చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 12 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 12

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 12

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene


@@@@@@@@@@@@@@

(టిఫిను ముగించాక, డీప్ రివర్ జాతీయ బాంకులోకి వెళ్ళిన నాన్సీ, మేనేజర్ క్లీన్ నుంచి మిసెస్ హోర్టన్ చనిపోవటానికి కొన్ని నెలల ముందు బాంకులోని తన రెండు ఖాతాలను మూసివేసినట్లు తెలుసుకొంది.  తరువాత కోర్టు కార్యాలయంలో మిసెస్ హోర్టన్ ఆర్ధిక లావాదేవీలను చూసే మిస్టర్ వీలర్ గురించి తెలుసుకొని అతని యింటికి వెళ్ళింది. మిసెస్ హోర్టన్ ఆస్తులను న్యూయార్కులోని ఆమె మనుమరాలికి అందజేసానని చెబుతాడు.  మాటల సందర్భంలో ఆ మహ్నుమరాలి వయసు యిరవై ఒకటి అని చెప్పగానే, నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు విస్తుపోతారు.  తరువాత. . . .) 

@@@@@@@@@@@@ 


 "ప్రస్తుతం జోనీ హోర్టన్ ఎక్కడుంది?" నాన్సీ అడిగింది.


"నాకు తెలియదు" పదవీ విరమణ చేసిన న్యాయవాది బదులిచ్చాడు.


నాన్సీ ఆలోచనలు పరిపరి విధాల పోయాయి.  వీలర్ చెప్పిన కథ నిజమైతే,  తన తండ్రి డ్రూ వద్దకు వచ్చిన బోవెన్ దంపతులెవరు?  వాళ్ళు మోసగాళ్ళా?  అదే అయితే, వాళ్ళ ప్రణాళిక ఏమిటి?  ఇలా నాన్సీ మరొక విధంగా ఆలోచించింది.  పెద్ద నాటకం ఆడి, ఆ ఎస్టేట్ ని మోసగాడెవరైనా సొంతం చేసుకోలేదు కదా!


జార్జ్ బుర్రలో కూడా అదే ఆలోచన వచ్చింది.  అకస్మాత్తుగా ఆమె ‌కలగజేసుకొంది.  "మిస్టర్ వీలర్! జోనీ హోర్టన్ పేరుతో  వచ్చిన అమ్మాయిపై మీకు అనుమానం రాలేదా?"


తక్షణమే గతంలో న్యాయవాది అయిన ఆతని ముఖం ముందు ఎర్రగాను, తరువాత దాదాపుగా గులాబీ రంగులోకి మారింది.  తన కుర్చీలోంచి దిగ్గున లేచి కోపంతో అరిచాడు, "ఓ అమ్మాయి! నీకెంత ధైర్యం? నువ్వు నా నైతికతనే‌ ప్రశ్నిస్తావా? వెంటనే నువ్వు, నీ స్నేహితురాళ్ళు యిక్కడనుంచి వెళ్ళిపొండి!"


***


"ఎందుకు .... మిస్టర్ ‌వీలర్ ..... నా ఉద్దేశం అది కాదని ....."  జార్జ్ కల్పించుకొంది.  "దయచేసి నన్ను క్షమించండి."


విశ్రాంత న్యాయవాది జార్జ్ క్షమాపణకు శాంతించి దీర్ఘ శ్వాస తీసుకొన్నాడు. 


"నేను వివరించటానికి ‌ప్రయత్నిస్తాను" నాన్సీ చెప్పసాగింది,‌ "మిసెస్ ‌హోర్టన్ తో వయసులో ‌బాగా చిన్నదైన ఆమె మనుమరాలు ఉందని మేము‌ విన్నాం.‌‌  కానీ ఆమె గురించి డీప్ రివర్లో‌ తెలిసిన వాళ్ళెవరూ లేనట్లుంది. అందుకే మీ కథ మమ్మల్ని చకితుల్ని చేసింది."


చివరకు వీలర్ శాంతించాడు.  "నేను పరిస్థితులను టూకీగా చెబుతాను" అంటూ తిరిగి కూర్చున్నాడు.  "నన్ను కలిసే సమయానికే మిసెస్ హోర్టన్ చనిపోయింది.  కేవలం వైద్యుడు, కర్మకాండ జరిపించే వ్యక్తి మాత్రమే అక్కడ ఉన్నారు.  ఆమె మంచం పక్కన బల్లపై ఉన్న వివిధ పత్రాలను,‌ సంతకం చేసి ఉన్న రెండు చెక్కులను వారు ‌నాకు చూపించారు.  అన్నీ ముసలామె చేతివ్రాతలోనే ఉన్నాయి.  వాటిలో ఒకటి విల్లులో పేర్కొనబడిన ఆమె మనుమరాలు న్యూయార్క్ లోని ఫలానా చోట నివసిస్తున్నదని పేర్కొంది.  మరొక కాగితంలో తన అంత్యక్రియలు రహస్యంగా జరగటమే ఆమె కోరిక అని ఉంది.  జోన్ తల్లిదండ్రులు బతికి లేనందున, ప్రతి విషయాన్ని తనే చూసుకొంటున్నట్లు మూడవ పత్రంలో అభ్యర్థన  ఉంది."


"దాని ప్రకారమే న్యాయవాదిని, ఒక జంటను వెంటపెట్టుకుని వచ్చిన  ఆమెను మనుమరాలిగా గుర్తించాము.  వాళ్ళు స్నేహితులు.  జోన్ అన్న ఆ యువతి తన జనన పత్రం, తన తల్లిదండ్రుల పెళ్ళిని నిర్ధారించే పత్రం నకలును, తన నాయనమ్మ నుంచి ‌వచ్చిన ఉత్తరాలను కలిగి ఉంది.  దానిని బట్టి ఆమె గుర్తింపు ‌విశ్వసనీయంగానే కనిపించింది."


   "మనుమరాలి వయసు, ఆ పిల్ల గార్డియన్ గురించి వీలునామాలో పేర్కొనలేదా?" బెస్ అడిగింది.


"లేదు" వీలర్ ‌బదులిచ్చాడు.  "అంతేకాక ఆ విల్లును నేను తయారుచేయలేదు.  దానిని వ్రాసిన న్యాయవాది, దానిపై సాక్షి సంతకాలు చేసినవారు బతికి లేరు."


"ఆస్తి భారీగా ఉందా?" నాన్సీ అడిగింది.


విశ్రాంత న్యాయవాది మిసెస్ హోర్టన్ యింటి భోషాణంలో డబ్బు తక్కువ మొత్తమే ఉందని, కానీ సెక్యూరిటీలు ఎక్కువ కనిపించాయని చెప్పాడు.  "అవి అన్నీ జోన్ పేరుకు బదిలీ చేయబడ్డాయి" వివరించాడు అతను.  "ఆమె హోర్టన్ యింటిని వదిలిపెట్టాక, తన గురించి నేను మళ్ళీ ‌వినలేదు."


   "ఆమె ఆ యింటిని అమ్మేసిందా?" జార్జ్ అడిగింది.


  'అవును.  దానిని ‌పొరుగింటి వాళ్ళే కొన్నారు.  కానీ వాళ్ళు దాన్ని వేరే‌ వాళ్ళకు అమ్మారు."


"మిసెస్ హోర్టన్ చనిపోవటానికి‌ ముందు ఆమె యింట్లో పనిచేసిన దంపతులు ఎవరు?" నాన్సీ అడిగింది.  అవి తనకు తెలియవని వీలర్ చెప్పాడు.


ఇది జరుగుతున్నంత సేపు నాన్సీ ఆ పెద్ద మనిషి ముఖకవళికలను చదువసాగింది.  అతను  పూర్తిగా నిజాయితీపరుడా లేక ఈ విల్లు విషయంలో ఏదైనా కుట్ర చేసి ఉన్నాడా అని ఆమె ‌ఆలోచించింది.  


"మీకు చూపించబడ్డ పత్రాలు ..... ఎవరైనా ఫోర్జరీ చేసినవి కావచ్చు కదా?" జార్జ్ ప్రశ్నించింది. 


ఆ ప్రశ్నకు కోపానికి బదులు విశ్రాంత న్యాయవాది ముఖంలో అలజడి తొణికిసలాడింది.  "అదేమీ లేదనే నేను గాఢంగా విశ్వసిస్తున్నాను" అన్నాడతను.


"ఆ పత్రాలు మీ దగ్గర ఉన్నాయా?" నాన్సీ అడిగింది.


"నా దగ్గర లేవు.  వాస్తవం చెప్పాలంటే, నేను వాటిని హోర్టన్ యింటిలోనే వదిలేసాను.  తరువాత అవి మాయమయ్యాయి.  వాటితో యింక అవసరం లేదని ఎవరో బయటకు విసిరేసారని భావిస్తున్నాను."


నాన్సీ లేచి‌ నిలబడింది.  వ్యాకులపడుతున్నట్లు కనిపించే వీలర్ నుంచి అమ్మాయిలైన తాము ముగ్గురు సాధ్యమైనంత సమాచారాన్ని రాబట్టినట్లు ఆమె భావించింది. 


