మనిషి మనిషికీ ఒక కథ - అచ్చంగా తెలుగు
మనిషి మనిషికీ ఒక కథ
(మా జొన్నవాడ కథలు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య
 (9490400858)"ఏమైనా  గాని ఒరే… ఒక్కటి మటుకు ఒప్పుకోని తీరాల్రా…. మీ నాయిన గంగప్ప… గంగప్పే! నువ్వు నువ్వేరా! " అన్నాడు రామిరెడ్డి అద్దంలో చూసుకుంటూ కోరమీసాలు తిప్పుకుంటూ. 
"ఊరుకోండి రెడ్డిగారు ములగ చెట్టెక్కీబాకండి" అన్నాడు సిగ్గుపడుతూ మంగప్ప. 
"లేదురా! నువ్వు నాకు క్రాఫు జేసి తలకు రంగు బెట్టింతర్వాత ఒక వారం పది రోజులు కాలేజీ పిలగాణ్ణాయినట్టు,  వయసు సగానికి సగం తగ్గిపొయినట్టు ఫీలవుతుంటాన్రా!. కలలు గూడా వస్తా ఉంటాయనుకో... ఆ మాదిరిగా!"
"వస్తాయి వస్తాయి… పనీ బాట లేకపోతే సరి......ఎప్పుడూ ఉన్న మందలే గదా అది…. చాలుగానీ…  స్నానానికి నీళ్ళు తోడాను. చల్లారిపోతాయి. ఊరేగండి తొందరగా...  పాచిపెత్తనం పదారు గళ్ళు అగ్గరారం పెత్తనం అరగడి అన్నట్టుగా ఉంది. వాడితో సోది మాటలు ఆపి ఆడికివ్వాల్సింది ఇచ్చి పంపండి.. వాడికి పనుంటందన్న జ్ఞానం గూడా లేదీ మణిషికి ఏంలోకమో ఏమో....”  భార్య మీనమ్మ కోపంగా చెప్పి లోపలికి వెళ్ళింది.
"అమ్మగారు విన్నట్టున్నారండీ మీ మాటలు" అన్నాడు నవ్వుతూ.
"వినాలనేరా  అనింది. 50 యేళ్ళకే ముసలోడినయిపొయినానని అంటూ తెగ యెగతాళి పట్టిస్తూ ఉంటాది ఎప్పుడూ" అన్నాడు మళ్ళీ మీసం తిప్పుతూ.
"సరేలేండి. డబ్బులిచ్చి పంపించండి. యేరోచోటికి బోవాల"
"రేయ్… యెల్లుండినుంచీ మా  అబ్బాయొచ్చి ఇక్కడే ఒక పది రోజులుంటాడు. పెందరాడే వస్తూ ఉండు" అన్నాడు.

*  *  *
రచ్చబండ మీద కూర్చున్న సుబ్బారాయుడు చుట్ట తాగి ఉమ్మేస్తూ "మంగప్పగాడి బార్య అల్లెమ్మ వడ్డీల వర్లక్ష్మి కాడ లక్ష రూపాయలు అప్పుదీసుకుందంట." అన్నాడు. పులిమేక ఆడుతున్నవాళ్ళు, డంకాపలాస మీద ఉన్నవాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడి తలలెత్తి చూశారు సుబ్బారాయుడి చాయల. "నిజమెహె! నిన్న పొద్దున్న మంగప్ప  అమ్మణ్ణమ్మ సత్రం పెళ్ళిలో సన్నాయి వూత్తా వూత్తా కళ్ళు తిరిగి పడిపోతే  ఎంటనే బొల్లినేనిలో జేర్చారంట. గుండెకేదో ఆపరేషన్ జెయ్యాలని  జెప్పారంట".  "అయ్యోపాపం మంచోళ్ళకే వస్తాయేంట్రా కట్టాలన్నీనూ" అన్నాడు జోగినాయుడు పేక క్రిందపడేస్తూ..."