తాత మనవడు - అచ్చంగా తెలుగు

 తాత మనవడు

డాక్టర్ . బీ. యన్ .వీ. పార్థసారధి     


సుధాకర్ మాధవిలకి లత ఒక్కత్తే  కూతురు. అల్లారు ముద్దుగా పెంచారు. వేసవి శలవల్లో “మా అమ్మానాన్నల దగ్గరకి వెడదాం” అని సుధాకర్ “కాదు మా అమ్మా నాన్నల దగ్గరకి వెడదాం” అని మాధవి ఎప్పుడూ వాదులాడుకునే వారు. ప్రతీ వేసవిలో అమ్మా నాన్నలు గొడవ పడటం బాల్యం లో లతకి విచిత్రంగా అనిపించేది. ఇంజనీరింగ్ లో కాలేజీ లో గోల్డ్ మెడల్ సాధించింది లత. వెంటనే మంచి సాఫ్ట్ వేర్  కంపెనీ లో ఉద్యోగం రావటం ఆ వెనువెంటనే మంచి సంబంధం కుదరడంతో లత కి వివాహం చేశారు. ఉద్యోగ రీత్యా లత భర్త, లత బొంబాయి లో వుంటున్నారు. వారికి ఒక్కడే కొడుకు అభిషేక్. లత అత్తామావలు ఊళ్ళో పొలం, ఇల్లు చూసుకుంటూ వారి స్వగ్రామం లో నే వుంటారు. ఏడాదికి ఒకసారి లత వాళ్లు చెరో వారం రోజులు అటు అత్తవారింట్లో ఇటు పుట్టింట్లో గడిపి వెడతారు.


సుధాకర్, మాధవి లు ప్రతీ ఏడు  వేసవి కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వుంటారు. ఆ ఏడు  వేసవి రానే వచ్చింది. లత వాళ్ళు వాళ్ళ అత్తవారింటికి వెళ్లి వారం తరవాత పుట్టింటికి వచ్చారు. సుధాకర్, మాధవిల సంతోషానికి అవధుల్లేవు. చూస్తూండగానే నాలుగు రోజులు గడిచిపోయాయి. మరో మూడు రోజుల్లో లత వాళ్ళు బొంబాయి కి వెళ్ళిపోతారు. లత తండ్రి సుధాకర్ తో ఎదో పిచ్చాపాటీ మాట్లాడుతోంది. మాధవి మనవడు అభిషేక్ కి అన్నం కలిపి పెడుతోంది. వాడికి మూడేళ్లు.  అన్నం తినటానికి అందరు చిన్నపిల్లల లాగా బాగా సతాయిస్తాడు.   మనవడిని మాటల్లో దృష్టి మళ్లించి మధ్య మధ్య వాడి నోట్లో అన్నం ముద్దలు పెడుతోంది మాధవి. " నీకు బామ్మ ఇష్టమా లేక అమ్మమ్మ ఇష్టమా?" అని ప్రశ్నించింది మాధవి. వాడు ఎంత మాత్రం తడుముకోకుండా " నాకు ఇద్దరు ఇష్టం" అన్నాడు. "మరి తాతగారు ఇష్టమా లేక తాత  ఇష్టమా?" మరో  ప్రశ్నాస్త్రం  సంధించింది మాధవి. తాతగారు అంటే లత వాళ్ళ మామగారు. సుధాకర్ ని వాడు తాతా అని పిలుస్తాడు. వాడు ఏమాత్రం సంకోచించకుండా నాకు తాతగారు, తాత  ఇద్దరూ  ఇష్టం " అన్నాడు. ఈ సంభాషణ విన్న సుధాకర్ చిరునవ్వు నవ్వాడు . " నాన్నా . పెళ్లి చూపుల తరవాత మా వివాహం ఖాయం అయ్యే సమయం లో నేను మా ఆయనకి ఒక షరతు పెట్టాను. దానికి ఆయన ఒప్పుకున్నారు."అంది లత తండ్రి సుధాకర్ తో. ఏమిటన్నట్టు  ప్రశ్నార్థకంగా చూసాడు సుధాకర్ కూతురు లత వైపు. " ప్రతీ ఏడాది ఒక వారం రోజులు వాళ్ళ అమ్మానాన్న దగ్గరకి, ఒక వారం రోజులు మీ దగ్గరకి సమానంగా వెడదాం అని నేను చెప్పాను. దానికి ఆయన అంగీకరించారు. " అంది లత. మౌనంగా వినసాగాడు సుధాకర్ .  "దీని వెనకాల ఒక చిన్న కథ  వుంది  నాన్నా" అంది లత. అలాగా అన్నట్టు తల ఊపాడు సుధాకర్.


“నా చిన్నప్పుడు ప్రతీ ఏడూ  వేసవి శలవలలో నువ్వూ  అమ్మా వాదించుకునే వారు నీకు గుర్తుందా ?" అడిగింది లత. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందా అన్నట్టు చూసాడు సుధాకర్.  లత తన సంభాషణని కొనసాగించసాగింది. "అప్పుడు మీరిద్దరూ అమ్మమ్మ ఇంటికి అంటే కాదు బామ్మా వాళ్ళ ఇంటికి అని ఎందుకు వాదించుకునే వారో నాకు బోధపడేది కాదు. పైగా నన్ను అమ్మమ్మ తాతయ్య ఎంత ప్రేమగా చూసేవారో అంతే  ప్రేమగా బామ్మా తాత  కూడా చూసేవారు. దానితో మీరిద్దరూ ఎందుకు వాదించుకునే వారో నాకు అర్ధం కాక అయోమయంగా ఉండేది. నేను కాస్త పెద్ద అయ్యేసరికి  కొంతవరకు దానికి కారణం గ్రహించాను." అని తండ్రి కేసి చూసింది లత. ఆతను విషయాన్ని పూర్తిగా చెప్పమన్నట్టు అతని ముఖ కవళికలని బట్టి పసిగట్టింది లత.


" తల్లిదండ్రులు తమ పిల్లల బాల్యం లో వారితో ఎక్కువ సమయం గడపలేరు. ఉద్యోగ భారం, ఇతర సంసార బాధ్యతలు వీటన్నింటింటితో పాటు పిల్లల బాధ్యత, పిల్లల పెంపకం కూడా ఒకానొక బాధ్యతగా లేదా  కర్తవ్యంగానే తల్లిదండ్రులు భావిస్తారు. ఆ సమయంలో తాతలు, బామ్మా అమ్మమ్మలు సంసార బాధ్యతలు చాలామటుకు వదిలించుకుని ఒక విధమైన ప్రశాంత జీవనంలో కి అడుగు పెడతారు. అప్పుడు వారికి కొంత కాలక్షేపం కూడా కావాలి. ఆ కాలక్షేపం వారికి మనవల రూపంగా దేముడు ఇస్తాడని  నేను నా యుక్త వయస్సులోనే  అర్ధం చేసుకున్నాను. అందుకే నా వివాహానికి ముందే మా ఆయనకి ఈ షరతు పెట్టాను " అంది లత.


ఇంతసేపు మౌనంగా కూతురు లత చెప్పిన మాటలు వింటున్న సుధాకర్  అప్పుడే అమ్మమ్మ పెట్టిన బువ్వ తిని మూతి తుడుచుకుంటూ వచ్చి తన వొడిలో కూర్చున్న అభిషేక్ ని నుదుటిమీద ముద్దు పెడుతూ . " తమ పిల్లల బాల్యంలో తల్లిదండ్రులు వారితో చేసిన తప్పులని తిరిగి దిద్దుకోవటానికి భగవంతుడు మరో  అవకాశం ఇలా మనవల రూపం లో ఇస్తాడు "  అన్నాడు తన కన్నీటిని కూతురు లత కి కనిపించకుండా జాగ్రత్త పడుతూ.  ఇంతలో టీ పాయ్  మీద పెట్టిన తన మొబైల్ మోగటంతో అటువైపు వెళ్ళింది లత. " తాతా . నువ్వంటే నాకు ఇష్టం. ఏడవకు " అని అభిషేక్ సుధాకర్ కంటి చివర నుంచి రాలిన కన్నీటి బిందువులని తన చిన్ని చేతులతో తుడిచాడు.   


***

No comments:

Post a Comment

Pages