నెత్తుటి పువ్వు - 28 - అచ్చంగా తెలుగు

                                                              నెత్తుటి పువ్వు - 28

మహీధర శేషారత్నం


(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. తన గతాన్ని గురించి రాజుకు చెపుతూ ఉంటుంది సరోజ ) 

సరోజకి అన్నం సయించటంలేదు. ఒకటే వికారం, వాంతులు, నీరసం, ఏం తిన్నానబ్బా! ఎందుకిలా అయింది అని ఆలోచించింది. ఏం తోచలేదు. హఠాత్తుగా స్ఫురించింది. ఈసారి నెలసరి ఇంకా రాలేదు. తప్పిపోయింది. డేట్ దాటి కూడా పదిహేను రోజులు దాటింది. ఏదో చిన్న అనుమానం... లేచి ముఖం కడుక్కుని బయటి నుంచి రెండు ఇడ్లీ తెచ్చుకుని తిని స్నానంచేసి గవర్నమెంటు హాస్పటల్ కి బయల్దేరింది. ఓ.పి.కి వెళ్ళి అంతా చెక్ చేయించుకుంది. వాళ్ళు నెలతప్పినట్టు నిర్ధారణ చేసారు. బలానికి మందులు రాసారు. వికారం రెండు, మూడు నెలలలో అదే తగ్గిపోతుంది. మరీ ఎక్కువవుతుంటేరా! అప్పుడు మందులు ఇస్తాను. కొద్దిగా ఉండడం సహజం అని చెప్పారు. లోపల శిశువు బాగా చక్కగా ఎదగాలంటే బాగా తినాలి. పాలు తాగాలి. పళ్ళు తినాలి. అంటూ జాగ్రత్తలు చెప్పారు.

సరోజకి ఆనందంతో మనసు వెలిగిపోయింది. నా చిన్ని బొజ్జలో చిరు మొలకా! అనుకుంది. నాకూ ఒక బంధం ఏర్పడబోతోంది. ఒక వింత అనుభూతి. ఎవరూలేరు అనుకునే నాకు ఒక చిన్న కుటుంబంమ ఏర్పడుతోంది. నాగరాజు మీద ప్రేమ తగ్గకపోయినా, నాగరాజు పరాయిసొత్తు. అయినా నా మీద ప్రేమ, అనుబంధం ఉన్నాయి. ఇది అచ్చం... నాకే.... నాకు మగపిల్లాడయితే ఎలాగైనా బతికెయ్యగలడు. దేవుడా! .... దేవుడా! నాకు చక్కని మగబిడ్డని ఇయ్యి. కొన్నాళ్ళు గడిస్తే నాకు ఆధారమవుతాడు. బలంగా ఉండాలి. చక్కగా తినాలి. ఇలా కలలు కంటూ గదికి వచ్చిన రోజూ బద్ధకించకుండా అన్నం కూరా వండుకుంది. కడుపు నిండా తృప్తిగా ఉంది. కొంచెం వికారంగా అనిపించింది కాని తిన్నది ఇమడానికి, వికారం తగ్గడానికి కొంచెం చింతపండు తొక్కు కడిగి బుగ్గన పెట్టుకుని ఊట పీల్చింది. తృప్తిగా అనిపించింది. పడుక్కుంది కాని ఆనందంతో, వెల్లువలా వచ్చే ఆలోచనలతో నిద్రపట్టలేదు. అటూ ఇటూ దొర్లబోయింది అలవాటు చొప్పున. అంతలోనే భయం వేసింది. ఇదివరకటలా ఇష్టం వచ్చినట్టు పడి దొర్లకూడదు. లోపలి బేబీకి ఏమైనా అయితే... అమ్మో! పొందికగా పక్కకు తిరిగి పడుక్కుంది. ఎలా పడుక్కుంటే లోపల బేబీకి ఇబ్బంది ఉండదో అడగలేదు. ఎవర్ని అడగాలి? అయ్యో! ఇందాక మరిచిపోయాను నర్సుని అడిగినా చెప్పేది? ఆలోచించుకుంటూ ఎప్పటికో అలాగ పడి నిద్రపోయింది నిద్రలేచే సరికి కాస్త హాయిగా అనిపించింది. ఎన్ని డబ్బులున్నాయో చూడాలి అనుకుంది. డబ్బా ముందు పెట్టుకు కూర్చుని ఓపిగ్గా లెక్కపెట్టింది. నాలుగున్నర వేలు ఉన్నాయి. నాగరాజుని అడగకుండా ఎలా గడపాలి? ఎక్కువ కష్టపడకుండా ఏం చెయ్యాలి? బిడ్డ బాగుండాలంటే ఎక్కువ కష్టపడకూడదు. తిండి తినాలి. ఏం ఆలోచన పాలుపోలేదు. మళ్ళీ మంచం ఎక్కింది.

*****

వికారము, వాంతులు ఎక్కువయ్యాయి సరోజకి. ఏదీ తినలేకపోతోంది. వంట చెయ్యాలనిపించడం లేదు. బలవంతంగా చేస్తోంది. ఇంకొక వారం చూసి మళ్ళీ ఆ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళింది.

అక్కడ ఉన్న నర్సు గుర్తుపట్టి మొన్ననేగా వచ్చి వెళ్ళాను. అప్పుడే ఏమయింది అంది కటువుగా.

“వికారం, వాంతులు తగ్గటంలేదు, తిండి సయించటం లేదు నీరసంగా ఉంటోంది. ఏదైనా మందు బిళ్ళ ఇస్తారేమోనని” భయం భయంగా నీరసంగా అంది సరోజ.

“పక్కలో లొంగున్నప్పుడు తెలియదా ఇలాంటి బాధ లుంటాయని, పదినెలలు తప్పవన్నీ” కసురుకుంది. 

సరోజ ముఖం సిగ్గుతో, బాధతో ఎర్రబడిపోయింది, కళ్ళ నీళ్ళు తిరిగాయి. 

ఇది గమనించి పక్కనున్న నర్సు ఆమెనా కోప్పడింది. “ఏమిటా మాటలు” అంటూ. “ఇటు రామ్మా! అంటూ అటు పిల్చుకెళ్ళింది. 

ఆ మాత్రం పిలుపుకే సరోజ సంతోషపడి... 

“అక్కా నేనెప్పుడూ నీ దగ్గరకే వస్తా. నాకు ఏం తినాలో ఏం తినకూడదో ఎలా ఉండాలో చెప్పక్కా అంది. 

“ఏం అత్త,అమ్మ ఎవరూ లేరా ఇంట్లో... ఆరాగా అడిగింది.

(సశేషం)


No comments:

Post a Comment

Pages