అమ్మో..అమ్మకలా అయితే..? - అచ్చంగా తెలుగు

                           అమ్మో..అమ్మకలా అయితే..?

ప్రతాప వెంకట సుబ్బారాయుడు 



ఎనిమిదినెలల గర్భాన్ని మోస్తూ.. నెమ్మదిగా, ఆయాసపడుతూ, చిరుచెమటలతో గదిలోకొచ్చింది జనని.

మంచం మీద కూచున్న రఘు ముభావంగా లేచి జనని దగ్గరకెళ్ళి, చిన్నగా మంచం దగ్గరకి నడిపించుకుంటూ వచ్చి, దిండ్లు సర్ది ఆమెని జాగ్రత్తగా పడుకోబెట్టి, కాళ్ళునొక్కసాగాడు.

"ఏవండీ.."

ఏవిటన్నట్టుగా భార్య వంక చూశాడు.

"మీరీమధ్య ఎందుకో డల్ గా ఉంటున్నారు. నాకు కడుపు వచ్చినప్పుడు కనబరచిన ఉత్సాహం, నెలలు నిండి పిల్ల బయటకు వచ్చే సమయం దగ్గరవుతోందన్న ఆత్రుత..మీలో గత కొద్దిరోజులుగా కనిపించడం లేదు. ఏదో కోల్పోయినట్టుంటున్నారు. మీ మనసులోది బయటకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? సమయంలో నా మనసు ప్రశాంతంగా ఉండాలని మీకు తెలుసుకదా, మీరలా ఉంటే, నేను సంతోషంగా ఎలా ఉండగలను?" బేలగా అంది.

మాట విన్నాక అతని హృదయం శీతలపవనం సోకిన కరిమేఘం అయింది. కళ్ళు కొంతసేపు అవిశ్రాంతంగా కన్నీళ్ళు వర్షించాయి.

"ఏవైందండి? ఎందుకు ఏడుస్తున్నారు?" ఆందోళనతో లేవబోయింది.

ఆమెను లేవనీకుండా చేతులతో సున్నితంగా అడ్డుకుని, కొన్ని నిమిషాల్లో తేరుకుని, మనసు లోని బాధను మాటలుగా పరిచాడు.

"జననీ, నువ్వ కడుపుతో ఉన్న విషయం, అదీ మా అమ్మ చనిపోయిన ఆర్నెళ్ళలోగా..తెలియగానే మురిసిపోయాను.

నీకు తెలుసు మా అమ్మంటే నాకెంతిష్టమో? అందరికీ తల్లి అపురూపమే! నాకైతే మరీను.

నా చిన్నప్పుడే నాన్న చనిపోతే, నన్ను పెంచడానికి కష్టాలకు ఎదురీదింది. బాధలతో సావాసం చేసింది. చుట్టాలు, పక్కవాళ్ళూ ఎవరూ చిన్నమెత్తు సాయం చేయకపోయినా, నిరాశపడలేదు. ఆవిడ జీవితానికి ఒకటే లక్యం, నన్ను వృద్ధిలోకి తీసుకురావాలని. అహర్నిశం అదే ఆలోచనతో చదివించింది. 'ఎప్పుడు ఉద్యోగం వస్తుందా? అమ్మను ఎప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటానా' అన్న ఒకటే ధ్యేయం నాకుండేది.

చదువు పూర్తి చేసుకున్న నాకు క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం రావడం, అమ్మ పట్టుపట్టి ఊళ్ళో ఉన్న నిన్ను నచ్చుకుని నా పెళ్ళి చేసేయడం అన్నీ ఆదరబాదరగా జరిగిపోయాయి.

నేనూహించనిది, నా జీవితంలో అశనిపాతమైందీ.. రాత్రి పడుకున్న అమ్మ పొద్దున్న లేవకపోవడం. తన బాధ్యత తీరిపోయిందనుకుందేమో, ప్రాణం విడిచేసింది. కాని నేనది తట్టుకోలేకపోయాను. అమ్మ మనసుకున్న గాయాలకు మాటల, చేతల నవనీతంతో లేపనం పూద్దామనుకున్నాను...ఊరట కలిగిద్దామనుకున్నాను. తానొకటి తలిస్తే, దేవుడొకటి తలుస్తాడన్నది నిజమే జననీ. జన్మకు అమ్మ నాకు లభించదు" అని వెక్కెక్కి ఏడ్చాడు. గుండెల్లోని భారం దిగేదాకా పొగిలి పొగిలి ఏడ్చాడు.

జనని అతని చేతులను అందుకుని  అనునయంగా సన్నగా నొక్కుతుండడంతో, లోకంలోకి వచ్చి మళ్లీ చెప్పడం ప్రారంభించాడు-

"అలా.. అమ్మను జన్మలో పొందలేనని, సేవ చేయలేనని బాధపడుతున్న నన్ను, నా బాధనీ చూడలేకపోయాడేమో భగవంతుడు, అమ్మ చనిపోయిన ఆర్నెళ్లకే నీ కడుపు పండేలా చేశాడు. పొట్ట ఇంటిలో ఉన్నది ముమ్మాటికీ అమ్మే! నువ్విందాక అన్నావుకదా, లోపలున్న శిశువును చూడాలన్న తహ తహతో నేనున్నానని, కాదు జనని కాదు, నన్ను చూడక ఉండలేని ఆవిడే ఎప్పుడెప్పుడు బయటకి వచ్చి నన్ను చూడాలా? అని ఆత్రపడుతోంది. కాని కాని జననీ.."మళ్లీ ఆమె పొట్ట మీద తలను ఆనించి మనసులోని భారం దిగేలా ఏడ్చాడు.

