తిరిగిరాని రోజులు! - అచ్చంగా తెలుగు

తిరిగిరాని రోజులు!

Share This

 తిరిగిరాని రోజులు!

భమిడిపాటి కాళిదాసు 


 అవును ఆరోజులు ఇంక తిరిగి రావు!నిజమే! అంటూ గతంలోకి వెళ్ళిపోయాడు శివం. అయిదు దశాబ్దముల పూర్వపు అపురూప స్మృతులు కళ్ళముందు కనిపించేయి. 


      అదొక పల్లెటూరు. సుమారు ఏభై శుద్ధఛాందస బ్రాహ్మణ కొంపలుండేవి ఆ వూర్లో! ఎప్పుడో రాజుల పాలనలో నిత్యపూజలు జపహోమాదులు లోకోపకారం కోసం ఆ బ్రాహ్మణ కుటుంబాలవారు నిర్వహించేవారు. వారి పోషణకు ఆగ్రామాన్ని నాటి పాలకులు ధారాదత్తం చేసేరని గ్రామంలోని పెద్దలు చెప్తూ వుండేవారు. దేవాలయాల్లో ఆదాతలగోత్రాభివృద్ధిని కోరుతూ నిత్యార్చనలు కూడా చేసేవారు, అదిగతం. ఇప్పుడక్కడ అగ్రహారపు బ్రాహ్మణులు ఒకటో రెండో కుటుంబాలవారు కులవృత్తిని నమ్ముకుని వున్నారు. భూములు సంపద నియమ నిష్ఠలు వేదాధ్యాయనములు గతవైభవమే!


                    నాన్న గారు అతి నిష్ఠాగరిష్ఠులు. నిత్యదైవారాధన, పురాణపఠనం, సద్గోష్టి వారి నిత్యకృత్యములు. మితాహారం మితభాషిత్వం వారి ప్రత్యేకతలు. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానసంధ్యలు జపతపాదుల అనంతరం నాటి అలవాటు ప్రకారం ఒక పెద్ద కంచుగ్లాసుడు కాఫీ సేవంచి పొలం వైపు నడక.


        అమ్మ మాకే కాదు అందరినీ అభిమానించి ఆదుకొనే అన్నపూర్ణమ్మ!ఆపద్బాంధవి. ఆకలని అర్ధించినవాళ్ళకు కల్పవల్లి. ఆ గ్రామస్థులకు లోకం క్షేమంగావుండాలని నిత్యపూజాదికాలు నిర్వహించే అమ్మా నాన్నా అంటే అమితమైన గౌరవం.


               నాన్నగారిచేయిపట్టుకుని ఆయనతో పొలానికి వెళ్ళేవాడిని నేను కూడా. ఆయనొక విజ్ఞానసముద్రం. ఎన్నో నీతి పద్యాలు విదుర నీతులు యక్షప్రశ్నలు రామాయణ భాగవత కథలు మహాకవి కాళిదాసు ప్రజ్ఞావిశేషాలు ఇంకా ఇంకా ఎన్నెన్నో కథలు నీతిశాస్త్రవిషయాలు ధర్మసూత్రాలు నాకు బోధించేవారు.


      ఆ రోజులలో కాలం ధర్మం తప్పకుండా ఋతువులు ప్రకృతి ధర్మం చక్కగా నడుస్తూ పాడి పంటలతో జగమంతా నిత్యకళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లేది. చెరువులు వ్యవసాయ బావులు జలకళతో కన్నుల పండువుగావుండేవి. విశాలమైన గడ్డి మైదానాలు నీటికాలువలు కొండ గెడ్డలు సెలయేళ్ళు పచ్చని తంగేడు పూలచెట్లు ఎఱ్ఱని మోదుగపూలతో చీపురు తుప్పలతో పవిత్ర (దర్భ)పోదలతో భూమాతపులకించి పోయేది. మామిడితోటలు, సపోటా, సీతాఫలం మధుర ఫలయుతములైనజామ పండ్లతోటలు పక్షుల కిల కిలారావములు ఆ ప్రకృతిని మదనుడు కూడా వర్ణించలేడేమో! 


