ఈ దారి మనసైనది - 39 - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది - 39

అంగులూరి అంజనీదేవి  


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్వితకు  ధైర్యం చెప్పి, మామూలు మనిషిని చేస్తాడు  ధీరజ్. ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకు వస్తే, అతడు మరణిస్తాడు.)

“ఒక్క సారి మీరు ఆలోచించండి ! ఏ డాక్టరైనా పేషంట్స్ చంపుకోవాలని చూడదు. ఆ డాక్టర్ మా వాడ్ని సేవ్ చెయ్యాలనే వచ్చింది కదా! అప్పటికే చనిపోయిన వాడ్ని ఎలా బ్రతికించ గలుగుతుంది? అసలు అతనికి మందు తాగాల్సిన అవసరం ఏమొచ్చిందో,దాని గురించి ఆలోచించకుండా డాక్టర్ మీద పడితే ఏ డాక్టరైనా ఏం చేస్తారు ? ” అన్నాడు ధీరజ్.

" అది కాదు డాక్టర్ ! హాస్పటల్ కి వచ్చేంత వరకు బతికే వున్నాడు” అంటూ బోరున ఏడుస్తూ బాధగా ప్రక్కకి వెళ్లాడు ఆ యువకుని మేనమామ. అసలు ఇదంతా అయన చేస్తున్న గొడవే. తన పిల్లని పెళ్లి చేసుకోమని పట్టుబట్టడం వల్లనే అతను చనిపోయాడు. అయనికి ఎలాగైనా ఆ కుర్రాడ్ని బతకించుకోవాలని వుంది ... ఎలా బ్రతుకుతాడు? ఏడిస్తే బ్రతుకుతాడా ? డాక్టర్ని తిడితే బ్రతుకుతాడా ? డాక్టర్ పై కేసు వేస్తే బ్రతుకుతాడా?

“మనిషి ప్రాణం పోవటానికి ఒక్క క్షణం చాలదా? డాక్టర్ది తప్పులేనప్పుడు వారు కేసు వేసినంత మాత్రాన ఆ కేసేమైనా నిలుస్తుందా? అతనేమైనా బ్రతికి వస్తాడా? అదీకాక డాక్టర్ కూడా లేటుగారాలేదని అందరు అంటున్నారు ” అన్నాడు ధీరజ్.

" అది కాదు డాక్టర్ ! ఎలాగైనా కేసువేసి ఇలాంటి వాళ్లని బయటకి లాగాలి ...” అన్నారు అందరు ఏక కంఠంతో ... ఆ కుర్రాడి తండ్రి కూడా ఆ మాటలకి సపోర్ట్ చేస్తూ ధీరజ్ పక్కన నిలబడ్డాడు.

మీడియా వాళ్లు అక్కడ జరుగుతున్నదంతా టి.వి.లో లైవ్ ప్రసారం చేస్తున్నారు. ఇదంతా వినిలోపలవున్న డాక్టర్స్ సి. ఎం.ఓ. , డి.ఎమ్.ఓ వచ్చి అక్కడ నిలబడ్డారు.

“చూడండీ ! చనిపోయిన వ్యక్తిని ... ఇంకా ప్రాణం వుంది. బ్రతికిస్తామని లోపలకి తీసికెళ్లి ట్రీటిమెంట్ ఇచ్చినట్లు నటించి ... చివరకు చనిపోయాడు. మేమింతవరకు ఇచ్చిన ట్రీటిమెంటికి బిల్ కట్టి బాడీని తీసికెళమనే వాళ్ళనైతే నమ్ముతారు కాని నిజాయితీగా వుండేవాళను నమ్మరు. అసలు అతను విషం తాగే దాకా రావటానికి కారణం అతని మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా మీ బావ పెళ్లికి తొందర చెయ్యడమేగా ... కేసు పెట్టడంలాంటి పనులు చేస్తే, తీగలాగితే డొంక కదుల్తుంది మరి.” అన్నాడు దీరజ్. ఆ యువకుని తండ్రితో

ధీరజ్ సమయస్ఫూర్తి - ఆ వూరి వాళ్లకి తెలియంది కాదు.

