ఆధ్యాత్మిక అనుభూతుల కదంబం - దైవంతో నా అనుభవాలు - అచ్చంగా తెలుగు

ఆధ్యాత్మిక అనుభూతుల కదంబం - దైవంతో నా అనుభవాలు

Share This

ఆధ్యాత్మిక అనుభూతుల కదంబం - దైవంతో నా అనుభవాలు 

పద్మినీ ప్రియదర్శిని 


మనం భూమ్మీద పడే ముందే, మన కోసం అమ్మను, ఆకలిని తీర్చేందుకు అమ్మపాలను సిద్ధంగా ఉంచుతారు దైవం, మనం ఊపిరి వదిలే సమయంలో ఎక్కడ భయపడతామోనని అండగా నిలబడతారు దైవం! ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, దైవం యొక్క దయ ఎంత అపరిమితమైనదో‌ మనకు అర్ధమవుతుంది. దైవాన్ని నమ్మిన వారికి ప్రతీ క్షణమూ ఒక అద్భుతమే! 

అయితే భక్తిలో తర్కాన్ని జొప్పించి, వితండ వాదన చేసే కొంతమంది ప్రభావం వల్ల నానాటికీ సనాతన ధర్మం యొక్క ఉనికి ప్రశ్నార్ధకమవుతోంది. ఇటువంటి తరుణంలో‌ భగవంతుడు ఇప్పటికీ భక్త సులభుడేనని చాటి చెప్పే ఒక‌చక్కని పుస్తకం వచ్చింది. అదే, 'దైవంతో నా అనుభవాలు'.

వినోద్ గారి ఆధ్యాత్మిక ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది. కలలు నిజమవుతాయా? కలలో చెప్పినవి కళ్ళ ముందు సాక్షాత్కారిస్తాయా అని సందేహంగా అడిగేవారికి, నమ్మలేని నిజాలను కళ్ళముందు సజీవంగా నిలుపుతుంది ఈ పుస్తకం.
సింగపూర్ వాస్తవ్యులైన శ్రీ పరిమి వేంకట వినోద్ గారు తిరుమల శ్రీవారి భక్తులు. వీరు ప్రతి నెలా తిరుమల సందర్శిస్తూ ఉండేవారు. కానీ కరోనా వల్ల గత కొంతకాలంగా రాకపోకల్లో ఇబ్బందులు ఉండటం వల్ల, వీరు తిరుమల స్వామివారిని దర్శించలేక పోయారు. 2019లో వీరు తన మిత్రుడైన నెల్లిమర్ల  రమేష్ కుమార్ తో కలిసి, సింహాచలం సందర్శించినప్పుడు, వినోద్ గారి ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఒక పుస్తకంగా రూపొందించమని, రమేష్ సలహా ఇచ్చారు. అదే భావన ఆయన మనసులోనూ ఉండడంతో, ఆనందంగా అంగీకరించి, మిత్రులిద్దరూ కలిసి, ఈ పుస్తకానికి శ్రీకారం చుట్టడం జరిగింది.

ఈ పుస్తకం అడుగడుగునా అద్భుతాల సమాహారం. కొన్ని  అధ్యాయాలు 'ఇలా కూడా జరుగుతాయా' అన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని అధ్యాయాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. కొన్ని అధ్యాయాలు అప్రయత్నంగా కనుల వెంట ఆనందబాష్పాలు రాలేలా చేస్తే, కొన్ని దైవం‌ పట్ల మనకున్న నమ్మకాన్ని ఇనుమడింపజేస్తాయి.‌ అహంకారం‌ కూడదని చెప్పేవి కొన్నైతే, మానవత్వమే పరమధర్మమని చాటిచెప్పేవి కొన్ని. ఇలా ప్రతి అధ్యాయం, ప్రతి సంఘటన మనం ఆశ్చర్యంతో తలమునకలయ్యేలా చేస్తుంది. ఈ పుస్తకాల ద్వారా వచ్చే డబ్బును వినోద్ గారు టిటిడికి, గో సంరక్షణకు విరాళంగా ఇస్తున్నారు. మనసులో భక్తిభావన, దైవం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా చదవదగ్గ పుస్తకమిది.


ఇతర వివరాలు:
పుస్తకం పేరు: దైవంతో నా అనుభవాలు
రచయత: వేంకట వినోద్ పరిమి
ప్రచురణా సంస్ధ: జె.వి.పబ్లికేషన్స్
పేజీల సంఖ్య: 176
ధర: 200 రూ.
పుస్తకం కోసం సంప్రదించాల్సిన వాట్స్ ఆప్ నెంబరు: 8558899478 లేదా 
No comments:

Post a Comment

Pages