యోగం - అచ్చంగా తెలుగు

 యోగం

G.S.S.కళ్యాణి.గోవిందరాజు తన నాలుగేళ్ల కుమారుడు అశ్విన్ ని ఒళ్ళో కూర్చోబెట్టుని పట్నంనుండీ తమ సొంత ఊరైన శ్రీపల్లెకి బస్సులో వెడుతున్నాడు. చల్ల గాలికి నిద్రపోయాడు అశ్విన్. శ్రీపల్లె రావడానికి ఇంకా కనీసం రెండు గంటల ప్రయాణం ఉంది.

కాలక్షేపం కోసం తన పక్క సీటులోని వ్యక్తిని, "మీరుకూడా శ్రీపల్లెకేనా?", అంటూ పలకరించాడు గోవిందరాజు.

"అవును!", చెప్పాడా వ్యక్తి.

"మిమ్మల్ని ఎప్పుడూ మా ఊళ్ళో చూడలేదే? నా పేరు గోవిందరాజు. మీ పేరూ??", ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని అడిగాడు గోవిందరాజు.

"నా పేరు శంకరయ్య! నేను జ్యోతిష్య శాస్త్రజ్ఞుడిని. మీ ఊళ్ళోని ప్రకాశంగారు నాకు పరిచయం. వారికి నాతో అవసరముందని చెప్పి నన్ను ఒకసారి వాళ్ళింటికి రమన్నారు. అందుకే వస్తున్నాను!", చెప్పాడు శంకరయ్య.

"ప్రకాశంగారు నాకు తెలుసులెండి! ఆయనకి జాతకాలన్నా, జ్యోతిష్యం చెప్పించుకోవడమన్నా మహా ఇష్టం! నాకటువంటి నమ్మకాలేంలేవులెండి!", అన్నాడు గోవిందరాజు కాస్త వెటకారంగా నవ్వుతూ.

శంకరయ్య మనసు చివుక్కుమంది.

"మమ్మల్ని అంత తీసిపారెయ్యకండి గోవిందరాజుగారూ! జ్యోతిష్యశాస్త్రం సరిగ్గా తెలిసినవాళ్ళు భవిష్యత్తును కచ్చితంగా అంచనా వెయ్యగలరు!! మీ ఒళ్ళో ఉన్న పిల్లాడి ముఖం చూసి చెబుతున్నా! వాడు పెద్దవాడయ్యాక యోగి అవుతాడు!! చూస్తూ ఉండండి!", అన్నాడు శంకరయ్య గంభీరంగా.

"వీడా? యోగి అవుతాడా?? అది అసాధ్యంలెండి! ముందు నా గురించి చెప్పండి! నేను ఎప్పటినుంచో మా ఊళ్ళో పలుకుబడి సంపాదించాలని కిందా మీదా పడుతున్నాను! మరి నాకు ఏదో ఒకరోజు పెద్ద పేరు వస్తుందని అంటారా? చెప్పండి చూద్దాం!", అంటూ తనకు సంబంధించిన వివరాలు శంకరయ్యకు చెప్పాడు గోవిందరాజు.

"దేనికైనా యోగముండాలండీ! అది కానీ ఉంటే, ఏ పనైనా ఇట్టే సాధ్యమవుతుంది! నా పరిజ్ఞానం ప్రకారం మీకు పేరుప్రతిష్టలు వచ్చే యోగం లేదు! అటువంటి ఆశలుంటే దయచేసి వదులుకోండి!", తెగేసి చెప్పేశాడు శంకరయ్య.

గోవిందరాజుకు శంకరయ్య మీద కోపం వచ్చింది.

"అందుకే నాకు ఈ జాతకాలన్నా జ్యోతిష్యమన్నా గిట్టదు! మీరు చెప్పినది నిజం కాదని నేను ఇప్పుడే నిరూపించగలను. ఎందుకంటే మా ఊళ్ళో నాకు ఇప్పటికే పలుకుబడి ఉంది తెలుసా? నేను ఏదో ఒకరోజు, ఇంకా బాగా పేరు సంపాదించి, ఆ తర్వాత మీ ఊరు వచ్చి మరీ మిమ్మల్ని కలుస్తాను! గుర్తుంచుకోండి!", అన్నాడు గోవిందరాజు ఆవేశంగా.

అంతలో ఒక గొర్రెల మంద బస్సుకు అడ్డుగా రావడంతో బస్సు ఆగింది.