"మిమ్మల్ని యిబ్బంది పెట్టినందుకు క్షమించండి" అంది నాన్సీ.  "ఈ సమాచారానికి‌ ధన్యవాదాలు.  దీన్ని నేను మా నాన్నకు తెలియజేస్తాను.  బహుశా ఆయన మా యింటికి చేరుకోగానే, మీకు ఫోను చేయవచ్చు."


బెస్, జార్జ్  ఆయనకు గుడ్ బై చెప్పినా, వీలర్ కుర్చీ నుంచి లేవలేదు.  నిర్ఘాంతపోయిన అతను ఆలోచనలతో తలమునకలయ్యాడు.  నాన్సీ అతని మనసు చదివినట్లు భావించింది.  వీలర్ చెప్పినవన్నీ నిజాలేనా?


అమ్మాయిలు ఆ యింటి ‌ముందు ద్వారం నుండి బయటకు వచ్చి కారు వైపు నడిచారు.  "అక్కడేదో ఉన్నట్లుంది కదూ!" బెస్ వ్యాఖ్యానించింది.  


"ఎవరెక్కువ ‌నిర్ఘాంతపోయారో నాకు తెలియటం లేదు .... మిస్టర్ వీలరా లేక నేనా?" అంది నాన్సీ.  "అమ్మాయిలూ! దీని అర్థం ఏమిటో మీరు గ్రహించారా? ఈ మొత్తం వ్యవహారం పెద్ద పితలాటకం అయితే, మిసెస్ హోర్టన్ సంపదను ఎవరో తీసుకుపోయి ఉంటే, అసలైన జోనీ హోర్టన్ కి దానిని పొందే, కనీసం అది ఎక్కడ ఉందో తెలుసుకొనే అవకాశం కూడా లేదు."


  "ఈ విషయాన్ని మరిచిపోకు" బెస్ మధ్యలో అందుకొంది.   " మూడేళ్ళ ‌వయసు ఉన్న జోనీ హోర్టన్ అన్న పాప గురించి ఒక చిన్న సంగతి కూడా ‌మనం తెలుసుకోలేదు.  అసలా అమ్మాయి మనకు ఎప్పటికీ దొరకనట్లే కనిపిస్తోంది."


  "ఇది ఖచ్చితంగా మిస్టరీనే!" అమ్మాయిలు కారులోకి ఎక్కుతుండగా జార్జ్ అంది.


దారిలో భోజనం ‌ముగించి వాళ్ళు మోటల్ కి చేరుకొన్నారు.  వెంటనే నాన్సీ ఫోను దగ్గరకు వెళ్ళి, తన తండ్రితో మాట్లాడటానికి ప్రయత్నించింది.  అయితే, ‌అతను శాన్ ఫ్రాన్సిస్కో హోటల్ని వదిలి వెళ్ళిపోయాడని,‌ కొన్ని రోజుల తరువాత తిరిగి వస్తాడని ఆమె తెలుసుకొంది.


తరువాత నాన్సీ హన్నా గ్రూకి ఫోను చేసింది.  ఈ కేసులో ఇటీవల జరిగిన మార్పులను తెలుసుకున్న హౌస్ కీపర్, వాటిని విని కలవరపడింది.  


  "ఈ మిస్టరీలో నువ్వు సంపాదించిన విషయంలో ఏదో ప్రమాదం ఉండి ఉండవచ్చు" అందామె.  "మీ నాన్న ఫోను చేస్తే, అతనికి నీ సందేశాన్ని అందజేస్తాను.  ఆయన తప్పకుండా ‌నీతో మాట్లాడతారని చెప్పగలను.  దయాళువైన ఆమె గూఢచర్యంలో తాను ముందడుగు వేసే ముందు అత్యంత జాగరూకతతో ఉండమని వేడుకొంది.  


" మర్చిపోవద్దు" అంటూ నాన్సీ యికిలిస్తూ ఆమెకు గుర్తు చేసింది, "నేను తెచ్చుకొన్న చంద్రమణే నాకు అదృష్టాన్ని ‌కలిగించవచ్చు."


"చంద్రమణా, అబ్బా! నీ లోకజ్ఞానాన్ని ఉపయోగించు.  అంత కన్నా మంచి ఫలితాలు వస్తాయి."


 నాన్సీ ఆమెకు గుడ్ బై చెప్పగానే, బెస్ ఆమెను సమీపించి  తానొక సలహా యివ్వదలచుకొన్నట్లు చెప్పింది.


(ఇంకా ఉంది)    


No comments:

Post a Comment

Pages