పాముమంత్రం - అచ్చంగా తెలుగు

పాముమంత్రం

రచన: కర్లపాలెం హనుమంతరావు


'రెడ్డి ఆసుపత్రి' ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది. ఆలోచనలు గతంలోకి మళ్ళాయి.

ఇరవైయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు నేను ఇప్పటె  పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా చెరువుపల్లి బ్యాంకులో మేనేజరుగా పని చేస్తుండేవాణ్ణి.

ఒక రోజు రాములమ్మ అనే ఆడమనిషి లోను కావాలంటూ పాముబుట్టతో సహా బ్యాంకుకొచ్చింది.'దొరగారు ఒక ఐదువేలిప్పిస్తే ఇంకో రెండు పాములు కొనుక్కుని ఆడించుకుంటానయ్యా!' అని ప్రాదేయపడింది. 

రూల్సు ప్రకారం పాములు కొనుక్కోవడానికి లోను ఇవ్వడం కుదరదు. పోనీ.. ఇంకేదన్నా వేరే దారిలో సాయం చేద్దామన్నా.. రాములమ్మ పేరున ఇదివరకే తీసుకున్న లోను మొండిబకాయిలో ఉంది. 

'ముందు పాతబాకీ చెల్లించు! అప్పుడు చూద్దాం' అన్నాను. 

 ‘ఇప్పుడిచ్చే అప్పులోనుంచే ఆ బాకీ చెల్లబెట్టుకోండయ్యా!' అంది గడుసుగా.

 బైటికి కనిపిస్తున్నంత అమాయకురాలు కాదనిపించింది. రెడ్డిచేత పాముబుట్ట లోపల పెట్టించి 'పాత కిస్తీలు వడ్డీతో సహా చెల్లించి బుట్ట పట్టుకు పో' అని బెదిరించి పంపించేసాను. 

'రేపు బాషాను పంపిస్తా! లోనెట్లా ఇవ్వరో చూస్తా!' అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది రాములమ్మ. 

'ఈ బాషా ఎవరు?!'

రెడ్డి చెప్పాడు 'హెడ్ కానిస్టేబులయ్యా! చాలా ఏళ్ళబట్టి ఈడనే ఉండాడు' రెడ్డి గొంతులో తిరస్కారం. 

చెరువుపల్లి చాలా చిన్నవూరు. నీళ్ళూ నిప్పులు సరిగ్గా ఉండవు. ఇక్కడ సర్వీసంటే పనిష్మెంటుకిందే లెక్క. 

ఏం బావుకుందామని బాషా ఈ ఊరినే పట్టుకుని బల్లిలా వేల్లాడ్డం?!' ఆ మాటే అడిగితే రెడ్డినుంచి సరిగ్గా సమాధానం లేదు. మాట దాటేయడాన్నిబట్టి 'చెప్పటం ఇష్టం లేదేమోలే' అని వూరుకుండిపోయాను.

తరువాత క్యాషియర్ గుప్తా చెప్పాడు' బాషా రాములమ్మని వదిలి ఉండలేడులే సార్! ఈ రాములమ్మ ఎవరో కాదు. మన రెడ్డి పెళ్ళామే.. ఇప్పుడాట్టే ఇద్దరికీ పొసగడం లేదు కానీ'. నోరు వెళ్ళబెట్టడం నా వంతయింది. పాముబుట్ట లోపల పెడుతున్నప్పుడు చూడాలి.. రెడ్డి, రాములమ్మల మధ్య జరిగిన యుద్ధం. విడిపోయిన మొగుడూ పెళ్ళాలుతప్ప మరొకరు అంత ఘోరంగా కొట్లాడుకోరు.

బాషాని గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు గుప్తా. 'బాషాకి ఇట్లాంటి యవ్వారాలు చాలానే ఉన్నాయి సార్ ఈ చుట్టు పక్కల ఊళ్ళలో! షాపుల్లో సరుకులు కొని డబ్బులు చెల్లించడు. హోటల్లో భోజనంచేసి బిల్లు కట్టడు. డబ్బడిగినవాళ్ళను ఏదో కేసులో ఇరికించి స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తాడు. ఎస్సైకూడా ఈయనెంతంటే అంత. ఎందుకొచ్చిన గొడవలే అని ఎవరూ ఈయన జోలికి వెళ్లరందుకే. మన రెడ్డి బాధా అదే!' అన్నాడు.

'పైవాళ్ళ కెవరికన్నా కంప్లైట్ చేసి ఉండాల్సింది' అన్నాను.

