పురాణ కథలు - బసవ పురాణం - 11 - అచ్చంగా తెలుగు

పురాణ కథలు - బసవ పురాణం - 11

Share This

పురాణ కధలు  - బసవ పురాణం - 11      

పి.యస్.యమ్. లక్ష్మి
11.  బిజ్జమహాదేవమ్మ కధ

భగవంతుని భక్తిలో అనేక విధాల తరించినవారున్నారు.  ప్రియుడిగా ప్రేమించినవారు, భర్తగా పూజించినవారు, బిడ్డగా ఆదరించినవారు, స్నేహితుడిగా అంకితమయినవారు, ఇలా ఎన్నో రకాల భక్తుల గురించి కధలు విన్నాము.  అయితే ఒక మహిళ మాతృమూర్తి అయి శివుణ్ణి లాలించిన కధ మీకు తెలుసా.  ఆవిడ పేరు బిజ్జమహాదేవమ్మ.  

బిజ్జమహాదేవమ్మ శివుడికి పరమ భక్తురాలు.  ఆవిడ ఆలోచనలు ఎప్పుడూ శివుడి చుట్టూతానే తిరుగుతూ వుండేవి.  ఒక రోజు ఆవిడ ఇలా ఆలోచించసాగింది.  శివుడికి భార్య వుంది, పిల్లలున్నారు, పరిచరులందరూ వున్నారు.  కానీ తల్లి లేకపోవటానికి కారణమేమిటో?  తల్లి లేకుండా ఇతనెట్లా పుట్టి వుంటాడు?  లోకంలో అందరూ జన్మించటానికి కారణం తల్లే కదా!  అట్టి తల్లి ఇతనికి వున్నట్లు కనబడదేమి?  తల్లే వుంటే ఇతనికిన్ని పాట్లు వచ్చునా!?  తల్లే వుంటే ఇతనిని భిక్షమెత్తనిచ్చేదా?  తానే ఏదో విధముగా బిడ్డను సాకేది కదా!  బిడ్డ ఇలా భిక్షమెత్తుతుంటే ఏ తల్లి చూసి సహిస్తుంది!?  తల్లే వుంటే ఇతనికి మంచి మంచి వస్త్రాలు కట్టబెట్టేది  గానీ ఇలా తోలు ధరించనిచ్చేదా?  తన బిడ్డడు వల్లకాటిలో వుండి బూడిద పూసుకుని తిరుగుతూ వుంటే చూస్తూ వూరుకునేదా?  పైగా విషం తాగేటప్పుడు అడ్డు పడుకుండా వుంటుందా?  పాపం ఇతనికి ముందు తల్లి వుండి తర్వాత గతించి వుండవచ్చు.  ఆవిడ తల్లి హృదయం ఇంకా ఇలా ఆక్రోశించింది.  అయ్యో లోకంలో ఇంతమంది తల్లులున్నారు కదా.  ఎవరైనా ఇతనిని తమ బిడ్డగా భావించి, చేరదీసి మంచీ చెడూ చెప్పవచ్చుకదా.  ఇలాంటి పనులు చెయ్యకుండా ఆపవచ్చుకదా.  పోనీ ఎవరు చూసినా చూడకపోయినా నేనివాళ్టినుంచీ ఈ శివయ్యని నా బిడ్డగా చూసుకుంటాను అని నిశ్చయించుకుంది.  శిశు పరిణామంగల ఒక శివ లింగాన్ని తీసుకువచ్చి ఆ లింగంతో, నాయనా ఇంకనుంచి నువ్వు నా బిడ్డవు.  నిన్ను ఇప్పుడే కన్నాను.  ఇంకనుంచి నా కన్నబిడ్డలా అత్యంత ప్రేమతో నిన్ను పెంచుకుంటాను అని ముద్దులాడింది. ఆవిడ ఆ చిన్ని లింగానికి పిల్లలకు చేసే సకల ఉపచారాలు, స్నానం చేయించటం, పాలు తాగించటం, నిద్ర పుచ్చటం, అన్నీ చేసింది.  పాకే వయసు వచ్చినప్పుడు నా తండ్రి పాకుతున్నాడని ఆ లింగాన్ని ఎత్తుకుని మోకాళ్ళకి చేతులకి అయిన మట్టి తుడిచేది.  

అయిదు సంవత్సరాల బాలుడయ్యేవరకు ఆ శివుడు కూడా చూడండి!  భక్తురాలి ముచ్చట తీర్చటానికి ఆవిడ కొడుకులాగే ఆవిడ చేసే ఉపచారాలన్నీ స్వీకరించాడు.  ఒక సారి ఆ ముక్కంటి ఆ భక్తురాలికి మోక్షమివ్వదలచి ఆవిడని పరీక్షించటానికి ఒళ్ళో వున్నవాడు అలాగే కళ్ళు మూసుకుని స్పృహ లేనట్లు పడుకున్నాడు.  ఆ తల్లి తల్లడిల్లింది.  అయ్యో బిడ్డా, నీకీ రోగం ఎక్కడనుంచి దాపురించింది.  నేను పోయి నువ్వున్నా బాగుండేది.  నిన్ను విడిచి నేనెట్లా వుండగలను.  కళ్ళు తెరిచి నన్ను చూడవేమి?  ఒళ్ళు చల్లగానే వుంది.  నాడి బాగానే కొట్టుకుంటోంది.  మరి ఈ మాయ రోగమెక్కడనుంచి వచ్చింది.  ఏ క్షణంలో ఊపిరి పోతుందో అన్నట్లు వుంది పిల్లాడి పరిస్ధితి.  అని పరి పరి విధాల వాపోయింది.  నువ్వు లేకుండా నేను బతకలేను.  నీకేమన్నా అవటానికి ముందే నేను ప్రాణాలు వదిలేస్తాను అని ఉరి వేసుకోబోయింది.  

ఇంతలో పరమేశ్వరుడు తన పరివారంతో ప్రత్యక్షమయి, “అవ్వా, నిన్నుధ్ధరించటానికి నేను ప్రత్యక్షమయ్యాను.  నీ భక్తికి లొంగి ఇన్నాళ్ళూ నేను నీ బిడ్డగా వ్యవహరించాను.  నీకే వరం కావాలో కోరుకో” అన్నాడు.  దానికి ఆ అమాయక తల్లి తన బిడ్డే ఎదురుకుండా వుండి మాట్లాడుతున్నాడని తలచి, “నా తండ్రీ, నాకే వరమూ అక్కరలేదు.  నీకే రోగమూ లేకుండా చిరంజీవివై నా కళ్ళ ఎదుట కళ కళలాడుతూ లోకోధ్ధరణ చెయ్యటమే నాకు కావాలి” అన్నది.  

అప్పుడు సాంబశివుడు చిరునవ్వు నవ్వుతూ “అవ్వా, నువ్వు తల్లివై నన్ను సంరక్షిస్తూవుండగా నాకు జబ్బేమి వుంటుంది?  నాకే అస్వస్ధత లేదు.  నువ్వేమీ అలాంటి అనుమానం పెట్టుకోవద్దు.  

నువ్వు కోరినట్లు నేను సదా నీ కళ్ళ ఎదుట కనబడుతూ వుంటాను.  నువ్వింక కొంత కాలం భూ లోకంలో వుండి తర్వాత కైలాసానికి వస్తావు” అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు.

చూశారా బిజ్జ మహాదేవమ్మ తల్లి ప్రేమ ఆవిడకి కైలాస ప్రాప్తి కలిగించింది.

***

No comments:

Post a Comment

Pages