అంతటనే వచ్చి కాచు నాపద్బంధుడు హరి (21-05-21) - అచ్చంగా తెలుగు

అంతటనే వచ్చి కాచు నాపద్బంధుడు హరి (21-05-21)

Share This
 అంతటనే వచ్చి కాచు నాపద్బంధుడు హరి  
(అన్నమయ్య కీర్తనకు వివరణ )

డా.తాడేపల్లి పతంజలి
 



రేకు: 0334-06  సం: 04-201


పల్లవి

అంతటనే వచ్చి కాచు నాపద్బంధుడు హరి

వంతుకు వాసికి నతనివాడనంటే జాలు

.1:

బంతిగట్టి నురిపేటి పసురము లెడ నెడ

బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు

చెంతల సంసారము సేయు నరుడందులోనె

కొంత గొంత హరి నాత్మ గొలుచుటే చాలు

.2: 

వరుస జేదు దినేవాడు యెడ నెడగొంత

సరవితోడుతదీపు చవిగొన్నట్టు

దురితవిధులు సేసి దుఃఖించు మానవుడు

తరవాత హరిపేరు దలచుటే చాలు

.3: 

కడుబేదైనవాడు కాలకర్మవశమున

అడుగులోనే నిధానమటు గన్నట్టు

యెడసి శ్రీవేంకటేశు నెరగక గురునాజ్ఞ

పొడగన్నవానిభక్తి పొడముటే చాలు


భావం

పల్లవి:

సంసారులు మొక్కుబడి కోసమయినా ‘ మేము నీవారము’  అన్న చాలు. వెంటనే ఆపదలలో రక్షించు శ్రీహరి వారిని రక్షించును.


చ.1:


వరికుప్పలు నూర్చటానికి  ఉన్న పశువు అప్పుడప్పుడు  ఒక్కొక్క గడ్డిపరకను  దగ్గరినుండి గ్రహించి తృప్తి పడుతుంటుంది. అలాగే   సంసారము చేయు మానవుడు తనకు కుదిరినప్పుడల్లా వేంకటేశుని మనస్సున నిలిపితే కృతార్థుడగును.


చ.2


ఎప్పుడూ చేదు తినేవాడు మధ్యలో అప్పడప్పుడు తీpi రుచి చూసి  సంతోషించినట్లుగా పాపపు విధి తప్పనిసరిగా చేసి “అయ్యో! తప్పు చేసానే” అని దుఃఖించు మానవుడు  వెంటనే శ్రీ హరినామాన్ని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి.


చ.3:


కాలము కలిసి వచ్చినప్పుడు కటికపేద వానికి  ఒక్క అడుగులో గొప్ప ధనపునిధి కనబడుతుంది. అలా  శ్రీవేంకటేశుని తత్వము ఏమాత్రము తెలియక తహతహలాడువానికి,గురుని ఆజ్ఞతో హరిదాసులపై భక్తి నిలిపితే శ్రీవేంకటేశుని తత్వము అర్థమై జన్మ ఫలిస్తుంది.


 స్వస్తి.

No comments:

Post a Comment

Pages