చంద్రమణి కోట రహస్యం -5 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం -5

Share This
చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 5
అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
ఆంగ్ల మూలం : The Moonstone Castle Mystery
నవలా రచయిత : Carolyn Keene
 

(డీప్ రివర్లో కనిపించకుండా పోయిన అమ్మాయి గురించి తన స్నేహితురాళ్ళతో వెళ్ళి శోధించి రమ్మని నాన్సీతో చెబుతాడు ఆమె తండ్రి. డ్రూ కోరికపై అతని యింటి వద్ద పోలీసు నిఘా ఏర్పాటుచేస్తారు. నిద్రలో తుపాకీ శబ్దం వినిపించి కిందకు వచ్చిన నాన్సీకి పోలీసులకు ఫోను చేస్తున్న తండ్రి కనిపిస్తాడు. తమ యింటి ముందు తచ్చాడే వ్యక్తిని నిఘా ఉన్న వ్యక్తి పట్టుకోబోగా, ఆ దొంగ కారులో పారిపోయాడని డ్రూ కూతురికి చెబుతాడు. అదే సమయంలో రోడ్డు మీద మొరాయించిన పాత కారు యింజను శబ్దాన్నే తుపాకీ మోతగా నాన్సీ భావించిందని కూడా చెబుతాడతను. తరువాత. . .)


నాన్సీ ఉపశమనం పొందినట్లు నిట్టూర్చింది. "ఎవరి మీదా తుపాకీ పేలనందుకు సంతోషిస్తున్నాను. దయచేసి మిగిలిన కథను చెప్పండి."

"వంటగదిలోకి వెళ్లి తినడానికి ఏదైనా తీసుకుందాం" అని డ్రూ సూచించాడు. "అదే నన్ను మెట్లు దిగి కిందకు వచ్చేలా చేసింది. నాకు నిద్ర పట్టలేదు, చాలా ఆకలిగా ఉండటంతో అర్ధరాత్రి అల్పాహారం కోసం నేను కిందకు వచ్చాను. నేను హాల్లోకి రాగానే ఏదో నీడలాంటి ఆకారం దొంగచాటుగా గది కిటికీని దాటి వెళ్ళటం గమనించాను. అదేమిటో చూద్దామని నేను బయటకు వెళ్ళేసరికి, డోన్నెల్లీ దొంగను వెంబడించటం కనిపించింది. అతను కారులోకి దూకటానికి ముందే వీధి దీపం వెలుతురులో ఒక్క క్షణం ఆ మనిషి ముఖాన్ని చూశాను."

"అతనెలా ఉన్నాడు?" నాన్సీ అడిగింది.

అపరిచితుడు సన్నగా నల్లజుట్టుతో ఉన్నాడని, అతని ముఖం చిరాకుగా ఉందని డ్రూ చెప్పాడు.

"ఓహ్! అతను నన్ను అనుసరించిన వ్యక్తి , జార్జ్ మరియు బెస్ చూసిన వ్యక్తి అయి ఉండవచ్చు!" నాన్సీ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది.
"అతనే కావచ్చు" న్యాయవాది అంగీకరించాడు. "అతను ఈ చుట్టుపక్కల ఏమి చేస్తున్నాడోనని ఆశ్చర్యపోతున్నాను."

"బహుశా నాకు పంపబడ్డ చంద్రకాంత మణిని దొంగిలించటానికి వచ్చి ఉండవచ్చు" నాన్సీ అనుమానించింది.

"అదే కావచ్చు" డ్రూ అంగీకరించాడు. "ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అతను చాటుగా వినే ఉద్దేశంతో మాత్రం లేడు. ఎందుకంటే ఈ సమయంలో మనం నిద్రపోతూంటాం గనుక."
ఇలా మాట్లాడుకొంటూండగానే నాన్సీ రెండు కప్పుల వేడి కోకోని తయారుచేసింది. తరువాత ఆమె వాళ్ళ హౌస్ కీపర్ హన్నా గ్రూ తయారుచేసిన ఏంజిల్ కేక్ ను తీసుకొచ్చింది. తండ్రీకూతుళ్ళు కూర్చుని రుచికరమైన స్నాక్ ని ఆస్వాదిస్తూ, పోలీసు కార్యాలయం నుంచి వచ్చే కబురు కోసం చూస్తున్నారు. అరగంట గడిచినా ఎలాంటి కబురు లేకపోవటంతో, పోలీసులకు ఫోను చేస్తే తప్పవుతుందా అని నాన్సీ అడిగింది.

"నువ్వు చేయి" పెద్దగా ఆవులిస్తూ చెప్పాడతను. "నాకు నిద్ర వస్తోందని ఒప్పుకొంటున్నాను. కానీ ఆ దొంగ పట్టుబడ్డాడో, లేదో తెలుసుకోకుండా నిద్రపోగలనా అని అనుమానంగా ఉంది."

ఫోను మోగటంతో నాన్సీ కంగారుగా వెళ్ళింది. కానీ రిపోర్టు నిరాశ కలిగించింది. డిటెక్టివ్ డోన్నెల్లీ వీధిలో పే ఫోను నుంచి పోలీసు కేంద్ర కార్యాలయానికి తెలియపరచిందేమిటంటే. . . తను ఎక్కిన కారుని వదిలేసి దొంగ అడవిలోకి పారిపోయాడు. చీకట్లో అతన్ని కనుగొనే అవకాశం లేదు.

"డోన్నెల్లీ మీ యింటికి తిరిగి వస్తున్నాడు" సార్జెంట్ చెప్పసాగాడు. "అనుమానితుడు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. యాదృచ్ఛికంగా అతను ఎక్కిన కారు ఈ రోజే దొంగిలించబడిందని రిపోర్టు వచ్చింది, కనుక అతని వివరాలు తెలుసుకొనే ఆస్కారం లేదు."

ఆ సందేశాన్ని నాన్సీ తన తండ్రికి తెలియపరచింది. తరువాత యిద్దరూ మేడ మీదకు బయల్దేరారు.

"హోర్టన్ కేసు గురించి నేను నీకు కొంచెం వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను" న్యాయవాది చెప్పాడు. "డీప్ రివర్లో నేను మాట్లాడాలని ప్రయత్నిస్తున్న ఒక మహిళ నుండి ఈ మధ్యాహ్నమే నాకొక సందేశం వచ్చింది. ఆమె మిసెస్ హోర్టన్ కి కాలేజీ స్నేహితురాలు. పది సంవత్సరాలుగా వారిద్దరి మధ్య సంబంధాలు లేవు. నిజం చెప్పాలంటే మిసెస్ హోర్టన్ చనిపోవటానికి ముందు ఉన్న పదేళ్ళూ అన్నమాట! ఆమె పేరు మిసెస్ ఎమోరీ. ఆమె తమ బాల్య మిత్రుల పునస్సమాగమం కోసం హోర్టన్ యింటికి ఫోను చేసింది. ఆమెతో మగవాడెవడో మాట్లాడాడు కానీ తన పేరు చెప్పలేదు. మిసెస్ హోర్టన్ ఫోను దగ్గరకు రాలేనంత అనారోగ్యంతో ఉందని చెప్పాడు. అయితే, అతను, అతని భార్య ఆ యింట్లో పనివాళ్ళమని, కొద్దిరోజుల్లో తామిద్దరూ శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళిపోతున్నామని చెప్పాడు."

"దాన్నిబట్టి జోన్ హోర్టన్ ఎక్కడకు వెళ్ళారన్నది మీకు తెలుస్తోంది. బహుశా వాళ్ళు తమతో ఆమెను తీసుకొని వెళ్ళి ఉండవచ్చు."

"సరె!" అంటూ డ్రూ, హోర్టన్ ఆస్తిని కొన్న ప్రస్తుత యజమానులను తాను కలవాల్సి ఉందని చెప్పాడు. "వాళ్ళు చాలా మంచివాళ్ళు, సహాయం చేయమని కోరుతున్నారు. కానీ ఆ యింట్లో ఏమి జరిగిందో పూర్తిగా తెలియదు. పాత యజమానులు పట్టణం విడిచి బయటకెళ్ళిపోయాక, వాళ్ళు ఈ ఆస్తిని ఒక రియల్టర్ ద్వారా కొన్నారు. వాళ్ళు నాకో క్లూ యిచ్చారు. వాళ్ళు ఆ యింట్లో దిగిన వెంటనే, అటక మీద ఉన్న చెత్తలో ఒక పోస్టుకార్డు దొరికిందట. అది పద్దెనిమిదేళ్ళ క్రితం న్యూయార్కులో, శాన్ ఫ్రాన్సిస్కోలోని మిస్టర్ మరియు మిసెస్ బెన్ ఒమెన్ కు పోస్టు చేయబడినది. దాని మీద క్లెయిర్ సంతకం చేశారు."

"ఈ ఒమన్ అన్నది ముసలామె అయిన హోర్టన్ పనివాళ్ళ పేర్లు అయి ఉండవచ్చని మీరు అనుకొంటున్నారా?" నాన్సీ అడిగింది.

