సత్కర్మేవ జయతే! - అచ్చంగా తెలుగు

 సత్కర్మేవ జయతే!

 (మా జొన్నవాడ కథలు)

 - డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య.   (9490400858)


ఉదయం 8 గంటలు. ఆరోజు ఆదివారం కావడంతో దైనందిన కార్యక్రమాలు ఇంకా అంతటా ప్రారంభమవలేదు. పిల్లలు మాత్రం రోడ్లమీద ఆటలకు వచ్చేశారు. కామాక్షమ్మ దర్శనం కోసం ఆరోజు ఎక్కువ మంది జనం కార్లల్లో, బస్సుల్లో, ఆటోల్లో దిగుతున్నారు. ఒక ఆటో వచ్చి ఆ ఇంటిముందాగింది. "నాన్నా సుజాతక్కొచ్చింది" అంటూ వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ళ రాఘవ లోనకొచ్చి చెప్పేసి మళ్ళీ బయటకు తుర్రుమన్నాడు.

న్యూస్ పేపర్ చదువుతున్న సుబ్బరామయ్య ఒక్క సారి ఉలిక్కిపడ్డాడు. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో వెధవ! సుజాత ఆర్నెల్ల క్రితం పెళ్ళై, చెన్నైలో హాయిగా కాపరం చేసుకుంటున్నది కదా! అని గొణుక్కుంటూ బయటికి వచ్చిన ఆయన..  ఒక్కతే సీరియస్‌గా సూట్‌కేసుతో  ఇంట్లోకి రావడం చూసి ప్రక్కకు తప్పుకుంటూ "అల్లుడుగారు రాలేదా అమ్మా!" అన్న తండ్రి మాటకు  ఏమీ జవాబివ్వకుండానే లోనకు వెళ్ళిపోయింది. "ఎవరూ.." అంటూ సరస్వతమ్మ వంటింట్లోనుంచీ బయటకొచ్చి "నువ్వటే! కాపరానికి దించినప్పుడే నిన్ను చూడ్డం...  ఆర్నెల్ల నుండి ఉత్తరం పత్తరంలేదు. ఫోనూ పాడు లేదు. హటాత్తుగా ఊడిపడ్డావు ఏమైంది? ఆరోగ్యం బాగుందా? అల్లుడు తర్వాత వస్తానన్నాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ సుజాతతోపాటూ గదిలోకి వెళ్ళబోతుండగా "అమ్మా గోల చేయకు..అన్నీ తర్వాత చెప్తాను" అంటూ భళ్ళున తలుపేసుకుంది.

గ్రుడ్లనిండా నీళ్ళు కక్కుకుంటూ "ఏమిటండీ ఇది? ఏమీ మాట్లాడడం లేదు. తలుపేస్కుని కూర్చుంది….గొడవ పడ్డారా ఏమిటి?" అని భర్తవేపు చూసి కొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ బొమ్మలా నిలబడిపోయింది.

"నాకు మాత్రం ఏం తెలుసు. అడుగుదాం. కాసేపాగు. నీ పనులు చూసుకో! దానికేమైనా తినడానికి టిఫిన్ చెయ్యి. నిదానంగా వాకబు చేద్దాం. భయపడకు. సమస్య ఏమిటో తెలుసుకోకుండా గాభరా పడకు" అన్నాడు.

తలుపులు కొట్టగా కొట్టగా ఒంటిగంటకు తీసింది. రాగానే తల్లి వేడి వేడిగా భోజనం వడ్డించింది. తిన్నాక "మళ్ళీ తలుపులు వేసుకోకు. విషయం ఏమిటో చెప్పు. మేమిక్కడ టెన్షంతో ఛస్తున్నాం" అన్న సరస్వతమ్మ మాటకు తలెత్తి "నేను కాపరానికి వెళ్ళడంలేదు" అంది.  అంతే ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు.

