యామాల సామి - అచ్చంగా తెలుగు
“యామాల సామి”
(మా జొన్నవాడ కథలు-10)
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
 (9490400858)


ఆరోజు పుష్య బహుళ ఏకాదశి. సమయం ఉదయం 10.30 గంటలు కావస్తోంది.  దేవళం మూసే సమయం కావడంతో భక్తులతో కిట కిటలాడుతున్నది. ఉన్నట్టుండి దూరంగా కొమ్ముబూర ఊదిన పెద్ద శబ్దం వచ్చింది. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి వీధిలోకి చూశారు. ముందు ఒక దివిటీ పట్టుకున్న వ్యక్తి ఆయన వెనుక ఇద్దరు వ్యక్తులు చేతులో గోతాలతో వస్తున్నారు. వారి వెనుక ఒక గుర్రంపై పసుపు పచ్చని గుడ్డలు వేసుకున్న ఒక ముసలి వ్యక్తి. గుర్రం రకరకాల రంగుల గుడ్డలతో అలంకరించబడి ఉంది.  గుర్రానికి ఇరుప్రక్కల ఇద్దరు వ్యక్తులు ఆయనకు రక్షణగా నిల్చున్నారు. వెనకబాగంలో కొమ్ము బూర ఊదుతున్న వ్యక్తి ఊళ్ళోకి వస్తున్నారు. దివిటీ పట్టుకున్న వ్యక్తి పాట అందుకున్నాడు. "యామాలసామి వచ్చాడండీ..యవన్మందిని రక్షించంగా..వడ్లూ బియ్యం డబ్బులు వేయండి వాత్సల్యమ్మును పొందండీ. ఆశీర్వాదము పొందండి...అందరు శుభముల పొందండి" అని వస్తున్నాడు.  పెద్ద వాళ్ళు "యామాల సామొచ్చాడు" అన్నారు. పిల్లకాయలు గుర్రం వెనుక అరుచుకుంటూ లగెత్తుతున్నారు. ఆ వీధిలో రచ్చబండ దగ్గర ఆ బృందం ఆగింది. 
యామాలసామి మనుషుల సహాయంతో గుర్రందిగి వాళ్ళు  బండపై పరచిన గుడ్డలమీద కూర్చున్నాడు. అందరూ వింతగా చూస్తున్నారు. కొంతసేపటికి నోరువిప్పి "జనులారా! గంగమ్మతల్లి ఆగ్రహించకుండా చూడండి. యామాల బావికి పూజలు చేయడానికి యావన్మంది వడ్లు, బియ్యం, ధనం ఇవ్వండి. సుఖసంతోషాలతో జీవించండి. చొల్లంగి అమావాస్యకు నెల్లూరు దర్గామిట్టకు తరలిరండి. పాతాళ గంగమ్మను సేవించండి. బెల్లం, ఉప్పు నైవేద్యం పెట్టండి" అని చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. అందరూ యధా శక్తి కానుకలు సమర్పించుకున్న తర్వాత ఆ బృందం తరలిపోయింది.
జొన్నవాడ పూజారి కూడా కొంచెం బియ్యం, డబ్బులు ఇచ్చి యామాలసామికి నమస్కరించడం చూసిన పూజారి కొడుకు ఆయనతో  "నాయనా! ఏందిది? ఎవరీన? పచ్చగుడ్డలతో ఉన్నాడేంది? ఎందుకు బియ్యంఇచ్చారు అందరూ” అని ప్రశ్నలవర్షం కురిపించాడు. చుట్టూ ఉన్న భక్తుల్లో కొందరికి కూడా ఆ విషయం తెలియకపోవడంతో "చెప్పండి స్వామీ! ఎవరీ యామాల సామి?" అని గుమికూడి అడిగారు.
దేవళం మూసే టైమయిందని చెప్పి దేవళం తాళం వేసి తాళాలు ఆఫీసులో అప్పజెప్పి వచ్చి మండపంలో కూర్చున్నాడు. భక్తులందరూ చుట్టూ కూర్చున్నారు. పూజారి "నాయనలారా ఇది చాలా పాత కథ. మా తాత నాకు చెప్పింది మీకు చెప్తున్నాను" అంటూ ప్రారంభించాడు.
