చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 11 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 11

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 11

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 


(తనను వెంబడించిన వ్యక్తిని జార్జి చూపగానే, నాన్సీ అతనిని ఎక్కడో చూసినట్లు ఉందనిపిస్తోందంటుంది.  తనను వెంబడించాలని  హోటలు నుంచి బయట కొచ్చిన అమ్మాయిలకు ఆ వ్యక్తి కనిపించడు.  మరునాడు అమ్మాయిలు ముగ్గురు చంద్రమణి కోటకు వెళ్ళినప్పుడు, కందకంలో నీటిని చూది ఆశ్చర్యపోయారు.  దానిపై వంతెన పైకి లేచి పోవటంతో, స్నానపు దుస్తులతో తిరిగి రావాలని వారు వెనుదిరిగారు.  ఊళ్ళో టిఫిన్ తిన్నాక, నాన్సీ బాంకుకి వెళ్తుంది. తరువాత......)

@@@@@@@@@

వాళ్ళు తినటం ముగించే సమయానికి,‌ దుకాణాలు, ఆఫీసులు తెరుచుకున్నాయి.  నాన్సీ డీప్ రివర్ జాతీయ బాంకు వైపు అడుగేసింది.


నాన్సీ గూఢచర్య పద్ధతులను గమనించటంలో  ‌బెస్,జార్జ్ ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు.  కార్యాలయాల్లోని అధికారులను కలవటంలో నాన్సీ విఫలం కాకపోవటానికి ఆమెలోని ఆకర్షణ, ముక్కుసూటి తత్వం, వ్యాపార తరహా ధోరణి, వీటిలో ఏది కారణమై ఉంటుందని వాళ్ళు తరచుగా ఆలోచిస్తుంటారు.  ప్రస్తుతం, ఆమె నుంచి చిన్న వివరణతో, అమ్మాయిలు అధ్యక్షుడి కార్యాలయంలోకి అడుగుపెట్టారు.  


  క్లీట్ వారితో ఆహ్లాదకరంగా మాట్లాడాడు.  అయితే, మధ్యలో వారి సమావేశానికి  ఫోను కాల్స్, మెసెంజర్లు పదే పదే అడ్డు తగులుతున్నారు.  అయినప్పటికీ,  మిసెస్ అడిలైడ్ హోర్టన్ సమాచారాన్ని నాన్సీ అడుగుతుంటే, ఏకాగ్రతతో విన్నాడు.   


  "మీరడిగిన సమాచారాన్ని కొద్దిగా మాత్రమే యివ్వగలనని అనుకుంటున్నాను" ఆ వ్యక్తి బదులిచ్చాడు.   "మిసెస్ హోర్టన్ గురించి నాకు కొద్దిగానే తెలుసు.  ఒక రోజు ఆమె యిక్కడకు వచ్చి తన రెండు ఖాతాలను మూసేసింది.  తరువాత తన సేఫ్-డిపాజిట్ బాక్స్ వద్దకెళ్ళి దానిలో ఉన్నవన్నీ, స్పష్టంగా చెప్పాలంటే సెక్యూరిటీలను తీసేసుకొన్నారు."


"ఆమె దానికి కారణాలు చెప్పలేదా?" నాన్సీ అడిగింది. 


"ఏమీ చెప్పలేదు.  ఆమె ఎక్కువగా మాట్లాడే మనిషి కాదు.  అంతేకాక, ఏమి చేస్తారని మా క్లయింట్లను ఏనాడూ ‌మేము అడగం. ఆమె అక్కౌంట్లను కోల్పోయినందుకు మేము విచారించాం."


"ఇది జరిగి ఎన్నాళ్ళు అయింది?" నాన్సీ ఆరా తీసింది.


క్లీట్ కొద్ది క్షణాలు ఆలోచించాడు.   "ఎన్నేళ్ళు అయిందో ‌నాకు సరిగా‌ గుర్తు లేదు, కానీ ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందు అని మాత్రం చెప్పగలను."


అదే సమయంలో క్లీట్ ఫోను బజర్ మోగింది.  అతను ఫోనెత్తి,‌ "సరె! అతనికి కలుపు" అని బదులిచ్చాడు.  తరువాత అమ్మాయిల వైపు తిరిగాడు.  "ప్రస్తుతం మీరు నన్ను ‌క్షమించాలి.  దూరప్రాంతం నుంచి ముఖ్యమైన ఫోను మాట్లాడాలి."


నాన్సీ హడావిడిగా లేచి‌ అతనికి ధన్యవాదాలు చెప్పింది.  తరువాత బెస్, జార్జ్ లతో ఆ గదిలోంచి వేగంగా బయటకు నడిచింది.


వాళ్ళు కాలిబాట ‌మీదకు రాగానే, "నాన్సీ! ముఖ్యమైన విషయం తెలుసుకున్నావని నువ్వు భావిస్తున్నావా?" అని జార్జ్ అడిగింది.


 "ఖచ్చితంగా తెలుసుకున్నాను.  మిసెస్ హోర్టన్ కి, ఆమె దగ్గర పనిచేసిన జంటకు మధ్యన అనూహ్యమైన సంఘటన ఏదో జరిగిందని నాకు అనిపించింది.  మిసెస్ హోర్టన్ దగ్గర నుంచి ఆమె డబ్బును, సెక్యూరిటీలను దూరం చేయటానికి ఆమె ‌పనివాళ్ళు ఏదైనా సమ్మోహక శక్తిని ప్రయోగించారా అన్న అనుమానం నాలో మొదలైంది."


"ఎంత‌ ఘోరం!" బెస్ వ్యాఖ్యానించింది.


ఆ పట్టణంలో ఉన్న మరొక బాంకుకి వెళ్తానని తన స్నేహితురాళ్ళకు చెప్పి, ఆ వీధిలో ఆమె కొంచెం ముందుకి వెళ్ళింది. ఆ సంస్థలో కూడా యువ గూఢచారి తాను యింతకు ముందు విన్న కథలాంటి దాన్నే తెలుసుకుంది.  అయితే ఆ సమాచారాన్ని హెడ్ కాషియర్ యిచ్చాడు.  గత పదిహేను ఏళ్ళుగా ఆ‌ బాంకులో పనిచేస్తున్న వ్యక్తి అతనొక్కడే! 


ఇతను కొంచెం వాగుడుకాయ కావటంతో, మిసెస్ హోర్టన్ బాగా డబ్బు ఉన్న వ్యక్తి అన్న నిజాన్ని బయటపెట్టాడు.  "ఆమె తన సంపదనంతా తన ఒక్కగానొక్క మనుమరాలికి వదిలేసిందని నమ్ముతున్నాను.  కానీ ఆ వివరాలు నా జ్ఞాపకాలనుంచి జారిపోయాయి."


అది విన్న నాన్సీ హతాశురాలైంది. ఎందుకంటే ఒక్క క్షణం ఆ వ్యక్తి తనకు ఉపయోగపడే ముఖ్యమైన క్లూ యిస్తాడని ఆశపడింది.  అతను చిరునవ్వు నవ్వాడు.  "మిసెస్ హోర్టన్ తన వ్యక్తిగత విషయాల గురించి ఎవరితో మాట్లాడేది కాదు.  తాను చేసే పనులు ఎవరికీ తెలియకూడదని ఆమె భావించేదనుకొంటా!"


ఈ మిస్టరీ ‌మీద కాషియర్ నుంచి యింక వివరాలేవీ ‌తెలియవని గ్రహించిన నాన్సీ అతనికి ధన్యవాదాలు చెప్పింది.  తరువాత అమ్మాయిలు ‌బాంకుని‌ విడిచిపెట్టారు.  వారి తరువాతి గమ్యం న్యాయ కార్యాలయాలు.  ఇక్కడ యువ గూఢచారిణిలకు దొరికిన సమాచారం శూన్యం.  మొదటి ఆఫీసులో ఉన్న యిద్దరు లాయర్లు అయిదేళ్ళ కన్నా తక్కువ కాలం అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏనాడూ మిసెస్ హోర్టన్ గురించి వినలేదు.


 తదుపరి కోర్టు కార్యాలయంలో  నాన్సీకి కొద్దిగా అదృష్టం పట్టింది.  వ్యక్తిగతంగా అతనికి ఆమె గురించి ఏమీ తెలియకపోయినా, అక్కడ వారు కలిసిన వ్యక్తి మిసెస్ హోర్టన్ గురించి విని ఉన్నాడు.     "ప్రస్తుతం రిటైరైపోయిన మిస్టర్ జాన్ వీలర్ అన్న లాయరు ఆమె ఎస్టేట్ వ్యవహారాలు చూసేవాడు" అని చెప్పాడతను. 


"ఆయన యిప్పుడు పట్టణంలోనే ఉన్నారా?" నాన్సీ ఆసక్తిగా అడిగింది. 


"ఉన్నారు.  విక్టోరియా వీధిలో ఉన్నారు. ఇంటి నంబరు నాకు తెలియదు, కానీ దానిని పట్టుకోవడం కష్టం కాదు.  ఆ యింటి ముందు పచ్చికబయల్లో ఒక పెద్ద కుక్క బొమ్మ ఉంది."


అమ్మాయిలు కంగారుగా వీలర్ ఇంటి దారి పట్టారు.  అదే సమయంలో తన తండ్రి చెప్పిన వ్యక్తి యితనే అయి ఉండవచ్చునని భావించింది. అయితే అతను ఊళ్ళో లేరని చెప్పారే!  ఆయన తిరిగి వచ్చి ఉండాలని ఆమె ఉత్సాహంగా ఆశపడింది.


వీలర్ ఊరికి తిరిగి వచ్చి ఉండటం, అమ్మాయిలను సాదరంగా ఆహ్వానించటం, నాన్సీకి ఆనందాన్ని కలిగించింది.  అతని వయసు డెబ్బై అయినా, చురుకుగా కనిపిస్తున్నాడు. 


"ఒక యువతి నన్ను కలవటానికి రావటమే అరుదు" కూనిరాగం తీస్తున్నట్లు అన్నాడు.  "ఒక్కసారిగా ‌ముగ్గురు....అందులోనూ అందమైన వాళ్ళు..... నిజంగా సంతోషించదగ్గ విషయం.  వచ్చి కూర్చోండి."


అమ్మాయిలు విశాలమైన, ఫర్నిచర్ తో అందంగా అలంకరించిన హాల్లో కూర్చున్నారు.  పిలవని పేరంటంలా‌ వచ్చినందుకు క్షమాపణ కోరుతూ, నాన్సీ తనను కర్సన్ డ్రూ కుమార్తెగా‌ ఆ న్యాయవాదికి పరిచయం చేసుకుంది.   


"మిసెస్ అడిలైడ్ హోర్టన్ ఎస్టేట్ ‌వ్యవహారాన్ని మీరే పరిష్కరించినట్లుంది?" నాన్సీ ప్రశ్నించింది.


"అవును. నేనే పరిష్కరించాను."


తన తండ్రి మిస్టర్ వీలర్ ని కలవటానికి డీప్ రివర్ ‌వచ్చారని, అయితే ఆయన ఊళ్ళో లేనట్లు తెలిసిందని నాన్సీ చెప్పింది.


"మా నాన్నగారు వృత్తిపరమైన పనిలో ఉన్నారు. అందుకే ఇక్కడ కొంత దర్యాప్తు చేసి రమ్మని నన్ను పంపారు."


"అయితే ఏ విషయం తెలుసుకోవాలని నువ్వు ‌కోరుకొంటున్నావు?" వీలర్ అడిగాడు. ‌ అతని కంఠంలో అనుమానపు జీర ధ్వనించింది.  


"అది మిసెస్ హోర్టన్ ఆస్తిని తీసుకొన్న ఆమె మనుమరాలి గురించి."


"అలాగా!" అంటూ వీలర్ కనుబొమలు పైకెత్తాడు.  "అంతా సవ్యంగానే సాగింది.  మిసెస్ హోర్టన్ చనిపోయే ముందు తన మనుమరాలి చిరునామా తెలిపే చీటిని‌ విడిచిపెట్టింది.  విషయం ఆమెకు తెలియపరచగానే‌ న్యూయార్క్ నుంచి ఆ‌ అమ్మాయి ‌వచ్చింది.  తనతో పాటు తన లాయర్ని కూడా ఆమె తీసుకొచ్చింది.  తానెవరో నిరూపించుకొనే అధికారిక పత్రాలన్నీ ఆమె‌ వద్ద ఉన్నాయి" అని కొద్ది క్షణాలు ఆగాడతను.  "అందుకే‌ మిసెస్ ‌హోర్టన్‌ సంపదంతా ఆమెకు సంక్రమించింది.  ఆ కథలో ఉన్న వివరాలవి."


"కానీ ఆమెకు సంక్రమించవు" అనాలోచితంగా బెస్ తొందరపడింది.  "ఆమె వయసు మూడేళ్ళే కద!"


వీలర్ మృదువుగా నవ్వాడు.  "కాదు ...కాదు.  ఆమె వయసు ఇరవై ఒకటి."


నాన్సీ, బెస్, జార్జ్ విస్తుపోయారు.  "ప్రస్తుతం జోనీ హోర్టన్ ఎక్కడుంది?" నాన్సీ అడిగింది.


(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages