"ఆశల ఆరాటం - జీవన పోరాటం" - అచ్చంగా తెలుగు

           "ఆశల ఆరాటం - జీవన పోరాటం"

-       Dr. Tekumalla Venkatappaiah. (9490400858)




          శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారిపేరు గుర్తుకు రాగానే చెన్నై నగరం గుర్తొస్తుంది. ఆ వెంటనే ఆయన స్థాపించిన జనని సాహిత్య సంస్థ గుర్తుకొస్తుంది. ఆయన ఆవేశంగా భాషాభిమానం పై చేసే ఉపన్యాసాలు గుర్తొస్తాయి. ఇవన్నీ చైన్ రియాక్షన్. చెన్నై నగరంలో ఉన్న తెలుగు భాషాభిమాని చెన్నయ్యగారిని అనేక సభల్లో చూసి ఉన్నాను. మంచి వక్త. తెలుగు ప్రజలు తెలుగు మరచిపోతున్నారన్న ఆవేదన ఆయనలో సదా ఉంటుంది. వీరిది కార్య కర్తగా, సేవాకార్యక్రమాలు ఒక పార్శ్వం.


          వీరి మరొక పార్శ్వం కవిత్వం. వీరు 2019 సం.లో "మనిషి కనపడుటలేదు" అన్న కవితా సంపుటి వెలువరించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు వీరు మానవత్వం గురించి సంధించిన ప్రశ్నలు యదార్ధమని ఆముఖం ఇచ్చారు. వీరు అనేక దిన, వార, మాసపత్రికలలో నిర్విరామంగా కవితా వర్షం కురిపిస్తూనే ఉన్నారు. చదివి ఆనందపడే వారిలో నేనూ ఒకణ్ణి.


           వివిధ పత్రికలలో అచ్చయిన 42 కవితలను "జీవనపోరాటం" అన్న పేరుతో 2021 లో ఒక కవితా సంపుటి వెలువరించారు. దాన్ని ఆసాంతం చదివాను. ప్రస్తుతం ఆ కవితల్ని గురించి నాలుగు మాటలు చెప్పాల్సి ఉంది.


              ఏ కవిత్వమైనా పాఠకుల హృదయాలకు సమగ్రంగా అవగతం కావాలంటే ముందుగా ఆ కవిత్వం మనసులోనికి ఇంకాలి.  దానికై ఆ కవిత్వంతో పాఠకునికి గాఢ పరిచయం ఏర్పడాలి. ఆ పరిచయం పదే పదే భావుకతతో కూడిన అధ్యయనం ద్వారా లభిస్తుంది. సమ భావుకతతో ఆ కవితలను తన హృదయగత పరికరంగా పదిలపరుచుకొన్న కొద్దీ, ఆ కవితల్లోని మనోజ్ఞత సాక్షాత్కరిస్తుంది. చిక్కుముడులు విడిపోతాయి. సందేశం తేటతెల్లమౌతుంది. అంటే ఒక కవి రచించిన కవితలు పాఠకునికి మనోజమై భాసించాలి. ఈ క్రమత సాధించినప్పుడు క్లిష్టతలు తొలిగిపోగలవు. పదే పదే పేజీలు తిప్పేయడం కాకుండా, ఇది పాఠకుల పరంగా సాగవలసిన కృషి. నేను ఆ ధోరణిలో నేను ఈ పుస్తకంలోని కవితలను గురించి చేసిన అనుశీలన చెప్పాల్సి ఉంది.


              ఆదిగా ఆదిగురువు అమ్మను సంభావిస్తూ "ప్రేమానురాగాలకు నిలయం అమ్మ - ఈర్ష్య ద్వేషాలకు అతీతమైనది అమ్మ" అంటారు. ఇంకా "నువ్వు వృద్ధాశ్రమంలో చేర్పించినా - నీ యోగక్షేమాలే కోరుకుంటుంది అమ్మ" అనడంలో అమ్మ ఉండాల్సింది వృద్ధాశ్రమంలోనో కాదు. వంశానికి మూలవేరు అమ్మ ఉండాల్సింది మూలగదిలో కాదు మీ గుండె గదిలో అన్న సందేశ మిస్తారు.


              యువతరం వేగంగా బండ్లను నడిపి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారన్న ఆవేదనా ఫలితమే "యువతరం". దీనిలో "గమనిచలేదు ముందు బండి నిలబడి ఉన్న సంగతి - వేగాన్ని పరిమితం చేసేలోపు, ఢీ కొంది ఆ బండిని" ఇంకేముంది. సరదాతో పెంచిన వేగంతో ఆ నిండు ప్రాణం బలయింది. "హెల్మెట్ లేనందువల్ల ముగిసిపోయిందాతని నూరేళ్ళ జీవితం" అని సందేశమిస్తాడు కవి.


              గత కాలం ప్రేమలు పలకరింపులు ఈనాడు కానరావు ‘స్వ్వర్ధం’ అనే కార్చిచ్చు ఈనాడు మనుష్యుల మధ్య అనుబంధాల్ని దహించి వేస్తోంది. కాలం కంటే వేగంగా మనుషులు ధనార్జన వ్యామోహంలో పడి పరుగులు తీస్తున్నారు. డబ్బు సంపాదనలో అన్నాచెల్లెలు, అక్కా తమ్ముడు, అమ్మానాన్నా వంటి బంధాలను సైతం విస్మరిస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా పరుగులెత్తుతున్నారు. విలువలు, న్యాయం, ధర్మం, నీతి అన్నిటిని తుంగలో తొక్కేస్తున్నారనివాపోతూ 'అతిథి దేవోభవ" అన్న కవితను వ్రాశారు. "సాదరంగా ఆహ్వానిద్దాం - మనకోసం వచ్చిన అతిథులను" అంటూ "విచక్షణా జ్ఞాన శూన్యులై - వచ్చినవారిని నిలబెట్టి మాట్లాడడం" అని ఈనాటి తరానికి మంచి చురక తగిలించారు.


              తల్లిభాషను మరచి ఆంగ్లభాషా మోజులో ఉన్న యువతరానికి "అమ్మపాల కమ్మదనం" రుచిపెట్టారు. "తలదించుక తిరుగవద్దు - తల్లిభాష మరవొద్దు - నా మాటను వినుమన్నా - మన తల్లిని మరువకన్నా" అంటారు. నడిచే వయసు, శక్తి ఉన్నా ఈ రొజుల్లో యువతరం అన్నిటికి, పదడుగుల దూరానికి కూడా వాహనాలనే వాడడం చూసి ఆవేదనతో "నడిచి వెళ్ళే దూరమే! నడవడు - రిక్షానెక్కాడు - దిగుతూ డబ్బులిచ్చాడు, తీసుకుంటూ శక్తి ఉన్నంత మేర - స్వశక్తితో బతకడం మిన్న - అంటూ వెళ్తున్న అతన్ని చూస్తూ" ఆశ్చర్యపోయాడు ఆ సగటు బద్ధకజీవి.


-0o0-

No comments:

Post a Comment

Pages