మోహావేశమ్ - అచ్చంగా తెలుగు

 మోహావేశమ్ 

-శ్రీనూ వాసా


చాలా పరిశుభ్రత, ఏసీ చల్లదనం ఆహ్లాదాన్ని కలిగిస్తున్నా, స్పిరిట్, మందుల వాసనతో కూడిన హాస్పిటల్ వాతావరణం కాస్త ఇబ్బందిగానే ఉంది శ్రీధర్ కి. ఈరోజంతా తప్పదు, అక్కడ ఎదురుచూడాల్సిందే. సాయంత్రం తమ్ముడొచ్చేవరకూ తనకు డ్యూటీ తప్పదు. లోపల ఐసీయూలో తండ్రి కి కావలసిన వన్నీ వాళ్ళే చూసుకున్నా మొత్తానికి వాళ్ళకే వదల్లేక అక్కడే ఉంటున్నారు అన్నదమ్ములిద్దరూ, ఒకరితరవాత ఒకరు.

రెండుగంటలు ఎత్తిన బుర్ర దించకుండా మొబైల్ చూసి చూసి బోర్ కొట్టేస్తోంది. మూలగా ఒక చైర్ చూసుకుని కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తున్నాడు.

తెల్లని పాలరాతి శిల్పాన్ని చెక్కి అక్కడ పెట్టినట్టు నుంచునుంది. అందమైన కళ్ళు, బాపూ బొమ్మలా పొడవైన జడ. దేవుడు కొంతమందిని అంత పెర్ఫెక్ట్ గా పుట్టిస్తాడు అనుకొన్నాడు మనసులో. సభ్యత కాకపోయినా కళ్ళు తిప్పుకోలేని అందం ఆమెది. మెడలో నల్లపూసలు చూసి కూడా దృష్టి కాస్త క్రిందికి దిగి, అక్కడే చాలాసేపు నిలిచిపోయింది. ఎన్నో ఊహలు మెదడులో రెక్కలు తొడిగి ఎక్కడికో మేఘాలంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాయి!

ఊహల్లోంచి బయటికొచ్చేసరికి తను అక్కడ లేదు.. కానీ కళ్ళు ఇంకా అక్కడే చూస్తున్నాయ్. తనలో తనే నవ్వుకుని ఈలోకంలోకి వచ్చాడు పూర్తిగా.

***

సాయంత్రం ఆరయింది. తమ్ముడికోసం ఎదురుచూస్తూ కారిడార్లో అటు ఇటు నడుస్తూ, సడెన్ గా ఆగిపోయాడు ఎదురుగా కనిపించిన దృశ్యంచూస్తూ.. పొద్దున్న తను చూసిన ఆమె వీల్ చైర్ లో..సెలైన్ ఎక్కించుకుంటూ, ఆకుపచ్చరంగు దళసరి బ్లాంకెట్లో, అప్పుడే ఆపరేషన్ చేయించుకుని బయటికొస్తూ!

ఏమైందో తెలుచుకోవాలన్న కోరిక అణచుకోడానికి ప్రయత్నిస్తున్న శ్రీధర్ కి లీలగా వినిపించాయి పక్కన ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకొంటున్న మాటలు... స్థనాల్లో కంతులు తొలగించారని, కేన్సర్ అని అనుమానం, బయాప్సీకి సాంపుల్స్ పంపించారు, రిసల్ట్స్ ఇంకారావలసి ఉంది, ఈలోగానే వాటిని ఆపరేషన్ చేసి తొలగించారు!

నిశ్చేష్టుడైన   శ్రీధర్ తమ్ముడి పిలుపుతో ఈలోకంలోకి వచ్చాడు.. దూరంగా గుడిలోని మైక్ నుంచి వినిపిస్తుంది ఎమ్మెస్స్ సుబ్బులక్ష్మి భజగోవిందం.. "నారీ స్తనభర నాభీదేశం. దృష్ట్వా మా గా మోహావేశమ్ |. ఏతన్మాంస వసాది వికారం. మనసి విచింతయా వారం వారమ్"

*** 

No comments:

Post a Comment

Pages