"ఏవిటండీ ఇది చిన్న పిల్లాడిలా.."రఘును అనునయించింది.

"జననీ..ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఈడపిల్ల కాదని ఈసడించుకునేవాళ్లు. మగ పిల్లల్ని ప్లస్ అని ఆడ పిల్లలని మైనస్ అని కించపరచేవాళ్లు. పెరిగి పెద్దయితే తండ్రి గుండెల మీద కుంపటి అనేవాళ్లు. ఇలా ఎన్నో వివక్షలు. సమాజం పెట్టిన భయానికి, లింగ నిర్దరణ పరీక్షలు చేయించి, ఆడపిల్ల అని తెలిస్తే పాపం పిచ్చి తల్లిదండ్రులు రాక్షసంగా భ్రూణ హత్యలకు సైతం దిగజారేవారు. నెలలు నిండి ఆడపిల్ల పుడితే, రేపటి ఆమె జీవితం కళ్ల ముందు వికృతంగా కనబడి గుండెలు జారిపోయేవి తల్లిదండ్రులకు.

కుల మతాలు, వర్గ వైషమ్యాలు తెలియని కుర్రతనపు ప్రేమలో..దోషం అమ్మయికే అంటగట్టి పెద్దలు జరిపిన పరువు హత్యల పర్వాలెన్నో తెలుసా?

పెద్దయ్యాక మనింటి మహాలక్ష్మిని కట్న కానుకలతో అత్తారింటికి పంపడం ఘోరం. అక్కడ జరగకూడనివి ఏవన్నా జరిగితే విత్తనం దశ నుంచి సమస్త జాగ్రత్తలూ తీసుకుని పెంచి పెద్ద చేసిన చెట్టును కూకటి వేళ్లతో కూల్చేసినట్టే కదా.

వ్యవస్థలో ఆడపిల్లల విషయంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, నేను అమ్మాయే కావాలనుకున్నాను. అమ్మే కావాలనుకున్నాను. ఎందుకంటే ఆవిడ బతికుండగా ఏం చేయలేకపోయాను. కనీసం జన్మలోనన్నా అమ్మను అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకోవాలని.

కాని ఇప్పుడు ఆడవాళ్ల పట్ల సమాజం మరింత పైశాచికంగా, కిరాతకంగా తయారైంది జననీ. వావి వరసలు, వయసు చూడడం లేదు ఆడది కనిపిస్తే చాలు మదించిన ఆబోతుల్లా మీదపడిపోతున్నారు. పాలుగారే శిశుదశ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుందే, అలాంటిది మగాళ్లు విచక్షణ కోల్పోయి, వాళ్లపై అత్యాచారం చేయడమేమిటి? పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు సైతం లైంగిక దాడులకు తెగబడడం, అత్యాచారాలు చేయడం, బలాత్కారాలకు తెగించడం పేపర్లలో చదువుతుంటే, మనం నాగరికులమా? చి..ఛీ..అనిపిస్తోంది. మగాణ్నై పుట్టినందుకు సిగ్గేస్తోంది.

మొక్కకు కంచెకడితే పశువులు తినవు. ఆడపిల్లను అలా ఎలా పెంచగలం? తల్లిదండ్రులం అహర్నిశం వాళ్లని అంటిపెట్టుకుని ఎలా ఉండగలం? చదువుకోవాలి, తమకిష్టమైన కళల్లో రాణించాలి..ఉద్యోగాలు చేసి తమ కాళ్లపై తాము నిలబడాలి..పైగా..పైగా నాకు పుట్టేది అమ్మ..అమ్మ విషయంలో అలాంటి కౄరకృత్యమేదన్నా జరిగితే నేను తట్టుకోగలనా..తట్టుకోగలనా..గట్టిగా గుండె బద్దలైనట్టు ఏడ్చేశాడు.

జనని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రఘు భయానికి కారణం అదా? రోజూ పేపర్లలోని వార్తలు, టీ వీల్లోని దృశ్యాలూ ఆమె మనో ఫలకంపై ఎర్రగా, భయానకంగా కదలాడాయి.

లోకం ఎంతో అందంగా ఉంటుందని, తనను అల్లారుముద్దుగా, జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకుంటోంది లోపలున్న పిచ్చితల్లి. బయటకు రావడం కోసం మృగాళ్లు నక్కల్లా..చిత్తకార్తెకుక్కల్లా పొంచి ఉన్నారని తెలిస్తే..అక్కడే పొట్టలోనే తన చిన్నిప్రాణం తీసుకుంటుందితల్లి మనసు తల్లడిల్లిపోయింది. తండ్రి హృదయం ఎప్పుడో బాధతో లుంగలు చుట్టుకుపోయింది.

***

"మీరు మీ అమ్మ పుడుతుందనుకున్నారు..ఇప్పుడేమంటారు?" అంది  జనని తన పక్కన నిద్దరోతున్న మగబిడ్డను చూపించి నవ్వుతూ.

"ఇప్పుడు కూడా పుట్టింది అమ్మే, కాకపోతే బయట ప్రపంచానికి భయపడి అబ్బాయిగా.."అన్నాడు వాడి లేత బుగ్గమీద ముద్దుపెడుతూ.

***

 

No comments:

Post a Comment

Pages