* * *
అది కొండవీటి రెడ్డి రాజుల కాలం. విక్రమసింహపురి అనబడే మన  నగరాన్ని తమిళులు అప్పట్లోనే వడ్లకు నిలయమనే బావముతో నెల్లూరనే పేరుతో పిలిచేవారు. శ్రీనాధ మహాకవి, అవచితిప్పయ్యశెట్టి అనే ఒక గొప్ప వైశ్యకళావతంసుడూ, ఇద్దరూ ఒకే గురువుదగ్గర విద్యాభ్యాసం గావించే వారు. ఆ తర్వాత శెట్టిగారు సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుని కొండవీటి ప్రభువుకు అమ్మేవాడు. అలాగే అరేబియా దేశం నుంచి గుర్రాలను తెప్పించి లాబానికి అమ్మేవాడు. ఒకవిధంగా రెడ్డి రాజులకు శ్రీనాధుణ్ణి పరిచయం చేసింది కూడా శెట్టిగారేనంటారు. ఆ శెట్టిగారు మనుమడి పేరు యామాల శెట్టిగా పేరుపొందిన వేమాల శెట్టి.  ఆయన గోల్కొండ నవాబుల 'సుబేదారు'  గా పనిచేసే రోజుల్లో జరిగిన విషయమిది. పెన్నానది ఉదృతంగా పారుతుండడం, దర్గామిట్టలోని ఆడవాళ్ళు నీళ్ళకోసం పెన్నకు పోయి అక్కడ సుడిగుండాల్లో మునిగిపోవడమూ,  మొసళ్ళ బారిన పడడమూ తరచూ జరుగుతుండడంతో దర్గామిట్టలో ఒక పెద్ద నూతిని త్రవ్వించాలని నిర్ణయించుకున్నాడు. కూలీలు ఎంత లోతు త్రవ్వినా నీటి జాడ లేదు. కూలీలు మా వల్ల కాదని గడ్డపార పలుగులు పడేసి చీకటి పడుతోందని నీళ్ళు పడవని తేల్చి చెప్పి వెళ్ళిపోయారు. శెట్టిగారికి ఏమి చెయ్యాలో తోచలేదు. ఆయన వాళ్ళ తాత లాగే పరమ శివభక్తుడు. ఊళ్ళో అందరికి బావి త్రవ్విస్తానని మాట ఇచ్చాడు. తన మాట చెల్లలేదు. చాలా బాధ కలిగింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ త్రిశూలం లాంటి పరికరం తీసుకుని ఒంటరిగా బావిలోకి దిగి ప్రార్ధించాడు. నీటి జాడ లేదు. భక్త్యావేశం పెల్లుబికింది. తనను తాను నరబలి ఇచ్చుకుందామని సంకల్పించాడు. "ఓంనమశ్శివాయ!" అంటూ తలమీద శూలంతోబాదుకున్నాడు. రక్తం ధారలుగా వచ్చింది.   వెంటనే నీటి ధార పుట్టి బావి నిండిపోయింది. శెట్టి జలసమాధి అయ్యాడు. బార్య వేమమ్మ భర్త ఇంటికి రాలేదనివస్తే బావిలో శవం తేలుతున్నది.  భర్త పాదాలపై తలను పెట్టి ఒక్కసారి " ఓం నమశ్శివాయ " అంటూ ప్రాణాలను విడిచింది. ఆబావినే ఇప్పటికి యామాలశెట్టి బావి అనే పేరుతో పిలుస్తున్నారు. 