డ్రాప్" అన్నాడు. "ఒరి నీయమ్మ బడవ! పొయి పొయి దాంతో బెట్టుకున్నారే! ఐదురూపాయలొడ్డీ గుంజద్దది ఆ యమ్మికి మంచి చెడూ లే! ఒక్క నెల వడ్డీ గట్టకపొయినా బతుకు బస్టాండే! " అన్నాడు ఎంకయ్య. "నిజమే కానీ..ఏంజేసుద్ది.. ఆడకూతురు. అర్జెంటు మరి" అని సుబ్బారాయుడి చాయల జూసి "ఒరే! నీకు ఎలా తెలుస్తాయిరా లోకంలో ఉన్న యవ్వారాలన్నీ!" అని అడిగిన సుందర్రావును జూసి నవ్వుతూ "అదే మరి ఎకాసెకాలంటే! వర్లక్ష్మి నాకు పొద్దున్నే ఫొన్‌జేసి.. వాళ్ళకు ఈడ జొన్నాళ్ళో ఎన్ని ఎకరాలున్నాయి? సొంత ఇళ్ళుందా అని మందలడిగింది"
"ఓరి నాయనో…అదేదో ముతక సామెత జెప్పినట్టు నువ్వు జొన్నవాడ మడిసివి గాదు నాయనో.. జిల్లా మడిసివి" అన్నాడు సోమయ్య పెద్దగా నవ్వుతూ..."నా చిన్నప్పట్నించీ జూస్తున్నా.. అదేదో సామెత అనడమే గానీ ఏనాడు ఒక్క సామెత కూడా చెప్పేడ్చింది లేదు" అన్నాడు చుట్ట పారేసి లేస్తూ సుబ్బారాయుడు. విషయం ఆనోటా ఈనోటా పడి రామిరెడ్డి చెవిన బడింది.  వెంటనే కారేసుకుని బొయి చూసి వచ్చాడు.
*  *  *
"అయినా మంగలోళ్ళను మాదిగోళ్ళను గూడా జూడ్డానికి బోవాలా?"
"నువు నోరు ముయ్యే! ఆళ్ళు మడుసులు గాదా! వాళ్ళ తాతల దగ్గర్నుండి మనకాడ పని జేస్తా ఉండారు"
"ఓసొస్ తేరగా జేస్తున్నారా ఏందయ్యా!  తెగ నీలగతుండావు? డబ్బులు దీసుకోడంలేదా? మామ్మూళ్ళు తీసుకోడంలేదా! ఏంది? "
"అమ్మా! నువ్వు ఇలా రా! నాయనకు అన్నం పెట్టు. రాత్రి ఎనిమిదయింది" అన్నాడు కొడుకు సుబ్బారెడ్డి.
"సర్లే! నువ్వేంజెప్ప బళ్ళా నాకు.  అదిగాదురా! మానాయనిచ్చిన కారుందిగదా అని కార్లేసుకోని ఊర్కే ఊర్లమీన దిరిగితే డీజిల్ అయిపోదా! తేరగా గానీ పోస్తుండారా…. మీ తాతలు పంపుల కాడ!"  అని మూతి విరుచుకుంటూ లోనకు వెళ్ళింది.
అన్నం తిని ఈజీచైర్‌లో కూర్చున్న రెడ్డికి మధ్యాన్నం బొల్లినేని ఆసుపత్రిలో జరిగిన విషయం జ్ఞాపకానికొచ్చి బాధ పడ్డాడు. అదే మనసులో మెదుల్తోంది.

*  *  *
రామిరెడ్డి కారు దిగి రిసెప్షన్‌లో మంగప్ప గురించి అడుగుతుంటే "ఒరేయ్..జొన్నవాడ రామిరెడ్డిగోరు" అంటూ ఇద్దరు వచ్చి మేము జూపిస్తామంటూ లిఫ్ట్‌లో గుండె జబ్బుల వార్డ్‌లో ఉన్న ఐ.సీ.యు కు తీసుకెళ్ళి డాక్టరుకు మా ఊరి పెద్ద రెడ్డి అనగానే డాక్టరు లోనకు తీసుకెళ్ళాడు. బయట బల్లమీద కూర్చున్న అల్లెమ్మను రెడ్డి గమనించలేదు.

రెడ్డి పది నిముషాల తర్వాత బయటికొచ్చి "ఏం పర్వాలేదన్నరయ్యా! దిగులు పడమాకండి. నాల్రోజులు హాస్పిటల్లో ఉండాలంట. అంతే! ఒక నెల్రోజులు విశ్రాంతిగా ఉండాలంట. ఇంకో ఇషయం సన్నాయి అవీ ఊదగుడుదని జెప్పాడు. మంగలి పని జేసుకుంటే చాల్లే వాడు. హాయిగా గడిచిపోదా జెప్పు" అంటూ కాళ్ళ దగ్గరగా కూర్చున్న అల్లెమ్మను చూశాడు.
"అల్లెమ్మా! నివ్వేం దిగులు పడబాక! నాల్రోజుల్లో జొన్నాడలో ఉండొచ్చు నీ పెనిమిటితో. ఇందా! ఇదుంచు" అని వెయ్యి రూపాయలు అల్లెమ్మ చేతిలో బెట్టాడు.
"రెడ్డి గారు. మా ఇళ్ళూ పొలం కాగితాలు కుదువ బెట్టి లచ్చ రూపాయలు దెచ్చి కట్టా ! ఆపరేషనుకు. కన్నకొడుకు ఎవతెనో దీస్కొని మద్రాసు బాయె! ఎవర్ని అడిగేందుకు దిక్కు లేక పాయె! అన్నదమ్ములను అడిగితే నీకు పొలం ఇచ్చిందే ఎక్కువన్నట్టు ఛీదరించుకున్నారు.  బావను చూడ్డానికి కూడా రాకపోతిరి. ఏం బందువులో ఏందో… బతుకు మీదనే ఇరక్తి పుడతా ఉంది. వచ్చే మాసం కాడ్నుంచి తిన్నా తినకపొయినా నెలకు నాలుగు వేలు వడ్డీ కట్టాలంట వర్లచ్చమ్మకు" అంటూ వలవలా ఏడ్చింది రెడ్డి కాళ్ళు పట్టుకోని. అల్లెమ్మ కళ్ళనీళ్ళు రెడ్డిగారి పాదాల మీద పడ్డాయి. ఒక్కసారి వళ్ళు జలదరిచ్చినట్టయింది రెడ్డికి.
"ఎహె. ఊర్కో అల్లెమ్మా! లే! ఎట్టోగోట్టా జేద్దాం లే. కష్టాలు కలకాలముంటాయా చెప్పు. సీతమ్మతల్లి లాంటి దానికిగ్గూడా కష్టాలు రాలా? జెప్పు. ధైర్ణంగా ఉండు ఏదో ఒకటి చేద్దాంలే.  అల్లెమ్మకు ధైర్ణం జెప్పండ్రా”  అంటూ  అని కారెక్కి వెళ్ళి పోయాడు.  
కార్లో డ్రైవరు "ఇట్టాంటి జబ్బులు మా అసుమంటి పేదోళ్ళకు రానే రాగుడదయ్యా. వస్తే అంతే సంగతులు" అన్నాడు.

*  *  *
మంగప్ప అడ్డంబడ్డాడన్న విషయం సుబ్బారాయుడు తన సహజ ధోరణిలో  ఊరూ వాడా టాం టాం జేశాడు. రెండు రోజుల తర్వాత బస్టాండు ప్రక్కన బంకు లాంటిది మినీ లారీలో తీసుకొచ్చి పెడుతున్న ఆయన్ను చూసి ఆత్రం పట్టలేక  "ఏందన్నా! కిళ్ళీ బంకు బెడతన్నావా ఏంది! చానా ఉళ్ళే… ఈమాదిరి బంకులు మా  జొన్నాళ్ళో" అన్నాడు.
తనవైపు అదోలా చూస్తున్న అతనికి పరిచయం జేసుకున్నాడు" నాపేరు సుబ్బారాయుడు" అనంగానే "ఆ మీరేనా! నెళ్ళూల్లో  అంతా జెప్పుకుంటా ఉంటారు.  జొన్నవాడ సుబ్బారాయుడని" అంటూ నవ్వుతూ జూశాడు.
