ రాజమండ్రి దాటింది. ఉన్నట్టుండి గావుకేకలు, స్త్రీ ల ఏడుపులు వినిపించి అందరితోపాటు పోలీస్ ఆఫీసర్ కూడా నిద్రలోంచి మేల్కొన్నాడు. రాంబాబు, రత్న భోరుమని విలపిస్తున్నారు. కూతుళ్లిద్దరూ తల్లిదండ్రులని ఓదారుస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ ఏమైందని వాకబు చేస్తే తెలిసిందేమిటంటే శ్రీకాకుళంలో రాంబాబు ఇంట్లో దొంగలు పడ్డారట. బీరువా పగలగొట్టి లోపల వున్న నగలు, డబ్బులు దోచుకెళ్ళారట. దొంగలు చేసిన శబ్దాలకి రాంబాబు పక్కింటివాళ్ళు మేల్కొని లైట్లు వేసి బయటికి వచ్చి చూసేసరికి ఆ దొంగలు పారిపోయారు. వెంటనే వాళ్ళు రాంబాబుకి ఫోన్ చేసారు. 

" ఇదంతా జరిగి ఎంతసేపవుతుంది?" ప్రశ్నించాడు పోలీస్ అధికారి రాంబాబుని. 

  ఇదంతా జరిగి సుమారు అరగంట అవుతుందని రాంబాబు బదులిచ్చాడు. 

" మీ పేరు. మీ మొబైల్ నెంబర్, మీ ఇంటి అడ్రస్ వివరాలు ఇవ్వండి " అని ఆ వివరాలు రాంబాబు నుంచి తీసుకున్నాడు పోలీస్ ఆఫీసర్. 

వెంటనే అతను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడాడు. ఆయన ఫోన్ లో సంభాషించిన తీరు విన్నాక రాంబాబు కి అతను ఒక పెద్ద పోలీస్ అధికారి అని తెలిసింది. 

" మీరేం దిగులు పడవద్దు. దొంగతనం జరిగి ఇప్పటికి ఇంకా గంట కూడా కాలేదు. ఇప్పుడు సమయం 2. 30 కావస్తోంది.  వాళ్ళు శ్రీకాకుళం నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకి పారిపోయే ప్రయత్నంలో వుంటారు. ఇంకా తెల్లవారడానికి నాలుగు గంటల సమయం వుంది. శ్రీకాకుళం చుట్టుపక్కల ముఖ్యమైన పోలీస్ స్టేషన్లకి అలెర్ట్ మెసేజ్ పంపించాం. వీలైనంత త్వరగానే ఆ దొంగలు పట్టుబడతారు." అన్నాడు పోలీస్ అధికారి.

ట్రైన్ దువ్వాడ స్టేషన్ దాటింది. ఉదయం ఏడు గంటలవుతోంది. రాంబాబు కి శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. దొంగలు భోగాపురం దగ్గర అరగంట క్రితం పట్టుబడ్డారట. ఉదయం పది గంటలకి వాళ్ళని శ్రీకాకుళం స్టేషన్ కి తరలిస్తారని, రాంబాబుని శ్రీకాకుళం చేరిన వెంటనే పోలీస్ స్టేషన్ కి రమ్మనమని కబురు చేశారు.

ఈ వార్త విన్న వెంటనే రత్న,రాంబాబుల సంతోషానికి అవధుల్లేవు. ఇద్దరూ పోలీసుఅధికారికి పదేపదే కృతజ్ఞతలు తెలుపుతూ దండాలు పెట్టసాగారు. ట్రైన్ లో, అదీ పదిమంది ఎదురుగా రత్న,రాంబాబులు అలా చెయ్యటం అతనికి కొంచం ఇబ్బందికరంగానే అనిపించింది.

తమ కూతురి పెళ్ళికి తప్పకుండా రావాలని, ఆహ్వాన పత్రిక పంపిస్తామని, రత్న, రాంబాబులు పోలీస్ అధికారి మొబైల్ నెంబర్, అడ్రస్ వివరాలు అడిగి మరీ తీసుకున్నారు.  వాళ్ళ ఇద్దరు అమ్మయిలు కూడా " చాలా థాంక్స్ అంకుల్. మీ మేలు మరచిపోలేము. మీరు లేకపోయివుంటే పోయిన మా డబ్బు, నగలు తిరిగి దొరికేవి కావు." అని పదే పదే కృతజ్ఞతలు తెలిపారు.

అతను పోలీస్ అధికారి అయినా, మనుషుల సైకాలజీ తో పాటు లోతుగా తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసాడు. మనిషి జీవితం ఒక లోలకం లాగా అనిపించింది అతనికి. ‘జీవితంలో ప్రతీ క్షణం జరిగే పరిణామాలతో రాగద్వేషాలకి లోనయిన మనిషి సుఖ దుఃఖా లని అనుభవిస్తాడు. ఆ సుఖదుఃఖాలు కలిగిన సందర్భాన్నిబట్టి, చుట్టూ వున్న పరిస్థితులు, మనుషుల ప్రభావంతో నవరసాలు అతని ప్రవర్తనలో వ్యక్తమవుతాయి. కదలిక, చైతన్యం మనిషి జీవితంలో ఎంతో సహజం. లోలకం కూడా అంతే. ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. జీవితం లోలకం లాగా సుఖదుఃఖాలకి, రాగ ద్వేషాలకి నడుమ ఊగిసలాడుతూ సందర్భోచితంగా నవరసాలని ఒలికిస్తూ సాగిపోతుంది. ఒక క్షణం వున్న పరిస్థితులు, సన్నివేశాలు మరుక్షణం వుండవు. దానికి ఉదాహరణ రత్న, రాంబాబుల కుటుంబం. నిన్న సాయంత్రం సికింద్రాబాద్ లో అయిదు గంటలకి ట్రైన్ ఎక్కినప్పటినుంచి ఇవాళ ఉదయం ఏడు గంటలవరకు కొంత సేపు ఆనందం, సంతోషంతో, మరికొంతసేపు ఆందోళన, దిగులుతో వున్నవాళ్లు కాస్తా మళ్ళీ ఇప్పుడు అవధులు లేని ఆనందంతో కనిపిస్తున్నారు ' అని తలపోశాడు పోలీస్ అధికారి. 

ఇంతలో వైజాగ్ స్టేషన్ రానే వచ్చింది. అతను ట్రైన్ దిగాడు. కొంతసేపటికి విజయనగరం ఆతర్వాత శ్రీకాకుళం రోడ్ స్టేషన్లు వస్తాయి. ఎవరి గమ్యం వచ్చినప్పుడు వారు ట్రైన్ దిగుతారు. కానీ ట్రైన్ మాత్రం అందరి అనుభవాలని, మనోభావాల్ని మోసుకుంటూ నిర్లిప్తంగా సాగిపోతుంది.   

"దుఃఖేష్వముద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః 

వీతరాగ భయక్రోధః స్థితిధీర్మునిరుచ్యతే"    

దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహలేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 

ఎక్కడో గుడిలోని లౌడ్ స్పీకర్ లోంచి ఘంటసాల గళం లో భగవద్గీత వినిపించసాగింది.

***


No comments:

Post a Comment

Pages