ఆ బావి నీళ్ళు త్రాగడం వల్లనే నెల్లూరు మహిళలు నెరజాణలయ్యారని జనం అంటారు. నెల్లూరు నెరజాణ మాట గురించి ఇంకాస్త వివరంగా జెప్పమని ఒక పిల్లగాడు  కోరడంతో పూజారి నవ్వి “కాంచీపురపు ఏలేశ్వరోపాధ్యాయుని కూతురు చాలా నేర్పరి. ఆమె నెల్లూరు కోడలు. మాటల పొంకమున్న స్త్రీ. ఎన్నో ఛలోక్తులు చమత్కారచేష్టలు ఈమెకు అంటగట్టారు. ప్రతి హాస్య కథ తెనాలి రామలింగనికి అతికించబడినట్లన్నమాట. గడుసుమాటలన్నియు యీమెకే అంకితమై ఉన్నాయి. నెల్లూరు దక్షిణంలో దుర్గామిట్టలోనున్న యామాలసెట్టి (వేములసెట్టి) బావినీళ్లు త్రాగినందునే ఈమెకు యీ చమత్కారము అబ్బినదని ప్రతీతి. కొంతమంది శ్రీనాధుడు ఈ ప్రాంతం సందర్శించినప్పుడు దాహమేయగా ఈ కాంచీపురం అమ్మయి చేతి కుండలో నీళ్ళు తాగినట్టు చెప్తారు. చివరలో  "ఆమె మీరెవరు స్వామీ!" అని అడగ్గా,  ఆయన "శ్రీనాధుణ్ణి… అంటే అర్ధం తెలుసా? ఆడవాళ్ళందరికి మొగుణ్ణి" అని చమత్కరించాడని, దానికి ఆమె "మీ అమ్మకు కూడా మీరు నాధుడా స్వామీ"  అన్నట్టు, శ్రీనాధుడు నివ్వెరపోయి "నెల్లూరు నెరజాణా! నమస్కారం" అని చెప్పినట్టు చెప్పుకుంటారు. కానీ శ్రీనాధుడి తర్వాతి కాలంలో బావి నిర్మిస్తే ఆయన ఈ బావి నీళ్ళు ఎలా త్రాగాడని అడిగే వాళ్ళూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకో మతలబుంది. కొందరు ఈ బావికి వెయ్యేళ్ళ చరిత్ర ఉందని దానికి ఋజువుగా వేములవాడ భీమకవి చెప్పిన పద్యం " శివునికృపఁబుట్టె వేమాల శెట్టి బావి - పరగ జగమెల్ల  నెఱుఁగనేపట్టణమున-నట్టి పట్టణమిలను సౌఖ్యములకునికి - పట్టనందగు నెల్లూరు పట్టణంబు" అని ఆయన నెల్లూరు పట్టణం దర్శించినప్పుడు చెప్పాడు అంటారు. భీమకవి 11వ శతాబ్ది వాడు. అందువల్ల శ్రీనాధుడు నెల్లూరు నెరజాణ అనడంలో తప్పులేదు కదా! ఇదమిత్థంగా ఎవరికి తెలియదు.  అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. ఈమెకు ఎదురు ఉజ్జీ - రావూరు రసికుడు. ఈ గ్రామము నెల్లూరుకు తూర్పున ఉంది. “నెల్లూరు నెఱజాణ - రావురు రసికుడు” అన్నది జంటమాట గా అయిపొయింది. వీరి ఛలోక్తులు చమత్కారాలు ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇంక నాలుగు రోజులలో రాబోయే ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అనీ   కొంతమంది తై అమావాస్య అనీ  అంటారు. ఆ రోజు పెన్ననదీ  స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుని జనం బెల్లం గడ్డలు బావిలో వేసి నివాళు లర్పిస్తారు. "ఈ స్వామి మరీ ముసలాయన లాగా అనిపిస్తున్నాడు స్వామీ!" అని జనంలో ఎవరో అడిగిన ప్రశ్నకు పూజారి "అవును నాయనా! గతంలో పెద్ద స్వామి ముసలివాడయే లోపల ఒక చిన్న స్వామిని తయారు చేసేవారు. ప్రస్తుతం ఈ స్వామి తర్వాత ఎవరూ ఆ వంశంలో యామాల స్వామిగా అవడానికి సిద్ధపడలేదు. అదే ఆయన బాధపడుతూ నాతో చెప్పాడు. వారు ఆ బావికి దగ్గర పెన్నా నది దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో పూజలు అవీ ఇవీ చెయ్యాలి. అక్కడున్న వైద్య వీరరాఘవస్వామి దేవళం వీరి అధీనంలోనే ఉంది. ఈ స్వామి అన్నదమ్ముల పిల్లలంతా ఉద్యోగాలకు వెళ్ళడంతో ఎవరూ ఈ వృత్తిపై ఎవరూ ఆసక్తి చూపలేదు”  అంటూ లేచి ఇంటి దారి పట్టాడు.  
* * *
"నాయినా! ఈరోజు అమవాశంట! మనం నెల్లూరు బోదాం. యామాల సామి బావిని జూద్దాం" అంటూ పిల్లలు గలబా చెయ్యడంతో ఇంటిల్లిపాదిని బయలుదేరదీసాడు కుప్పుస్వామి. బార్య తొందరగా భోజనం తిని నెల్లూరు బొయ్యి మ్యాట్నీ సినిమా అయింతర్వాత బావి కాడికి బోదామని వేసిన ప్లానుకు కుప్పుస్వామి ఒప్పుకోలేదు. "ఎప్పుడూ ఇంతే యెదవ బతుకు..మనకంటే కుక్కలే్‌నయం" అంటూ బుడి బుడి రాగాలు తీసేసరికి అందరూ దగ్గరగా ఉన్న సినిమాహాల్లో సినిమా జూసి అందరూ షేర్ఆటో ఎక్కి దర్గామిట్ట దగ్గరున్న రాంనగర్ చేరుకున్నారు.
అక్కడ వేమాల సెట్టి నిర్మించిన బావి ప్రక్కన వేమాలసెట్టి వంశస్తులు వంశంలో ప్రతి తరానికి ఒకరు యామాలస్వామి గా దీక్ష తీసుకుని జిల్లా అంతా పర్యటించి తీసుకుని వచ్చిన వడ్లు, బియ్యం ధనంతో అక్కడొక వైద్య వీర రాఘవ స్వామి దేవళాన్ని నిర్మించారు. అందులో ప్రాణ త్యాగం చేసిన చిన్ని వేమాలయ్య దంపతుల విగ్రహాలను ప్రతిష్టించారు. దక్షిణ భారతదేశంలో ఇది రెండవ దేవాలయం. మొదటిది తిరువళ్ళూరులో ఉంది. కుప్పుస్వామి కుటుంబం ఆ దేవళాని దర్శించుకుని బావిలో బెల్లం వెయ్యాలని క్యూ లో నిల్చున్నారు, క్యూ లో  ఒక కిలోమీటర్ పైన భక్తులు నిలబడి ఉన్నారు. "సినిమా వద్దే అంటా విన్నా.. ఇప్పుడు జూడు జనాలు ఎంతమందుండారో! ఇప్పుడేడవాల మనం కూచోని" అనేసరికి బార్య ఆండాళమ్మ గయ్యిమంది. "ఆర్నెల్ల కొకసారి నెల్లూరొచ్చి సినిమా జూడకుండా బోతే ప్రక్కింటి సుబ్బమ్మత్త ముందు ఎంత నామర్దా నాకు. దానికి సినిమా కథ జెప్పి ఊరించబళ్ళా!  తాటిచెట్టు మాదిరి పెరిగావేగానీ ఏందెలవదు నీకు" అని ముక్కు చీదింది. "సర్లే కొంపకు జేరేసరికి ఏవరుతుందే ఏమో  కానీండి తొందరగా” అన్నాడు. 
ఇంతలో యామాలసెట్టి గుర్రం డాన్సు ప్రారంభమయింది. గుర్రాన్ని రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉన్నాడు. గుర్రం రెండు కాళ్ళమీద నిలబడ్డం. సకిలించడం చూసి జనాలు సంతోషంతో ఊగి పోతున్నారు.   అరవైఏళ్ళ వృద్ధుడు చేయించే గుర్రం విన్యాసాలకు జనం ఆశ్చర్యపోతున్నారు. గుర్రం దిగి బావి దగ్గరకు వెళ్ళి జనాన్నుద్దేశించి చిన్న ప్రసంగం చేశాడు. ఆ వెనుక  పులివేషాలు, పాముడ్యాన్సులు వస్తునాయి. ఊరేగింపుగా దేవళం దగ్గర  కీలు గుర్రాలు, నెమలివేషాల వాళ్ళ విన్యాసాలు  సాగుతున్నాయి. దారి పొడవునా  పెట్రోమాక్ లైట్స్ వెలుగులో ధగధగలాడిపోతోంది. ఒక ప్రక్క గుడిలో ఉప్పు నైవేద్యం పెడుతున్నారు. బావిని దర్శించుకొని టెంకాయలు కొట్టి సంకల్పం చెప్పుకుని బెల్లం సమర్పించే భక్తులతో దేవళం కిటకిటలాడి పోతూ ఉంది. కుప్పుస్వామి కుటుంబం కూడా మొక్కు చెల్లించుకుని నమస్కరించుకని హమ్మయ్యా అని బయట పడ్డారు.. అప్పటికే దేవళం ముందు జనం పొర్లబడుతున్నారు.

పూజారి  ఈ రోజు ఆఖరు కార్యక్రమం యామాలస్వామికి పసుపునీటి అభిషేకం అని మైకులో ప్రకటించగానే జనం అక్కడ పెట్టిన పసుపునీళ్ళ గంగాళాలముందు గుమికూడారు. పోలీసులు అందరిని దూరంగా నిలబెట్టారు. యామాలస్వామి వచ్చి గంగాళాల ముందు వున్న ఒక రాతి బండపై కూర్చునే ముందుగా పూజారి,  యామాలసామికి  పసుపునీళ్ళు పోయాలనుకున్న  భక్తులు అక్కడ కట్టిన బారికేడ్లలో వరుసగా క్యూలో రావాలని ప్రకటించాక, సామి ముఖ్యవిషయం అని నిలబడేసరికి, జనం అంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. "నెల్లూరు పట్టణ భక్తులారా! ఇతర ప్రాంత వాసులారా! నేను మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి మీకు. నాకు ముసలితనం కన్నా ఈ  కట్టుబాటు నాతో ఆగిపోతున్నదన్న బాధ నన్ను రోజురోజుకూ కృంగ దీస్తున్నది. వచ్చే సంవత్సరానికి నేను జీవించి ఉంటానని కచ్చితంగా చెప్పలేను. మావంశంలో ఎవరూ ఈ దీక్షకు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. నా మరణానంతరం ఏమి జరగాలో ఆ భగవంతుడు ఈ పాటికి నిర్ణయించే ఉంటాడని నమ్ముతున్నాను. మా తమ్ముడి కొడుక్కి పన్నెండేళ్ళు నిండాయి. మా వంశం కట్టుబాటు ప్రకారం పదేళ్ళలోపే ఈ స్వామి దీక్ష తీసుకోవాలి. మా వంశంలో ఎవరూ లేరు. ఈ సమస్యను దేవుడే పరిష్కరించుకోవాలి." గుండుసూది వేస్తే రాలనంత నిశ్శబ్దం ఆవరించింది స్వామి పసుపునీటి అభిషేకానికి కూర్చోబోతుండగా జనంలోంచి "స్వామీ! నేనున్నాను" అన్న కేక వినబడేసరికి అందరూ ఎవరా అని  ఆశ్చర్యంగా చూశారు.
ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళ బుడతడు, అందమైన ముఖ వర్ఛస్సు, విశాలమైన నుదురు, గుండ్రంగా వుండి మెరిసేకళ్ళు, నునుపైన చెక్కిళ్ళు, ఎర్రని పెదవులు కలిగిఉన్న వాడు ముందుకు వచ్చి చెయ్యెత్తి నిలబడ్డాడు. మనిషి తెల్లగా లేకపోయినా నలుపు మాత్రం కాదు. పూజారి "ఎవరు బాబూ నువ్వు? ఎవరి అబ్బాయివి? నీ తల్లిదండ్రులెవరు? అని అడగ్గానే "క్షమించండి. మీ ప్రశ్నల్లో వేటికీ సమాధానం చెప్పలేను. నన్ను దేవా అని పిలుస్తున్నారు. ఆ పేరెవరు పెట్టారో తెలియదు. గూడూరు దగ్గర ఒక అనాధాశ్రమంలో పెరిగాను. నాకులం ఏందో తెలీదు. మతం ఏందో తెలీదు. ఒక ఆరునెలల క్రిందట ఆశ్రమం ఉన్నటుండి మూతపడింది. మేము మళ్ళీ బజార్‌న పడ్డాం. పది మంది పిల్లకాయలం  గూడూరులో ఒక ట్రయిన్ ఎక్కి ఒక్కొక్కరు ఒక్కో స్టేషనులో దిగాలని అనుకున్నాం. నాకు ఇక్కడ దిగాలనిపించింది దిగాను. స్టేషనులో ఏడుస్తుండగా చూసిన ఒక అయ్యవారు స్టవునస్పేటలో తన ఇంటికి తీసుకునిపోయి ఆశ్రయమిచ్చాడు. వాళ్ళకున్న చిన్న హోటల్లో పాత్రలు శుభ్రం చేస్తున్నాను. పొయిన నెలలో మీరు గుర్రంపై వచ్చినప్పుడు అందరూ తరువాతి యామాలస్వామి ఎవరూ లేరు అన్న మాటలు మాట్లాడుకోవడం విన్నాను. మా అయ్యవారిని  నేను సామి నవాలనుకుంటున్నాను అనగానే కులం గోత్రం లేని వాడివి నోరు మూసుకో! అన్నాడు. నాకు తెలుగు చదవడం వ్రాయడం మాట్లాడడం బాగావచ్చు. మీకు ఇష్టమైతే నేను సిద్ధంగా ఉన్నాను" అన్నాడు. స్వామి ఒక్కక్షణం పైకి చూసి ఆ వీరరాఘవస్వామే పంపించి ఉంటాడన్నట్టు  గుడివైపుకు చూసి దండం పెట్టాడు. ఆ తరువాత గుడిలో ప్రతిష్టించి ఉన్న తమ పూర్వీకుల విగ్రహాలకు సాష్టాంగనమస్కారం చేసి వచ్చాడు.  పూజారి మాత్రం ఆగ్రహంగా బాలుని వంక చూస్తున్నాడు.  "పూజారి గారూ! మీ మౌనమెందులకు చెప్పండి" అనగానే  "బాబూ! నీవెవరో తెలియదు. నీ కులగోత్రాలు తెలియదు. అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడంలేదు" అన్న మాటలకు యామాలస్వామి అందుకుంటూ.. గురువర్యా! ఒక్క క్షణం ఆగండి. నా మాటలను వినండి. కర్మ చండాలుని కంటే, జాతి చండాలుడు మేలు అనే సామెత మీరెరుగనిది కాదు.   భక్తివిహీనులు చేసే జపతపాలు, వ్రతాలు, వేదాధ్యయనము, యజ్ఞాలు, శాస్త్రపఠనాలు,  అన్ని గూడా వ్యర్థమే అని నారద పురాణంలో చెప్పలేదా? భక్తి గల చండాలుడు కూడా బ్రాహ్మణునికంటే అధికుడే. భక్తిలేని బ్రాహ్మణుడు కూడా చండాలుని కంటె అధముడు అని మీరే ఒకసారి ప్రవచనంలో చెప్పారు. ఇంతెందుకు ఆదిశంకరుల వారు ఒకరోజు గంగానది వైపు వెళ్తుండగా మార్గమ`ధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఏమన్నాడు? సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కానేరదు అన్న వెంటనే తప్పిదం తెలుసుకున్న  శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారని మీరే ఒక  నాడు మాకు సెలవిచ్చారు. వాల్మీకి, వ్యాసులవారు, విశ్వామిత్ర మహర్షి ఎవరు?  మీకు నీతులు చెప్తున్నానని అనుకోవద్దు. దయచేసి ఈ యామాలస్వామి కట్టుబాటును కొనసాగనివ్వండి” అని చేతులు జోడించి ప్రార్ధించి బండపై అభిషేకానికి కూర్చున్నాడు.. పూజారి ఆ పిల్లవాని ఎత్తుకొని స్వామి ఒళ్ళో కూర్చుండబెట్టడంతో అందరూ సంతోషంగా చూశారు. కృతనిశ్చయంతో "నాతో పాటూ ఈ దేవస్వామికి కూడా పసుపునీళ్ళ అభిషేకం జరిపించండి"  అని రెండు చేతులూ ఎత్తి జనాన్ని కోరాడు. అప్పటిదాకా ఏమి జరుగుతుందో అని ఉత్కంఠగా చూస్తున్న భక్తులు పెద్ద పెట్టున హర్ష ధ్వానాలు చేశారు. "చిన్న యామాల సామికి జై" అని అరిచారు.  డప్పుల వాళ్ళు చెవులు చిల్లులు పడేట్టు తప్పెట్లు  వాయిస్తున్నారు. ఇద్దరికి అభిషేకం జరిగింది. పెద్దస్వామి చిన్న స్వామిని గుర్రంపై ఎక్కించుకుని దర్గామిట్ట మొత్తం తిప్పి పరిచయం చేశాడు. 
* * *

కుప్పుస్వామి భార్య జొన్నవాడ బస్సెక్కుతూ "ఏమయ్యో! ఈ మందల ముందలే తెలిసుంటే మన పిలగాళ్ళల్లో ఒకణ్ణి యామాల్‌సామికిచ్చేదాన్ని గదూ! మంచి ఆదాయమంట. గుడి మాన్యాలు శానా ఉన్నయంట. నాకొడుకు హాయిగా రాజా మాదిరి గుర్రమెక్కి తిరిగేవాడు దేనికైనా అద్రుష్టముంబళ్యా మన మొగాన!"   అన్న మాటకు టవల్ అడ్డుపెట్టుకుని నవ్వుకున్నాడు తప్ప జవాబియ్యలేదు కుప్పుస్వామి.  
-0o0-

No comments:

Post a Comment

Pages