మానసవీణ-17 - అచ్చంగా తెలుగు

 మానసవీణ -17

-సత్యవోలు కిరణ్ కుమార్


(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెతో చనువుగా మెలుగుతూ ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభుత్వ కాలేజిలో చేరి, చదువుతూ ఉన్న మానస అక్కడి విద్యార్ధుల మనసు గెల్చుకుని, క్లాస్సులు సజావుగా జరిగేలా చేస్తుంది. రోడ్డుపైన అనాధలుగా వదిలేసిన కొండలరావు దంపతుల దీనస్థితిని చూసి, వాళ్ళ బిడ్డలకు బుద్ధి చెప్పి, దారిలో పెడుతుంది మానస. మనసు నలతగా ఉండడంతో గుడికి వెళ్ళిన మానసను శ్రావణి కౌగిలించుకుంటుంది. భూషణం చనిపోతాడు. అనిరుధ్ మానస గురించి ఆలోచిస్తూ ఉంటాడు.)

రాజేష్ మనసులో మానస మెదిలినప్పుడల్లా అతని ముఖంలో చిరునవ్వు ఉంటోంది. అలాంటి నవ్వు ఎప్పుడు రాజేష్ ఎరిగి ఉండదు. ఎప్పుడూ నలుగుర్నిఏడిపించి నవ్వడమే తెలిసిన రాజేష్ కి ఈ నవ్వు చాలా కొత్తగా అనిపించింది. అలాంటినవ్వును పరిచయం చేసిన మానస అంటే మరింత ఇష్టం కలిగింది.

కాలేజ్ లో రాజేష్ తరచూ మనసును కలుస్తూ ఉండేవాడు. ఒకరకంగా మానసను కలవడం కోసమే కాలేజ్ కి వెళ్ళేవాడు. మానసను చూస్తున్న తీరు, నడవడిక అన్నిటిలోను మార్పును గమనించాడు. తనను పూర్తిగా మార్చేసింది. మనసు మారితే మనిషి మారుతాడు. ఇప్పుడు రాజేష్ మనసు నిండా మానస ఉంది. మానస లేని తనను ఉహించుకోలేని స్థాయికి చేరుకున్నాడు.

ఒకరోజు కాలేజ్ లో రాజేష్ మానసతో "నీతో ఒక విషయం చెప్పాలి." అన్నాడు.

"ఏంటి?" అనడిగింది.

"ఇప్పుడు కాదు. సాయంత్రం క్యాంటిన్ దగ్గర కలుద్దాం" అని చెప్పాడు.

"సరే.." అంది.

రాజేష్ వెళ్ళిపోయాడు.

* * *

రాజేష్ వెళ్లిన కాసేపటికి మానసకి అనిరుద్ కాల్ చేసి మాట్లాడాలి అని అన్నాడు. సాయంత్రం కాలేజ్ అయ్యాక వస్తే క్యాంటిన్ దగ్గర కలుద్దామని చెప్పింది మానస.

* * *

సాయంకాలమైంది ...

తను రాసిన ప్రేమ లేఖ పట్టుకుని కాలేజ్ క్యాంటిన్ దగ్గర బైక్ మీద కూర్చుని ఎదురు చూస్తున్నాడు అనిరుద్. తన ప్రేమను వ్యక్తపరిచి మానస మనసులో ఏముందో తెలుసుకోవాలని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ప్రేమ అంతే తేలికైన బరువు!!

మరోవైపు క్యాంటిన్ లో మానస కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రాజేష్. టీ తాగుతుండగా మానస వచ్చింది. మానస కోసం మరో టీ ఆర్డర్ చెప్పాడు. కుర్రాడు టీ పెట్టి వెళ్ళాడు.

"ఏంటి చెప్పాలన్నావ్?" అనడిగింది.

రాజేష్ ఆన్సర్ చేసేలోపు అనిరుద్కాల్ చేసాడు.

