విరతి గలుగవలె - అచ్చంగా తెలుగు
విరతి గలుగవలె విష్ణుభక్తుడు గావలె
 తాళ్లపాక పెదతిరుమలాచార్య  ఆధ్యాత్మ సంకీర్తన
రేకు: 58-5 సంపుటము: 15-332
డా.తాడేపల్లి పతంజలి 
విరతి గలుగవలె విష్ణుభక్తుడు గావలె
సరవితో నుండవలె సహజయోగికిని ॥పల్లవి॥

మంతనాన నుండవలె మనసు శోధించవలె
చింతించవలె హరిని చెలగవలె
అంతరంగుడు గావలె నాసలు మానగవలె
సంతోసాన మించవలె సహజయోగికిని ॥విరతి॥

వెరవు గలుగవలె వెఱవు లుడుగవలె
యిరవై యెఱుకవలె యెచ్చరవలె
విరసము మానవలె వివేకించుకొనవలె
సరుగ మౌని గావలె సహజయోగికిని ॥విరతి॥

భావించుకొనవలె పదరకుండగవలె
కావలెబరిపూర్ణుడు కరుణవలె
శ్రీవేంకటేశ్వరుని సేవే కలుగవలె
సావధానుడు గావలె సహజయోగికిని ॥విరతి॥

తాత్పర్యం
'సహ' అంటే మనతోపాటు 'జ' అంటే జన్మించిన కుండలిని శక్తి 'యోగం' అంటే భగవంతునితో కలయిక అని అర్థం. ఇది పొందిన వాడు సహజ యోగి. ఈ సహజయోగి కావాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలో తాళ్లపాక పెదతిరుమలాచార్య   ఈ కీర్తనలో చెబుతున్నారు.

పల్లవి 
సహజ యోగి కావాలంటే మొట్టమొదట విరక్తి లక్షణం కలిగి ఉండాలి. విష్ణు భక్తుడు కావాలి .ఒక పద్ధతిగా బతికే తీరు అలవర్చుకోవాలి .

చరణం 1
 సహజ యోగి కావాలంటే ఏకాంతంలో ఎక్కువగా గడుపుతుండాలి. తన మనసుని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. శ్రీహరిని తలుచుకుంటూ ఉండాలి.ఆశలు మాని తన అంతరంగంలో ఉన్న శ్రీహరిని దర్శించుకునే తపనతో ఉండాలి . ఎప్పుడు సంతోషంతో ఉండాలి. 

చరణం 2 
సహజ యోగి కావాలంటే ఇంద్రియాల మీద  పట్టు కలిగి ఉండాలి. భయాన్ని వదిలి వేయగలగాలి .జ్ఞానానికి నిధియై జాగరూకత కలిగి ఉండాలి. విసుగు మానాలి. ఎప్పటికప్పుడు  మేలుని కీడును వివేచి స్తూ  ముని మార్గంలో బతకాలి.  ముని క్రమముగా సహజ యోగి అవుతాడు.

చరణం 3 
వేంకటేశ్వరుని ఎప్పుడూ మనసులో భావించుకోవాలి. గబగబా  వాగరాదు . పరిపూర్ణమైన కరుణా మూర్తి కావాలి .ఎల్లప్పుడూ  శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించాలి. ఎప్పటికప్పుడు తనకు జరిగే సంఘటనల మధ్య  జాగరూకతతో ఉండాలి . ఇవి సహజ యోగి లక్షణాలు. స్వస్తి.          

***

No comments:

Post a Comment

Pages