కుర్రాడి తండ్రి, మేనమామ ఒకరి ముఖాలు ఒకరు చూసు కున్నారు. అక్కడ నుండి కదిలి శవాన్ని తీసికెళ్లే ప్రయత్నం చేశారు.

అక్కడుండే డాక్టర్స్ ధీరజ్ భుజం తట్టారు.

ఆ సంఘటనతో మన్విత బాగా ఆప్ సెట్ అయి, హాస్టల్ కి వెళ్లకుండా ఇంటికెళ్లింది.

* * * *

ఆటో దిగి ఇంటి వైపు నడుస్తోంది మన్విత ....

ఇంకొద్ది దూరం నడిస్తే ఇల్లు వస్తుందనగా సన్నటి సందులాంటి ఆ వీధిలో నడుచుకుంటూ వస్తోంది నానమ్మ 'ఈ టైంలో నానమ్మ ఎక్కడికి వెల్తోంది?' అని మనసులో అనుకుంటుండగా ... కళ్లనీళ్లు తుడుచుకుంటూ దగ్గరవుతున్న నానమ్మను చూసి దిగ్ర్భాంతి చెందింది. మన్విత.

మన్వితను చూసి వర్థనమ్మకూడా అలాగే అయింది.

“ నానమ్మా ! ఎక్కడి కెళ్తున్నావ్? ఏంటలా వున్నావ్ ? మమ్మీ ఏమైనా అన్నదా?” అంటున్న మనువరాలు ప్రశ్నలకి సమాధానంగా కళ్లు తుడుచుకుంటూ తలవంచుకొంది.

“ ఏం జరిగింది నానమ్మా ! చెప్పు?” అంటూ మెల్లగా నానమ్మ భుజం చుట్టూ చేయివేసి, గడ్డం పట్టుకొని పైకి లేపుతూ మృదువుగా ప్రశ్నించింది.

ఆమె మాట్లాడలేదు. మన్విత సహనానికి అదో పరీక్ష అయింది.

“పద ! నానమ్మా ! ఇంటికెళాం !” అంటూ ఇంటి వైపు నడిపించబోయింది.

" నేను రాను ... ఇప్పుడు నువ్వు కూడా వెళ్లొద్దు ...” అంది. ఏదో భయంతో కూడిన ఆందోళనతో ...

“ఏం ! ఎందుకు ? ” అంది మన్విత అర్థం కాక ...

"ఆ వీధిలో ... మన ఇంట్లో ... ప్రస్తుతం నీదే చర్చ. పక్కంటి పిల్లాడొచ్చి టి.వి.లో నువ్వోస్తున్నావని చెప్పగానే అందరం చూశాం... “అయ్యో ?నీ కూతురు మనుషుల్ని కూడా చంపుతుందా కృష్ణవేణీ ! అంటూ వీధిలో వాళ్లంతా మన ఇంటి కొచ్చారు... మీ మమ్మీకి తలకొట్టేసినట్టే ఎప్పటిలాగే నా మీదకి లేసింది. “దాన్నిందుకేనా మీరు  చదివించేది?” అని ... తెలిసీ తెలియకుండా నా మనవరాల్ని మాటలంటే నేనొప్పుకోను” అంటూ ఆ వీధిలో వాళ్లను కసురుకున్నాను.