ఫోన్ లిఫ్ట్ చేసి "హ... అనిరుద్ఎక్కడ?" అనడిగింది నవ్వుతు. రాజేష్ కి ఆమె నవ్వు నచ్చిన ఆ నవ్వు ముందు పలికిన ‘అనిరుద్’ పేరు చేదు మాత్ర మింగినట్టు అనిపించింది. ఓ క్షణం అతనిలో అలజడి.

"ఇక్కడే క్యాంటిన్ బయటే ఉన్నాను." అని చెప్పాడు అనిరుద్.

"బయట ఎందుకు లోపలికి రా.. నా ఫ్రెండ్ రాజేష్ ని పరిచయం చేస్తాను." అంది.

'రా... జే... ష్... ' పైకి అనకుండా పెదాలు కదుపుతూ పలికాడు అనిరుద్.

"వస్తున్నాను." అని చెప్పి క్యాంటిన్లోకి అడుగు పెట్టాడు.

అతను దగ్గరకు వచ్చేలోపు "అనిరుధ్ అని నా ఫ్రెండ్. ఏదో చెప్పాలి అంటే ఇక్కడికే రమ్మన్నాను. కలిసి వెళ్ళిపోవచ్చు కదా, చాలా మంచి ఫ్రెండ్. నేను చేసే సోషల్ సర్వీస్ కి హెల్ప్ కూడా చేస్తాను అని అన్నాడు." అని చెప్పింది మానస.

మానస మాటలు వింటూనే నడుచుకుంటూ వస్తున్న అనిరుద్ని చూస్తూ ఉండిపోయాడు రాజేష్. అనిరుద్ అడుగు పెట్టింది తన జీవితంలోకి అన్నట్టుగా తోచింది రాజేష్ కి.

అనిరుద్ ని చూడాగానే మానస నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.

రాజేష్ కి మొట్టమొదటిసారి ఆ నవ్వు వెనక కారణం తను కాలేదన్న బాధ కలిగింది.

ఒకరినొకర్ని పరిచయం చేసింది. ఒకరి కళ్ళు ఒకరు సూటిగా కలుసుకుని విడిపోయాయి. రాజేష్ కి కాలేజ్ లీడర్ అనే దర్పం తెలియకుండా తన్నుకొచ్చింది. కాలు మీద కాలు ఆటోమాటిక్ గా వేసుకున్నాడు. కుర్చీ కి జారబడి, మోచేయిని వెనక్కి ఆంచి గడ్డం ఎత్తి సూటిగా అనిరుద్ ని చూసాడు.అనిరుద్ కూడా అంతే సూటిగా రాజేష్ ని చూసాడు.

"టీ తాగుతావా బ్రదర్" అనడిగాడు రాజేష్.

"వద్దు బ్రో. థాంక్స్ " అన్నాడు అనిరుద్.

"అవును, ఏంటో చెప్పాలని అన్నావ్ ఏంటది?" రాజేష్ ని అడిగింది.

రాజేష్ ఓ క్షణం అనిరుద్ ని చూసాడు. అనిరుద్ చేతిలో ఉన్న కవర్ ని కూడా చూసాడు.

"మీరు లోపలికి వచ్చేలోపు మీ గొప్పతనం గురించి చెప్పింది బ్రదర్. మీలాంటి బెస్ట్ ఫ్రెండ్ మానసకు ఉండటం చాలా మంచి విషయం. మీరు మానసకు బెస్ట్ ఫ్రెండ్ కనక నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీరు ఉండగానే సూటిగా చెప్పేస్తాను.మీరు వచ్చాకా నాకు ధైర్యం వచ్చింది " అని ఆగాడు.

అనిరుద్ క్వశ్చన్ మార్క్ పేస్ పెట్టాడు.

"నేను మానసను ప్రేమిస్తున్నాను." అని చెప్పేసాడు రాజేష్. మానస షాక్ అయి ఉండిపోయింది. అనిరుద్ చేతిలో ఉన్న కవర్ ని నలపడం రాజేష్ చూపు దాటిపోలేదు.

