చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 17 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 17

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 17

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

ఆంగ్ల మూలం : The moonstone castle mistery 

నవలా రచయిత : Carolyn Keene

(పోయిన నాన్సీ కారు దొరకలేదు కానీ ఒక స్త్రీ తన కారులో వెళ్ళినట్లు పోలీసులు సమాచారం యిచ్చారు.  అలాన్ పిక్నిక్ లో పాల్గొన్న నాన్సీని న్యాయవాది కలుస్తాడు.  హోర్టన్ కేసు విషయంలో నది అవతల ఉన్న ఒక వ్యక్తిని కలవటానికి ఆమెను తీసుకెళ్తానని అతను చెబుతాడు.  రాత్రి తొమ్మిదింటికి నాన్సీ, జార్జ్ లు వీలర్ తో అతని పడవలో బయల్దేరుతారు.  అవతల గట్టుకి సమీపంలో వారి పడవ ఒక రాతిని గుద్దుకొని కన్నం పడుతుంది, వీలర్ స్పృహ కోల్పోతాడు.  పడవలోకి నీరు రాసాగింది.  తరువాత) 

@@@@@@@@@@@@


"ఇక్కడ లోతు ఎంత వరకు ఉందో నేను చూస్తాను" అంది నాన్సీ.  తరువాత ఆమె పడవలోనుంచి నదిలో దిగి మాయమయ్యింది.  ఆమె తిరిగి నీటి మీదకు వచ్చాక, "ఇక్కడ మన తలలు మునిగేంత లోతు ఉంది.  జార్జ్! పడవలో ఉన్న అరలో ఫ్లాష్ లైట్ ఉందేమో చూడు."


  జార్జ్ గూటి తలుపును బలంగా లాగి తెరిచింది.  "అవును, ఉంది" అని బదులిచ్చిందామె.


  దాన్ని వెలిగించి, ఆ వెలుతురు తీరం వైపు పడేలా ఎత్తి పట్టుకోమని నాన్సీ జార్జ్ తో చెప్పింది..  తను వీలర్ కు చేయూత నిస్తానని చెప్పింది.  


  "నువ్వు అతన్ని పక్కకు దొర్లించి వెల్లకిలా పడుకొనేలా చేయగలవా?" నాన్సీ అడిగింది.


  "ప్రయత్నిస్తాను."  త్వరలోనే జార్జ్ అతన్ని నీటిలోకి చేర్చింది.


  నాన్సీ వీలర్ మెడచుట్టూ చేతినుంచి అతను నీటిపై తేలేలా పట్టుకొంది.  తరువాత స్వేచ్ఛగా ఉన్న చేత్తో ఈదుతూ గట్టువైపు సాగుతోంది.  జార్జ్ తన చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ కాంతి గట్టున పడేలా ఎత్తి పట్టుకొని నాన్సీ పక్కన వెళ్తోంది.  


   అదృష్టవశాత్తూ, వారు గట్టుకి తగినంత దూరంలో ఉండటం వల్ల, ఈదటం పెద్దగా ప్రయాస అనిపించలేదు.   వారిద్దరూ గట్టుని సురక్షితంగా చేరుకొన్నారు.  తరువాత స్పృహ తప్పిన అతన్ని చదునుగా ఉన్న విశాల మైదాన ప్రాంతానికి మోసుకెళ్ళారు.  అక్కడ మరొకసారి అతను కోలుకొనే ప్రయత్నం చేసినా, అది నిష్ఫలమే అయింది.  

  అక్కడ ఒక్క యింట్లోంచయినా దీపాల కాంతి కనిపిస్తుందేమోనని, ఆ దట్టమైన చీకట్లోకి అమ్మాయిలిద్దరూ చూసారు.  కానీ వారిలో ఎవరికీ దీపాల వెలుతురు కనిపించలేదు. 


  "మనం సాయం కోసం అరవాల్సి ఉంటుందేమో అనుకొంటున్నా!"  అంది నాన్సీ.


  ఆమె అరవటం మొదలెట్టింది కానీ ఏ విధమైనా ప్రతిస్పందనా రాలేదు.  తరువాత జార్జ్ అరవటాన్ని అందుకొంది.  స్నేహితురాళ్ళిద్దరూ తమ అరుపులకు వీలర్ తప్పకుండా లేస్తాడని భావించారు.  కానీ అతనలా గడ్డిలో పడుకొనే ఉన్నాడు.


"నేను ఈ ఫ్లాష్ లైటుతో సహాయాన్ని అర్ధించే సిగ్నల్ యిస్తాను" చివరకు నాన్సీ అంది.  "బహుశా ఎవరైనా దాన్ని అందుకోవచ్చు."  