దానితో మీ మమ్మీకి కోపం వచ్చింది. “దేనికైనా ముందుకొచ్చి నీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పే వీధిలో వాళ్లపై కోప్పడతావా? తప్పంతా నీ మనవరాలి దగ్గర పెట్టుకొని మొన్నటికి మొన్న ప్రేమలో పడి నరాలు రోసుకుంది ఇప్పుడేమో ఒకతను చనిపోతుంటే చూస్తూ వూరుకొంది.ఇందుకేనా దాన్ని మీరు డాక్టర్ చదివించింది? మనుషుల్ని చంపి టి.విలో కన్పించటానికా? వీధిలో రేప్పొద్దున నేను తలెత్తుకు తిరగాలా వద్దా? నా మాటవిని పెళ్లిచేసి వుంటే ఎంత గౌరవంగా వుండేది?” అంటూ నిన్నూ, నన్నూ నానా మాటలు అంది.

“నన్నంటే అన్నాను కాని నా మనవరాల్ని అంటే నేను ఒప్పుకోను. అదిప్పుడు డాక్టరు. గౌరవనీయమైన హోదాలో వుంది.” అన్నాను... “ఆ ... పెద్ద హోదా ! కన్పించిందిగా టి.వి. లో ” అంది.

ఆ తర్వాత చిలికి, చిలికి గాలివాన అయింది. " అదొస్తే అన్ని నిజాలు తెలుస్తాయి ఇంకేంమాట్లాడకండి!” అన్నాను. “ఎక్కడ కొస్తుంది? నా గడప తొక్కితే దాన్ని కాళ్లు విరగొడతాను.” అంది. “నా మనవరాలు నా ఇంటికి రాక ఎక్కడికి వెళ్తుంది?” అన్నాను... దానితో రెచ్చిపోతూ ... “ఎక్కడుంది నీ కిక్కడ ఇల్లు ?” అంది కట్టేవిరిచినట్లు పెళ్లున మీ మమ్మి ఒక్కక్షణంకూడా ఆ ఇంట్లో వుండబుద్ది కాలేదు...” అంది వర్ధనమ్మ జరిగింది మొత్తం వివరిస్తూ .... అమె కళ్లు వర్షిస్తూనే వున్నాయి. 

... హాస్పిటల్లో జరిగిన సంఘటన నానమ్మను వీధిపాలు చేసిందా ?ఎంత పని జరిగింది?

“ఈ కోపతాపాలు మామూలే నానమ్మా ! అంత మాత్రాన ఇల్లు వదిలి వచ్చెయ్యడమేనా? మమ్మీ కోపం నీకు తెలియదా? పాల పొంగు ... కాస్త నీళ్లు చల్లితే తగ్గి పోతుంది. అయినా మమ్మీ అన్నంత మాత్రాన ఆ ఇల్లు నీది కాకుండా పోతుందా? ” అంది మన్విత.

“నాదెలా అవుతుంది? ఆ ఇల్లు మానాన్న నాకివ్య లేదు. నా భర్త కట్టించలేదు. పోనీ... నా కొడుకు సంపాదనతో కట్టింది కూడా కాదు. అది మీ మమ్మీకి వాళ్ల తల్లిదండ్రులు పోతూ ఇచ్చింది. అది నా దని వాదించే అధికారం కూడా నాకులేదు...” అంది వర్దినమ్మ.

ఆ మాటలకి మన్విత ఒళ్లు జలదరించింది.

సుదీర్ఘమైన ఆమె జీవన యాత్రలో ...ఉండేందుకు సొంత ఇల్లుకూడా సంపాయించుకోకుండా... ఈజీవన సంధ్యాసమయంలో నీడను కోల్పోయింది. అందుకే అంటారు. మనిషి స్మశానానికి వెళ్లేంత వరకు కూడు, గుడ్డ, గూడు అవసరమని..... 

మారుతున్న కాలంలో వచ్చే మార్పులు, వ్యాపార దృష్టితో మారే బాంధవ్యాలు... వాటివల్ల వచ్చే ఇబ్బందులు వర్ధనమ్మను అయోమయంలోకి నెట్టి వేశాయి. ఆత్మాభిమానంతో, అవమానంతో ఆమె మనసు మిషన్లో పెట్టిన చెరుకు గడలా వుంది.