''అదీ అయింది సార్! ఊళ్ళో రెండు గ్రూపులు. ప్రెసిడెంటుది. మాజీ ప్రెసిడెంటుది. ఒకళ్ళు ఎడ్డెమంటే.. రెండో వాళ్ళడ్డు తెడ్డెమంటారు'

'ఇదేం తిరకాసు. ఒక వంక మంచివాడు కాదంటుంటిరి. మరో వంక ట్రాస్ఫరాపుతుంటిరి!' 

నా ఆశ్చర్యాన్నర్థంచేసుకున్నట్లుంది.. మరో కొత్త విషయం చెప్పుకొచ్చాడు గుప్తా 'బాషాకు పాముమత్రం వచ్చు సార్! ఎట్లాంటి పాము కొట్టినా వీడు మంత్రమేస్తే విషం విరుగుడై పోతుంది. ఊళ్లో చాలామంది వీడి చలవ్వల్లే లేఛి తిరుగుతున్నారు. ఎస్సై కొడుకుని బళ్ళో కట్లపాము కొడితే.. క్షణాల్లో ఆ విషాన్ని దించేసాడు బాషా. అందుకే ఈ ఎస్సై ఉన్నంత కాలం  ఎవరూ బాషా వెంట్రుక్కూడా కదప లేరు. అది మాత్రం గ్యారంటీ!' అని తేల్చేసాడు గుప్తా.

చెరువుపల్లి రేగడి ప్రాంతం. పొగాకు ప్రధాన పంట. అట్లాంటి చోట పాములు, తేళ్ళు తిరగడం సహజమే. అయితే అన్ని పురుగుల్లోనూ విషముండదు. ఇండియాలో ఉండే రెండువేల రకాల్లో విషంగలవి కేవలం తొమ్మిది రకాలే. విషంలేని పురుగు కుట్టినా మందో మాకో వేసి, చెవులో ఏదో మంత్రం ఊదేసి తగ్గించినట్లు నాటకాలాడే మాయగాళ్లూ మనదగ్గర తక్కువేం లేరు. చదువుకున్నవాళ్లూ అమాయకత్వం వల్లనో.. అజ్ఞానం వల్లనో ఇలాంటి దొంగమంత్రగాళ్లనే నమ్ముకుంటున్నారు! పాముకాటు మరణాల్లో అధికశాతం  కాటువల్ల సంభవిస్తున్నవి కాదు. పాము కాటేసిందన్న షాకువల్ల జరుగుతున్నవి. పాములకు పగ పట్టడం తెలీదనీ, పాలు ఆహారం కాదనీ, వినడానికి చెవుల్లాంటి ఏర్పాట్లేవీ ఉండవనీ చెబితే చదువుకున్నవాళ్ళైనా నమ్మని పరిస్థితి దాపురించివుందీ దేశంలో.

ఎక్కడ దాకానో ఎందుకు? ఇక్కడ ఈ గుప్తా లేడూ! 'ప్రెసిడెంటుని పంచాయితీ ఆఫీసులో పాము కాటేసినప్పుడు బాషా వచ్చి పాంమంత్రంతో లేపి కూర్చోబెట్టాడు సార్!  నా కళ్ళారా చూసాను. దానికేమంటారు?' అంటూ మొండివాదనకు దిగాడు. ఏం చేస్తాం?

మర్నాడు బాషా నిజంగానే బ్యాంకు కొచ్చాడు. గుబురు మీసాలు.. బానబొర్ర.. మొహమంతా స్ఫోటకం గుంటలు. మాటా కరుకే. అంతకుముందున్న దురభిప్రాయం మరింత బలపడేటట్లుంది వాలకం. 'రాములమ్మ యాడికీ పోదు. నాదీ గ్యారంటీ. కావాలంటే  సంతకం తీసుకో! లోనుమాత్రం ఇచ్చితీరాలప్పా!'- అదీ అతగాడు అప్పు అడిగే తీరు!

‘మీ సంతకం కావాలంటే మీ పై వాళ్ళ పర్మిషనుండాలి గదా! ముందది తీసుకురండి. తరువాత చూద్దాం!' అన్నాను.