సుబ్బరామయ్య ముందుగా తేరుకుని "కారణమేంటో చెప్పమ్మా..అల్లుణ్ణీ బ్రతిమిలాడి గొడవలు రాకుండా చూస్తాం" అనగానే సుజాత చివుక్కున లేచి లోపల పెట్టిన సూట్కేసు బయటకు తెచ్చి "అవసరం లేదు. మనం అనుకున్నంత ఉత్తముడేమీ కాదు మీ అల్లుడు.... పైగా ఆయనకు మొగతనం లేదు. పైగా హింసాత్మక ప్రవృత్తి. నేనొక్క క్షణం అక్కడ ఉండలేను. నేను ఇక్కడ నెల్లూరుకు దగ్గరలో ఉన్న ఒక విలేజ్‌లో టీచరుగా చేరుతున్నాను. ప్రిన్సిపాల్ మా ఫ్రెండే, మీరు ఆయన వచ్చి నా గురించి అడిగితే నేను రాలేదని చెప్పండి. ఆ సహాయం చెయ్యండి చాలు" అంటూ బయటికి వెళ్ళిపోయింది.

"ఏమిటండీ ఇది..మనం ఇప్పుడు విన్నదీ…. చూసిందీ…. నిజమేనా? ఎన్ని కలలు కన్నాం దీని గురించి. మంచి చదువు చెప్పించాం. మంచి అందమైన మొగుణ్ణి కట్టబెట్టాం కదా అనుకుంటే..ఇలా అయిందేమిటండీ..ఇవాళో రేపో శుభవార్త చెప్తుందనుకుంటున్న పిల్ల...అని కళ్ళనీళ్ళతో అడుగుతున్న సరస్వతమ్మకు ఆయన మాత్రం ఏమి జవాబివ్వగలడు? గుడ్ల నీళ్ళు కక్కుకుంటూ ఈజీచైర్‌లో కూర్చుండిపోయాడు.  


"అక్కేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నాది? బావ రాలేదా? అంటూ ప్రశ్నిస్తున్న రాఘవను దగ్గరకు తీసుకుని  "ఒరేయ్..జాగ్రత్తగా విను. అక్క ఇక్కడికి వచ్చిందా అని బావ వచ్చి అడిగితే ఏమీ చెప్పకు. రాలేదని చెప్పు. పొరబాటునకూడా వచ్చిందని చెప్పకు" అంటూ గట్టి జాగ్రత్తలు చెప్పాడు సుబ్బరామయ్య.  రాఘవకు ఇదంతా అర్ధం కాకపోయినా అక్క వచ్చిందని చెబితే ఏదో గొడవ అవుతుందని, చెప్పకూడదని మాత్రం అర్ధమయింది. తండ్రి వేపు అయోమయంగా చూస్తూ..సరేనన్నట్టు తలూపాడు.  

****

మూడో రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సుధాకర్ కారు ఇంటి ముందు ఆగింది. చదువుకుంటున్న రాఘవ, తండ్రి సైగతో గదిలోకి వెళ్ళిపోయాడు. "రండి అల్లుడుగారూ..ఇదేనా రావడం..అమ్మాయి రాలేదా? ఏదైనా క్యాంపు మీద నెల్లూరు వచ్చారా?” అన్న సుబ్బరామయ్య ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పకుండా "సుజాత వచ్చిందా? నిజం చెప్పండి. నాటకాలాడొద్దు!" అని పెద్దగా అన్న మాటలకు సరస్వతమ్మ బయటికి వచ్చి "రండి రండి అల్లుడుగారూ...అమ్మాయెక్కడ?" అన్న ప్రశ్నకు అవాక్కయ్యాడు.

"మీ అమ్మాయి నాతో గొడవపడి వెళ్ళిపోయింది. మీ ఇంటికి వచ్చే ఉంటుంది. నాటకాలు మాని ఎక్కడ ఉందో చెప్పండి?" అని గద్దించాడు.

"అదేమిటల్లుడూ.. గొడవపడ్డం ఏమిటి? ఏమైందసలు? కూర్చోండి" అంటూ సరస్వతమ్మకు కాఫీ తెమ్మని సైగ చేశాడు.

"మీ బోడి మర్యాదలేమీ నాకేం అక్కరలేదు. ముందు సుజాతను పంపించండి చాలు" అని పెద్దగా అరిచాడు. రాఘవ బయటికొచ్చి ఇదంతా చూస్తున్నాడు.

"ఒరేయ్..మీ అక్క వచ్చిందా ఇక్కడికి?" అన్న ప్రశ్నకు ఏడుస్తూ "బావా.. మీతోనే ఉందిగదా చెన్నైలో. మాదగ్గరకు ఎందుకొస్తుంది" అన్నాడు తండ్రివేపు చూసి.

"అందరికి అందరే ఇక్కడ... బాగా నాటకాలాడుతున్నారు. సుజాత విషయం చెప్పకపోతే మీ మీద పోలీసు కంప్లెయింటు ఇవ్వాల్సి ఉంటుంది. నా భార్యను తీసుకొని వెళ్ళే హక్కు నాకుంది. " అన్న మాటకు సుబ్బరామయ్య కోపంగా చూస్తూ.. "మా కూతురును తీసుకురాకుండా, ఏమయిందో చెప్పకుండా.. పైగా మమ్మల్నే బెదిరిస్తావా? నేనే నీమీద పోలీసు స్టేషనులో రిపోర్ట్ చేస్తాను. మాకూతురును  నీతో కాపరానికి పంపి ఆర్నెల్లయింది. ఇంతవరకూ ఒక్క ఫోనూ పాడూ లేదు. ఉత్తరాలకు జవాబు లేదు. ఏమైంది? దీనికి సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఈ ఊరి కరణాన్ని నేను. ఇక్కడ నా పరువు మర్యాద ఏమవుతాయి?" అని నిలదీసేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాక అలా కుర్చీలో కూర్చొండి పోయాడు. 

రెండు నిముషాలు ఆగి.. కాఫీ తాగాక మెల్లిగా  "ఏమీ లేదు మామ గారూ.. అందరి ఇళ్ళల్లో ఉన్న చిన్న చిన్న గొడవలే! ఈ మాత్రానికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు" అని తలపట్టుకున్నాడు.

"అమ్మాయికి ఆర్నెల్లవుతున్నా ఏమీ విశేషం లేదు అల్లుడుగారూ..ఎందుకని" అని స్ట్రెయిట్‌గా నిలదీసిన అత్తగారి మాటలకు కంగు తిని వెంటనే తేరుకుని "ఇప్పట్లో ఒక 2-3 సంవత్సరాలు పిల్లలు వద్దనుకున్నాం అత్తయ్యా!" అన్నాడు.

"ఏమోలే అక్కడ ఏమి జరుగుతోందో ఎవరికి తెలుసు? మరి మా అమ్మాయి మాతో ఫోనులో కూడా ఎందుకు మాట్లాడడంలేదు? మా వుత్తరాలకు ఎందుకు సమాధానం ఇవ్వడంలేదు?" అని నిలదీసింది.

"తనకు అసలు ఖాళీ ఉండడంలేదు. బాగా బిజీ అవడం వల్ల...." అంటూ నసిగాడు.

ఏం బిజీ అయ్యా! భలే చెప్తున్నావే! మీ అమ్మా నాన్నా అక్కడ ఎక్కడో పల్లెటూర్లో ఉంటారు. సుజాతకు ఆఫీసు డ్యూటీ లేదు. నువ్వు ఆఫీసుకెళ్ళాక ఏం చేస్తుంది? దానికి అసలు ఫోను అందుబాటులో ఉందా లేదా? మేము ఫోన్ చేస్తే..లైను కలవదు. అసలు మేమే వద్దాం అనుకున్నాం.ఇక్కడ వ్యవసాయం పనుల వల్ల రాలేదు"

"అయితే ఇక్కడికి రాలేదంటారు" అంటూ లేస్తుండగా..