   సాధారణంగా సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న ఓడలు పంపే కోడ్ భాష అది.   ముందుగా ఆమె చుక్కలు, తరువాత మూడు గీతలు, తరువాత మూడు చుక్కలతో సిగ్నల్ పంపిందామె.  చాలా సెకన్ల నిరీక్షణ తరువాత ఆమె మరొకసారి ఈ ప్రమాద సంకేతాన్ని పంపింది.  


  అకస్మాత్తుగా అమ్మాయిలకు నది వైపునుంచి "హల్లో" అన్న పలకరింపు వినిపించింది.  "మీరు యిబ్బందిలో ఉన్నారా?" అంటూ మగమనిషి కంఠస్వరం వినిపించింది.


  "అవును.  మా పడవ ప్రమాదానికి లోనయింది.  గాయపడిన వ్యక్తితో మేము గట్టున ఉన్నాం."  


 "కొద్దిసేపట్లో నేను అక్కడ ఉంటాను" అని అపరిచితుని వాగ్దానం వినిపించింది.  కొద్ది క్షణాల్లోనే ఒక చిన్న పడవ గట్టుకి లాగబడింది.  దానిలో ఉన్న జంట తక్షణం గట్టుకి దూకారు.  


  ఒక యువకుడు స్పృహ తప్పిన వీలర్ దగ్గరకొచ్చి, మోకాళ్ళపై కూర్చుని, అతని నాడిని పరీక్షించాడు.


  ఇంతలో ఒక అమ్మాయి వారిని పరిచయం చేసుకొంది.  "మేము అమీ కాడ్మస్ మరియు అర్ట్ మున్సన్.  అర్ట్ ఒక వైద్య విద్యార్ధి."


  "మీ మంచితనానికి ధన్యవాదాలు" అంటూ జార్జ్ తనను, నాన్సీని పరిచయం చేసుకొంది.  ఆ యువకుడు వీలర్ ని త్వరగా పరీక్షించాడు.  "మనం వెంటనే ఈ వ్యక్తిని డీప్ రివర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి" చెప్పాడు అర్ట్.


   "ఇక్కడకు సమీపంలో రోడ్డు మార్గం ఉందా?" నాన్సీ అడిగింది.  


  "లేదు, లేదు.  ఈ ప్రాంతమంతా దాదాపుగా అడవి.  ఈ వ్యక్తిని నా దోనెలో ఆసుపత్రికి ఆనందంగా చేరుస్తాను.  అమీ! ప్రస్తుతం నువ్వు నాతో రా! తరువాత నేను మీ అమ్మాయిల కోసం తిరిగి వస్తాను.  విధి విలాసం! మీరు వణికిపోతున్నారు."


  "అవును.  మేము నీళ్ళలో బాగా తడిసిపోయాం" జార్జ్ చెప్పింది.  "మిస్టర్ వీలర్ కూడా!"


  "ఈయన జాన్ వీలర్.  డీప్ రివర్లో న్యాయవాదిగా చేసి రిటైరయ్యారు" నాన్సీ చెప్పింది.  


  "అలాగా?" అమీ అంది.  "ఆయన నాకు తెలుసు."


కావలసిన సరంజామా సమకూర్చబడిన అర్ట్ యొక్క చిన్నపడవలో రెండు రెయిను కోట్లు, ఒక పెద్ద టార్పాలిన్ ఉన్నాయి.  అతను నీళ్ళలో నానిపోయిన యిద్దరు అమ్మాయిలకు తలొక రెయిను కోటు యిచ్చాడు.  వీలర్ని పడవలో పడుకోబెట్టి, అతనిపై టార్పాలిన్ కప్పాడు.  


  పడవలోని వారు తెడ్డు వేసి, నదిలో వేగంగా వెళ్ళిపోయారు.  ఏమైనప్పటికీ, జార్జ్, నాన్సీలకు ఆ చీకట్లో నిరీక్షణ తప్పలేదు.  అయితే, చివరికి అర్ట్ మళ్ళీ వెనక్కి వచ్చాడు.  


  జార్జ్, నాన్సీ ఆ దోనెలోకి ఎక్కారు.  "నది అవతలగట్టుకి చేరిన వెంటనే నేను అంబులెన్సుకి ఫోను చేసాను.  అమీ అక్కడే ఉండి అంబులెన్సులో వచ్చిన వైద్యవిద్యార్ధికి మిస్టర్ వీలర్ ఎవరో, అతనికేం జరిగిందో చెబుతానంది."  


  "అతనికి నయమవుతుందని అనుకొంటున్నారా?" నాన్సీ అడిగింది.


  "చెప్పటం కష్టం" యువ వైద్య విద్యార్ధి బదులిచ్చాడు.  "నేను అతన్ని వదిలే సమయానికి యింకా స్పృహలోకి రాలేదతను."


  జార్జ్ అదనంగా ఉన్న మరొక తెడ్డుని అందుకోవటంతో, వారు త్వరగానే పట్టణానికి చేరుకొన్నారు.  అమీ వారి కోసం గట్టున నిరీక్షిస్తోంది.  అంబులెన్సు వచ్చి వెళ్ళిందని ఆమె చెప్పింది.  వీలర్ యింకా అపస్మారంలోనే ఉన్నాడు.  


  "మీ అమ్మాయిలు ఎక్కడ ఉంటున్నారు?" అడిగిందామె.  


  "లాంగ్ వ్యూ మోటెల్లో" నాన్సీ బదులిచ్చింది.


తన కారు దగ్గరలోనే ఉందని, దానిలో అమ్మాయిలను బస వద్ద విడిచిపెడతానని అర్ట్ చెప్పాడు. "వేడి స్నానం, రాత్రి మంచి నిద్ర కోసం డాక్టర్ మున్సన్ ఉత్తర్వు చేస్తున్నారు" నవ్వుతూ జోడించాడతను.  


  ఆతని ఉత్తర్వును శిరసావహిస్తామని నాన్సీ, జార్జ్ నవ్వుతూ చెప్పారు.

  

  వాళ్ళు మోటెల్ వైపు వెళ్తుండగా, అమీ జార్జ్ ని అడిగింది, "మీకు అబ్బాయి పేరు ఎలా వచ్చింది? లేక జార్జ్ అన్నది మీ అసలు పేరు కాదా? "


  జార్జ్ నవ్వింది.  "ఇది నా అసలు పేరే! జరిగిన కథ ఏమిటంటే, తమకు ఖచ్చితంగా మగ పిల్లాడు పుడతాడని నా తల్లిదండ్రులు ఆశపడ్డారు.  అందుకే పుట్టే బాబుకి జార్జి అన్న పేరు పెట్టాలని నిర్ణయించుకొన్నారు.  వాళ్ళు అనుకొన్నట్లు గాక నేను పుట్టాను. ఏమైనప్పటికీ, వాళ్ళు నాకు ఆ పేరునే పెట్టారు."


  "ఇది నాకు చాలా యిష్టం" అంది అమీ. "అసాధారణమైన పేర్లు నన్ను మాయ జేస్తాయి.  పద్దెనిమిదేళ్ళ వయసున్న నా సోదరికి ఒక స్నేహితురాలు ఉంది.  ఆమె పేరంటే నాకు చాలా యిష్టం.  ఆ పేరు జోడిన్."


  "ఇది అసాధారణమైనదే!" నాన్సీ ఒప్పుకొంది.  "ఆమె అలాగే పిలవబడుతుందా?"


  "లేదు. అది అవమానంగా నేను భావిస్తాను.  ఆమెను జోడీ అని పిలుస్తారు."  జోడీ ఒక విలక్షణమైన అమ్మాయని అమీ చెప్పింది.  "మీరు యిక్కడ ఉన్నప్పుడు ఆమెను మీరు కలవాలని కోరుకొంటున్నాను.  ఆమె చివరి పేరు ఆరంస్ట్రాంగ్. ఆమె బిర్చివుడ్ వీధిలో ఉంటోంది.  అది హైస్కూలుని ఆనుకొని ఉన్న పక్కవీధి.  ఆమె వయసు మూడు, నాలుగేళ్ళు ఉన్నప్పుడు దత్తత వెళ్ళింది.  అప్పటినుండి ఆరంస్ట్రాంగ్ అన్నది పేరుతో కలిసింది." 

   

  ఆసక్తిగా వింటున్న జార్జ్. నాన్సీ ఒకరినొకరు చూసుకొన్నారు.  జోనీ హోర్టన్ కి యిది క్లూగా పనిచేస్తుందా?  "జోడీని యిక్కడ డీప్ రివర్లోనే దత్తత తీసుకొన్నారా? " 

ఉదాసీనతను నటిస్తూ నాన్సీ అడిగింది.


  "ఆమె ప్రస్తుత తల్లిదండ్రులు పక్క పట్టణంలోని దత్తత సమాజంనుంచి ఆమెను తెచ్చుకొన్నట్లు నేను నమ్ముతున్నాను."


(సశేషం)

No comments:

Post a Comment

Pages