   ఆయనవెంట నడుస్తూ నన్ను నేను శివుని వెంటనడిచే వినాయకుడుగా ఊహించుకొనేవాడిని. మాకు యెదురు పడ్డ గ్రామస్తులు రైతులు యెంతో గౌరవంగా భక్తితో నాన్నగారికి నతులర్పిస్తూ నాన్నగారూ బాబుగారూ,మామయ్యగారూ తాతగారు ఇత్యాది బంధుపదములతో పలకరించి గౌరవించేవారు. ఒక్కొక్కసారి సమీపంలోని నదీ తీరానికి నన్ను కూడా తీసుకెళ్ళేవారు నాన్నగారు, వేసవి రోజుల్లో తాపోపశమనం కొరకు. ఆయన ఆస్వఛ్ఛమైన ఇసుకతెన్నెలపై ఆసీనులై దైవధ్యానంలో వుంటే మా బృందం అక్కడ ఏటికీ చెలియకట్టకూ మధ్యగల (ఏటిబాడవ అనేవారు) చెట్లతోపులలో వివిధరకాల ఆటలతో ఆనందించేవాళ్ళం. స్వచ్ఛమైన నీటితో ఏరు గలగలా ప్రవహించేది. పుణ్యదినాలలో పెద్దలంతా ఈ ఏటిలోనే పుణ్య స్నానాలు చేసేవారు. కాలం మారింది.

 కాలంతోపాటు ప్రభుత్వాలు వాటివిధానాలు మారేయి. నాన్నగారికీ వారి దాయాదులకు ఏనాడో దఖలుపడిన మడిమాన్యాలు పళ్ళతోటలు పరాధీనమైనాయి. వారి ఆధీనంలో వున్న కాస్త భూవసతీ కూడా దాయాదల దౌష్ట్యంతో హీన క్రియానికే అమ్ముకోవలసి వచ్చింది. కాని పుట్టిన మట్టిని విడువలేక అక్కడే నివసించాలని నాన్నగారు నిర్ణయించుకున్నారు. మారిన కాలంతో పాటు జీవన విధానం మార్చుకోవడమే విజ్ఞుల లక్షణమని నమ్మిన నాన్నగారు నన్ను చదువుల నిమిత్తం ఉత్తరాదిన పెద్దవుద్యోగంలో వున్న పెద్దమామయ్య దగ్గరకు పంపించీసేరు. అప్పటికే అక్కను పెళ్ళాడిన చిన్నమామయ్యకు తమ్ముణ్ణి అప్పజెప్పేరు. మాచదువులు సాగుతున్నాయి. అప్పడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి అమ్మా నాన్నలను చూసివెళుతున్నాం.


          కాలపురుషుని కఠోర చేష్టలు బహుకర్కశముకదా! అకస్మాత్తుగా అమ్మకు గుండెపోటు వచ్చి పరమశివుని సన్నిధికి చేరుకుంది. పండుటాకులా రెపరెపలాడిన నాన్నగారు విధివిలాసమునకు కించిత్తుకూడా జడవని  స్థితప్రజ్ఞులు. ఆయనలోని భక్తిభావం ఇంకా ద్విగిణీకృతమైంది. అయినా ఆయనను వొంటరిగా విడువకుండా అక్కా మామయ్యా వారితో దక్కనుప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. దక్కనుప్రాంతంలో ఆనాడే చిన్నమామయ్య పెద్ద వుద్యోగి. అంతే అప్పటినుండి ఆ విధంగా మాకు పుట్టిన గడ్డతో అనుబంధం దూరమైంది.