"నాపేరు రంగనాధ్. ఇక్కడ సెలూన్ పెడుతున్నాను" 
"సెలూనంటే  ఏందయ్యా అదీ. ఏం యాపరమో అదీ! "
"మంగలి షాపు"
"ఓరి నీయమ్మ బడవా! అంత పెద్ద పేరా ఇంగ్లీషులో దానికి. అవున్లేవయ్యో…  మన టొవున్లో జూసినాలే! గిర్రున తిరిగే కుర్చీలో కూకోబెట్టి క్షవరం జెయడం గదా! అబ్బో జొన్నాడ కూడా లెవెల్ పెరిగిళ్ళా!  సరే… నీ అద్రుష్టం బాగుంది పో! మంగప్పకు పేణం బాగలే! సరేలే ఊర్లో అందరికి జెప్తా కాని నాకాడ  డబ్బులు ఎక్కువగుంజబాకయ్యో! " అంటూ  చెప్పేది కూడా వినకుండా సర్రున  ప్రచారానికి బొయినాడు.
*  *  *
"యావన్మదికీ తెలియజేయడమేదంటయ్యా అంటే రేపు పొద్దటేళ సరిగ్గా 10 గంటలకు  పెద్దరెడ్డి రామిరెడ్డి గారు ఆరింట్లో ఊరు బాగోగుల గురించి సమావేశం ఏర్పాటు చేశారహో! ఊళ్ళో ళ్ళంతా రావాల్సిందిగా కోరారహో!" అని టముకు వాయించాడు చాటింపేసే చెంచయ్య.
ఒరే! మావా! ఇసయం ఏటైటుంటదంటావు?" అని రచ్చబండపై అడిగిన సుబ్బారాయుణ్ణి అందరూ నవ్వుతూ జూస్తూ ఉంటే "అదేదో సామెత జెప్పినట్టు నువ్వు గదంట్రా జెప్పాల్సింది మమ్మల్ని అడుగుతావేంది?" అన్నాడు సోమయ్య. 
"ఎహె. నాకు తెలిస్తే ఈపాటికి జెప్పనా ఏందీ! "
"ఊరి బాగోగులు అంటే రోడ్డు..బడి..ఆసుపత్రి లాంటివి ఏమైనా పెట్టాలని డబ్బులొచ్చాయో ఏమో. ఈ మద్దిన గవర్నమెంట్ మారిన కాడ్నుంచి పాపమా ముఖ్యమంత్రి అన్నీ జేయిస్తా ఉళ్ళా.. ఊళ్ళల్లో" అన్నాడు ఈరయ్య దొర.
"అదీ నిజవే! గుంజులాట ఎందుకురా! యవ్వారామేందో రేపీపాటికి తేలిపోదా అని" అన్నాడు జగ్గయ్య.
*  *  *
మొత్తం పాతికమందిదాకా పోగయ్యారు. అందరికి టీలు బిస్కెట్లు పెట్టించి ప్రశాంతంగా కూచోబెట్టాడు రెడ్డి. మీటింగు పుస్తకంలో వేలి ముద్రలు సంతకాలు పూర్తయింతర్వాత గొంతు సవరించుకొని "మీకు ఈరోజు ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలని పిలిచాను. ఒకటి మన ఊరికి ఎలిమెంట్రీ స్కూలుకు ఆ పెంకుటిల్లు పడగొట్టించి ఆరు రూములతో బడి గట్టే దానికి నిధులు మంజూరు చేశారు" అనగానే అంతా చప్పట్లు కొట్టారు.
"మీకందరికి తెలుసు. ఆ స్థలం మా తాతగారు పెద్దిరెడ్డి సుదర్శన రెడ్డిగారు ఈ ఊళ్ళో బడి ఉండాలని రాసిచ్చారు. అందుకే ఎస్.ఆర్ ఎలిమెంట్రీ స్కూల్ అన్న పేరు వచ్చింది. అది ఒక విషయం. అని సీసాలో మంచినీళ్ళు తాగి ఉమ్మేసాడు.
"ఇంకో ముఖ్యమైన విషయం మల్లప్ప తాతల కాలం నుంచీ మన ఊరిని నమ్ముకొని పనిచేస్తున్నాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలక్కుండా ఇళ్ళకు వచ్చి పని చేసి పోతున్నాడు. వాడికి గుండె జబ్బు వచ్చిన సంగతి మీకు తెలుసు. ఎంత మంది ఆసుపత్రికి పోయి చూసి వచ్చారు? చెప్పండి యీడున్నోళ్ళు "    అని అడగ్గా పాతిక మందిలో ఆరుగురు చేతులు ఎత్తారు.
"రెడ్డీ.. నేంబోదామనుకున్నా కానీ…. మా కూతురు కానుపు రోజులు అందుకే పోలేదు" అని ఒకడన్నాడు. ఇలా అందరూ ఎవరికి వాళ్ళు తమ పనులు  చేసుకుంటూ,  ఏవో రకరకాల యిబ్బందులను చెప్పారు..  “వాడి భార్య అల్లెమ్మ ఉన్న ఆస్తి కుదువ బెట్టి వాడి ప్రాణాన్ని కాపాడుకొనింది. వాడి ప్రాణం అల్లెమ్మకే కాదు మనకూ మన ఊరికీ  అవసరమా కాదా! చెప్పండి" అన్న ప్రశ్నకు అందరూ మెదలకుండా ఉండిపోయారు. వాడి తాహతుకు వాడికి కర్చులు బోంగా  నెలకు 4 వేలు ఆదాయమే రాదు. అలాంటిది వడ్డీల వర్లక్షమ్మకు వడ్డీ ఎలా కడతాడు? కొంచెం మానవత్వంతో ఆలోచించండి అందరూ.  వాళ్ళ మామిచ్చిన ఎకరా పొలముండబట్టి అంత అన్నం తింటున్నారు వాళ్ళు. అవునా కాదా! “అనగానే అందరూ అవునన్నట్టు తలలూపారు. "మనమందరం కలిసి ఆ కుటుంబానికి సహాయం చెయ్యాలా వద్దా!" అన్న రెడ్డి గారి మాటలకు వీరయ్య దొర లేచి "అయ్యా రెడ్డిగారు నాకు సమచ్చరాదాయం పొలం మీద రెండు లచ్చలొస్తాయి. నేను ఐదువేలు సహాయం చెయ్యగలను అన్నాడు. వెంటనే రెడ్డిగారు కాగితం మీద పేర్లూ మొత్తాలూ రాయించారు. "మొత్తం 94 వేలయింది. నేను మిగతా డబ్బులేసి వేసి లక్ష రూపాయలు వరలక్షమ్మకు ఇచ్చేసి కాగితాలు తెప్పిద్దాం" అన్న మాటకు అందరూ చప్పట్లు కొట్టారు.
ఒరే సుబ్బారాయుడూ.. నువ్ కొద్దిసేపాగు…. అందరితో లగుదోలబాక. కొన్నిషయాలు సెపరేటుగా మాట్లాడాల" అన్నాడు.
*  *  *
ఆ తర్వాత మరో నెలరోజులకు డబ్బులన్నీ దండిన తర్వాత వడ్డీల వరలక్షమ్మను రెడ్డిగారు పిలవనంపించారు. మంగప్పను భార్య అల్లెమ్మ కూడా వచ్చారు. మళ్ళీ ఊళ్ళో జనం పోగయినారు రెడ్డిగారి ఇంట్లో.
"అందరికి నమస్కారం! మీరందరూ నా మాట ఇన్నందుకు చానా సంతోషంగా ఉండాది. అందరూ సహాయం చెయ్యబట్టే ఈరోజు అల్లెమ్మ చేతికి మళ్ళీ ఆమె పొలం, యిళ్ళ కాగితాలు వస్తున్నాయి" అనగానే అందరూ చప్పట్లు కొట్టారు.
"వర్లచ్చమ్మా! డబ్బుల్లెక్క జూసుకోని కాగితాలు ఇవ్వు" అన్న రెడ్డి మాటలకు నోట్ల కట్ట టేబుల్‌పై బెట్టి లేచి నిలబడింది.