నానమ్మను అలా చూస్తుంటే మన్విత కరిగిపోయింది. మనిషి బ్రతకడం కోసం ఇంత అంతర్గత కుమ్ములాట, డిస్ట్రబెన్సెస్ అవసరమా అన్పించింది.

నానమ్మ కన్నీళ్లు తుడుస్తూ .... ఒక్క క్షణం తన కళ్లెందుకు తడవటం లేదో ఆలోచించింది. నిజంగా తనకిప్పుడు... రావలసిన టైంకు కూడ కన్నీల్లు రావటం లేదు. బహుశా తనకి ఎదురైన పరస్థితులు తనని రాయిని చేసివుంటాయి. ఇంత చిన్నవయసులో .... ఇన్ని బాధలు, కష్టాలు, అవమానాలు ఎదురవుతుంటే వాటి నెలా జయించాలో అర్థం కావటం లేదు ఆశక్తులమైతేనే శక్తులమయ్యే సామర్థ్యం పెరుగు తుందంటారు. తనిప్పుడేం చేయాలి ?

" మమ్మీకి నేను నచ్చ చెబుతాను నానమ్మా ! నిన్నింకెప్పుడూ అలా అనొద్దని ...” అంటూ నచ్చ చెప్పబోయింది మన్విత.

" నువ్వేం చెప్పినా నేను రాను ...” అంది వర్ధనమ్మ. “రాక ... ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు నానమ్మ?” అంది మన్విత.

" ఎక్కడికో వెళ్లాలని వుంటే కదా ! టైం గురించి ఆలోచించేది.” అంది. | ఈ మధ్యన ఎదుటి వాళ్ల బాధను అవలీలగా అర్థం చేసుకొనే శక్తి మన్విత సొంతమైందన్నట్లుగా నానమ్మ మానసిక స్థితిని వెంటనే అర్థం చేసుకోగలిగింది.

“సరే ! రా ! మా హాస్టల్ కి వెళాం ! ” అంది మన్విత.

“మీ హాస్టల్ కా ! అమ్మో ! నేనురాను. మీరంతా పిల్లలు... నేను వయసులో పెద్దదాన్ని... నన్ను చూసి నవ్వుతారు. పైగా డాక్టర్లు ...” అంటూ ఫీలయింది.

“ఏం కాదు నానమ్మా! నాతోటి హౌస్ సర్జన్లందరికి ఇంటి దగ్గర నీలాగే నానమ్మలుంటారు... మీరు లేకుండా మేమెలా వచ్చాం చెప్పు? నువ్వలాంటి భయాలేమి పెట్టుకోకు...” అంటూ నానమ్మ చేయి పట్టు కొని ఆటో ఎక్కించి ... తన హాస్టల్ కి తీసికెళ్లి ... ఆ రాత్రికి తన రూంలో వుంచుకొంది మన్విత..

“ నీకు నేనున్నా ” నన్నట్లు నానమ్మ పై చేయివేసి ... నిశ్చింతగా పడుకోమని చెప్పింది. మన్వితకి నిద్ర రావడం లేదు. నానమ్మ గురించే ఆలోచిస్తోంది.

ప్రస్తుతం నానమ్మకి - హౌస్ సర్జన్ చేస్తున్న మనవరాలు వున్నా ... బి.పి. ఘగర్ లేనందువల్ల ఆరోగ్యంగా, హుషారుగా, వయసు కన్పించకుండా వుంటుంది. నిద్ర లేచినప్పటి నుండి అన్ని పనులు ఉత్సాహంగా చేసుకుంటుంది, కాకపోతే, ఇంట్లో కోడలు చర్యలవల్ల ... తనపనికో గుర్తింపు లేదని తెలిసిపోతూ, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్లు డిప్రెషన్లో వుంటుంది. అంతే ! 

కానీ ... నానమ్మని ఎక్కువ రోజులు హాస్టల్లో వుంచుకోవటానికి లేదు. మహా అయితే రెండు రోజులు వుంచుకోవచ్చు, ఆ తర్వాత ... ఎక్కడ వుంచాలి ? తండ్రి పట్టించుకోడు. అయన అదో టైపు. 

