సీతారామ కల్యాణం (మాజొన్నవాడ కధలు) - అచ్చంగా తెలుగు

సీతారామ కల్యాణం (మాజొన్నవాడ కధలు)

Share This
 సీతారామ కల్యాణం
 (మాజొన్నవాడ కధలు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)"ష్.. బావా.... ఆపు...  ప్రదక్షిణాలు చేస్తుంటే ఏంది నీ గోల?  వెనకెనకే వీపు తాకతా…నడుముల మీన చేతులేస్తూ..  నడుస్తున్నావు? మా నాయనకు తెలిసిన వాళ్ళు గానీ గమనించి చెపితే… ఇంకేమైనా ఉందా? ఇద్దరికి బడిత పూజే! దూరంగా జరుగు. ఆడ అరుగు మీద కూచో పో!"
"సీతా! నువ్వెన్ని ప్రదక్షిణాలు చేసినా నా కోసమే గదా?  నిజం చెప్పు? అయినా నువ్వేం పరాయి పిల్లవా? కాబోయే భార్యవు! " అని చెయ్యి పట్టుకోబొయ్యాడు. 
"ఎవరు చెప్పారు నాయనా నీకు? నాకు మంచి మొగుడు రావాలని… ఆ కామాక్షమ్మ తల్లిని కోరుకుంటున్నా!" అని చేయి వదిలించుకుంటూ కిల కిలా నవ్వింది.
"నా కంటే మంచోడెవరు దొరుకుతారే నీకు? నాకు రాముడని పేరు పెట్టింతర్వాత రెండేళ్ళకు నువ్వు పుట్టావు. మా అత్తమ్మ ముందుగా ఊహించే నా పెళ్ళాం  నువ్వేనని  నీకు సీత అని పేరుపెట్టింది"
"ఏమో...అయన్నీ నాకు తెల్దు....నువ్వు చాకిరేవులో నా యెనకమ్మడి తోకలాగా తిరగడం మా నాయిన చూళ్ళేదనుకో మాకు. గుడ్డలు బానలో ఉడకబెట్టేటప్పుడు, ఆరేసేటప్పుడు నువ్వు నన్ను తాకుతూ తిరగడం…వెకిలి చేష్టలు చెయ్యడం చూసే చాకిరేవు పనికూడా మానిపించేశాడు మా అయ్య.  అందుకని ఓ..రాములోరో... సీత గురించి ఎక్కువ సినిమా కలలు కనమాక!"
“కొండయ్య మావకు నేనంటే మొదలు కాణ్ణించీ  ఇష్టంలేదు. స్వంత పెద బావమరిది కొడుకని కూడా చూడకుండా… నన్ను అవమానిస్తున్నాడు"
ఇగో...ఇంకో మందల జాగ్రత్తగా యిను. ఆనక నా మీద పడమాక.. నెళ్ళూళ్ళో ఎవరో మా అయ్య తాలూకు దూరపు చుట్టాలకు నాలుగు ఇస్త్రీ-లాండ్రీ షాపులున్నయంట. సూర్యారావని పెద్ద డబ్బున్నోట్ట మా మావ... వాడి కొడుక్కు సుధాకరుకు కట్టబెడతాడంట నన్ను. ఆనక గింజుకుంటే లాబంలే..అదుగో…సుబ్బరావమ్మ ఇటే వస్తాఉంది. అది సామాన్యురాలు గాదు. లోకంలో యెవ్వారాలన్నీ దానికే గావాల. మనిసయం టాంటాం ఏసిందంటే పెద్దగోల.. వస్తా మరి.." తుర్రుమంది.
మావ తనను కాదని వేరే సంబంధాలు చూస్తున్నాడని దిగాలు పడిపోయి అక్కడే చతికిల బడ్డాడు. మోకాళ్ళలో మొహం దాచుకొని దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటికి ఒక చల్లని చెయ్యి రాముడి తలపై పడింది. తలెత్తి చూశాడు. ఏవరో ఆజానుబాహుడు. వళ్ళంతా తెల్లని విబూధి రేఖలు. ఇంతకు ముందు అతన్ని ఎప్పుడూ చూచి ఉండకపోవడం వల్ల "మీరు..?".
నా పేరు మల్లన్నలే... ఈడే ఉంటా గానీ.. "బాధపడకు! అమ్మణ్ణిని నమ్ముకో! అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి" అని నిర్మలంగా నవ్వాడు.
"నా సమస్య ఏమిటో నీకు తెలుసా?" అన్న ప్రశ్నకు పెద్దగా నవ్వి "మీ అయ్య అర్ధాంతంగా చావబట్టి నీకీ దుస్థితి కలిగింది... అన్నీ జరుగుతాయిలే! జరక్కపోతే జరిపిద్దాం. సరేనా... నీ ప్రయత్నం నువ్వు చెయ్యి!" అన్నాడు. లేచి నిలబడి చూస్తే ఎక్కడా అగపళ్ళేదు మల్లన్న.
****
అయ్యా...అడుగో రాముడు మనింటి వైపే వస్తున్నాడు. ఏంటో కత.." అన్న కొండమ్మ మాటకు ఉలిక్కిపడి.."ఒసే...కొండీ..సీతను వంటింట్లోకి వెళ్ళమన్నానని చెప్పు. నే జెప్పేంత దాకా రావద్దని చెప్పు." కొండయ్య హుకుం జారీ చేశాడు.
"నమస్కారం మావా!     అత్తా…. బాగున్నారా?" కొండమ్మకు మొగుడి సంగతి తెలుసు కాబట్టి రాముడు కుశల ప్రశ్నలకు ఏమీ మాట్లాడకుండా గుడ్డలు మూటలు కడుతూ కూర్చున్నది.
"మా బాగోగులకేమొచ్చె...ఆర్చేవాడివా తీర్చేవాడివా...వచ్చిన మందలెందో చెప్పరా?"
"ఏం లేదు..సీతకు సమ్మంధాలు చూస్తున్నారా?"
"ఆ.. అవును.. అయితే నీకేమయిందంట మధ్యలో?"
"అది కాదు మావా..ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఏదీ ఎవరికి శాశ్వతం కాదు. చిన్నప్పటినుండి మీరే మమ్మల్ను మొగుడూ పెళ్ళాలని ఆట పట్టించారు. లేని పోని ఆశలు రేపారు. మళ్ళీ ఇప్పుడిలా..అన్నాయం మావా!" కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు
"ఒరే! ఆడముండలాగా ఏడవబాక. చెప్పేదిను... మీ యెవ్వారం నాకన్నా మీకే బాగా తెలుసు. దానికి రెండు పూటలా కడుపునిండా అన్నమన్నా పెట్టగలవా నువ్వు?  పోనీ పొగడ్రు స్నో లైనా కొనీగలవా?  ఏముందిరా నీ కాడ? ఏం జూసి ఇయ్యాల్రా? పరిస్థితులు బాగున్నప్పుడు వెయ్యి అనుకుంటాం. అన్నీ జరగాలని రూలేం లేదబయా.. కాలంతో పాటూ మనమూ మారాల అంతే"
"పోనీ..నాకు ఒక సంవత్సరం కాలం టైమిచ్చి చూడు.  నా కాళ్ళమీద నేను నిలబడి చూపిస్తా.. అపుడు పెళ్ళి చేసుకుంటా!"
"ఒరే ఇంకా నీకు పసితనం బోలే.. సినిమాలు చూసి చూసి….. అదే లోకంలో ఉన్నట్టున్నావు. ఇవన్నీ జరిగే యెవ్వారాలు గాదులే గానీ..  నీకూ ఒక పేదింటి పిల్లను చూసి ముడిపెడతానులే. బయపడమాక! గంతకు దగ్గ బొంత..యాడ్నో ఉండే ఉంటుల్లా.. ఇంకెళ్ళు. మాకు రేవుకు టైం అయింది. రాములో...ఇసయం..తెగేసి చెప్పేశా.. ఇంక నువ్వు సీతతో మాటలు బందుజెయ్!. యెవ్వారం పెద్ద మనుషుల్దాకా రాదని అనుకుంటుండా..ఆ...ఎవరి మర్యాదలో వాళ్ళుండడం మంచిది. తాహత్తూ..ఎవ్వారం తెలుసుకోని మెలగాల...ఆ... ఇగ బో..."
****
"వదినా! పిల్ల కుందనపు బొమ్మలా చక్కగా ఉంది. సరే! వంటా వార్పూ లాంటివి వచ్చా? మేమే నేర్పుకోవాలా?"
"లక్షణంగా జేస్తుంది వదినా! స్వీట్లు, నిప్పట్లు, చెక్కలు, గారెలు, సుఖీలు, మణుగుబూలు బెమ్మాండంగా చేస్తుంది."
"ఏమోనమ్మా! కొండన్న ఐదేళ్ళనుంచీ కాలికి బలపం గట్టుకొని తిరగతా ఉండాడని మీరు అంత స్థితిమంతులు గాకపొయినా, పిల్లందం చూసి ఒప్పుకున్నాం. మా ఉమ్మడి కుటుంబంలో మాట రానీకుండా ఉండాల మీ అమ్మాయి. అవునూ… వదినా! అమ్మాయి మొగం దిగులుగా ఉన్నట్టుంది కొంచెం."
" దాని మొగం..దిగులా పాడా..కొత్త చోటు కదా వదినా!" 
ఏమీ లేదన్నట్టు తల ఊపింది సీత. ఆమె కళ్ళలోంచి రాలిపడ్డ నీటిబొట్లను  సుధాకర్ గమనించకపోలేదు.  
"ఒరే..అమ్మాయితో ఏమన్నా మాట్టాడాల్నా ఒంటరిగా?" అన్న సూర్యారావు మాటలకు అవునన్నట్టు తలూపాడు. పదిహేను నిముషాల అనంతరం ఇద్దరూ నవ్వుతూ గదిలోనుంచీ వచ్చేసరికి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
"వదినా ఇంక పెట్టుపోతల గురిచి ఒక మాట అనుకుందామా?" అన్న వియ్యపురాళ్ళ మాటలకు సుధాకర్ అడ్డొస్తూ "అమ్మా!  నాల్రోజులు ఆగండి. సీత మూడు రోజులు మనింట్లో ఉండాలి. అలవాట్లు, ఆహార వ్యవహారాలు మనకు తెలియాలి, తర్వాతే మీ లాంఛనాల మాటలు. అది మనింట్లొ సెట్టవుద్దా లేదా" అన్న మాటకు కొండమ్మ కొంత ఆశ్చర్యపడ్డా కొండయ్య "అట్టాగే అల్లుడూ..అట్నే గానీ లే! మేము ఆదివారం వచ్చి సీత ను  జొన్నాడకు తీసుకొని బోతాం. అందాకా ఉణ్ణీలే..  ఆచ్చేపణేంలే..నాకు.. కొంప ముణింగిందేం లేదులే" అన్నాడు.  సీత మాత్రం దిగులేమీ లేకుండా ఒప్పుకున్నది.
****
"అమ్మా...సాయంత్రం మేమిద్దరం రంగనాయకులపేట దేవళానికి బోతున్నాం" సుధాకర్ అనగానే అమ్మ నేనూ వస్తానని పట్టు బట్టింది. సూర్యారావు మాత్రం "పిల్లకాయల్ని సరదాగా బోనీవే....మనం ఇంకో రోజు బోదాంలే!" అని ఒప్పించేసరికి హాపీగా ఫీలయారిద్దరూ.   కారు సరిగ్గా 5 గంటలకు దేవళం ముందు ఆగింది. ముందుగానే వర్తమానం అందుకున్న రాముడు వెంటనే కారులోకి ఎక్కాడు. వారిద్దరిని సుధాకర్ మద్రాసు బస్టాండు వరకూ తీసుకుని వెళ్ళి అక్కడ ఇంకో టాక్సీ ఎక్కించి మదరాసు పెరంబూరులో ఎక్కడ దిగాలో చెప్పి 10 వేలు డబ్బులు ఇచ్చాడు. సీతారాములు యిద్దరూ రోడ్డుమీదనే సుధాకర్ కు సాష్టాంగ నమస్కారం చేశారు.  “రాఘవయ్యతో నేను మాట్లాడాను.  అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీరు నేను చెప్పే వరకూకొంతకాలం అక్కడే ఉండండి.” అనగానే టాక్సీ మదరాసు వైపు సాగిపోయింది.
