అనసూయ ఆరాటం - 11 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 11 

చెన్నూరి సుదర్శన్  


అనసూయ కుటుంబానికి నెల, నెలా సరిపోయే సౌదలు దుకాన్లకెల్లి వత్తానై. పండుగలు పబ్బాలకు బట్టలత్తానై. కాని చిల్లర కర్సులకెట్ల. పొలగాండ్ల పుత్తకాలకు.. బట్టల కుట్టుకూళ్లకు గావాల్నాయె. ఏదైనా కొందామంటే చేతిల చిల్ల గవ్వ లేకుంటే ఎట్ల.. అని అనసూయ బాగా సోంచాయించింది.


          ‘పటేల్ పెండ్లాం’ అనే మాటను పక్కకు పెట్టింది. జాలారిడ్చిన చీరను లేచి గోచి పెట్టింది. పొలగాండ్లకు సద్ది కట్టిచ్చి బడికి తోలి తను దినాం కూలి అడ్డకు పోయి నిలబడింది. తొలుత అడ్డ మీదున్నోల్లు అనసూయను సూసి ‘అయ్యో పాపం’ అని అనుకునేటోల్లు. కొన్నాల్లకు అలవాటై పోయింది.


          అనసూయ సదువుకోలేదు కాని నలుగురి ముందు నిలబడి నడిచే రకం. కిలాసుల పెబ్బే లెక్క.. శాన తెలివి కల్లది.


          నిత్తె కూలీలనందరిని కలుపుకొని ఒక సంఘాన్ని పెట్టింది. అంతా దానిని ‘అనసూయ సంఘ’ మనేటోల్లు. అనసూయ రోజు కూలీ గాకుండా ఎకరాల కొద్ది పొలాలను ఎకరాకింత అని గుత్తకు మాట్లాడేది. అంతా కలిసి కట్టుగ నాట్లేసుడు.. కలుపు తీసుడు.. బంతి కొట్టుడు.. పనులు చేసుకుంట పైసలు పంచుకునేది. పల్లికాయ తెంపుడు.. కొట్టుడు.. ఒల్సుడైతేనేమి.. పత్తి, మిర్చి ఏ సీజన్ల అది అనసూయ లేంది ఎవ్వలూ ముందుకు సాగరు. కూలోల్లమను కోకుంట.. సంత పనిలెక్క బారెడు పొద్దుగాల్నే పొలాల్ల వంగి జానెడు పొద్దు వంగుడుకు లేసేటోల్లు. ఇండ్లు చేరేటల్లకు పురంగ చీకటి పడేది. 


          అనసూయ వచ్చిన సంది కూలి పైసలు ఎక్కువ గిట్టుబాటైతానయని కూలోల్లంతా ఖుషీగున్నరు.


          అనసూయ వరి నాట్లేసుకుంట తీరొక్క పాట పాడేది.


నాటెయ్యవే కోడలా.. నాటెయ్యవే..


నాత్రికి నాకొడుకు వాటంగా వాటేసుకుంటడే.. /నాటే/


నాటేసుడు రాదు అత్తో.. నాకు నాటేసుడు రాదే..


నీ కొడుకును వాటేసుకునుడే తప్పా..


నాకూ నాటేసుడు రాదే..’ అని పాడుతాంటే.. తోటి పనోల్లంతా వల్లె వేసేటోల్లు. పని చేత్తానమనే అలుపెరుగేటోల్లు కాదు.


           ఒక సారి కాపోల్ల వాడల.. ఒక బుడ్డ లీడరు గుర్నాథంకున్న ఐదెకరాల పొలంల  నాట్లు ఏయించుకొని పైసలు రేపిత్త.. మాపిత్తనని తిప్పిచ్చుకోబట్టిండు. అనసూయకు పది రోజులు దంపట్టింది. పదకొండో రోజు నలుగురాడోల్లను ఎంటేసుకొని  గుర్నాథం ఇంటి మీదకు పోయి నిలదీసింది. ఒక కూలీ దాని కెంత హిమ్మతీ.. అని గుర్నాథం రోషానికి పోయి అనసూయ మాడ మీద చెప్పుతోటి కొట్టిండు. మొగడు లేని ముండని సూత్తే ఎవనికైనా అలుసే.. అని అనసూయ అగ్గి మీద గుగ్గిలమైంది. తోడచ్చిన నల్గురు గజ్జ, గజ్జ వన్కబట్టిండ్లు.


          “తప్పు నీ దిక్కుల ఉండాలని నిన్ను ఏమనకుండా పోతాన.  కొడుకా.. నీ సంగతి సూత్త” అన్కుంట కనుగుడ్లెల్లబెట్టి సూపుడేలు తోటి బెదిరిచ్చింది.


          “అదన ఆడదానివి నువ్వేం చేత్తవే.. నా వెంటుక సుత పీక లేవు” అని గుర్నాథం ఉరిమి సూసిండు. ఆ.. సూసు కుందామన్నట్టు.