"చూడండి గోవిందరాజుగారూ! నా మీద కోపగించుకుంటే లాభమేమీ ఉండదండీ! అంతా యోగం మీదే ఆధారపడి ఉంది! అదుగో! ఆ గొర్రెలను కాస్తున్న వ్యక్తి మీకు తెలుసా?", అడిగాడు శంకరయ్య.

"తెలియకేం? మా ఊరి పొలిమేరకు వచ్చేశాముగా? వాడు గొర్రెల గొర్రప్ప. అప్పుడప్పుడూ డబ్బుల కోసం నా దగ్గరకొస్తూ ఉంటాడు!", చెప్పాడు గోవిందరాజు.

"అతడికి పేరుప్రతిష్టలు వచ్చే యోగం ఉంది! నా మాట నమ్మండి!", అన్నాడు శంకరయ్య.

"నువ్వు భలేవాడివయ్యా! అసలు నీకు నిజంగా జ్యోతిష్యశాస్త్రం తెలుసా? గొర్రప్పకు పేరు రావడమేమిటీ? వాడికన్నా మా అశ్విన్ కే ఎక్కువ విషయాలు తెలుసు! ఆ గొర్రప్పగాడిని నేను పిలిచి ఘనంగా సన్మానం చేసినా వాడికి ఎటువంటి గుర్తింపు ఈ జన్మకు రాదని నేను కుండ బద్దలుకొట్టి మరీ చెప్పగలను!”, అన్నాడు గోవిందరాజు హేళనగా.

"అబ్బే! నేను చెప్పేది కొట్టిపారెయ్యటానికి నావి ఒట్టి మాటలు కాదండీ..!", అంటూ ఏదో వివరించబోయాడు శంకరయ్య.

అందుకు గోవిందరాజు అడ్డు చెబుతూ,"ఒక్క క్షణం ఆగండి!", అని "ఒరేయ్ గొర్రప్పా! ఓమాటు ఇలారారా!", అంటూ గొర్రప్పను రమ్మని కేకవేశాడు.

"వత్తున్నా బాబుగారూ!", అంటూ గొర్రప్ప గోవిందరాజున్న బస్సు వద్దకు పరుగు పరుగున వచ్చాడు.

"ఒరేయ్ గొర్రప్పా! ఈ సాయంత్రం మన ఊళ్ళో రచ్చబండ దగ్గర నీకు సన్మానంరా! నీ భార్యను తీసుకుని సరిగ్గా ఆరుగంటలకు అక్కడికి వచ్చెయ్!", అన్నాడు గోవిందరాజు.

"అట్టాగే బాబుగారూ!", అంటూ అయోమయంగా బుర్రగోక్కుంటూ వెళ్ళిపోయాడు గొర్రప్ప.

శంకరయ్యను చూస్తూ మీసం మెలేశాడు గోవిందరాజు. చిరునవ్వును సమాధానంగా చెప్పి బస్సు దిగి తన దారిన వెళ్ళిపోయాడు శంకరయ్య. గొర్రప్ప గొర్రెలమందను మేపి ఇంటికి చేరుకున్నాక తనకు సన్మానం జరగబోతోందని తన భార్య  బంగారికి చెప్పాడు.

"ఏందయ్యా నువ్వనేదీ?! నీకు సన్మానమేమిటీ? నువ్వు సరిగ్గానే ఇన్నావా?", ఆశ్చర్యపోతూ గొర్రప్పను అడిగింది బంగారి.

"అవునే! అయ్యగారు ఎందుకట్టా అన్నారో ఏమో తెల్దు! నేను పోకపోతే ఆయనకు నా మీద కోపమొస్తుంది. మనకు ఎప్పుడైనా డబ్బు అవసరపడితే మనం ఆయన్నేగా అడగాలీ? ఆయన చెప్పిందేదో మాట్టాడకుండా సేసేస్తే పనైపోద్ది! ఏమంటావ్?", అన్నాడు గొర్రప్ప.

"అవునయ్యోయ్! నువ్వంటున్నది నిజమే! మరి తొరగా తయారవ్వూ..!", అంది బంగారి.

గొర్రప్పకు గోవిందరాజు సన్మానం చెయ్యబోతున్నాడన్న విషయం గ్రామమంతా పాకింది.

ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ, 'ఆఁ! ఆ గొర్రప్పగాడేమన్నా ఘనుడా? వాడికి సన్మానమేమిటీ? దానికి వెళ్లే పిచ్చోళ్ళు ఎవరుంటారూ? ఎలాగో ఎవడూ రాడు! కాబట్టి అసలా సన్మానం ఎందుకోసం చేస్తున్నారో నేనొక్కడినే వెళ్లి చూసొస్తా!', అని అనుకుని, జనమంతా ఒకరికి తెలియకుండా ఒకరు సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు రచ్చబండ వద్దకు చేరుకున్నారు. దాదాపు ఊరిజనమంతా గొర్రప్ప సన్మానానికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు గోవిందరాజు.

అప్పుడు గోవిందరాజు గొర్రప్పను పిలిచి, అతడికి ఒక గొంగళి కప్పి, ఒక ఇరవై రూపాయలు గొర్రప్ప చేతిలో పెడుతూ, "మన ఊరిలో గొర్రెలన్నీ ఏ ఆరోగ్య సమస్యలూ లేకుండా హాయిగా ఉన్నాయంటే అందుకు కారణం మన గొర్రప్పే! అతడికి పనిపట్ల ఉన్న అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే! అతడి సేవకు ఒక గుర్తింపును ఇవ్వడానికే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాను!", అన్నాడు గోవిందరాజు.

గ్రామప్రజలంతా గొర్రప్ప వంక మెచ్చుకోలుగా చూస్తూ, "గత ముప్పై ఏళ్లుగా మన ఊళ్ళో గొర్రెలను ప్రతిరోజూ పొద్దునే ఊరి అవతలకు తీసుకెళ్లి, వాటిని మేపి తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్న గొర్రప్ప గొప్పతనాన్ని మనమిన్నాళ్లూ తెలుసుకోలేకపోయాం! ఏదేమైనా ఇవాళ గోవిందరాజుగారు చేసినది చాలా మంచి పని!", అని అనుకున్నారు. 

సన్మానకార్యక్రమం తర్వాత గొర్రప్ప ఇంటికి వెళ్ళిపోయాడు. రెండు వారాలు గడిచాయి. ఊళ్ళో జనాలు ఎవరిపాటికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు.

'అందరూ ఆ గొర్రప్పగాడిని మర్చిపోయినట్లే! అయినా వాడికి పేరు రావడమేమిటీ?', అని నవ్వుకున్నాడు గోవిందరాజు.

ఒకరోజు మధ్యాహ్నం శ్రీపల్లె గ్రామానికి పట్నంనుండీ ముగ్గురు పెద్దమనుషులు వచ్చారు. వారికి సాదర ఆహ్వానం పలికి వారు వచ్చిన పనేమిటని అడిగాడు శ్రీపల్లె గ్రామపెద్ద. వాళ్ళేం సమాధానమిస్తారోనని వారి చుట్టూ గుమిగూడి ఆసక్తిగా వినసాగారు గ్రామస్థులు.

"మీ గ్రామం వెనుకబడిన గ్రామాల్లో ఒకటిగా మేము గుర్తించాము. పెద్దగా వసతులులేని మీ గ్రామంలో ఎవరైనా తమ స్వయంకృషితో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నట్లైతే వారిని సత్కరించి ప్రోత్సహించాలని అనుకుంటున్నాము. అలాంటివాళ్ళెవరైనా మీ ఊళ్ళో ఉన్నారా?", అని గ్రామ పెద్దను అడిగాడు ఆ వచ్చిన పెద్దమనుషుల్లో ఒక వ్యక్తి.   

ఎవరి పేరు చెప్పాలా అని గ్రామపెద్ద దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే గోవిందరాజు తన పేరు చెప్పమన్నట్లు సైగ చేశాడు.

" ఆఁ! లేకేం? మా ఊళ్ళో తన స్వయంకృషితో పైకి వస్తున్న వాడు ఒకడున్నాడు! వాడే గొర్రప్ప! మా ఊళ్ళో మర్యాదస్తుల్లో ఒకడైన గోవిందరాజంతటివాడి చేత మొన్నీమధ్యే సన్మానాన్ని కూడా అందుకున్నాడు గొర్రప్ప! వాడిని సత్కరించండి! ఏం గోవిందరాజు గారూ? మీరంటున్నది అదేగా?", అన్నాడు గ్రామపెద్ద గోవిందరాజు వంక చూసి నవ్వుతూ.