ఈ మధ్యన తన గురించి కూడా అయన పట్టించుకోవడంలేదు. మెడిసిన్ నాలుగు సంవత్సరాలు అయిపోగానే తన బాధ్యత తీరినట్లు మౌనంగా వున్నాడు. అదీకాక. “దానిమీద ఇంకో పైసా పెట్టినా నేను ఒప్పుకోను... అదొక్కతే కాదు. పక్కన కొడుకున్నాడు. అసలే రేట్లు మండిపోతున్నాయి. వాడి చదువుకోసం కాస్త దాచండి!” అని తల్లి ఎప్పుడో తెగేసి చెప్పింది. ఇక తన గురించి వాళ్లు ఆలోచించరు. పిల్లల్లో తల్లిదండ్రుల రక్తసంబందానికి కూడా విలువలు తగ్గిపోతున్నాయి.

... అలాగే నానమ్మను కూడా బయటకి పంపించి వేశారు. తండ్రికి ఫోన్ చేసి నానమ్మని తీసికెళ్లమని చెప్పింది.

“ తీసికెళ్తే ... మీ మమ్మీ నన్ను ఇంట్లో వుంచదు. అర్థం చేసుకో మన్వితా ! అన్నాడు విశ్వనాధ్. కనీసం ఆమెను ఓల్డేజ్ హోంలో వుంచాలన్న ఆలోచన కూడా ఆయనలో లేదు. 

రేపు ఆయనకి కూడా ఓ కొడుకువున్నాడని... ఆ కొడుకు అలోచనలు కూడా ఆయన్ని మించి వుంటాయని... ఏరు దాటాక తెప్పల్ని తగలేసుకుంటూ, ఎదురొచ్చేవాటిని దాటుకు పోవాలన్న వేగంలో కొట్టుకుపోతూ... అడ్డుగా వున్న తల్లిదండ్రుల్ని రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో వదిలేస్తాడని గ్రహించినట్లు లేడు. తను తన తల్లికి కల్పించలేని సెక్యూరిటీ, సౌకర్యం తన కొడుకు తనకి కల్పిస్తాడని... తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని భ్రమపడ్తున్నాడు. తల్లితో అవసరం లేదనుకుంటున్నాడు.

కానీ ... ఇప్పుడు నానమ్మని తను ఎలా పోషించాలి? తను వదిలేస్తే దిక్కుతోచక చనిపోతుంది. వదలకపోతే ....?

హాస్పిటల్ వాళ్లు-హౌస్ సర్జన్లకి నెలకి 5.000/- రూపాయలు ఇస్తారు. ఆ డబ్బుతోనే తను హాస్టల్ బిల్లు, మిగతా ఖర్చులు సరిపెట్టుకుంటోంది. అటు వంటి పరిస్థితిలో వున్న తను నానమ్మను బయట వుంచి ఎలా పోషించగలదు ? ఏ విధంగా చూసినా మన్విత అలోచనలు నానమ్మ విషయంలో ఓ కొలిక్కి రావటం లేదు.

“ ఏమాలోచిస్తున్నావ్? నిద్రపోకుండా మన్వీ ?” అంది సంజన. బహుశా మన్విత దీరజ్ గురించే దీర్ఘాలోచనలో వుందన్న అనుమానంతో... సంజనకి ఎలాంటి డౌట్స్ వస్తుంటాయో మన్వితకి ముందే తెలుసు ... నీ అనుమానం నిజం కాదని ఎంత చెప్పినా సంజన వినదు. అదీకాక ఈ రోజు హాస్పిటల్లో తనని సేవ్ చేసింది. దీరజ్ అని ఈ పాటికి అందరికి తెలిసే వుంటుంది. సంజనని ఇక ఆపలేం .... అందుకే!

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages