నన్నునింతగా గడించి నాయమా దిగవిడువ ( తాత్పర్య విశేషాలతో) - అచ్చంగా తెలుగు

నన్నునింతగా గడించి నాయమా దిగవిడువ ( తాత్పర్య విశేషాలతో)

Share This
నన్నునింతగా గడించి నాయమా దిగవిడువ  ( తాత్పర్య విశేషాలతో)
(రచన – పెద తిరుమలాచార్యులు):  రేకు  0003-01 సం:15-014
వివరణ:డా.తాడేపల్లి పతంజలి



పల్లవి:   నన్నునింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించుకోవె అంతర్యామీ
చ.1:      సొమ్ము వోవేసినవాడు చుట్టి చుట్టి వీధులెల్లా
కమ్మర వెదకీనట కన్న దాఁకాను
నమ్మిన ఆజ్ఞానములో నన్నుబడ వేసికొని
అమ్మరో వూరకుందురా అంతర్యామీ
చ.2:       వోడబేరమాడేవాడు వొక్కదరి చేరిచి
కూడిన యర్థము గాచికొనీనట
యీడనే ప్రపంచములో యిట్టే నన్ను దరి చేర్చి
వోడక కావగరాదా వోయంతర్యామీ
చ.3:       చేరి వుప్పమ్మేవాడు చిట్లు వేగనడట
వూరకే శ్రీ వేంకటేశ వోపికతోడ
ఆరయ నన్నుబుట్టించినట్టివాడవు నా
భార మేరీతినైన మోవు మింక నంతర్యామీ
తాత్పర్యం
పల్లవి:
వేంకటేశా ! జీవుడినైన నన్ను ఇంతగా ఇన్ని జన్మలలో కల్పించి- (గడించి-) నీ రక్షణ నువ్వే చేసుకోమని నన్ను విడిచి పెట్టుట (దిగవిడుచుట) న్యాయమా? (న్యాయము కాదని భావం)
ఓ అంతర్యామీ!(లోపలనుండి జీవుని, ఇంద్రియాదులను తమతమ కృత్యములలో నియమించువాడు) ఈసాంసారిక సంబంధమైన ప్రతి విషయంలోనూ నన్ను నువ్వే రక్షించాలి.
చ.1:
దారిలో నడుస్తూ సొమ్ము పోగొట్టుకున్నవాడు మరలా మరలా ( కమ్మర ) ఆ సొమ్ము కోసం వీధులన్నీ చుట్టి చుట్టి. పోగొట్టుకున్న సొమ్ము కనపడే దాక(కన్న దాకాను) వెతుకుతూవుంటాడు.
వేంకటేశ ! నేను కూడా అంతేనయ్యా! అజ్ఞానాన్నినమ్ముకొని భ్రాంతిలో పడి ఆ అజ్ఞానపు దారిలో ఎన్నో జన్మలలో నన్ను నేను పోగొట్టుకొని నాకోసం నేను వెతుక్కుంటున్నాను. ఎంత ఆశ్చర్యం!( అమ్మరో ) ఓ అంతర్యామీ ! నువ్వు చూస్తూ వూరకుండుట న్యాయమా స్వామీ !     ( న్యాయము కాదని రక్షించమని భావం)
చ.2
ఓ అంతర్యామీ ! వేంకటేశ! ఓడమీద చేసే వ్యాపారం చేసేవాడు ( వోడబేరమాడేవాడు, నౌకావ్యాపారం చేసేవాడు) ఒక ఒడ్డుకు ప్రయాణికుల వస్తువులను చేర్చి, అలా చేర్చినందుకు సమకూడిన వస్తురుసుమును ( కూడిన యర్థము, కమీషన్) రక్షించు కొంటాడట.
అలాగే నువ్వు జన్మల ఓడల వ్యాపారం చేసేవాడివి . ఈ శరీరాన్ని ఇవతలి జన్మ నుంచి అవతలిజన్మకు మా కర్మల రుసుముతో చేరుస్తుంటావు.. మళ్లీ మళ్లీ జన్మలెత్తి ఈ శరీరపు వస్తువుతో వ్యాపారం చేయలేను అయ్యా ! కనుక నీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడనే ఈ జన్మలోనే ( ఈడనే) ఈ కనిపిస్తున్న నేను బ్రతుకుతున్న ప్రపంచంలోనే- నన్ను మళ్లీ మళ్లీ అటు ఇటు తిరగని – నీ దరికి చేర్చు.  ఏమాత్రము సంకోచించకుండా( ఓడక) ఈ జీవుని భక్తిని చూసి రక్షించవయ్యా !
చ.3:
ఓ అంతర్యామీ ! వేంకటేశ! ఉప్పుతో దేశవిదేశాలలో పెద్దగా వ్యాపారం చేసేవాడు -చిన్న చిన్న పనులను ,భారాలను లెక్కపెట్టడట. స్వామీ ! నువ్వు కూడా అలానే ఓపికతో నేను చేసిన తప్పులను క్షమిస్తూ- వాటిని లెక్కపెట్టక రక్షించు. నన్ను పుట్టించిన దేవా! నారు పోసినవాడే నీరుపోయాలన్నట్లు – పుట్టించిన నువ్వే – నా ఈ సాంసారిక భారమంతా- ఎలాగైనా మోయాలి. నాకు శక్తి లేదు.
విశేషాలు
అన్నమయ్య కీర్తనల్లో వివిధ సందర్భాలలో ఉప్పుతో, ఓడ తో చేసిన ప్రయోగాలను అర్థాలను,ఈ సందర్భంగా జ్ఞప్తి చేసుకుందాం
ఉప్పు
1.ఉప్పమ్మగొందరు చిట్లు మోయగొందరు - పెద్దపనికి కొందరు - చిన్నపనికి కొందరు;
2.ఉప్పు చింది యినుమడగు ఉప్పొలి కినుమడగు   - కొంత నష్టమైనట్లు కనిపించినా దానివల్ల మరింత లాభం కలుగు
3.ఉప్పొలికి ఇమ్మడి అయినట్లు- నష్టపడు, లాభపడు
4.ఉప్పులో కప్పురమేల- ఒక దానిలో తగనిది  వుండడం
5.ఉప్పువేసి పొత్తు గలియు - కొద్ది త్యాగంతోవాటా పొందు.
6.ఉప్పువేసి పొత్తులు - కొద్దిగా శ్రమపడి పెద్ద లాభాన్ని పొందడం.
ఓడ
1.ఓడ విడిచి వదరిడు - ఓడను వదలి సొరకాయను గ్రహించడం లేనిదాన్ని గ్రహించడం,
2.ఓడతో దూలము -  అవినాభావ సంబంధంతో ఉండేది.
3.ఓడబేరము - ఓడమీద చేసే వ్యాపారం, నౌకావ్యాపారం.
4. ఓడలు బండ్ల వచ్చు  - నేలపై ఓడలు బండ్లపై, నీటిపై బండ్లు ఓడలపై వెళ్లక తప్పదు.
***

No comments:

Post a Comment

Pages