'అట్లాగా!' అంటూ గుడ్లురుముకుంటూ లేచి నిలబడ్డాడు బాషా. 'ఆడకూతురు పాంబుట్ట ఏ అథార్టీతో లోపల పెట్టుకున్నారప్పా! ముందది బైటకు తియ్యి!' అంటో పోలీసుజులుం ప్రదర్శించబోయాడు. 'బ్యాంకు డబ్బుల్తో కొన్న సరకది. అప్పు తీరిందాకా బ్యాంకుకు అధికారం ఉంటుంది. వాయిదాలు సక్రమంగా లేకపోతే సరుకు బిగపట్టుకునే అధికారం అప్పు తీసుకున్నప్పుడే రాములమ్మ బ్యాంకుకి రాసిచ్చింది. మీ కంత జాలిగా ఉంటే  బకాయిలు చెల్లించి బుట్ట పట్టుకుపోవచ్చు. మీరూ సంతకం చేసారుగదా అప్పుడు! మీకూ బాధ్యత ఉంటంది' అన్నాను. కాస్త వెటకారంకూడా ద్వనించిందేమో నా మాటల్లో.

బాషా కోపంగా బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాలే రాములమ్మ శాపనార్థాలు పెట్టుకుంటూ.. 

'లోనివ్వడానికి డబ్బుల్లేవనో.. రూల్సు ఒప్పుకోవనో చెప్పచ్చు కదా సార్! వాడసలే మంచోడు కాదు' అని భయపడ్డాడు రెడ్డి. 

రెడ్డి భయానికి కారణం లేకపోలేదని తరువాత తెలిసింది. ఇంతకు ముందు మేనేజరుగా చేసిన శర్మ ఇలాగే లోను ఇవ్వనని మొండికేశాట్ట. తరువాత  రెండు రోజులపాటు వరసగా బ్యాంకు ఆవరణలో పాములే పాములు! 'లోనిచ్చి బాషాను చల్లబరిస్తేగానీ 'సర్ప దర్శనం' ఆగింది కాద'ని రెడ్డి చెప్పుకొచ్చాడు.

ఇయర్ ఎండింగ్ పనుల వత్తిడిలో పడి ఆ సంఘటనను అక్కడితో మర్చిపోయాను. 

మార్చినెల చివరి వారం. బ్యాంకులో ఉన్నది నేనూ.. రెడ్డీనే! ఆదివారం కనక స్టాఫు ఎవరూ బ్యాంకువైపుకి రాలేదు.  రెగ్యులర్ అటెండర్లు డ్యూటీ ప్రకారమే పని చేస్తారు. రెడ్డిది ప్రొబేషనరీ జాబు. కాబట్టే నాకు తోడుగా బ్యాంకులో ఉంచడానికి వీలయింది. 

పని ధ్యాసలో పడి ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు. వేసవికాలం. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఎవరమూ చెప్పలేం. నూనె దీపాలు సిద్ధం చేసి పెట్టమని రెడ్డికి పురమాయించి నా పనిలో మునిగిపోయాను.

ఉన్నట్లండి కెవ్వున కేక! రెడ్డిదే ఆ వణికే గొంతు! స్టోరు రూమునుంచి! ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తాను. నురుగులు కక్కుతూ పడివున్నాడు రెడ్డి స్టోర్రూములో! బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. 'ఏమైంది రెడ్డీ?' అనడిగితే వేలితో పాముబుట్టవైపు చూపించాడు. బుట్టమూత సగం తెరిచివుంది! బుట్టలో ఉండాల్సిన రెండు పాములూ లేవు!

గభాలున వంగి రెడ్డి పాదాలవంక చూసాను.  రక్తపు బొట్టు! రెడ్డిని పాము కాటేసిందని అర్థమవడానికి ఆట్టే సమయం పట్టలేదు. 

ఏం చేయాలో పాలుపోలేదు. నిజం చెప్పద్దూ! ఆ క్షణంలో నాకు ముందు గుర్తుకొచ్చింది బాషానే! ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. నిజమేగానీ.. ఇరవై కిలోమీటర్ల పైగానే ఉందది ఎక్కడో  ఆత్మకూరులో. బ్యాంకు బైకు రిపేరులో ఉంది. ట్రాక్టర్లాంటిదేమన్నా దొరకాలన్నా సమయం పడుతుంది. 

రెడ్డి కండిషన్ చూస్తే నిమిష నిమిషానికీ దిగనాసిల్లిపోతోంది. ఏవైతే అదవుతుందని పోలీస్టేషనుకు ఫోను చేసా. రింగయీ.. రింగయీ.. చివరికో ఆడగొంతు వినిపించింది. నిద్రమత్తులో ఉన్నట్లుంది. ఎక్కడో విన్నట్లే ఉంది ఆ యాస.