          అనసూయను కొట్టిండని ఊరంతా తెలిసింది. తెల్లారి అడ్డ మీద కూకున్న కూలీలు అనసూయకు వత్తాసు పలుకిండ్లు. కూలికి రాము పొమ్మన్నరు. మిగిలిన వాడలల్ల కూలీలంతా పనులకు రామని.. అనసూయ సంఘానికి మధ్ధతు పలికిండ్లు. పొలమున్న ఆసాములంతా అప్సోసయ్యిండ్లు.


ఒక రోజు.. రెండు రోజులు కాదు వారం రోజులు చూసిండ్లు. కాలం పోతాంది. వరి నాట్లు పడాల్నాయె.. ఎట్ల అని ఎంతో బతిలాడి సూసిండ్లు. అందరు ఒక్క కుత్కెమీద ఉన్నరు.


గుర్నాథం శాన తప్పు చేసిండని అందరు కలిసి గుర్నాథం ఇంటికి పోయిండ్లు. నువ్వు చెయ్యబట్టి మా పనులన్నీ ఆగిపోయినయని పెద్ద బొబ్బ మోపయ్యింది. పైసలివ్వక పోవుడు గుర్నాథం తప్పని కొట్టబోయిండ్లు. గుర్నాథం రెండు చేతుల్తోటి దండం బెట్టిండు. గట్ల కాదు అనసూయ కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పు.. లేకుంటే నీ తోలుతీత్తమని బెదిరిచ్చిండ్లు.


          గుర్నాథంకు కూలోల్ల పవరేంటో తెలిసింది. తప్పు ఒప్పుకుంటేనే తన లీడరు గిరి నిలుత్తదని అడ్డమీదున్న అనసూయ దగ్గరికి ఉర్కచ్చిండు. తప్పైందని దండం పెట్టిండు. కాళ్ళు మొక్కత్తే.. వద్దని అనసూయ ఎన్కకు జరిగింది. మా పైసలు మాకిత్తే సాలన్నది.


          లీడరు మొకంమ్మీద నెత్తురు సుక్క లేదు. పైసలు అనసూయ చేతిల పెట్టి ఇంకో సారి దండం పెట్టిండు.


          అడ్డ మీద కూలీలంతా అనసూయమ్మకు జే.. జే..లు పలికిండ్లు.

***

           సూత్తాంటే.. సూత్తాంటే.. ఆదిరెడ్డి పదో తరగతి పట్టిండు. అనిమిరెడ్డి ఎన్మిదో తరగతి.. జయమ్మ ఆరుల కచ్చింది.


కండ్లల్ల వత్తులేసుకొని కొడుకు సదువుతాంటే అర్సుకునేది అనసూయ. ఆదిరెడ్డి తప్పకుండా ప్యాసు కావాలని దేవుల్లకు మొక్కుకునేది. సదువు బెగడో ఏందో గాని తాప తాపకు ఒకలకు గాకుంటే ఒకలకు జరాలచ్చేది. ఖాన్‌సాబ్ వచ్చి సూదులు మందులిచ్చేటోడు. ఒక రోజు పిలగాండ్లందరు జరాలచ్చి పన్నరు. అనసూయ వల్లిచ్చుకుంట ఏడుత్తాంటే.. పోలీసు రాజయ్య, బతుకమ్మలు వచ్చి సముదాయించిండ్లు. 


          “ఎందుకైనా మంచిది.. పిల్లలందరికి పరీచ్చలు చేయిత్తే బాగుంటది.. నేను ఖాన్‌సాబ్‌ను అడుగుతా” అన్నడు రాజయ్య


          అనసూయకు మరింత గుబులైంది.


          “పరీచ్చలే కదా.. ఇప్పుడు మన ఊల్లె సర్కారు దవకాన్లనే సేత్తాండ్లు” అన్నదీ బతుకమ్మ.


సరే అన్నట్టు తల్కాయె ఊపింది అనసూయ.


          తెల్లారి పిల్లలందరిని సర్కారు దవకాన్లకు తీస్కపోయిండు రాజయ్య.  పరీచ్చలు చేయిచిండు. ఆయన అనుమానం నిజమైంది. పిల్లలందిరికీ ఇప్పుడుప్పుడే టీ.బీ. వత్తానట్టు తేలింది. ఇది అనసూయకు చెప్పద్దని ఖాన్‌సాబ్ తనూ అనుకున్నరు. మామూలు జరమేనని డాక్టరు రాసిచ్చిన మందులు కొనుక్కపోయి ఎట్ల వాడాల్నో చెప్పిండు రాజయ్య. ఖాన్‌సాబ్ సుత అనసూయను భయపడద్దని.. మల్ల మల్ల పిల్లలకు జరాలు రావని దైర్నం చెప్పిండు.

***

No comments:

Post a Comment

Pages