"మన గోవిందరాజుగారిది మంచి మనసు. ఆయనేమంటూ గొర్రప్పకు సన్మానం చేశారోకానీ ఇప్పుడు మన గొర్రప్ప పేరు పట్నంలో అందరికీ తెలిసిపోతుంది!", అని తెగ సంబరపడిపోయారు శ్రీపల్లె గ్రామస్థులు.

తాను తలచినదొకటి అక్కడ అయ్యింది వేరొకటీ అయ్యేసరికి మారుమాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు గోవిందరాజు. పట్నంలో గొర్రప్పకు ఘనంగా సత్కారం జరిగింది. ఆ తర్వాత గొర్రప్పను ప్రసంగించమని అన్నారు సన్మానం ఏర్పాటు చేసిన పెద్దలు.

"నాకేటీ తెలీదు! నేనేమంత గొప్పోడ్ని కాదు! ", అన్నాడు గొర్రప్ప మొహమాటంగా.

"గొర్రప్పది ఎంత వినయం! ఎంత విధేయత!! ఎంత గొప్పవాడైనా తనకేమీ తెలియదనగలిగే నిరాడంబరుడు!", అని ఆ కార్యక్రమానికి వచ్చినవారంతా గొర్రప్పను కొనియాడారు!

సంవత్సరాలు గడిచే కొద్దీ గొర్రప్ప గురించి శ్రీపల్లె చుట్టుపక్కలనున్న అన్ని ఊళ్లకూ తెలిసింది. ఎందరో గ్రామస్థులు గొర్రెలను కాసుకోవడంలో మెళకువలూ, వాటి ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలకూ సంబంధించిన సలహాల కోసం తమ గొర్రెలకాపరులను గొర్రప్ప వద్దకు పంపేవారు. ఇదంతా చూస్తున్న గోవిందరాజు, ఒకప్పుడు శంకరయ్య  తనకు చెప్పిన మాట నిజమవుతోందని గ్రహించి అమితాశ్చర్యం చెందాడు!

పాతికేళ్ళు గడిచిపోయాయి. గొర్రప్ప కాలం చేశాడు. శ్రీపల్లె ప్రధాన కూడలిలో గొర్రప్ప కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గ్రామస్థులు. అనుకోకుండా ఒకరోజు ఏదో పనిమీద వెడుతున్న గోవిందరాజుకు అప్పుడే శ్రీపల్లెలో బస్సు దిగుతున్న శంకరయ్య కనిపించాడు.

గోవిందరాజు శంకరయ్య వద్దకు వెళ్లి, "శంకరయ్య గారూ! గొర్రప్ప విషయంలోనూ, నా విషయంలోనూ మీరన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి! గొర్రప్పకు చాలా పెద్ద పేరొచ్చింది! కానీ నేను ఎంత తాపత్రయ పడినా నా పరపతి ఒక స్థాయికి వచ్చి అంతటితో ఆగిపోయింది!", అన్నాడు విచారంగా.

శంకరయ్య గోవిందరాజుకు చిరునవ్వుతో నమస్కరిస్తూ,"చూశారా మరి? యోగానికున్న మహత్తు అది! అందుకే శాస్త్రాన్ని కొట్టిపారెయ్యడం సరికాదని నేను ఆనాడు మీతో అన్నాను!", అన్నాడు.

"కానీ ఒక్క విషయం శంకరయ్యగారూ! మా అబ్బాయి విషయంలో మీరన్నది నిజం కాలేదు. వాడు మీరన్నట్లుగా యోగి అయిపోయి మమ్మల్ని విడిచి హిమాలయాలకు వెళ్ళిపోతాడేమోనని నేను తెగ కంగారు పడ్డాను! దేవుడి దయవల్ల అలా జరగలేదు! వాడు పట్నంలో గొప్ప సంగీత విద్వాంసుడిగా స్థిరపడ్డాడు!", అన్నాడు గోవిందరాజు ఒకింత గర్వంతో.

దానికి శంకరయ్య పెద్దగా నవ్వుతూ, "నా మాట నిజం కాలేదంటారేంటి గోవిందరాజుగారూ? సంగీతం నాదయోగం! కాదంటారా?? మీవాడు నాదయోగి అయ్యాడన్నమాట! నేను చెప్పినట్లే జరిగింది!", అన్నాడు.

ఆ మాట విన్న గోవిందరాజు రెప్పవేయడం కూడా మరచి శంకరయ్య వంక సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాడు!

*****

No comments:

Post a Comment

Pages