****
రాఘవయ్య బస్టాండు ముందు టాక్సీ ఆగీ ఆగం గానే నంబరు ప్లేటు గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి "రాములేనా?" అని అడిగాడు. ‘రాఘవన్ డ్రైక్లీనర్స్’ అని తమిళ్ లో బోర్డు రాసి ఉన్న ఇంట్లోకి సదరంగా తీసుకెళ్ళి కూల్ డ్రింక్ ఇచ్చి ఎప్పుడు ఎంగిలి పడ్డారో ఏమో ఉండండి అంటూ బయటికి వెళ్ళి బిరియానీ పొట్లాలు, పండ్లూ అవీ ఇవీ తెచ్చీ హడావిడి చేశాడు. "నన్ను సుధాకరయ్య బాబాయ్ అని పిలుస్తాడు. వాళ్ళ నాయన తరఫు దూరపు చుట్టరికం  మాది. 40 యేళ్ళయింది ఈడకొచ్చి…  వాళ్ళ పెదనాయనే నాకు దిక్కూ మొక్కూ..నాకు పిలకాయల్లేరు. బార్య ఈమద్దినే ఎల్లిపోయింది. ముసలి వయసులో తోడు గావాలని సుధాకరయ్యకు శానా తూర్లు సెప్పినా..ఇప్పటికి… కొడుకూ కోడల్ని ఒకే సారి పంపించాడు ఆ దేముడు" అని అన్నీ చెప్పుకుని పరమానంద భరితుడయ్యాడు. "నా పేరు ఈడ రాఘవన్ నాయర్ నన్ను దెలీని వాళ్ళు లేరీడ" అని పెద్దగా నవ్వాడు. "రేపు ఈడ దగ్గిరగా ఉండే దేవళంలో మీ పెళ్ళి. ఈ రోజు కు మాత్రం మీ పడకలు వేరే వేరే అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు.
****
కాలం తెలీకుండానే 10 నెలలు గడిచింది.  పండంటి కొడుకు పుట్టాడు. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ అందరికి మా తమ్ముడి కొడుకు కోడలు, నా తర్వాత వీళ్ళే ఈ లాండ్రీకి యజమానులు అని అందరికి చెప్పి, తనకున్న లాండ్రీ ఇల్లు, వ్యాసార్‌పాడిలో పడిపోయిన పెంకుటిల్లు వీరిద్దరి పేరుమీద రాసి, మనమడితో ఆడుకుంటూ  ఆడుకుంటూ సడన్‌గా ఒకరోజు కన్నుమూసాడు. ఫోను చేయగానే వెంటనే వచ్చిన సుధాకర్ దంపతులు రాముడితో కార్యక్రమాలు జరిపించారు.
కార్యక్రమాల అనంతరం సుధాకర్ రాములుతో అమ్మకు ఆరోగ్యం బాగుండలేదని మదరాసులో తమ వద్ద ఉంచుకోమని, ఒక్కసారి సీత తల్లిదండ్రుల పరిస్థితి కూడా బాగోలేదని,  సీత రాముడితో వెళ్ళడానికి కారణం తనే అని ఆడిపోసుకుంటున్నారని, సీత కోసం కలవరిస్తున్నారని, ఒక్కసారి మనవడిని చూపించి వెళ్ళమని చెప్పిన సలహాకు రాములు సీత జొన్నవాడ వస్తారు.
****
కారు దిగ్గానే కొడుకుని మొదటగా అమ్మణ్ణికే  కొడుకుని చూపించాలని దేవళానికి తీసుకు  వెళ్తుండగా మల్లన్న లోపల ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఆయనకు ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేయగానే మెల్లిగా కళ్ళు తెరిచి "సుఖంగా ఉన్నావా? కామాక్షికి చూపించండి. ఈ పుణ్యక్షేత్రంలోనే మీ వాళ్ళతో సుఖంగా జీవించండి.  శుభం." అని నవ్వుతూ అశీర్వదించి లోనకు పంపిస్తాడు. సీత "ఎవరండీ… ఈ స్వామి?  ఎన్నాళ్ళకు మళ్ళీ అమ్మను చూస్తున్నాం" అంటూ తన్మయత్వంతో లోపలికి వెళ్ళి గర్భగుడిలో మల్లన్న అమ్మ వారి ప్రక్కన నిలబడినట్టు తమను ఆశీర్వదిస్తున్నట్టు అగుపించడంతో ఆశ్చర్యానుభూతి చెందుతారు.
****

No comments:

Post a Comment

Pages