ఠక్కుమని గుర్తుకొచ్చింది. రాములమ్మ గొంతు! అంత చీకటివేళ ఆ ఆడమనిషికి స్టేషన్లో  

పనేమిటో?!అదీ స్టేషనుకొచ్చే ఇన్-కమింగ్ కాల్సు రిసీవ్ చేసుకునేటంత చొరవా! వెనకనుంచి ఎవరిదో మగగొంతు.. ప్రామ్టింగిస్తున్నట్లు!

విషయం చెప్పి బాషా కావాలని అడిగాను గబగబా. 'లేడు. డూటీలో ఉన్నాడు' అని కట్ చేసింది అవతలి మనిషి. మళ్ళీ ఎన్నిసార్లు ప్రయత్నించినా రింగవడమేగానీ.. ఫోన్ ఎత్తలేదు అవతలనుంచి! మనిషెవరన్నా దొరికితే స్టేషనుకు పంపిద్దామని బాంకు బైటికొచ్చాను. క్షణాల్లో బ్యాంకుముందు జనం పోగయ్యారు. తలా ఓ మాట. 'దాహం..దాహం' అని అంగలారుస్తున్నాడు రెడ్డి. ఎవరో నీళ్ళు ఇవ్వబోతే పెద్దశంకరయ్య అడ్డంగొట్టాడు 'పాంకాటు పడ్డోడికి నీళ్ళిస్తే ప్రమాదం. కడుపులోకేదీ పోకూడదు. కంటిరెప్ప కిందికి వాలకూడదు' అంటూ రెడ్డి పక్కనచేరి చెంపలమీద తడుతూ కూర్చొన్నాడా పెద్దాయన.

ఇంతలో బాషా రానే వచ్చాడు. వంటిమీద వట్టి లుంగీ. పైన బనీను. డ్యూటీలో ఉండే మనిషి యూనీఫాం ఇదేనా?! ఏదో ఒకటి. ముందు వచ్చాడు. అదే పది వేలు.

వచ్చీ రాగానే వైద్యం మొదలు పెట్టేసాడు బాషా. సంచీలోనుంచి ఏదో వేరులాంటిది తీసి బలవంతంగా రెడ్డి బుగ్గలో దోపాడు. కాటుపడ్డ చోటికి కాస్తపైన తాడుతో బలంగా కట్టేసి కాల్చిన కత్తితో గాయాన్ని బాగా పెద్దది చేసాడు. రక్తం బొటబొటా కారిపోతుంటే బాధతో రెడ్డి విలవిల్లాడిపోతున్నాడు.

మంత్రించిన పొడిని రెడ్డి పడున్న రూములో వలయంగా చల్లించి 'పురుగులు రెండూ ఈడనే ఏడనో నక్కుంటాయి. వెదకండి కానీ కర్రల్తో కొట్టద్దు. పాములు చస్తే రెడ్డి బతకడు' అంటూ హుకుం జారీ చేసాడు.

ఒక సుశిక్షణ పొందిన వైద్యుడిలాగా బాషా తన పని తాను చేసుకుంటూ పోతుంటే నమ్మబుద్ధి కాలేదు నాకు. 'వట్టి బూటకం అని కొట్టిపారేసే ఈ నాటువైద్యం వెనకకూడా ఇంత పెద్ద తతంగం ఉందా!'అని నా ఆశ్చర్యం. చుట్టూ చేరిన జనాన్ని దూరంగా జరగమని రెడ్డి చెవులో పాముమంత్రం ఊదడం మొదలుపెట్టాడు బాషా. దగ్గరే ఉన్నాను కనుక నాకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి '..మహావీర గరుడ.. సమస్త సర్ప.. నివారణా.. దుష్ట..  సర్పబంధన… కురు.. కురు.. ' అని ఇలాగే ఏవో గొణుకుళ్ళు!  ఇంకా ఏవేవో శబ్దాలు రణగొణగా వినిపిస్తున్నాయిగానీ వాటిని గురించి ఆలోచించే స్థితిలో లేను నేను. 

ఎక్కడో చదివినట్లు గుర్తు.. పాముమత్రంలో బీజాక్షరాలు ఉండవంట! బాషా ఎంత మంత్ర తంత్రాలతో గింజుకుంటున్నా రెడ్డిమీద వాటి ప్రభావం సున్నా. క్షణక్షణానికీ దిగనాసిల్లుతున్న రెడ్డిపరిస్థితిని చూసి దిగులుగా కూర్చోవడం మినహా నేను చేయగలిగింది ఏమీ లేదే అని నా దుగ్ధ. ఇప్పట్లోలాగా అప్పట్లో ఒన్ నాట్ యైట్లు .. ఒన్ నాట్ ఫోర్లు లేవు!

తెల్లవారుతుండంగా ఎవరో రావినూతలవారి ట్రాక్టర్ని పట్టుకొచ్చారు. దాంట్లో రెడ్డిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించేసరికే ఆలస్యమైపోయింది.

డాక్టార్లు ఎంత పోరాడినా రెడ్డి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. విషంకాటుతో నల్లబడ్డ రెడ్డిశవాన్ని చూడటానికి ఊరు ఊరంతా తరలి వచ్చారు. రెడ్డి పదేళ్ల కొడుకుచేత కర్మకాండ జరిపించింది రాములమ్మ.

*  *  *            

కులాచారం ప్రకారం జరగాల్సిన తంతులన్నీ అయిన తరువాత  పదిరోజులకు రెడ్డికుటుంబానికి బ్యాంకునుంచీ రావాల్సిన పరిహారం  ఇప్పించడంకోసం రాములమ్మను పిలిపించాను. 

రాములమ్మ ఆకారం చూసి ఆశ్చర్యపోయాను. రెండువారాల కిందట లోనుకోసం వచ్చి యాగీచేసిన మనిషి ఈమేనా?! ఈ కాలంలోకూడా ఇలా భర్త పోయినతరువాత శిరోముండనం చేయించుకునే భార్యలున్నారా? ఉసూరుమన్నది ప్రాణం. 

పత్రాలమీద వేలుముద్రలేస్తూ భోరుమని ఏడ్చేసింది రాములమ్మ. ఇంత చిన్నవయసులో ఆమె కొచ్చిన కష్టం సామాన్యమైనదా?మొగుడూ పెళ్లాలనుకున్న తరువాత అప్పుడప్పుడు ఏవో కీచులాటలు తప్పవు. కలసి ఏడడుగులు నడిచి జీవితంలో కొంతదూరం గడచి వచ్చిన జంటలు ఏవేవో కారణాలవల్ల విడిపోతే విడిపోవచ్చు. కానీ మనస్సుల్లోని ఆ పాత మధురస్మృతి పరిమళాలను వదిలించుకోవడం అంత తేలికా?! రాములమ్మ సంగతి ఎలా ఉన్నా రెడ్డి మనస్తత్వం నాకు బాగా తెలుసు. చాలాకాలంగా దగ్గర్నుంచి పరిశీలించినవాణ్ణి.

ఆ రోజు రాములమ్మ పాముబుట్టను లోపల పెట్టమని పురమాయించినప్పుడు రెడ్డి ముఖం  చూడాలి.  పెళ్ళాంమీద ఎంత ప్రేమ లేకపోతే అంతలా బాధపడతాడు!

'పాముల్ని ఆడించుకుంటూ పొట్టపోసుకునే ఆడదయ్యా అది! జీవనాధారాన్నట్లా లాగేసుకుంటే పిలగాడిని సాక్కునేదెట్లా సామీ? సారుకి మీరే ఎవరైనా చెప్పండి! పాముల్ని  తిరిగి ఇప్పించండ'ని బ్యాంకు స్టాఫు దగ్గర తెగ మొత్తుకున్నసంగతి అప్పట్లోనే చూచాయగా తెలిసింది. 

రెండు మూడు కిస్తీలన్నా బాషాచేత కక్కించి పాముల్ని తిరిగిచ్చేద్దామని నా ఆలోచన. రాములమ్మ పేరుతో అప్పట్లో తీసుకున్న లోను డబ్బులు వాడుకుంది బాషానే అని రెడ్డి రెండు మూడుసార్లు నా దగ్గర వాపోయినట్లూ గుర్తు. ఇంతలోనె ఇలాగయింది! అసలు ఆడించుకునే పాములకి విషపు కోరలు తీసేస్తారని విన్నాను. మరి రెడ్డి పాముకాటువల్ల ఎలా చనిపోయినట్లు?

రాములమ్మే అడిగిందో.. పెళ్లాంబిడ్డల బాధ చూడలేక తనే అనుకున్నాడో.. పాముల్ని విడిపించాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు చాలాసార్లు స్టోరురూములో తచ్చాడాడు రెడ్డి. బుట్టలోని పాముల్ని చీకట్లో తప్పించి భార్యకి ఇచ్చేయాలనుకున్నట్లున్నాడు పిచ్చిరెడ్డి! కోరలింకా తీయని పాములవని తెలీక మొత్తానికి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడా ప్రేమికుడు.. పాపం!