"చూడు బాబూ.. వచ్చే ఆదివారం సుజాతను తీసుకొచ్చి చూపించకపోతే బాగోదు. మేమే చెన్నై వచ్చి మీ ఆఫీసుకు కూడా వచ్చి గొడవ చేస్తాం " అన్న మామ గారి మాటలకు  అనవసరంగా ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయాను అనుకుంటూ బయటికి వచ్చేశాడు. అత్తా మామా కారు దగ్గరకు కూడా రాకపోయేసరికి ఎక్కడో ఏదొ వ్యవహారం జరిగిందని అర్ధమయింది.

సుధాకరు బయటికొచ్చి కారు స్టార్ట్ చెయ్యబోతుండగా...కారు దగ్గరకు వచ్చిన సుజాత క్లాస్‌మేట్, మునుసబు కొడుకు  పద్మనాభం "హలో..బాగున్నారా? అదేమిటి? సుజాతను మీతో తీసుకెళ్ళడంలేదా?" అని అడిగాడు. ఏమీ చెప్పకుండా కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కారు గూడూరు దాటుతుండగా పద్మనాభం అన్న మాట మళ్ళీ గుర్తొచ్చింది. అంటే వాడి మాటలకర్ధం.. ఆల్రెడీ సుజాత జొన్నవాడకు వచ్చిందనా? లేక కార్లో లేకపోవడం చూసి అలా అడిగాడా? అంతా తికమకగా ఉంది.

****

"ఒరేయ్ సుధా..నువ్వేనా?"

"ఎవరు మాట్లాడేది?"

"నేనురా..నాగశేఖరును"

"హా..చెప్పు..చెప్పు"

"అవునూ..సుజాత తోటపల్లిగూడురులో ఉందేమిటి? మీ అత్తగారు వాళ్ళు జొన్నవాడ కదా ఉండేది?"

"ఏవూరన్నావ్?"

"తోటపల్లి గూడూరు. సుజాత అక్కడ టీచరుగా పనిచేస్తోంది స్కూల్లో..ఏమైంది? మీ అత్తగారు అక్కడికి మారారా?"

సుధాకరుకు స్టొరీ మొత్తం అర్ధమయింది. సుజాతను అక్కడ దాచారన్న మాట.

- రెండురోజుల అనంతరం ఉదయం 11 గంటలకు.. సుధాకరు ఊళ్ళొ ఎంక్వయిరీ చేసి స్కూల్ ముందు కారాపాడు.

దూరం నుండి ఎర్ర కారు రావడం గమనించిన సుజాత వెంటనే ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళి విషయం చెప్పింది. వెంటనే ఒక ఏభై యేళ్ళు పైబడ్డ పెద్దావిడను పిల్చి ఏమి చెయ్యాలో చెప్పి, సుజాతను లోపల్ బాత్రూంలో ఉండమని చెప్పి బయట తాళం వేసింది. సుధాకరు కారు లోపల పార్క్ చేసి వచ్చాడు.

"గుడ్ మార్నింగ్ మేడం! అంటూ ప్రిన్సిపాల్ గదిలోకి  వచ్చాడు."

"వెరీ గుడ్మార్నింగ్. మీ పిల్లల అడ్మిషన్ కోసమా?"

"కాదు. మీ స్కూల్లో పనిచేసే సుజాత నా భార్య!"

"ఐ.సీ.మీరు ఇంత యంగ్‌గా ఉన్నారు. తనేమో.."అని ఆగి "నాకెందుకులెండి. లవ్ ఈజ్ బ్లైండ్. తను విడిపోయానని చెప్పింది"

"లేదు మేడం ఒక్కసారి పిలవండి మాట్లాడాలి."

