కలియుగ వైకుంఠం భద్రాచలం - అచ్చంగా తెలుగు

కలియుగ వైకుంఠం భద్రాచలం

Share This

'కలియుగ వైకుంఠం..భద్రాచలం!'

-సుజాత.పి.వి.ఎల్



కోదండరాముడు, అయోధ్యరాముడు, జానకిరాముడు అంటూ ఆ శ్రీరామమూర్తిని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమయిన శ్రీ రాముడు మానవరూపంలో ఈ భూమి యందు నడయాడిన ఉత్తమ పురుషుడిగా మన ఇతిహాసాలు చెబుతున్నాయి. మానవులు ధర్మంతో ఎలా మెలగాలో అనే విషయాన్ని తాను ఆచరించి చూపించిన మహా ధర్మమూర్తి రాముడు. ఆయన అంత ధర్మమూర్తి కాబట్టే ఆయన పాలన కూడా అంత గొప్పగా వుండేది. అందువల్లే ఇప్పటికీ ఏ ప్రాంతంలోనైనా పాలన బాగా జరిగితే ఆ పాలన జరిగిన ప్రాంతాన్ని శ్రీరామరాజ్యంగా భావిస్తారంటే ఆయన పాలన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం గుడి గురించి అక్కడి విశిష్టతల గురించి తెలుసుకుందాం.

కలియుగ అంతానికి కారణమయ్యే గుడి! భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది. చరిత్ర గోల్కొండను నవాబు అబుల్ హసన్ తానీషా పరిపాలించేటప్పుడు భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు.

1. సమీపంలోని పర్ణశాల: రామావతారంలో సీతారాములు లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసే సమయంలో ఈ భద్రాచలం సమీపంలోని పర్ణశాలలో వున్నట్లు చరిత్ర చెపుతుంది. అక్కడ ఉన్నప్పుడే రావణుడు సీతను అపహరించాడు. సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముడిని చూసి ఒక వరం అడిగాడు.

2. వరం: ఆ వరం ఏంటంటే "నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి". దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను. తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.

3. భద్రుని ఘోరతపస్సు: కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు.

4. విష్ణువు: అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం, విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే ఉండే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తుంది.

5. మూల విగ్రహం : అందుకే అక్కడ మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా వుంటుంది. రాములవారి విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది. ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, ఎడమవైపున వున్న రెండు చేతులలో విల్లు, చక్రము కనిపిస్తుంది

6. వైకుంఠం రాముడు : వైకుంఠం నుండి నేరుగా వచ్చి ఇక్కడ వెలిసాడు కాబట్టి వైకుంఠ రాముడయ్యాడని మరో కథనం వుంది. భద్రుడనే ఋషి తపస్సు వలన ఆయన తపస్సు చేసిన కొండ మీదే శ్రీరాముడు వెలశాడు. అందుకే ఆ ప్రాంతం భాద్రాద్రిగా పేరు గాంచింది.

7. రామరామరామ!: ఇక్కడి గర్భగుడి ప్రక్కనే భద్రుడి బండ అనే ఒక బండరాయి వుంది. ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామ! రామ! రామ! అనే శ్రీరామ జపం వినిపిస్తుందట. రామదాసు ఇప్పుడు వున్న రామాలయాన్ని కట్టించక మునుపు ఒక చిన్న ఆలయంగా అక్కడి బోయవారు కట్టి పూజించేవారు.

8. ఆదిశంకరాచార్యులు : ఆలయ నిర్మాణానికి కొన్ని వందల సంవత్సరాలకి ముందు అక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీరామదర్శనం చేసుకున్నప్పుడు సాక్షాత్తు వైకుంఠంలో వున్నట్లు ఆయనకు అనిపించిందట. అందుకనే భద్రాద్రి రాముడికి వైకుంఠరాముడు అని పేరు పెట్టారని ఒక కథనం వుంది.

9. రామదాసు చరిత్ర : కథ కాదు ఆ పేరుని ఇప్పటికీ భక్తులు స్మరిస్తూనే వున్నారు. రామదాసు చరిత్ర కథ కాదని యదార్థ ఘటనని నిరూపించటానికి ప్రధమ సాక్ష్యం భద్రాద్రి ఆలయమయితే రెండవ సాక్ష్యం గోల్కొండలోని రామదాసు చెరశాల.

10. రాములవారి పూజలు: రామదాసుని బంధించిన చెరశాలలో నిత్యం రాములవారి పూజలు చేసుకోవటానికి అక్కడ గోడలపై రామదాసు స్వయంగా తన చేతులతో సీతారాములు, ఆంజనేయస్వామి, లక్ష్మణస్వామి విగ్రహాలను చెక్కాడు. ఇప్పటికీ ఆ బొమ్మలు గోల్కొండ కోటలోని రామదాసు చెరశాలలో కనిపిస్తాయి.

11. గర్భగుడి : రాములవారి గర్భగుడిపై వున్న చక్రాన్ని ఎవ్వరూ తయారుచేయలేదట. ఆ గుడి కడుతున్న సమయంలో భక్త రామదాసు అక్కడ గోదారిలో స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చి రామదాసు చేతిలో పడిందట ఆ చక్రం. అది రాములవారు ప్రసాదించారని భావించిన రామదాసు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడి గోపురంపై ప్రతిష్టించాడు.

12. ఏకశిల : ఆలయంలో రాముడు కొలువైవున్న గర్భగుడిపై వున్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. ఈ రాయి బరువు 36 టన్నులు, అంతటి బరువైన రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆకాలంలో అంత పైకి చేర్చిన అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతటి ఉన్నతస్థానంలో ఉండేదో తెలుస్తుంది.

13. దేవుడికి ఆభరణాలు : ఈ ప్రపంచంలోని ఏ ఆలయంలోనైనా దేవుడికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం రాములవారి నగలకు ఆయనే మూల్యం చెల్లించాడు. రామదాసు ప్రభుత్వ డబ్బుతో స్వామివారికి నగలు చేయించినందుకుగానూ రామదాసుని చెరశాలలో బంధించారు. రాములవారు ఆ మూల్యాన్ని తానీషాకి చెల్లించి తన భక్తుడిని విడిపించుకున్నారు.

14. శ్రీరామ టెంకలు: తన భక్తుడిని విడిపించటానికి రాములవారు ఆయన కాలం నాటి శ్రీరామ టెంకలు అంటే నాణేల రూపంలో ఆరు లక్షల రూపాయలను చెల్లించాడు. దీన్నిబట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు రాములవారు స్వయంగా చెల్లించినట్లయింది. ఇప్పటికీ ఆ నాణేలు గుడి మ్యూజియంలో వున్నాయి.

15. ముత్యాల తలంబ్రాలు : రాములవారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం వుందనే చెప్పాలి. భక్తరామదాసు వల్ల అప్పటి రాజు తానీషాకి కలలో రాముడు దర్శనం అవటం వల్ల ఆ మహాథ్భాగ్యానికి పొంగిపోయిన తానీషా ముత్యాల తలంబ్రాలను రాములవారి కల్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేసాడు.

16. పాలకుల చేతుల మీదుగా : ఈ శాసనం ప్రకారం స్వామివారి కల్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగానే రావాలని వుంది. అందుకే ఇప్పటికీ ఆ సంప్రదాయాలని మన ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి.

17. మంగళ సూత్రాలు : రాముల వారి కల్యాణంలో వాడే మంగళ సూత్రాలు 16 వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు. అప్పుడు ఆయన చేయించిన మంగళ సూత్రాలతో పాటు మిగిలిన ఆభరణాలన్నీ ఇప్పటికీ వాడుతున్నారు.

18. శ్రీరామనవమి వేడుకలు : భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితో తయారుచేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయే బియ్యం కోసం వడ్లగింజలను దంచడమో, మిషిన్ ల మీద ఆడించడమో చేయకుండా ఒక్కొక్క వడ్లగింజ మీద పొత్తును చేతితో తీసి ఆ బియ్యాన్ని తలంబ్రాలుగా చేస్తారు.

19. బస్సు సౌకర్యం : భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా అనుసంధానమై వుంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

20. రైలు సౌకర్యం: భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

21. లాంచీ: సౌకర్యం గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి.

22. నడవలేని వారి కోసం: వికలాంగుల కోసం భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారి కోసం లిఫ్ట్‌ సౌకర్యం కలదు.

ఇల వైకుంఠమైన 'భద్రాచలం' నా పుట్టిల్లు కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
జై శ్రీరామ్!!

***

No comments:

Post a Comment

Pages