అప్పటి నపరాధమా ఆదరించవలదా - అచ్చంగా తెలుగు

అప్పటి నపరాధమా ఆదరించవలదా

Share This

అప్పటి నపరాధమా ఆదరించవలదా

అన్నమయ్య కీర్తనకు వివరణ 

వివరణ: డా.తాడేపల్లి పతంజలి 





రేకు: 0335-06 సం: 04-207

పల్లవి:

చెప్పినంతపని నే జేయగలవాడ నింతే

అప్పటి నపరాధమా ఆదరించవలదా

.1:

నీయాజ్ఞ దేహము నే మోచితినింతే

యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా

వేయి వేలై వేగుదాక వెట్టిసేసి యలసితి

వోయయ్య కొంతైన వూరడించవలదా

.2:

నీవు సేసేకర్మము నేజేయువాడ నింతే

యీవల నానందసుఖ మియ్యవయ్యా

కోవరమై వెంట వెంట గొలిచినబంట్లకు

తావుల గొంత వడైనా దప్పిదీర్చవలదా

.3: 

మతిలో శ్రీవేంకటేశ మనికయినవాడ నింతే

తతి నాపాటుకు దయదలచవయ్య

యితవై పనిసేసేటి యింటి పసురమునకు

వెతదీర బాలార్చి వెడ్డు వెట్టదగదా

భావం

పల్లవి:

చెప్పినంతపనిని  నేను చేయగలవాడనుఇంతే.

మరల మరల నా అపరాధమా! ఆదరించవలదా!(జన్మ ఎత్తుటకు అపరాధము కూడా ఒక కారణమునేను నువ్వు చెప్పిన పని చేసే వాడినినా యెడల జన్మలెత్తేటంత అపరాధాలుఎన్ని ఉంటాయిఈ పుట్టుకలు  లేకుండా నన్ను ఆదరించవయ్యాఅని భావం)

.1:

అయ్యా నీ ఆజ్ఞతో ఈ  దేహమును నేను మోసానుఇంతే.

మరి ఎందుకు  విజ్ఞానము ఇయ్యవు?(నీవల్ల ఈ శరీరము వచ్చింది కనుకనాకు విజ్ఞానము ఇయ్యవలసిన బాధ్యత నీదేనని భావం)

అనేక విధాలుగా తపించేవరకు  కూలిలేక చేయుపని నీకు చేసి అలసిపోయాను.

ఓ అయ్య కొంతైన నన్ను  ఊరడించవలదా!

.2:

నీవు విధించిన తప్పక అనుభవించవలసిన  నాకర్మమును నేను చేస్తుంటాను.ఇంతే.

అందువల్ల ఈలోకంలో అనందసుఖము ఇయ్యవయ్యా!(ఇవ్వవలసిన బాధ్యత నీకు ఉందని విజ్ఞప్తి)

గాఢమైనఅధికమైన భక్తితో నీ  వెంట  వెంట ఉండి నిను కొలిచిన సేవకులకు కొంత వరకైనా  దప్పిక తీర్చవలదా! (కొంతవరకయినా నిన్ను తెలుసుకోవాలనే తపనను తీర్చమని భావం)

.3:

శ్రీవేంకటేశనా మతిలో స్థానమయినవాడివి. (నా మనస్సులో ఉన్నవాడివినా కష్టానికి  దయతలచవయ్య!

మేలుకలిగించి పని చేసే  ఇంటి  పశువుకు-దాని దిగులు పోయేటట్లు హితమైన ఆహారమిచ్చి, పరిరక్షించి బుజ్జగించతగదా?(భక్తుడనైన తనను అలా బుజ్జగించమని వాత్సల్య భక్తితో స్వామిని  కవి అర్థిస్తున్నాడు.) 

No comments:

Post a Comment

Pages