ఎన్నడు దెలిసే మెచ్చరికెపుడో - అచ్చంగా తెలుగు

ఎన్నడు దెలిసే మెచ్చరికెపుడో

Share This

 తాళ్లపాక అన్నమాచార్య   అధ్యాత్మ సంకీర్తన

రేకు: 258-6  సంపుటము: 3-336

- డా.తాడేపల్లి పతంజలి 



॥పల్లవి॥

ఎన్నడు దెలిసే మెచ్చరికెపుడో

ఇన్నియు గన్నవె యెఱిగీ నెఱగ

01 వ చరణం     

నిన్నటియాకలి నేడూ నున్నది

కన్నదినంబే కడచనెను

పన్ని నిదుర మాపటికి నున్నదదె

యెన్నగ రాతిరి యెందో పోయ        ॥ఎన్న॥

02 వ చరణం

కాయపు సుఖములు గంపల నున్నవి

పాయమే కైవాలి పండెనదే

యీయెడ సంసార మింటనే వున్నది

చేయును నోరును చెనటై నిలిచె       ॥ఎన్న॥

03 వ చరణం

విడువని జన్మములు వెంటనే వచ్చీ

తడవేటి మోక్షము దవ్వాయ

యెడపక శ్రీవేంకటేశ నీ మఱగు

బడి జొచ్చితి నా భారము నీది        ॥ఎన్న॥


తాత్పర్యము:

 

పల్లవి॥ వేంకటేశా! మాకు ఎప్పటికి తెలుస్తుంది అయ్యా! మేము జాగ్రత్త పడేది ఎప్పుడుమేలుకొనేది ఎప్పుడుఇన్ని విషయాలు (చరణాలలో చెప్ప బోవు విషయాలు) అన్నీ చూస్తున్నవే!

 అన్ని తెలిసిన  వాడను నేనే! తెలియని వాడను నేనే!

01 వ చరణం     

నిన్న పుట్టిన ఆకలి ఈ రోజు కూడా ఉంది . నేను చూస్తున్న రోజు నా ఎదుటే  నశిస్తున్నది.

నువ్వు కల్పించిన నిద్ర రాత్రి అయ్యే సరికి సిద్ధంగా ఉంటుంది .

ఈ రాత్రి ఎక్కడ కలిసిపోతుంది అని ఆలోచిస్తే అంతు పట్టడం లేదు.


02 వ చరణం                                          

ఈ శరీరానికి కావలసిన సుఖాలన్నీ సమకూరాయి.

పండిన పైరు భూమిపై వ్రాలుతున్నట్లుగా  నా వయస్సు పండి పోతున్నది.  నేలను కరుచుటకు సిద్ధంగా ఉంది.  ఈ సందర్భంగా ఈ సంసారమంతా  నా శరీరమనే ఇంట్లోనే ఉంది. నా చేయి ,నా నోరు వయసు మీద పడుతున్న కొద్దీ నా వశములో లేక వ్యర్థంగా ఉన్నాయి.

 

03 వ చరణం

 నన్ను విడిచి పెట్టకుండా ఎన్నెన్నో  జన్మలు  వెంటవెంటనే వచ్చాయి కానీ ఎంత వెతికినా ఆ మోక్షం మాత్రం దూరంగా ఉంది.

 

 శ్రీవేంకటేశ ! ఎప్పుడు తల్లి చాటున పిల్లవాడు రక్షణ కోసం దాగి ఉన్నట్లుగా నీ చాటున   నేను నీ శరణు కోరుతూ దాగి ఉన్నాను .నీ పాదముల త్రోవలో నిన్ను ఆశ్రయిస్తూ ప్రవేశించాను .ఇక నా భారం అంతా నీదే.

***

No comments:

Post a Comment

Pages