                 మాచదువులు పూర్తయిన తరువాత మేము ఆ ప్రాంతములలోనే వుద్యోగాలలోచేరేం.అప్పుడప్పుడు తమ్ముడూ నాన్నగారూ నా దగ్గరకో నేను వారి దగ్గరకో వెళ్ళడం రావడం జరుగుతూ వుండేవి, నాన్నగారే మావివాహములు కూడాజరిపించి ఒకరోజు నిశ్చింతగా శివైక్యం చెంది అమ్మదగ్గరకు చేరుకున్నారు. 


           కాలచక్రం ఆగదుకదా!మేమూ పెద్దవాళ్ళమైనాము. పిల్లలకు బాధ్యతలు అప్పగించి విశ్రాంత జీవితంలో వున్నాం. ప్రతి సంవత్సరం ఒకసారి తమ్ముడూ నేనూ కలుస్తూ వుంటాం. ఈ సంవత్సరం నాకు నా జన్మభూమిని చూడాలనే వాంఛ కలిగింది.                


             మా గ్రామానికి సమీపంలోని పట్నానికి ఆరోజుల్లో బస్ సౌకర్యం  ఉండేది. తరువాత పొగబండి యెక్కి అటు ఉత్తరాదికో ఇటు (దక్కను) దక్షిణాదికో రెండు దినములు ప్రయాణం చేసి చేరేవాళ్ళం.


           మేం రైలు బండి యెక్కే పట్టణానికి ఇప్పుడు విమానాలు కూడా వున్నాయిట. నాకు కూడా వయసు మీరుతూంది కదా! కొడుకులు విమానంలో పంపించేరు. అక్కడినుంచి వాళ్ళే మా గ్రామానికి గల రవాణా సౌకర్యాలను అంతర్జాలంలో పరిశీలించి నాన్నగారు మీరు విడిచిపెట్టి వొచ్చిన మీ గ్రామాలు ఎలామారేయో గమనించండి అన్నారు. అక్కడ ప్రొద్దున్న అల్పాహారం తీసుకున్నాక పిల్లాడు వచ్చి విమానం యెక్కించేడు. నేను పట్నంలో దిగేసరికి మావాళ్ళు చెప్పిన నెంబరు గల కారు సిద్దంగా వుంది. డ్రైవరు నమస్తే చెప్పి భోజన హొటల్ కి తీసుకెళ్ళేడు. ఇద్దరం భోజనం చేసేక నాగమ్యస్థానం గురించి చెప్పేను. నాకు తెలుసు మీ వాళ్ళు దూరవాణి లో వివరాలన్నీ చెప్పేరు. మీ తిరుగు ప్రయాణం కూడా నాకే అప్పజెప్పేరు. రేపు సాయంత్రం విమానం యెక్కిస్తాను అంటూ భోజననాంతరం కారు సిద్ధం చేసేడు, బయలుదేరేం.


                 చూడు నాయనా!ఇక ఇక్కడినుండి మనప్రయాణం కొంత ఇబ్బందికరమేమో,రహదారి అంతసుఖంగా వుండదేమో! జాగ్రత్తగా తీసుకెళ్ళు అన్నాను.ఆ డ్రైవరు చిన్నగా నవ్వుతూ మాష్టారూ మీరు ఈ ప్రాంతాని చివరిసారిగా వచ్చి ఎంతకాలం అవుతుంది అన్నాడు. అదెక్కడ మీ నాన్న వయసుకంటే ఎక్కువ కాలమైవుంటుంది అన్నాను. అయ్యా ఇప్పుడు మీరు వెళ్ళబోయే వూరికే కాదు చాలా గ్రామాలకు బస్సులు ఆటోలు కార్లు తిరిగే చక్కని రోడ్లు వేసేరండీ చూస్తారు కదా!అన్నాడు మరొక పదినిముషాలకు గమ్యంచేర్చి ఇదేసార్ మనం చేరవలసిన గ్రామం అన్నాడు ప్రక్కన రోడ్లు రహదార్ల వారు ర్పాటుచేసిన నామఫలకం కనిపించింది. నాకు అత్యాశ్చర్యం కలిగింది. 


