మానసవీణ - 33 - అచ్చంగా తెలుగు

 మానసవీణ - 33 

 చెళ్ళపిళ్ళ శ్యామల, విజయనగరం 


రొప్పుతోంది మానస. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్ళు లాగేస్తున్నాయి. ఇక తను పరుగెత్తలేదు. పొరపాటు చేసిందా తను. ఎవరి జీవితాల్లోనో  మార్పు తేబోయి  తన జీవితం ప్రమాదం లోకి నెట్టుకుంటోందా ! పరి పరి ఆలోచనలు ఆమె పరుగు కన్నా వేగంగా... పరుగెడుతున్నాయి. 

ఇన్నాళ్లూ... తను ఎవరూ లేని అనాధ. కానీ యిపుడు కన్నవారిలా ఆప్యాయత చూపిస్తున్న శ్రావణి రఘురాం లున్నారు. అడవిలోకి సైతం వచ్చి అండదండగా వున్న అనిరుధ్ వున్నాడు. అభిమానం గా చూస్తున్న కృషీ అంకుల్, వున్నారు. ఇక GTR అంకుల్, ఆంటీ.. నా కున్న అత్యంత ప్రియమైన  ఆత్మీయులు..  కాలేజీ స్టూడెంట్స్, ఆశ్రమ విద్యార్థులు తన చుట్టూ ఉన్నారు. తనకేమన్నా అయితే ఇంత మంది కన్నీరు కారుస్తారు. తనిప్పుడు అనాధ కాదు. 

ఇంత మంది మనసులో తనకు స్థానం ఉంది. ఇప్పుడు తనకు ఏమైనా అయితే.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రావణి గారు తట్టుకోగలరా? లేదు నాకేం కాదు నేను పరిగెత్తాలి. ఇంకా ఇంకా ఇంకా పరిగెత్తాలి వాళ్ళకి అందనంత దూరం పరుగెత్తాలి ఇలా ఆలోచిస్తూ ఇంకా స్పీడ్ గా పరిగెడుతోంది. ఆమెను వెంబడిస్తున్న నలుగురు ముసుగుమనుషులు రొప్పుతున్నారు. 

               ఇంట్లో శ్రావణి గారు ఒక్కరే ఉన్నారు. రెండు రోజుల కిందటే అనిరుధ్ ఇంటికి వెళ్ళాడు. రఘురాం గారు భూషణంగారిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్లారు. ఈరోజు ఇలా జరుగుతుందనుకోలేదు. రోజూ  ఇద్దరు ముగ్గురు పిల్లల ఇంటికెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని కలిసి వస్తున్నాను. దేవుడా! నన్ను రక్షించు అంటూ శక్తినంతా కాళ్లలోకి తెచ్చు కుంది మానస. లేడి పిల్లలా ఉంది ఆమె పరుగు. దూరం నుంచే రఘురాం చూస్తున్నాడు  మానసని  నలుగురు ముసుగు మనుషులు తరమడం. ‘వచ్చేస్తున్నా తల్లీ ! వచ్చేస్తున్నా! నా చిట్టి తల్లి కేం కానివ్వను’  అంటూ కారు స్పీడ్ పెంచాడు. ఇంకాస్త దగ్గరికి వెళితే మానసని ఆదుకోగలడు. ఇంతలో ఓ మలుపు నుంచి సూపర్ ఫాస్ట్ గా బైక్ మీద వచ్చిన వ్యక్తి మానసను బైక్ ఎక్కించుకుని పోయాడు. కళ్ల ముందే ఇలా జరగడంతో రఘురాం షాక్ అయ్యాడు. 

                 శ్రావణి చాలా కంగారు పడుతోంది ఇంకా మానస రాలేదు. వెతకడానికి వెళ్ళిన రఘురాం అనిరుధ్  ఏమయ్యారు ? వాళ్ళకి మానస కనపడలేదా?

‘మానసకే మన్నా అపాయం కలిగిందా! మానస కేదైనా అయితే తను  ప్రాణాలతో ఉండలేదు. దేవుడా! ఎందుకిలా చేస్తున్నావ్! నా చిట్టి తల్లి ని మానస లో చూసుకుంటుంటే అదీ నీకు నచ్చలేదా తండ్రీ.  నేనేం పాపం చేశాను. ఇన్నాళ్ళూ... బిడ్డ ఉండీ గొడ్రాలులా బతికాను. ఇప్పుడు మానసే నా సర్వస్వం  అనుకున్నాను. లేదు లేదు భగవంతుడు నా మానసను క్షేమంగా ఇంటికి రప్పిస్తాడు’ అనుకుంటూ శ్రావణి మనసు పరిపరి విధాల పోతోంది. ఇంతలో ‘అమ్మా! వచ్చేసా!’ అన్న మానస పిలుపుతో ఆమె గొంతులో అమృతం పోసినట్లయింది ఒక్క ఉదుటున వెళ్ళి తలుపు తీసింది.

           అనిరుధ్ మానసని నెమ్మదిగా బైక్ నుంచి దించాడు. ‘మానస చాలా అలసిపోయింది. ఆమెను పడుకోబెట్టండి’  అన్నాడు. ఇంతలోనే రఘురాం మానస దొరకలేదని కంగారుగా వస్తూ... బైక్ పైనుంచి మానస దిగడం చూశాడు. ‘బైక్ పై వచ్చింది అనిరుద్దా,  ఇంకా ఎవరో అనుకున్నా. థాంక్ గాడ్’ అనుకుంటూ మానస ను  మంచం మీద పడుకోబెట్టాడు.  మరో వారంలో తండ్రిని డిశ్చార్జ్  చేస్తారని  తెలిసి  వెంటనే తిరిగొచ్చిన రఘురామ్ మానస కోసం బయలుదేరాడు.  మానస పిల్లల తల్లిదండ్రులని కలవడానికి వెళతానని చెప్పడం రఘురాంగారు హాస్పిటల్ కి వచ్చారని  తెలియడంతో అనిరుధ్  మానస క్షేమం కోరి వెంటనే బయలుదేరి రావడంతో మానస సేవ్  అయింది. 

          రత్నాంబ మొక్కులే ఫలించాయో, చేసిన మంచి పనుల ఫలితమో గానీ కృషీవలరావు బాగా కోలుకున్నాడు.  రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు  డాక్టర్ గారు. ఒక్కసారిగా మానస గుర్తొచ్చిందతనికి  ‘అర్జెంటుగా మానస విషయం తెలుసుకోవాలి. శ్రావణి గారిని తనతో కలపాలి. నాకేదయినా  అయిందా! నాన్న కోరిక తీరేదా! అంతేకాదు భూషణంగారికి మానసే తన మనుమరాలని చెప్పాలి. ముసలితనం ఏ  క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం’ అనుకున్నాడు కృషీవలరావు.

         దినేష్ ఆలోచిస్తున్నాడు.తను అనాధ కావడానికి కారణమైన భూషణం పై పగతీర్చుకోవాలా  వద్దా. అతని మనసు అటూ ఇటు గా ఊగిసలాడుతోంది.  ఏదేమైనా తను ముందు మానస ని ప్రొటెక్ట్ చేయాలి. ఆమె టీచర్ గా జాయిన్ అయిన గిరిజన ప్రాంతంలో  భూషణం లాంటి పెద్ద మనుషుల వల్ల ఆమె ప్రాణానికి ప్రమాదం ఉంది. ఒకసారి ఆ గ్రామం వెళ్లి ఊర్లో ఆమెకి ఎలాంటి అపాయం  కలగకుండా చూడాలి. అనుకున్నాడు దినేష్ ఇంతలో అతనికి కృషీ వలరావు నుంచి అతనికి ఫోన్ వచ్చింది.

***

      రఘురాం మనసు అలజడిగా ఉంది. ‘లేదు లాభం లేదు ఎలాగైనా మానసని  తమతో ఉంచుకోవాలి. శ్రావణి దక్కాలంటే... మానస కి ఏ అపాయమూ  రాకుండా చూసుకోవాలి. అంతే కాదు త్వరలో మానసని ఆమె అంగీకారంతో దత్తత  తీసుకోవాలి.’ ఈ ఆలోచనతో  రఘురాం మనసు కాస్త స్థిమిత పడింది.

            ‘ నా బంగారు తల్లి నే ఎత్తుకు పోతావా! నిన్ను చంపేస్తా!’ అంటున్న శ్రావణి మాటలకు నిద్రలేచింది మానస. తనని గట్టిగా పట్టుకుని పడుకుంది శ్రావణి. ‘లేదమ్మా... నీ ప్రేమ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు’ అంటూ ఆమెకు మరింత దగ్గరయింది. ఇప్పుడు  మానసకు తన గురించే కాక,  తన వాళ్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. జీవితాంతం శ్రావణి, రఘురాం లనే తల్లిదండ్రులిగా భావించాలి అనుకుంది. ఇక అనిరుధ్... రాత్రింబవళ్లూ.. తనకి అండగా ఉంటున్న అనిరుధ్ చేయినే  జీవితాంతం పట్టుకోవాలి. ఈ విషయం త్వరలోనే అనిరుధ్ తో పంచుకోవాలి. ఆ ఆలోచన రాగానే అప్రయత్నంగా ఆమె పెదాలు విచ్చుకున్నాయి.                 

      ‘ ఇక ఆలస్యం చేస్తే మానస కి ముప్పే. అనుక్షణం తనకి నీడనై సాగాలి. అమ్మ నాన్న కి చెప్పి ఒప్పించి, మానసను నా  సొంతం చేసుకోవాలి’ అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అనిరుధ్.

  ఎవరి ఆలోచనలు వారి చుట్టూ భ్రమరమై తిరుగుతున్నాయి. రేపు కాలం ఏమి తీర్పు ఇస్తుందో! ఎవరి ఆలోచనలు నిజం చేస్తుందో ! లేక మరేదన్నా...  చేస్తుందో ! 

అసలు ఈ గ్రామంలోని ముసుగు మనుషులు ఎవరు?  ఆమెనెందుకు  వెంబడించారు?   విద్యార్థులను చదవనివ్వకుండా... చేస్తున్న శక్తులేవి? ఇవ్వకుండా చేస్తున్న శక్తులేవి? మానస వాటిని  ఎదుర్కోగలదా? 

అన్నిప్రశ్నలకు  కాలమే జవాబు  చెప్పాలి.

***

No comments:

Post a Comment

Pages