"రెడ్డిగారికి, ఊరిలోని పెద్దమణుషులందరికి నమస్కారం. నా పేరు వర్లచ్చమ్మ. మనుషుల్ని వడ్డీకోసం పీక్కుతినే రాక్షసిగా మీ అందరికి తెలుసు" అనగానే అందరూ ఒకరి మొహం ఒకళ్ళు చూసుకున్నారు. "ముందు ఒక పది నిముషాలు నా కథ వినాల్సింది గా మిమ్మలని కోరతా ఉన్నా!" అని డండం పెట్టింది. అక్కడ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమె గొంతు సవరించుకుని "నేనూ సిగ్గూ బిడియం ఉన్న ఆడమనిషిగానే ఒక పేద కుటుంబంలో తోటపల్లిలో పుట్టాను. 16 యేళ్ళకే పెళ్ళయింది. తర్వాత ఐదేళ్లకే నెల్లూరు నిప్పో ఫాక్టరీలో పనిచేసే నా భర్త డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుండి బాధలే! ఇద్దరు చిన్న చిన్న పిల్లకాయలు. ఫాక్టరీ వాళ్ళిచ్చిన ఐదు లక్షల డబ్బుతో జీవనం మొదలు పెట్టాను. నేను చదువుకోక పోవడం వల్ల ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగం ఇవ్వలేమన్నారు. వయసులో ఉన్న ఆడదంటే అందరికీ లోకువే! ప్రతి వెధవా నేను డబ్బులిస్తే పక్కలోకి వస్తానన్నట్టు మాట్లాడే వాడు. అన్నీ దిగమింగుకుని ఒక గుడిసెలో కాపురం పెట్టాను. జీవితంలో మెతకగా ఉండడం వల్ల ఎన్ని బాధలుంటాయో తెలిసింది. మా అమ్మ చీట్ల వ్యాపారం చేసేది ఆ అనుభవంతో కొన్నాళ్ళు చీట్ల వ్యాపారం చేశాను. ఆ తర్వాత వడ్డీలకు డబ్బులివ్వడం ప్రారంభించాను. నా ఇద్దరు పిల్లల చదువులు సాగాలి.  డబ్బు తీసుకున్న వాళ్ళు మొహం చాటేసే వారు. వేరే ఊళ్ళకు బిచాణా ఎత్తేసేవారు. ఒకసారి పోస్టువాడిచ్చిన అడ్రెసు సహాయంతో అప్పు ఎగ్గొట్టి కర్ణాటక వెళ్ళిపోయిన వాడిని మా అక్క కొడుకులిద్దరి సహాయంతో పట్టుకున్నాను. అక్కడ మా వాళ్ళు వాణ్ణి కొట్టారు. పోలీసు కేసయింది. జడ్జి నా బాధ విని శిక్ష వెయ్యకుండా వదిలేశాడు. పెద్ద గలభా అయింతర్వాత మొత్తానికి రెండు రోజులుండి డబ్బు వసూలు చేసుకోని వచ్చాము. అప్పటినుండి  నేను పూర్తిగా మారిపోయాను.  లేని కోపం ప్రదర్శించడం ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతూ ఉండడం వల్ల ఎవ్వరూ నా జోళికిగానీ ప్రస్తాపనకు గానీ వచ్చేవాళ్ళు కాదు. నేను డబ్బు అప్పు ఇచ్చేది మధ్యతరగతి వాళ్ళకు.  వాళ్ల అవసరాలు తెలిసికొని సహాయం చేస్తుంటాను. ఆరోజు అల్లెమ్మ పిచ్చిదానిలాగా జుట్టు విరబోసుకుని బొల్లినేని హాస్పిటల్ ముందు ఏడుస్తూ కూర్చుని ఉంటే నేనే వెళ్ళి విషయం తెలుసుకొని సహాయం చేశాను.  కావాలంటే ఆమెనే అడగండి. అందరికి ఐదు రూపాయలయినా నేను ఆమెకు నాలుగు రూపాయల వడ్డీకి ఇచ్చాను. నేనేదో ధర్మ కార్యాలు చేస్తున్నానని చెప్పను కాని ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ రాదు. అందువల్ల అప్పుడు సహాయం చెయ్యాలి." అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఒక ఆడదానిగా పుట్టి బూతులు మాట్లాడుతున్నానంటే.. నాకేం తమాషాగా ఉంటుందా?  లోపల ఎంత బాధ ఉంటుంది? దాని వెనుక ఉన్న ఆవేదన అర్ధం చేసుకోండి. సరే! ఇప్పుడు నాకు రావలసింది. లక్ష రూపాయలు మళ్ళీ వడ్డీ నాలుగు వేలు. మొత్తం లక్షా నాలుగువేలు. నాకు మీ ఊరి వారి ఔదార్యం చూసి చేతులెత్తి దండం పెట్టాలని ఉంది. నాకు 90 వేలు మాత్రం ఇవ్వండి చాలు. ఈ కాగితాలు తీసుకోండి. ఆ 14 వేల రూపాయలు నా చందా క్రింద వారికి మందులకూ...మాకులకూ వాడండి" మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు.
"అమ్మా లచ్చమ్మా! నువ్వు ఎవరింటి ఆడబడుచువో మాకు తెలీదు కానీ ఈరోజునుండి నువ్వు మాకు  జొన్నవాడకే ఆడబడుచువు. నువ్వు ఎప్పుడైనా మా ఊరికి రావచ్చు. వెళ్ళొచ్చు. నీకే బాధ ఉన్నా మా కాడకొచ్చి చెప్పుకోవచ్చు. మా ఊరివాళ్ళు నీకే సాయం గావాలన్నా చేసేందుకు రెడీగా ఉంటారు." అనే సరికి రెడ్డిగారి కాళ్ళ మీద పడింది.  ఇంతలో రివ్వున వచ్చి "రెడ్డిగారు.. వాళ్ళు రేపొస్తున్నారు పొద్దున్నే 8 గంటలకి అదీ మందల" అన్నాడు. అంతా పకపకమని నవ్వారు. జనాన్ని చూస్తూ ఏమీ అర్ధం కాక నిలబడిపోయాడు సుబ్బారాయుడు.  రెడ్డిగారు "ష్.." అరవకు అన్నట్టు సైగ చేసి వాణ్ణి లోనకు తీసుకుని బోయి ఏదో చెప్పాడు.
*  * *
ఉదయం 8 గంటలయింది. వాళ్ళు  వస్తారా? అన్నట్టు చూసిన రెడ్డిగారిని చూసి సుబ్బారాయుడు టాక్సీ కూడా ఏర్పాటు చేసి వచ్చాను. వస్తారు కచ్చితంగా…. అంటుండగా ఒక నల్లకారు వచ్చి దేవళానికి కొద్దిగా వెనుక ఆగింది. దాన్లోంచి దిగిన ఒక బ్రాహ్మణుడు, ఒక యువ జంట  దిగి  "ఎక్కడ?" అన్నట్టు సుబ్బారాయుణ్ణి చూశారు. అందరూ కలిసి బస్టాండు దగ్గరకు వెళ్ళారు. దూరంనుండి చూపించగా వాళ్ళు రంగనాధ్ షాపు వైపు నడిచారు.
"అయ్యా! రెడ్డిగారు..నమస్కారం. మీరు చెప్పకపోతే ఇంకా ఎన్నాళ్ళు వీడు మదరాసులో ఉద్యోగం అని చెప్పి ఇక్కడ ఈ పని చేసేవాడో తెలీదు. నా తర్వాత కాటేపల్లి దేవళం చూసుకోవలసిన వాడు మంగలి పని చేస్తున్నాడు. ఖర్మ! ఖర్మ! ఈ షాపు తాళాలు మీకు అప్పజెప్తున్నాను. పాతిక్కో పరక్కో దీన్ని అమ్మేసి డబ్బులు సుబ్బారాయుడు ద్వారా పంపండి" అని దండం బెట్టాడు బ్రాహ్మడు.   అంతా కారెక్కారు.
"పెద్దిరెడ్డా..మజాకా.." అని మీసం తిప్పుకుని నవ్వుకున్నాడు.

* * *

No comments:

Post a Comment

Pages