           నా బాల్యం లో బస్ యెక్కడానికి వెళ్ళాలంటే పొలం గట్ల మీద నడిచి సుమారు రెండు మూడు గంటలు ప్రయాణం చేయవలసి వచ్చేది. వర్షాకాలంలో అయితే జారు బురదలో పొలం గట్ల వెంట మరో గంట యెక్కువ సమయమే పట్టేది. మార్గమధ్యంలో ఒక్కొక్క ప్రాంతంలో నిర్మానుష్యంగా వుండేది. ఒంటరిగా వస్తే పులగులు గుడ్లగూబలు తీతువు పిట్టల అరుపులు భయం కలిగించేవి.


మార్గం జనసంచారశూన్యమై  సాయంత్రం చీకటి పడితే గుంటనక్కల అరుపులు తోడేళ్ళ సంచారం అబ్బా చాలా భయమేసేది. ఇప్పుడు రహదారికిరువైపులా నివాసాలు కాఫీ హొటళ్ళు తినుబండారాలు వేడివేడిగా తయారు చేసి అమ్మే అంగళ్ళు.. అబ్బా! ఎంతమార్పు.


మా చిన్నప్పుడు  మాగ్రామంనుంచి బయలుదేరుతే త్రోవకిరువైపులా సిపాయిలు సలాంచేస్తున్నట్లు తాటి చెట్లవరుసలు, కంది చేలతో వేరుశనగ  రాగి జొన్న గంటి పైరులతో మెట్టు భూములు పచ్చని తివాచీ పరిచినట్లు కన్నులపండువగా కన్పించేవి. ఇప్పుడు మచ్చుకు కూడా ఆఛాయలు గోచరించలేదు. నాటి మెట్టు భూములు కూరగాయలక్షేత్రములుగా పశువులు హాయిగా మేతమేసే గడ్డి బీళ్ళుగా వండేవి ఇప్పుడు నివాసాల మయంగా కనపిస్తున్నాయి.


          గ్రామానికి నాలుగువైపులా పచ్చని కూరగాయల పాదులు బీర,ఆనప,కాకర పొట్ల చిక్కుడు తీగలు గోరుచిక్కుడు,మిరప,మున్నగు పొదలు,ప్రతి యింటా దొండ పందిరి బచ్చలి చిన్నమిరప (చీమమిరప)తప్పకుండా వుండేవి. ఇంటి పెరట్లో కరవేపాకు మునగ, గోరింటాకు చెట్లు వుండేవి. డ్రైవర్ కి పరిచయమున్న ఒక ఫలహారాల దుకాణం(హోటల్)దగ్గర కారు ఆపి నా గురించి చెప్పినట్లున్నాడు. అక్కడి మిత్రలు నన్ను ఆత్రుతగా చూస్తున్నారు. నాకు తెల్సిన వ్యక్తులెవ్వరూ కనిపించలేదు. డ్రైవరుకి చెప్పి ఒకవిద్యార్ధి సహాయంతో గ్రామంలో పూర్వం మేము నివసించిన ప్రాంతానికి చేరుకున్నాను.


              నేనా ప్రాంతాన్ని ఆశ్చర్యంగా పరిశీలించడం గమనించి నాతోవచ్చిన కుర్రాడు 'ఇక్కడ పూర్వం బ్రాహ్మణుల ఇళ్ళుండేవని మానాన్న చెప్పేడు' అన్నాడు.  ఇంతలో ఒక పెద్దాయన వచ్చి బాబూ తమదేవూరు ఇలావచ్చేరేంటి అన్నాడు,ఒకప్పుడు ఈవూరే ఇప్పుడు ఉత్తరదేశం అన్నాను,వెంటనే ఆయన బాబూ తమరు ఫలావారి కుమారులా అని నాన్నగారి పేరు చెప్పగానే హమ్మయ్య ఆధారందొరికింది అనేవుత్సాహం నాలో కట్టలు త్రెంచుకుంది. 


           నాన్నగారు ధర్మప్రభువులు అమ్మగారు కాశీ అన్నపూర్ణమ్మే వారిచ్చిన ఇల్లు ఇదే బాబు అని ఒక అధునాతనమైన సిమ్మెంటు భవనం చూపించాడాయన! ఆశ్చర్యం నావంతైంది. ఒక్కసారి గతం నాకళ్ళముందు గోచరించింది. అప్పటి మాఇల్లు మట్టి గోడల తాటాకుల యిల్లు.సుమారు నాలుగు వందల గజాల స్థలం.రెండు ఇళ్ళు దక్షిణ ముఖంగా ఉండేవి. ఉత్తరంలో పెరడు ఒరల నుయ్యి పెద్ద చపటా వుండేవి. ఒక ఇల్లు వంటలు భోజనాలు పూజలకు వినియోగించే వారు. ఇంకొకటి పడకలు బాతాఖానీ లకు వీధి గుమ్మం అతి విశాలంగా వుండి పంచాంగశ్రవణం పురాణ కాలక్షేపములకు, రామ పట్టాభిషేకం మొదలైన దైవకార్యాలకు వినియోగించేవారు మా పూర్వీకులు.


             వేసవిలో విశాలమైన వీధిగుమ్మంలో మధ్యాహ్నం అతి చల్లని గాలి వచ్చేది. మాయింటి యెదుట ఒక రావిచెట్టు వేపచెట్టూ ప్రక్కన జామ చెట్టు వుండేవి. పుణ్య దినాల్లో ఆవృక్షరాజములకు పూజలు చేసేవారు. రావి చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం గా విరాజిల్లేది. వేప, జామ పళ్ళకొరకు చిలుకలు వచ్చి బహుసందడి చేస్తూ వుండేవి. ఇప్పుడవేవీ కనపడలేదు.సిమ్మెంటు రహదారులు విద్యుత్ స్తంభాలు వేయడానికి చెట్లు తొలగించేరేమో!మాయింటి చూరులలో కిలకిలారావములతో పిచ్చుకలు జంటలుగా గూళ్ళు కట్టుకొని వుండేవి. అసలిప్పుడు ఆ చిన్ని పక్షుల జాడకూడా లేదు. మొత్తం గ్రామం లో చాలాయిళ్ళు వెలిసేయి.పూరిళ్ళు మాత్రం వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు.


పంతులుబాబూ ఇది నాయిల్లు ఆపక్క నున్నవి మా కొడుకుల ఇళ్ళు అన్నాడు. నాకాశ్చర్యంవేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు. మా తండ్రిగారు ఉమ్మడి కుటుంబం ఆరోజుల్లో ఏడెనమండుగురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో వుండేవారు. అవును కాలం మారుతోంది కదా!అనుకున్నాను.


             ఆపెద్దాయనను అభ్యర్ధిస్తూ నాన్నగారు ప్రతిదినం వెళ్ళే పొలంవైపు యేటి ఛాయలకు ఒకసారి వెళదామా అని అడిగేను. వెంటనే ఆయన అదేముందిబాబూ పదండి అన్నాడు. కొంతదూరం వెళ్ళాము అప్పటి దృశ్యాలు ఏవీ కనిపించలేదు. గడ్డి బీళ్ళు,నీటి గెడ్డలు గొర్జిలు అన్నీ పొలాలైపోయేయి. చెరువు మూడొంతుల పరిధి తగ్గిపోయింది. 


           ఏటిగట్టుకు చేరేం. ఆనాటి ఫలవృక్షములు గడ్డి బీడులు ఇసుక తిన్నెలు నీటి గలగలలు స్వఛ్ఛవాయువులు ఏవీ కనిపించలేదు. రంగుమారిన కలషిత జలం దుర్గంధభరితమైన వాయువులు నన్ను అవహేళన చేస్తున్నాయా అనే భావం కలిగింది.ఏదో చెప్పలేని భయం ఆవరించింది. ఇక ఆమంచికాలం తిరిగి రాదని నిశ్చయించుకున్నాను.

***

No comments:

Post a Comment

Pages