నెత్తుటి పువ్వు - 39 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 39 

మహీధర శేషారత్నం 


 నాగరాజుకి కాస్త ఊపిరాడినట్టయింది, మళ్ళీ అప్పుడప్పుడు సరోజ దగ్గరకు వెళ్ళడం మొదలెట్టాడు. పూచిన పూల చెట్టులా ఉన్న సరోజని ఎంతసేపు చూసినా నాగరాజుకి తనివి తీరటంలేదు, మధ్య మధ్య శంకరం వార్నింగు లిస్తున్నాడు.

ఒకరోజు శంకరం నాగరాజుకి కబురుపెట్టాడు. సరోజని, పార్వతిని కూడా పిలిచి చిన్న విషయం మాట్లాడాలన్నాడు.

నలుగురూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే శంకరం వీధి తలుపు తీసి వచ్చాడు.

“సరోజా! నా మీద నమ్మకం ఉందా?” అన్నాడు. 

అది దేనికి అడిగాడో తెలియక అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. 

“నేను ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించాను. పార్వతి నీ ఇష్టం, సరోజ ఇష్టం ఇందులో ముఖ్యం. 

ఒక్క క్షణం ఆగాడు. 

పార్వతి, సరోజ అయోమయంగా చూసారు. 

నాగరాజుకీ అర్థం కాలేదు.

“సమస్యేమిటి అన్నయ్యా!” అంది సరోజ అయోమయంగా నీకు, నాగరాజుకు ఉన్న సంబంధం నైతికమూ కాదు, చట్ట బద్దమూ కాదు. అది నీ జీవితానికి గౌరవము కాదు.”

నాగరాజు సిగ్గుతో, అవమానంతో తలొంచుకున్నాడు. అలా అనడం, ముఖ్యంగా అక్కడ పార్వతి ఉండడం అతడికి ఇబ్బందిగా అనిపిచింది. శంకరం అది అర్థం చేసుకున్నాడు.

“సారీ రా! రాజూ! ఈ విషయం తప్పకుండా పార్వతికి తెలియాల్సిన విషయం. 

“నాకు తోచిన సలహా చెప్తాను. ఆలోచించుకు చెప్పండి అందరూ. గంభీరంగా అన్నాడు. 

“నాన్చక తొందరగా చెప్పండి బాబూ” విసురుగా అంది పార్వతి.

ఆ కంగారే వద్దు, సరోజా! మనం మాకు తెలిసిన చిన్న ఆస్పత్రికి వెడదాం, ఆస్పత్రి చిన్నదైనా డాక్టర్ చాలా మంచావిడ. ఆవిడతో ఏం మాట్లాడాలో అది నేను మాట్లాడతాను. డెలివరీ టైములో ఫారాలలో తల్లి పేరు పార్వతి, తండ్రి పేరు శంకరం. సంతకం నేను పెడతాను.” సరోజ అవాక్కయింది.

“అన్నయ్యా! అంది, ఇది అన్యాయం ఇంతకాలం నేను ఎవరూ లేని అనాధలా బతికాను, నాకంటూ ఒక నీడా, గూడూ ఏర్పడుతుంటే నాబిడ్డకి నేనేం కానా!” ఆవేశంగా అంది.

తొందరపడకు సరోజా! రేపు నీకు బిడ్డ పుట్టాక నీ స్థానమేమిటి? మీరు ఇద్దరూ భార్యా భర్తలనుకున్నా చట్టం అందు కంగీకరించదు. నీకు ఆ పేరు ఇవ్వదు. పుట్టిన బిడ్డకేం చెప్తారు? నిజం తెలుస్తే లక్ష్మి పరిస్థితి ఏమిటి? నాగరాజు పరిస్థితి ఏమిటి? ఈ సంబంధం ఎన్నాళ్ళు కొనసాగ గలుగుతుంది.

నేను తల్లి పిల్లలను వేరుచేసే దుర్మార్గుణ్ణి కాను. నువ్వు మాతోనే ఉంటావు. పాలిచ్చి పెంచుకుంటావు. అయితే పార్వతి ఎక్కువ చేరతీస్తుంది. పుట్టినబిడ్డ మాకు పెంపుడు బిడ్డ అన్న మాట. వాడో, అదో పార్వతిని అమ్మా అని నిన్ను అత్తా అనో, పిన్నీ అనో అంటారు. నేను కాని పార్వతికాని వాడి స్థానాన్ని మాకు పిల్లలు పుట్టినా మార్చం.

“ఏమంటావు పార్వతీ!” 

పార్వతి ముఖం సంతోషంలో వికసించింది.

“పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు పుడతారని అందరూ అంటూంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది!

సరోజ ముఖం మ్లానమైంది. ఆ అమ్మాయి మనసు ఇది అన్యాయం అని ఆక్రోశిస్తోంది. నాగరాజుకి కాస్త ఉపశమనగా అనిపించింది.