రెడ్డి దుర్మరణానికి నేనూ ఒకరకంగా కారణమేనా? పాముమంత్రంతో ఎంతోమందిని గట్టెక్కిచ్చానని గొప్పలు చెప్పుకునే బాషా రెడ్డిని ఆ గండంనుంచి ఎందుకు బైటపడేయలేక పోయినట్లు? మంత్రగాడిగా బాషా సిన్సియారిటీని అనుమానించాల్సిన పని లేదు. ఒక్క ఫోన్ కాల్ కే పక్కలోని రాములమ్మనికూడా పట్టించుకోకుండా పరుగెత్తుకొచ్చాడంత రాత్రి పూట! ఆ మంత్ర తంత్రాలు.. నాటు వైద్యం యాగదీక్షతో చేసాడు. లోపం ప్రయత్నంలో ఎంతమాత్రం లేదు. ఏమన్నా ఉంటే గింటే.. ముందునుంచీ అనుమానిస్తున్నట్లు ఆ మంత్ర తంత్రాల్లోనే ఉండి ఉండాలి!

ఇన్ని తెలిసీ.. మరెందుకు రెడ్డిని పాము కాటేసిందని తెలియగానే నాకూ ముందు బాషా   మంత్ర తంత్రాలే గుర్తుకొచ్చాయి?! వెంటనే సరైన చికిత్స అందించే సౌకర్యం అందుబాటులో ఉండుంటే నేనీ బాషాను కనీసం బ్యాంకులోకి కూడా అడుగు పెట్టనిచ్చుండే వాణ్ణి కాదు. అందులో మాత్రం అనుమానం లేదు. 

నాలాగా ఇంకెందరో? నమ్మకం లేకపోయినా ఇలాంటి మంత్రగాళ్ల చేతిలో విలువైన ప్రాణాలు పెట్టేవాళ్ల సంఖ్య తగ్గాలంటే  వెంటనే నేను చేయాల్సిన పనేమిటి? బాషాలాంటి మాయగాళ్లను తరిమి కొట్టాలి. తరువాత?! 

పదిరోజుల తరువాత బ్యాంకు కొచ్చిన బాషానే ఆ ప్రశ్నకు సమాధానం అందించాడు. రాములమ్మ పాతబాకీ పూర్తిగా చెల్లించి పోవడానికి వచ్చి  'పెనుగొండ బదిలీ అయింది సార్! ఫ్యామిలీ అక్కడే ఉంది. వెళ్ళిపోతున్నాను' అన్నాడు. ఈసారి ఎవరూ ఆపే ప్రయత్నం చెయ్యలేదు కాబోలు! 'లేదు. నేనే రిక్వస్టు పెట్టుకుని పోతున్నాను. నేను పోయినా నాలాంటి మాయగాడు ఇంకెవడో పుట్టుకొస్తాడు. జనం మళ్లా వాళ్లనే నమ్మి మోసపోతుంటారు. ఇట్లాంటివేవీ లేకుండా ఉండాలంటే ఇక్కడే ఒక మంచి ఆసుపత్రి రావాలి సార్!అదీ నా రిక్వెస్టు' అన్నాడు పోతూ  పోతూ. 

ఇప్పుడు చెరువుపల్లిలో ప్రారంభమవుతున్న రెడ్డి ఆసుపత్రికి అలా అప్పట్లోనే ఆలోచనాబీజం పడింది. ‘ఆలోచన సరే! మారుమూల పల్లెల్లో లాభాపేక్ష లేకుండా వైద్యమందించే వైద్యులున్నారా ఈ వ్యాపారయుగంలో? 

‘ఉన్నార’ని నిరూపించినవాడు రెడ్డి కొడుకు. స్కాలర్షిప్పులమీదైనా సరే  వైద్యం చదువుకుంటే తండ్రి పేరుమీదో ‘ఆసుపత్రి’ పెట్టుకోవచ్చని అప్పట్నుంచీ అతగాడిని ప్రోత్సహించి సహకారమందించింది నేనే. ఇప్పటికైనా ‘రెడ్డి ఆసుపత్రి’ కల సాకారమవుతున్నందుకు సంతోషంగా ఉంది.

                                                        ***

No comments:

Post a Comment

Pages