ఈ దారి మనసైనది - 35 - అచ్చంగా తెలుగు

 ఈ దారి మనసైనది - 35 

                                                                  అంగులూరి అంజనీదేవి


“వాడు అనకండి ఆంటీ ! కాబోయే అల్లుడు కదా ?” " 

సరే ! అతన్ని నాకెందుకు చూపించలేదు ?” అంది నిష్టురంగా.

"అతను ఇక్కడే పి.జి చేస్తున్నాడు ఆంటీ ! తర్వాత చూపిస్తాను లే ....” అంది సంజన తనకి తెలిసిన హౌస్ సర్జర్ కన్పించటంతో ... “హయ్' చెబుతూ అటు వెళ్లింది సంజన.

“అయ్యో! ఆ అబ్బాయిని చూడ లేక పోయానే" అని అనుకుంటూ..... తనింత ఉరుకులు, పరుగులు  హాస్పిటలకి రావటానికి కారణం అతనేగా .... తన కూతురు అతన్ని ప్రేమించి ఆ ప్రేమను పొందలేక యిలా చేసుకుందని తెలియగానే ... అత్త గారి వైపు చూస్తూ .....

“నీ మనవరాల్ని చదువుకోటానకి పంపారా? నరాలు తెగోసుకోటానికి పంపారా? మాట్లాడలేం ? నేను పెళ్లి చెయ్యమంటే చెయ్యకుండా చదువుకోటానికి పంపాడు నీ కొడుకు! ఇప్పుడు దానికేమైనా అయితే ఎవరు బాధ్యులు?” అంటూ అత్తగారి మీద కేక లేసి హాస్పటల్ కి పరిగెత్తింది.

హాస్పిటల్లో - బెడ్ మీద ప్రాణంతో వున్న కూతుర్ని చూడగానే కాస్త స్తిమిత పడింది ... ఈ పరిస్థితిలో కూతుర్ని తిడితే మళ్లీ చస్తుందన్న భయంతో మౌనంగా వుందే కాని... కూతురు చేసిన పని క్షమించ తగింది కాదు.

ప్రేమిస్తే చావాలా ?

రోజు, రోజుకి - ప్రపంచం ఎంతో ముందుకి వెళ్తుంటే - డాక్టరు చదువు చదువుతూ బామ్మల కాలం నాటి ఆడపిల్లలా నరాలు కోసుకోవడం ఏమిటి? చచ్చి ఎవర్ని సాధించాలి? బ్రతికితే దేన్నైనా సాధించ వచ్చు.

పోనీలే .... ఇప్పటికైనా ఆ అబ్బాయి మళ్లీ తన కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఒక వేళ అతను రాకపోయినా బ్రతకటానికి ప్రయత్నించాలి కాని చావడం దేనికి? తన జీవితంలో తనెంత కష్టపడలేదు. అలాగని చనిపోయిందా?

పెళ్లికి ముందు తను ఎన్ని కలలు కన్నది. 

ఒక్క కలన్నా నిజమైందా? 

దీనికి కారణం తన భర్త విశ్వనాథ్ ....

భార్య మాట విన్నా , భార్య అభిప్రాయానికి విలువ ఇచ్చినా, నెత్తి నెక్కి కూర్చుంటుందని .... వాళ్ల పెద్దవాళ్లు చెప్పిన మాటని వేదంలా విని, ఆ మాటల్ని నర, నరంలో జీర్ణించుకొని, తను ఏది అడిగినా కాదనే వాడు ... ఏది చెప్పినా విననట్లే వుండే వాడు ... మళ్లీ మళ్లీ రెట్టించి అడిగితే “నేను చస్తే కాని నువ్వు నోరు మూసుకోవు' అని బెదిరించేవాడు... ఇంత కన్నా బలమైన ఆయుదం మరొకటి వుంటుందా భార్యను పొడవటానికి? ఆ మాటతో భయపడి మనసుకి పక్షవాతం వచ్చిన దానిలా మారిపోయింది ...ఎంత మారినా గాని ఏ కాలక్షేపం లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చోటానికి తనేమైన రచయిత్రియా ? చిత్రకారిణియా ? మామూలు స్త్రీ. అందుకే చుట్టు పక్కల వాళ్ల గొడవల్లో తల దూర్చి కాలక్షేపం చేస్తోంది. ఇంట్లో వున్న అత్తగారిని మాటలతో హింసించి తృప్తి పడ్తోంది. మనిషి అన్నాక ఏదో ఒక తృప్తి వుండాలిగా.... లేకుంటే గతం గీసిన గీత మీద కళ్లకి గుడ్డ కట్టుకొని ప్రయాణం చేయాలంటే సాధ్యమా ! సాధ్యం కాకపోయినా చేయక తప్పని ప్రయాణం ఇది. చచ్చిపోతే ఎలా?

అంతలో - ప్రియబాంధవి, అనురాగ్ వస్తూ కన్పించారు. 

వాళ్లకి ఎదురెళ్లింది కృష్ణవేణి.

“బాగున్నావా! అనురాగ్ ! నీ వల్లనే నా కూతురు నాకు దక్కింది. బయటంతా అదే చెప్పుకుంటున్నారు” అంటూ అనురాగాని పలకరించి...

ప్రియబాందవిని కావలించుకొని ఏడ్చింది.

“మన్విత ఎలా చేసిందో చూడండి ! ఒక వేళ జరగరానిది జరిగివుంటే మా పరిస్థితి ఏమయ్యేది. దాని చదువు మీద ఎంత డబ్బు పెట్టాం. ప్రేమించినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా? వాడేమైనా పై నుండి వూడిపడ్డాడా ? మీరైనా చెప్పండి ! లోకంలోమగవాళ్లకి కరువేమైనా వచ్చిందా?” అంటూ తన దోరణిలో తను కళ్ల నీళ్లు తుడుచుకొంది.

ప్రియబాంధవి మాట్లాడలేదు. మన్విత అనురాగుని ప్రేమించినట్లు కృష్ణవేణమ్మకి తెలిసినట్లు లేదు. తెలిసుంటే తనతో ఇలా వుండేది కాదు. ఎంతో భయపడూ వచ్చిన ప్రియబాందవికి ఇప్పుడా భయం తగ్గింది.

"మా వదిన కొడుకు ఇప్పటికీ దీని కోసం ఎదురు చూస్తు వున్నాడు. ఇస్తే పెళ్లి చేసుకుందామని ....” అంది కృష్ణవేణమ్మ. 

తనిప్పుడు మన్వితకి పెళ్లి చెయ్యమని చెప్పాలా ? చదివించమని చెప్పాలా? మన్విత విషయంలో ఏది కరక్టో తేల్చుకోలేక పోతోంది. ప్రియబాంధవి. "

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages