గొడుగు - అచ్చంగా తెలుగు

 గొడుగు  

(మా జొన్నవాడ కథలు)

 - డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


ఒరే! మాల్యాద్రీ! ఈ లోటా ఎత్తుకబోయి అమ్మగారికిచ్చి గబాల్నరా! తాగిన కాఫీ గ్లాసు ఇచ్చాడు. 

"అట్టాగే అయ్యా!"

"ఒరేయ్.. నీకిప్పటికిప్పుడు ఇంట్లో కొంపమునిగి పోయే పన్లేమన్నా ఉన్నాయంట్రా" అన్న మాటకు మౌనంగా లేవన్నట్టు తలూపిన మాల్యాద్రిని తీసుకుని జొన్నవాడ వీధుల్లో తిరగడానికి చెప్పులేసుకున్నాడు ప్రెసిడెంట్ వెంకురెడ్డి.

"పాచిపెత్తనం పదహారు ఘడియలు. అగ్గరారం పెత్తనం ఆరు ఘడియలు అనీ సామెతొకటుంది. అట్టాఉంది మీ యెవ్వారం. తొందరగా రాండి. చాలా పన్లున్నాయి. మీరు జాలక ఆడ్నొకడ్ని తోజు జేసుకొని పోతారు బజార్ల మీదికి" అని విసుక్కుంది రెడ్డమ్మ.

"ఒక్కసారి తిరిగి చూసి "అట్నేలే!" అని నవ్వుకుంటూ బయలుదేరాడు.

"ఒరే ఊర్లో అంతా మార్పొచ్చేసిందిరా! అందరూ జొన్నాడొదిలి నెల్లూరుకు కాపరం బొయ్యేవాళ్ళే"

"అవునయ్యా.. ఆడైతే సినిమాలు షికార్లు, మంచి మంచి ఓటళ్ళు ఉంటాయి. ఈడేముంది ఆ పులిబంగరాల అంగడి. మీరా టీ అంగడి దప్ప" "

"ఒరే మాల్యాద్రీ... బతుకంటే అదేనట్రా! మర్యాదా మట్టూ పల్లేదా? అప్పటి ప్రేమలు అభిమానాలు ఇప్పుడేడయిరా.. అంతా డ్రామాలాడతా  ఉంటారు." అంటూ వచ్చిపోయే వాళ్ళ నమస్కారాలు తీసుకుంటూ నడుస్తున్నాడు.

"అవునయ్యా"

"మాల్యాద్రీ.. ఆడు గంగులుగాడు జూడు. నా వయసే గదా ఆడు. ఇంత పొద్దున్నే ఆ చెప్పులుకుట్టే పని మొదలుబెట్టేశాడు. ఏం ఓపికరా ఆడికి"  అన్నాడు రచ్చబండ కాడికి చేరుకుంటూ.

"ఆళ్ళు పచ్చిమాంసం తింటారయ్యా! అందుకే అంత బలం ఆళ్ళకి"

"ఏమో మాల్యాద్రీ... మనమూ పొట్టేళ్ళూ.....కోళ్ళు తింటూనే ఉంటాం కదా!" అని నవ్వి "ఒరే! గంగులూ ఎట్టున్నావు?"

"బాగానే ఉండానయ్యా! తమరి ఆరోగ్యం ఎట్టాగున్నాదయ్యా!" అన్నాడు లేచి నిలబడి చేతులుగట్టుకొని. 

"ఓరి నీపాసుగాల! నాకా మర్యాదలెందుకురా! మనిద్దరం ఎలిమెంట్రీ స్కూల్లో చదూకున్నోళ్ళం కదా!"

"అయ్యా! అయ్యొక రోజులు. ఇప్పుడు మీరు ప్రెసిడెంటు. నేను చెప్పులు గుట్టుకోని బతికేవాణ్ణి. పెద్దంతరం చిన్నంతరం ఉండ బల్లా అయ్యా!"

"నీకెన్ని సార్లు చెప్పినా అంతే వినవు కదా! సర్లే వచ్చే డబ్బులు సరిపోతున్నాయా?"

"లేదయ్యా..ఇప్పుడంతా చెప్పులు టవునుకుబోయి పాపులరనీ..బాటా అనీ కొనుక్కుంటున్నారయ్యా! ఈ గంగులు గాడి కిర్రు చెప్పులకు విలువ ఎప్పుడో బొయింది"

"అవున్రా! నేను నా కాడ పనిజేసే వాళ్ళకు చెబతాలే. సమచ్చరానికి రెండు జతలన్నా తీసుకోమని"

"అట్టాగే గానీ. మీ కాడ పాత గొడుగేదైనా ఉంటే ఇప్పించడయ్యా.. వానొచ్చినా...ఎండొచ్చినా అన్నీ నామీదనే".

“నువ్వడగాలే గానీ కొత్తదే కొనీనంటరా!”

“కొత్తది పల్లేదులే అయ్యా..పాతది… నా మొహాన పడేయ్యండి… అదే పదేలు. ఇది చూడయ్యా.. అన్నీ కంతలే" అని నవ్వాడు.

"సరేలేరా గంగులూ! వస్తా! జాగర్తగా ఉండొరేయ్!" అని చిన్నప్పుడు గంగులూ తనూ చదువుకునేప్పుడు జరిగిన సంఘటనలన్నీ మాల్యాద్రికి చెప్తూ సాగుతున్నాడు.

ఈడు యాణ్ణుంచీ తెచ్చేవాడో గానీ…. సంచిలో మామిడికాయలు, బిస్కెట్లు, నిమ్మబిళ్ళలు, కమ్మరకట్లూ తెచ్చి ఒంటేలు గంటప్పుడు నాకు మాత్రమే రహస్యంగా ఇచ్చేవాడు. ఒకసారేమయిందో తెలుసా! మేము నాలుగో క్లాసు చదివేటప్పుడు ఐదో క్లాసులో రహీంగాడుండేవాడు. పెద్ద రౌడీ వాడు. వాడు ఎక్కాలు సరిగ్గా చెప్పకపోతే అయివారు చింతబరికెతో పూజ్జేశాడు. నేను పక పకా నవ్వానా? వాడికేమో అరికాలిమంట నెత్తికెక్కింది. ఒంటేలు గంటప్పుడు మేమిద్దరం లోపలుంటే ఆ రహీంగాడు పెద్ద కట్టె దీసుకోని నా తలమీద గొట్టబోయేంతలో ఈడు.. ఈ..గంగులుగాడు గబక్కన వాడి కాల్లాగేశాడు. దభీ మని క్రింద పడ్డాడు. ఆదెబ్బకేమయిందో తెలుసా! ముందు పన్నొకటి విరిగిపొయింది. తర్వాత అందరూ వాణ్ణీ చూసి తెగ నవ్వారనుకో! అయివారు రహీంగాణ్ణి ఇరగ్గొట్టారు రెడ్డిమీద కట్టెత్తుతావా? అని మానాయన రహీంగాడి నాయనకు వార్నింగిచ్చేతలికి భయపడిపొయినాడు నాయాలు. ఇప్పుడేడున్నాడో ఏందో.." అని పెద్దగా నవ్వాడు.

***

కొద్దిరోజులకు వెంకురెడ్డి నెల్లూరు కోమలవిలాస్‌లో భోంచేసి బయటకు వస్తుండగా వాన పట్టుకుంది.  డ్రైవరు ఇది చూసి ముందే గబ గబా తినేసి  గొడుగొకటి కొనుక్కొచ్చి రెడ్డిని తడవకుండా కారెక్కిచ్చాడు. గొడుగు డిక్కీలో పడేశాక ఇద్దరూ ఆ సంగతి మరచిపోయారు.

ప్రక్కరోజు ఉదయం మాల్యాద్రి "అయ్యా గంగులు గాడికి పేణం బాగలేకపోతే రాత్రి రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో చేర్చారంట!" 

"అట్నా! మనం చూసి రావాల్రా! ఆడు మంచోడ్రా మాల్యాద్రీ!" అని కారులో అప్పడికప్పుడు బయల్దేరాడు.

"ఈనకు లేడికి లేచిందే పరుగు...ఏం మనిషో ఏందో" భార్య యధావిధిగా విసుక్కుంది.

వెళ్ళేసరికి భార్యా, కొడుకు ఏడుస్తూ బయట నిలబడి ఉన్నారు. డాక్టరుతో మాట్లాడితే హార్ట్ ప్రాబ్లం అనీ చాలా కష్టంగా ఉంది పొజిషన్ అనీ… చెప్పాడు. ఇరవై వేలు  బలవంతంగా కొడుకుచేతిలో పెట్టి, ఇద్దరికీ ధైర్యం చెప్పి వచ్చేశాడు.

రెండు రోజుల తర్వాత -  ఉదయాన్నే ఊళ్ళొ మాదిగాడలో డప్పులు వినబడుతుంటే "ఏంట్రా పొద్ద పొద్దన్నే గలభాలు. రచ్చలు. ఎవరు చచ్చారని" అని విసుక్కున్నాడు.

మాల్యాద్రి వచ్చి "అయ్యా! మన గంగులు తెల్లారుఝామున పోయాడంటయ్యా! ఆళ్ళు ఎత్తుబడి జేస్తా ఉండారు" అని చెప్పాడు.

ఒక్కసారి మత్తు వదిలిపోయింది వెంకురెడ్డికి. కళ్ళల్లో నీళ్ళు తన్నుకొచ్చాయి. వెంటనే డ్రైవరును నిద్రలేపి కారెక్కి మాదిగాడకు బయలుదేరాడు. డప్పుల చప్పుడు దగ్గరయ్యే కొద్దీ బాధకూడా ఎక్కువయింది రెడ్డికి. కార్లోనే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. డ్రైవరు "రెడ్డిగారూ! ఊర్కోండి" అని సముదాయిస్తున్నాడు.

కారు దిగే సరికి పదిమంది చిన్నా పెద్దా  చుట్టుముట్టి “అయ్యా! అన్నేయం జరిగిపొయిందయ్యా! మన గంగులు ఇంక లేడయ్యా.. చూడండయ్యా.." అని ఏడ్చారు. ఒకవైపు కొడుకు అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాడు. భార్య రత్తాలు పొర్లి పొర్లి ఏడుస్తోంది. ఆడవాళ్ళు  ఆమెను అదుపు జెయ్యలేకపోతున్నారు. తప్పెట్ల మోత భయంకరంగా వినిపిస్తోంది. చావుడప్పు ఎంత భయంకరంగా ఉంటుందో మొదటి సారి దగ్గరగా విన్నాడు వెంకురెడ్డి.


ఇంతలో మెల్లిగా వర్షం ఆరంభమయింది. కానీ ఏర్పాట్లు ఆగలేదు. జరుగుతూనే ఉన్నాయి. గంగులుకు చివరి స్నానం చేయించాలని, కులపెద్ద చెప్పడంతో శవానికి నీళ్ళు పోస్తున్నారు. ఒక పక్క వర్షం పెద్దదయింది. చెట్టు క్రింద నిల్చున్న రెడ్డిగారు వర్షానికి తడిసిపోతున్నారని డ్రైవరు డిక్కీలో గొడుగు తెచ్చి రెడ్డిగారికి పట్టుకుని నిల్చున్నాడు.

"కొత్తది పల్లేదులే అయ్యా..పాతది… నా మొహాన పడేయ్యండి… అదే పదేలు. ఇది చూడయ్యా.. అన్నీ కంతలే" అని నవ్వడం పదే పదే రింగులు తిరుగుతూ సినిమా ఫక్కీలో వినిపిస్తోంది. రెడ్డికి. వెంటనే డ్రైవరు చేతిలోని గొడుగును తీసుకుని,  శవం వద్దకు వెళ్ళి వర్షం మీద పడకుండా అడ్డుపెట్టాడు. అందరూ నివ్వెరపోయారు. "అయ్యా..మీరు.."అన్నారు.

"పరవాలేదు. వాడు నాకు పరాయోడేం కాదు. నాకోసం ఎన్నో చేశాడు. నేను వాడి చిన్న కోరిక కూడా తీర్చలేకపోయాను" అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు.

కారు ఇంటికి చేరింది. గంగులు జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి వెంకు రెడ్డి నెమరేసుకుంటూ నలుగురితో పంచుకుంటూ ఉంటాడు. గంగులు చనిపోలేదు. రెడ్డిగారి జ్ఞాపకాలలో చిరస్మరణీయంగా ఉండిపోయాడు.


-0o0-


No comments:

Post a Comment

Pages