"ఒకే అని బెల్ కొట్టి, ప్యూన్‌తో సుజాతగారిని ఒకసారి నేను వెంటనే రమ్మన్నానని చెప్పండి"

ఒక యేభై యేళ్ళ ఆవిడ లోపలికి వచ్చింది.

"మేడం.. పిలిచారట"

"అవును..రా..కూర్చో. ఎవరొచ్చారో చూడు. నీ భర్త. నీతో ఏమీ తగాదాలు లేవు అంటున్నాడు. ఇంత చిన్న కుర్రాడిని పడేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు సుజాతా..తగాదాలు వద్దు హాయిగా కాపురం చేసుకో! ఏమంటారండీ..అని సుధాకర్ వేపు తిరగ్గానే.

"మేడం ఈవిడ పేరు సుజాతా!" అని దిమ్మెరపోయాడు.

"అవును. సుజాత నీ భార్య అన్నావు కదా.. ఇక్కడ మాట్లాడుతారా? చాటుకు తీసుకెళ్తారా?"

"నో.. ఈవిడకాదు..అన్నాడు పెద్దగా.

"అదేంటయ్యా.. అలా అంటావు. సుజాత టీచర్ అంటే తనే..అంటే ఎవరో రాంగ్ ఇన్‌ఫర్మేషన్ ఇచ్చారు మీకు. ఇక్కడ ఈవిడే సుజాత"

వచ్చినావిడ తేరుకుని నవ్వుతూ "మేడం..నేను వెళ్ళొచ్చా" అని అనడంతో "యెస్" అనింది.    

సుధాకరుకు తల కొట్టేసినట్టయింది. ఏమీ మాట్లాడలేక లేచి "వస్తానండీ! అని వెళ్ళిపోయాడు.

కారు దూరంగా పార్క్ చేసి అక్కడ చెట్ల చాటున నిలబడ్డాడు.

పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఆరోజు సుజాతను మేడ మీద తన ఇంట్లోనే ఉంచుకుంది.

అందరు టీచర్లు వెళ్ళిపోయినా సుజాత రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో ఇంతకు  ముందు సుజాత అన్న పెద్దావిడ సుధాకరుకు దగ్గరగా వచ్చి "మీతో రావడం నాకు ఇష్టమే! మీరు భర్తగా ఉంటానంటే చెప్పండి. మీతో వస్తా. అంటూ నవ్వేసరికి. "ఏయ్. దూరంగా వెళ్ళు" అని ఛీదరించుకున్నాడు.

****

సుజాత విడాకులకు నోటీసు ఇస్తే సుధాకర్ అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. లాయర్ ఫోన్ చేసి నీ బండారను కోర్టులో బయటపెడతాము ఇంకా గృహ హింస, హెరాస్‌మెంట్ కేసు పెడతాము అని గట్టిగా బెదిరించేసరికి దారికొచ్చాడు.

సుజాతను ప్రిన్సిపాల్ తమ్ముడు  సుధీర్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటాననటంతో పెద్దలందరి అనుమతితో పెళ్ళి చేసుకుంది. 

****

పండంటి బిడ్డతో సుధీర్ సుజాతలు తిరుమలకి వెళ్ళి వస్తుండగా తిరుపతి స్టేషన్ ముందు సుధాకర్ పిచ్చివాడిలా అడుక్కుంటూ కనిపించడంతో అవాక్కయి, అతణ్ణి సుధీర్‌కు చూపించింది. చేసిన పాపం అనుభవించక తప్పుతుందా? అనేసరికి, మా జొన్నవాడ కామాక్షమ్మతల్లి అసలొప్పుకోదు, శిక్షించి తీరుతుంది... అని పెద్దగా నవ్వేసింది... ఎందుకో తెలియకుండా కన్నీళ్ళూ కారాయి.

-0o0-


No comments:

Post a Comment

Pages