"నిజం బ్రదర్ రౌడీలా తిరిగే నన్ను మానసే మార్చేసింది. కాలేజ్ లో ఇప్పుడు నేను పొందుతున్న గౌరవం మానస వల్లే కలిగింది." అని మానస వైపు తిరిగి "మానస, నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను. నీ కులం, మతం నాకు అనవసరం. నువ్వు నా చేయి పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళినా రావడానికి నేను సిద్ధం. నీ గమ్యానికి నేను మార్గం అవుతాను. నీ గెలుపుకి నేను ప్రయత్నం అవుతాను. నీ ప్రేమకు బానిసనవుతాను. నీ వాడినై నీకు తోడుగా ఉంటూ కావలి కాస్తాను. నీ జవాబు నా జీవితాన్ని నిలబెడుతుంది. నీ నిర్ణయం కోసం కోసం నిరీక్షిస్తూ ఉంటాను." అని చెప్పాడు.

రాజేష్ మాటలకు మానస కన్నా అనిరుద్ ఎక్కువ షాక్ అయిపోయాడు. ఒక్క క్షణంలో అంతా తల్లకిందులైపోయింది. తన ప్రేమను చెప్పాలని వచ్చి మానసపై మరొకడి ప్రేమను వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు.

మానస సమాధానాం కోసం రాజేష్ కంటే అనిరుద్ ఎక్కువ టెన్షన్ పడ్డాడు. మానస మౌనంగా లేచి నిలబడింది. రాజేష్, అనిరుద్ లు కూడా నిలబడ్డారు.

"నాకు కొంచెం టైం కావాలి." అంది. మౌనంగా అలాగే అన్నట్టుగా తలూపాడు రాజేష్.

మానస అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోగానే రాజేష్ ని గుడ్లురుమి చూసాడు అనిరుద్.

"సారి బ్రదర్, నీ చేతిలో కవర్ చూసి డౌట్ కొట్టింది. ఏదో పెద్ద స్కెచ్ వేసుకొచ్చావని అనిపించింది. మానస అంటే నీకు ఇంటరెస్ట్ ఉందని నాకు అర్ధం అయింది. ప్రేమ బ్రదర్, తొందర పడాలి. ఇలా కాగితాలు, కవితలు అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు.ఏ కాలంలో ఉన్నావ్ బ్రదర్. ఇంకా ప్రేమ లేఖలు రాసుకుని తిరుగుతున్నావ్! నువ్వు నాకంటే ముందెక్కడ చెప్పేస్తావనే భయంతో నేను చెప్పేసాను. నువ్వు ఛాన్స్ మిస్ అయ్యావ్. నెక్స్ట్ లైఫ్ బెటర్ లక్! 'నేను కరక్ట్ గానే అన్నాను నెస్క్ట్ టైం కాదు. నెస్క్ట్ లైఫ్ బెటర్ లక్ !" అని చెప్పాడు రాజేష్.

"గేమ్ ఇప్పుడేగా మొదలైంది. అప్పుడే గెలిచేసానని ఎందుకు అంత ఫీల్ అవుతున్నావ్. నువ్వు ఫస్ట్ స్టెప్ వేసావ్ అంతే! నేను ఇంకా ఆట మొదలెట్టలేదు. నీ ఆట నువ్వాడు. నా ఆట నేను ఆడుతాను. ప్రేమ కోసం జీవితం అంతా పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు కూడా దానికి ప్రిపేర్ అవ్వు. నా ప్రేమను గెలిపించుకోవడానికి నాకు రెండు దారులు. నేను ఆమెకు దగ్గరవడం. లేదా నిన్ను ఆమెకు దూరం చేయడం. చూద్దాం.." అని కౌంటర్ ఇచ్చాడు అనిరుద్.

"ఛాలెంజ్ చేస్తున్నావా?" అన్నాడు రాజేష్

"పేరేదైనా పెట్టుకో..." అన్నాడు అనిరుద్.

"చూద్దాం మానస ఎవరిని ప్రేమిస్తుందో!!" అన్నాడు రాజేష్.

"నువ్వు చూడు! నేను చేసి చూపిస్తాను. " అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేష్.

ఉక్రోషంతో టీ గ్లాస్ ని నేలకేసి కొట్టాడు రాజేష్

(సశేషం)

No comments:

Post a Comment

Pages