అనసూయ ఆరాటం - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం

(కొత్త సీరియల్ ఆరంభం )

చెన్నూరి సుదర్శన్ 


          ఓడలు పోయి బండ్లైతై.. బండ్లు పోయి ఓడలైతై. ఎవల నసీబు ఎట్లున్నదో..! ఎవ్వలకెరుక. కొందరి కతలు ఇంటాంటే ఇచ్చంత్రమైతది. నమ్మబుద్ధి కాదు. కాని మన ముందల కండ్లకు కట్టినట్టు కనబడుతాంటే.. నమ్మక తప్పది. అయినా మన సేతుల్ల ఏమున్నది. అంతా మన నొసలు మీద తక్దీర్ రాసే బమ్మ దేవునికే ఎరుక.


          ‘కాలం కలిసత్తే నడిచచ్చే కొడుకు పుడ్తడు’ అన్నట్టు సమ్మయ్య, బుచ్చయ్యలకు నడిచచ్చే కొడుకు లెక్కనే ఎదురైండు లింగారెడ్డి.


 “సేట్లూ.. బ్యారం ఎట్ల సాగుతాంది” అన్కుంట. జరంత సేపు ఆగుమన్నట్టు చెయ్యి సూయించిండు.


          సైకిలు స్టాండుకు పెద్ద బట్టల మూట ఉండుట్ల.. సైకిలు దండె ముందుకెల్లి కాలు తిప్పుకొని ఎడ్మ పైడల్ మీదున్న కాలు బిగబట్టి సట్న సైకిలు దిగిండు బుచ్చయ్య. 


“ఔ.. పటేలా..! సంచిల సంచకారి లేకున్నా.. ఏదో అంటరు సూడు.. సేట్లమే..!‘ గడియ రికాం లేదు.. గవ్వ రాకడ లేదు’. మా గోస  ఎవ్వలకు చెప్పుకోవాలే.. పటేలా” అన్నడు సమ్మయ్య.. సైకిలు బిరకేసి దిగుడు దిగుడే.  సమ్మయ్య తోడెం పొట్టిగుంటడు. దిగబోయి సొలిగిండు. లింగారెడ్డి పట్టుకున్నడు పడకుంట.     


సమ్మయ్య, బుచ్చయ్య జిగ్రీ దోస్తులు. ఇద్దరిదీ ఒక్క ఊరే.. హన్మకొండ దగ్గర ఊరుగొండ. మొదట్ల కూలికి మొగ్గాలు నేసెటోల్లు.


సమ్మయ్యకిద్దరు కొడుకులు. బుచ్చయ్యకో కొడుకు, ఒక బిడ్డ. ఒక పక్క పిల్లలు ఎదుగుతాండ్లు గాని సంసారం ఎదుగ కచ్చిందని మిడ్కబట్టిండ్లు.


ఆ ఊరి బడి పంతులుకు మంచి పేరున్నది. బడి మొత్తానికి ఒక్కడే పంతులు. ఊరి బాగు కోసం.. పెద్దబడి కోసం పాకులాడుతాంటడు. ఊరోల్లకు బతుకుదెరువుకు ఉపాయాలు సుత చెప్తాంటడు.


ఒక రోజు బుచ్చయ్య, సమ్మయ్యలు పంతులును కలిసిండ్లు.. ఏదైనా ఉపాయం చెప్తడని. తమ కడ్పులున్న ఎతనంత చెప్పుకున్నరు. వీల్ల తండ్లాట సూసి  పంతులు గుండె కలికలైంది.  


“ఇద్దరికైతే సైకిల్లున్నై కదా.. వాటికి పని చెప్పుండ్లి. బట్టల బ్యారం చెయ్యుండ్లి. వరంగల్ల నాకు తెలిసిన సేటున్నడు. ఆయనకు పెద్ద బట్టల దుకాణమున్నది. అందుల జమానత్ పడి బట్టలు ఉద్దెరకిప్పిత్త. కాని కొన్నైనా పైసలు కడ్తే మర్యాదగుంటది” అన్నడు పంతులు నెత్తి గోక్కుంట.


సమ్మయ్య, బుచ్చయ్య బగ్గ సోంచాయించిండ్లు. పెండ్లాల మీది గంటె పుత్తెలు ఊళ్ళె సావుకారు దగ్గర కుదువబెట్టి చెరో రెండునూర్లు.. రెండుపైసల సొప్పున మిత్తికి తీసుకున్నరు.


పంతులు ఇప్పిచ్చిన దుకాన్ల ఖాత తెర్సిండ్లు.  ‘పంతులు కడుపు సల్లగుండ..’ అనుకున్నరు మన్సుల. కొన్ని పైసలు జమ కట్టుడు.. బట్టలు తెచ్చి సైకిలు మీద ఊరూరూ తిరుక్కుంట అమ్ముడు..


ఊరోల్లు వీల్ల దగ్గర ఖాతాలు.. వీల్లు వరంగల్ల సేటు దగ్గర ఖాతాలు. ఏనాడూ.. పైసలు సుక్త కట్టింది లేదు. అనుకున్నంత సంసారం ఎదిగిందీ లేదు. ‘గొర్రె తోక జానెడే’ అన్నట్టు.


 “ఏంది బుచ్చయ్య సేటూ.. నువ్వేం మాట్లాడవ్. సమ్మయ్య సేటు సూడు.. శాత్రాల మీద శాత్రాలు గుప్పిత్తాందు” అన్కుంట ముస్కురాయించ బట్టిండు లింగారెడ్డి.


“రోలచ్చి మద్దెల తోటి చెప్పుకున్నట్టున్నై మాబతుకులు. ఊల్లె బట్టలు తీసుకున్న తల్లులు పైసలియ్యమంటె మొకం సాటేత్తరు. అటు అప్పులోల్లు.. ఇటు బట్టలు ఉద్దెరకిచ్చిన సేటు.. చెరో దిక్కు వాయిత్తాంటే సట్టర్ల నాడె లెక్క అటూ, ఇటూ తిరుగుతానం” అని ముక్కిర్సిండు బుచ్చయ్య. దోతి కొస, రొండ్లె దోసుకుంట.. కమీజు కీసలకెల్లి దోస్త్ బీడీ తీసి ఎలిగిచ్చిండు. ఒక దమ్ము గుంజి సమ్మయ్యను సూసిండు. ఆ సూపు ఇంక పోదామన్నట్టున్నదని  తెల్సుకున్నడు లింగారెడ్డి.

No comments:

Post a Comment

Pages