సరోజా! అర్థం చేసుకో. నీ బిడ్డ, నువ్వు మాతోటే ఉంటారు. నువ్వు ఏదైనా నేర్చుకుని సంపాదనలో పడడానికి పార్వతి తోడ్పాటుంటుంది. నేను కాని రాజుకాని పెద్ద ధనవంతులం కాము. నీ ఆదాయం నీకు ఉండి తీరాలి. కాస్త ఆరోగ్యం సెటిలయి ఏడాది, రెండేళ్ళు గడిచాక నిన్ను ఎవరైనా మంచివాణ్ణి చూసి పెళ్ళిచేస్తా, కష్టమైనా అసాధ్యం కాదు, తాపీగా చెప్పాడు శంకరం.

సరోజ విసురుగా లేచింది. 'మీ అందరి సమస్యలూ తీరతాయి. వదినకి అమ్మ అనే పిలుపొస్తుంది. రాజుకి వాళ్ళావిడ వస్తుంది. నాకు మళ్ళీ పెళ్ళా! రాజుబాబే నా మొగుడు. ఏమనుకుంటున్నారు? నా గురించి గట్టిగా అరిచింది.

శంకరం చెయ్యిపట్టి ఆపాడు.

“ఏమీ అనుకోవడంలేదు. మీరు ఇద్దరూ చేసింది తప్పు. నీ పాత్ర ఏం లేదని నేను అనుకోను, ఎందుకంటే నువ్వు ఛీ కొడితే మీద పడేంత నీచుడు కాడు రాజు. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టే సంబంధం ఏర్పడింది. నిజమా? కాదా!”

సరోజ ఏడుస్తూ కూలబడింది కుర్చీలో నాగరాజు ప్రాణం విలవిలలాడింది. 

తన తప్పు ఉంది కదా!

“శంకరం నా తప్పు ఉంది. నిజానికి సరోజ వయసులో నా కంటే చాలా చిన్నది, లోకజ్ఞానం సంగతి అలా ఉంటే ఎవరూ లేనిది. అందుకని నామీద వాలిపోయింది. నిజానికి సంవత్సరం వరకు మా మధ్య ఏ సంబంధము లేదు. నేనే తెలివి తక్కువగా విడిగా ఉంచాను. తనని ఏ స్త్రీలకు సంబంధించిన శరణాలయాలలో చేరిస్తే బాగుండేది. నా తప్పులేదని నేను దాటుకోలేను.” నిర్లిప్తంగా అన్నాడు.

నీ తప్పులేదని నేనూ అనటం లేదు. పైగా నిన్ను చాలాసార్లు హెచ్చరించాను కూడా. ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేము. ఒక చిక్కుముడి పడింది. ఒడుపుగా విప్పుకుంటే అందరికీ మంచిది.

శంకరం తీవ్రంగా అన్నాడు. 

శంకరం పార్వతివైపు తిరిగాడు.

“ముఖ్యంగా నువ్వు చెప్పు పార్వతీ! ఎందుకంటే నువ్వు నా జీవితంలో భాగానివి. నీ తర్వాతే నాకు ఎవరైనా! నా మీద నీకు నమ్మకం ఉందా? సరోజ నన్ను అన్నయ్యా! అని వరస కలిపి కాకుండా శంకరంగారూ అనో సార్ అనో పిలిస్తే నేను ఈ విషయంలో అసలు తలదూర్చే వాడిని కాదు, నాకు నీ విషయం ముఖ్యం చెప్పు ఏ సంకోచం లేకుండా చెప్పు. మళ్ళీ మనిద్దరి మధ్య గొడవలు రాకూడదు.” గట్టిగా అన్నాడు.

“మీ నిర్ణయమేదైనా నాకు ఇష్టమే. నేను గొడవ పెట్టుకోను” నెమ్మదిగా స్థిరంగా అంది పార్వతి. చూడు సరోజా! మీ ఇద్దరి సంగతి మా ఇద్దరికీ మొదట్నుంచీ తెలుసు. మా నీడలో నీకు కొంత రక్షణ ఉంటుంది.

మీరిద్దరూ చేసిన తప్పుడు పనికి మీకు పుట్టబోయే పాపో, బాబో బాధపడకూడదు. నిజానికి నాకిది అనవసరమైన బర్డనే కాని ఎంతో మందికి సహాయం చేసిన నాగరాజు ఒక్కనీ విషయంలోనే తప్పుచేసాడు. నాగరాజు ఎల్లకాలం నీతోడు కాలేడు. ప్రేమలుంటే మనసులో దాచుకోండి. ఇష్టమైతే మళ్ళీ పెళ్ళి చేసుకో. లేకపోతే మా ఇంట్లో పక్క పోర్షన్లో ఉండు. నేను మామూలు సంసారిని. పాపైనా, బాబైనా నీవాడే. మేం వేరుచేయము. అయితే మేము అమ్మా నాన్నలుగా మమ్మల్ని అలా పిలిచినందుకు చైల్డ్ బాధ్యత కంప్లీట్గా మాదే, మాకు మళ్ళీ పిల్లలు పుట్టినాసరే. నువ్వూ, రాజు గట్టిగా ఆలోచించుకు నిర్ణయం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ మాటలు మారిస్తే నేను మళ్ళీ చేరదీసే ఆలోచనే చెయ్యను. మీ గదిలో మీరిద్దరూ ఆలోచించుకోండి. తొందరలేదు, రెండు మూడు రోజుల్లో చెప్పండి. నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కాని డెలివరీ తరువాత నాలుగు నెలలవరకే నీకు ఇక్కడ రక్షణ ఉంటుంది. నా నిర్ణయాన్ని ఆమోదిస్తే ఎప్పటికీ మాతోనే ఉంటావు. నువ్వు చెప్పినా, చెప్పకపోయినా నీ అనుబంధం బిడ్డతో మాత్రమే గట్టిగా నిలబడుతుంది. నీకూ చెబుతున్నా రాజూ! మీ నిర్ణయాన్నిబట్టి నా నిర్ణయం ఉంటుంది. నేను ఇంక కలగచేసుకోను.”

రా! పార్వతీ! అంటూ బెడ్ రూంలోకి వెళ్ళిపోయాడు. రెండు నిమిషాలు అలా కూర్చొని సరోజ, నాగరాజు నీరసంగా తమ గదిలోకి వెళ్ళిపోయారు.

సరోజ ఏడుస్తూ నాగరాజు ఒళ్ళో వాలిపోయింది. నాగరాజు నిస్తేజంగా గోడకానుకుని కూర్చుండిపోయాడు.

*****

మర్నాడు మళ్ళీ నాగరాజు సరోజ దగ్గరకు వచ్చాడు. శంకరం ఆలోచన నాగరాజుకి బాగానే తోచింది. అదే సరోజతో చెప్పడానికి వచ్చాడు.

సరోజ ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు వాచి ఉన్నాయి. నాగరాజుకేసి నిర్లిప్తంగా చూసింది.

నాగరాజు సరోజని పొదివి పట్టుకుని మంచం దగ్గరకు తీసుకెళ్ళి కూచోపెట్టాడు. తను పక్కనే కూచున్నాడు. నుదుటిమీద ముద్దుపెట్టుకున్నాడు. పొట్టమీద ముద్దు పెట్టుకున్నాడు. తను తెచ్చిన కమలాలలో ఒక పండు ఒలిచి ఒక్కో తొన తినిపించాడు. కాస్త సరోజ మూడ్ మార్చడానికి ప్రయత్నించాడు.

“సరోజా! శంకరం చెప్పింది బాగానే ఉంది ఆలోచించు, అక్రమ సంబంధానికి పుట్టినబిడ్డ అంటే మన బిడ్డకి మాత్రం సంఘంలో ఏమాత్రం విలువ ఉంటుంది. తనకి పిల్లలు పుట్టకపోవడంవల్లే పార్వతి ఈ ప్రతిపాదనకి ఒప్పుకుంది. లేకపోతే ఏ సంబంధంలేని బిడ్డని పెంచడానికి ఏ ఆడది ఒప్పుకుంటుంది. నేను ఆ బిడ్డ సంరక్షణ గాలికి వదిలెయ్యను. శంకరం నా మిత్రుడు, భార్యాభర్త లిద్దరికీ ఇది తెలిసిన విషయమే. నేను తెలివి తక్కువ వెధవని. ఎన్నో కేసులు చూస్తూ కూడా నీ వ్యామోహంలో పడిపోయాను. తప్పునాదే, నీకు ఇష్టమైతే మళ్ళీ పెళ్ళి చేస్తాడు శంకరం.”

“నా గురించి ఎంత చులకనగా అంచనా వేసావు?”

“ఇందులో చులకన చేయడం ఏంలేదు. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు భర్తకు విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళున్నారు. మనది చట్టబద్ధం కాదు, కనుక విడాకుల విషయం సంభవించదు.” అనునయించాడు.

“మరి ఆరోజు లక్ష్మికి విడాకులియ్యమంటే అంత కోపం వచ్చిందే!” 

లక్ష్మి విషయం వేరు, నీ విషయం వేరు... 

నాగరాజు మాటపూర్తి కాకుండానే గయ్యిమంది సరోజ “ఏమిటి వేరూ? చెట్టూ?”

“నిన్ను ప్రేమించినవాడు మోసం చేసాడు. వదిలేసి పారిపోయాడు. ఈ విషయం చెప్పి అంగీకరించే వాడికే ఇచ్చి చేస్తాం.”

“ఇంక మాట్లాడకు తలబద్ధలు కొట్టుకొంటాను. వెళ్ళిపో, అమ్మ ఏం భయపడిందో అదే జరుగుతోంది. కళ్ళ నీళ్ళు వచ్చాయి సరోజకి.

నాగరాజు నిస్సహాయుడై పోయాడు. సరోజని పొదువుకున్నాడు. 

“నేను వెధవని, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. కళ్ళు మూసుకుపోయాయి.” 

అలా బాధగా ఒకరినొకరు పొదువు కూర్చుండి పోయారు ఎంతోసేపు.

*****


No comments:

Post a Comment

Pages