"అవును, అలాగే అనుకొంటున్నాను" ఆమె తండ్రి బదులిచ్చాడు. "ఏమైనా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఈ ఆధారాలన్నీ దర్యాప్తులో చాలా విలువైనవని నేను భావిస్తున్నాను.” నాన్సీని ముందు వెళ్ళమని చెప్పి, అతను గదిలో లైట్లు ఆర్పటం ప్రారంభించాడు.

అతని కూతురు ఆగి తండ్రి వైపు చూసి నవ్వింది. "డీప్ రివర్లో శోధించటానికి నాకు ఏమైనా మిగిలి ఉందని మీరు ఖచ్చితంగా అనుకొంటున్నారా?" ఆటపట్టిస్తూ ఆమె అడిగింది.

"పుష్కలంగా" ఆమెకు హామీ యిచ్చాడతను. "ఇంకా ఏమిటంటే, ఒక కేసులో పనిచేసేటప్పుడు, నువ్వు చూపించే అద్భుతమైన అంతర్దృష్టిని యిష్టపడతాను."

ఇద్దరూ రెండవసారి శుభరాత్రి చెప్పుకొని, వెంటనే నిద్రలోకి జారుకొన్నారు. మరునాడు ఉదయం వెస్ట్ కోస్ట్ కెళ్ళే తొలి విమానాన్ని పట్టుకోవటానికి నాన్సీ తన తండ్రిని కారులో విమానాశ్రయానికి తీసుకెళ్ళింది. అక్కడనుంచి తిరిగి వచ్చిన ఆమె సామాన్లతో తన యింటి దగ్గర ఎదురుచూసే బెస్, జార్జ్ లను చూసింది.

బెస్ తన బుగ్గలపై సొట్టలు కనిపించేలా నవ్వింది. "నేను స్విమ్మింగ్ దుస్తులు, టెన్నిస్ రాకెట్టు, ఎత్తు మడమల బూట్లు తెస్తున్నాను. డీప్ రివర్ వాలీలో గూఢచర్యమే కాదు కాస్త సరదా కూడా పంచుకోవాలి. కాదంటావా?"

హన్నా గ్రూ నాన్సీ మూడవ ఏట ఆమె తల్లి చనిపోయినప్పటినుంచి కన్నతల్లిలా చూసుకొనే ఆహ్లాదకరమైన స్త్రీ. ఆమె బెస్ చేసినది అద్భుతమైన ఆలోచనగా భావించింది. " సెలవుల్లో ఆనందించటానికే వచ్చారని, అక్కడ ప్రజలు అనుకొనేలా మీరు ప్రవర్తిస్తే, సమంజసంగా ఉంటుంది."

నాన్సీ ఆలోచిస్తూ అంది, "నేను చంద్రకాంత మణిని తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను."

వెంటనే బెస్ అందుకొంది, "అలా చేయి. అది నీకు అదృష్టాన్ని తేవచ్చు. మిస్టరీలను పరిష్కరించేటప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించవచ్చు!"

"ఖచ్చితంగా అదృష్టం ఎప్పుడూ బాధించదు" మిసెస్ గ్రూ వ్యాఖ్యానించింది.

ఈ మొత్తం వ్యవహారాన్ని జార్జ్ మూఢనమ్మకంగా పరిగణిస్తుంది. "సరె! కానీ మీరు ఆ చంద్రకాంతమణిని కేవలం చూడటానికే తీసుకొస్తే, అది బాగానే ఉంటుంది."

ఆమె మాటలకు మిగిలినవారు నవ్వారు. నాన్సీ తన పర్సులో ఉంచిన భావగర్భితమైన బహుమతిని తెచ్చుకొందుకి లోనికెళ్ళింది.

"అందరూ సిద్ధంగా ఉన్నారా?" ఆమె తిరిగొచ్చి అడిగింది. "అలా అయితే, వెళ్దాం!"

అప్పటికే తన సొంత సూటుకేసులను ఆమె కారులో పెట్టుకొంది. బెస్, జార్జ్ లకు చెందిన వాటిని బయటకు మోసుకొచ్చి, కారు డిక్కీలో సర్దారు.

"గుడ్ బై, హన్నా!" అంటూ నాన్సీ హౌస్ కీపర్ ని కౌగలించుకొంది. "నీ ఆరోగ్యం జాగ్రత్త!"

"నాదీ అదే మాట, నాన్సీ!"

ముగ్గురు అమ్మాయిలు కారులోకి అడుగుపెట్టారు. నాన్సీ తాళాన్ని ఇగ్నిషన్లో పెట్టి తిప్పే ముందు, డ్రూ యింటిలోని టెలిఫోను మోగింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages