'చొల్లంగి అమావాస్య' కి ఆ పేరెలా వచ్చిందంటే..! - అచ్చంగా తెలుగు

'చొల్లంగి అమావాస్య' కి ఆ పేరెలా వచ్చిందంటే..!

Share This
 'చొల్లంగి అమావాస్య' కి ఆ పేరెలా వచ్చిందంటే..!

-సుజాత.పి.వి.ఎల్,

సైనిక్ పురి, సికిందరాబాద్.


ప్రతి సంవత్సరం పుష్యమాసం చివరిరోజైన అమావాస్యని 'చొల్లంగి అమావాస్య' అంటారు. చొల్లంగి అనే పేరు ఎలా వచ్చిందంటే.. చొల్లంగి అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం. కాకినాడకు దక్షిణంగా, యానాం వెళ్లే మార్గంలో మూడు మైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి. గోదావరి ఏడు పాయల్లో (సప్త గోదావరి) ఒక భాగానికి "తుల్యభాగ" అని పేరు. ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఆ సంగమ ప్రాంతం లో స్నానం చేస్తే పుణ్య నదిలోనూ, సముద్రంలోనూ ఏక కాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సప్త గోదావరిలో ఒక భాగమైన ఈ 'తుల్య భాగ' ఏమిటంటే... పుట్టుకతో దానవుడైనా, నడవడికతో ఏ మాత్రం దానవ లక్షణాలు లేని మహర్షి తుల్యుడు. నిరంతరం పరమార్థ తత్వ చింతనలో ఉంటూ, తరుచుగా దేవ దానవుల మధ్య ఏర్పడే వివాదాల్ని ఏ మాత్రం పక్ష పాతం లేకుండా చాకచక్యంగా పరీక్షించేవాడాయన. అందుకని అతనిని అందరూ తుల్య భాగుడని పిలిచేవాళ్ళు. ఒకసారి సప్త గోదావరిలో ఒక పాయని తీసుకెళ్లి అతను సముద్రం లో కలపాల్సొచ్చింది ఎందుకంటే... లోక కంటకుడైన తారకాసురుని కంఠంలో అమృత లింగాన్ని కుమారస్వామి ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై వాటిలో ఒకటి దక్షవాటిలో పడింది. ఆ శకలాలన్నీ సప్త గోదావరి జలంతో శుద్ధి చేసి అవి పడ్డ స్థానంలోనే ప్రతిష్టించాలని సప్తఋషులు సంకల్పించారు. వెంటనే వాళ్ళు గోదావరి నదీమాతను అర్థించగా...నదీమతల్లి అంగీకరించింది. మహర్షుల వెంట దక్షవాటికి వెళుతూ దారిలో దానవుల ఆశ్రమాల్ని ముంచెత్తింది సప్త గోదావరి. అందుకు కోపించిన దానవులు సప్త గోదావరిని. ''నీళ్లు ఎండిపోయిన నదిలా ఉండుగాక'' అని శపించారు. అప్పుడు తుల్య భాగ మహర్షి మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పక్షాల శాపాల్ని ఉపసంహరింపజేశాడు. పుష్య బహుళ చొల్లంగి అమావాస్య నాడు తుల్యభాగ సముద్రంలో సంగమించే చోట స్నానమాచరిస్తే పాపాలన్నీ తొలగుతాయని శాస్త్రం చెబుతోంది.ఈ చొల్లంగి అమావాస్య ప్రత్యేకతను తెలిపే ఒక పురాణ గాథ ఉంది.దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు మంది కుమార్తెలను ( వీళ్ళే ఇరవై ఏడు నక్షత్రాలుగా చెప్పబడ్డారు). చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడికి రొహిణి (కొన్ని చోట్ల రేవతీ నక్షత్రం అని కూడా అంటారు) . ఈ రోహిణి అంటే మహా ప్రేమ. అందువల్ల ఆమెతోనే ఉంటూ, మిగిలిన భార్యల్ని నిర్లక్ష్యం చేస్తాడు. కుమార్తెల ఫిర్యాదు మేరకు ఎన్నోసార్లు అల్లుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు దక్ష మహారాజు. అయినా కూడా చంద్రుడు తన ధోరణిని మార్చుకోక పోవడంతో అల్లుడిని.."క్షయ వ్యాధికి గురి అవుగాక" అని శపిస్తాడు. శాపవిమోచనం కలిగించగల శక్తి శివుడికి మాత్రమే ఉన్నదని గ్రహించిన చంద్రుడు శివ తపస్సు చేస్తాడు. పుష్యమాసం చివరి రోజైన అమావాస్యనాడు శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు ''దక్షుని శాపం పూర్తిగా తొలగించలేను కానీ, కొంత ఉపశమనం చేయగలనని చెప్పి..మాసంలో సగం రోజులు వృద్ధి అవుతావని వరమిస్తాడు..'' అందుకే చంద్రుడు నెలలో సగం రోజులు క్షయం, మిగిలిన సగం రోజులు తిరిగి వృద్ధి ఉంటాయి..అవే రెండు పక్షాలు.

***


No comments:

Post a Comment

Pages