అమ్మ,నాన్న - అచ్చంగా తెలుగు

 అమ్మ, నాన్న 

 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.  


నాన్న పైలోకాలకు మళ్ళాక, 

తన గొప్పతనం తెలిసింది.

బడిలాంటి తనగుండెలపై 

ప్రియంతో పడుకోపెట్టుకొని, 

ధైర్యం ,శౌర్యం ,నడక,నడత నేర్పించిన 

నాన్న మాయమయ్యాక, 

అతని గొప్పతనం గ్రహింపు కొచ్చింది ,

జీవిత సారం ముగింపు కొచ్చింది.

అమ్మ దూరంగా వెళ్ళాక,

ఆమె మంచితనం తెలిసింది.

గుడిలాంటి తనఒడిలో 

గుట్టుగా నన్నుపెట్టుకొని, 

గుండెలలో పొంగేప్రేమతో 

పయ్యదకు నన్నుహత్తుకొని, 

అమృతాన్నేక్షీరంగా త్రాగించిన 

అమ్మ ఇప్పుడు శాశ్వతంగా దూరమయ్యాక, 

ఇక ఏ జన్మలోనూ చేరలేని తీరమయ్యాక

ఇలా ఈజీవితం భారం అయ్యింది,

చెయ్యరాని నేరం చేసినట్లయ్యింది,

కటకటాలు లేని కారాగారం అయ్యింది.

ఇప్పుడు అమ్మ గొప్పగుణం తెలిసింది,

అనంతంగా హృదయాన్ని కలిచింది.

నీటిబావుల్లాంటి అమ్మానాన్నలు దూరమయ్యాక

ఎండమావుల్లాంటి జీవితం ఏహ్యమనిపించింది,

ఇక ఆనందం అనుహ్యమనిపించింది.

 ***


No comments:

Post a Comment

Pages