ఆశ - అచ్చంగా తెలుగు

 ఆశ

  పి.యస్.యమ్. లక్ష్మి

 

అమ్మా, అమ్మా  ఐదేళ్ళ వరుణ్ వాకిట్లోంచి కేక పెట్టాడు. ఇంట్లో పనిలో వున్న సరళ ఏమిట్రా అందిగానీ బయటకి రాలేదు.  ఒక నిముషం చూసి వాడే లోపలకొచ్చి సరళ చెయ్యి పట్టుకుని బయటకి రమ్మని లాగసాగాడు.

ఏంటి నాన్నా, పని వుందిరా  అంది సరళ

నీకెప్పుడూ పనే.  నేనేం చెప్పినా వినిపించుకోవు.  ఆ బుజ్జి పిట్ట చూడు .. ఏ పని లేకుండా ఎలా తిరుగుతోందో .. రా..అంటూ లాక్కొచ్చాడు వాళ్ళమ్మని బయటకి.

ఇడ్లీ కుక్కర్ పెట్టటం అయిపోయింది.  అవి వుడికేలోపల వాడి సంగతి చూసొద్దామని సరళ బయటకొచ్చింది.  చిన్న పిల్లలు వున్న తల్లులకంతే.  పనే తీరదు.  ఇంట్లో పనో, పిల్లల పనో, ఏదో ఒకటి ఎప్పుడూ వుంటుంది.

సరళ చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి బయట సిమెంట్ తో చేసిన పెద్ద కరెంటు స్తంభం మీదనుంచీ, ఎదురింటికీ, పక్కనున్న చెట్టుమీదకీ చకచకా గెంతుతున్న బుజ్జి పిట్టని చూపించాడు వరుణ్.  సరళ కూడా దాన్ని చూసి ముచ్చటపడి బాగుందిరా అంది.  

నువ్వెప్పుడూ పనంటావు .. చూడు అది ఏ పనీ లేకుండా ఎలా ఎగురుతోందో!  అమ్మా, పిట్టలకి పనులుండవా?  వాటికి పిల్లలుండవా?  అవి అన్నం ఎలా వండుకుంటాయి?”  వాడికొచ్చిన అనుమానాలు బయట పెట్టాడు.

పిట్టలు అన్నం తిన్నా అవి వండుకోవు నాన్నా.  వాటికి చేతులు లేవుకదా.  పైగా అవి బుజ్జి బుజ్జివి. సరళ చెప్పటానికి ప్రయత్నించింది.

మరి అవి అన్నం ఎలా తింటాయి?”

నోటితో తింటాయి.  నేలమీద మనం పడేసిన మెతుకుల్నీ, గింజల్నీ, చిన్ని చిన్ని పురుగుల్నీఏరుకు తింటాయి. 

మరి వాటి పిల్లలెక్కడుంటాయి?  వాటికి ఇల్లుండదా?”

వాటికి మనింటికిమల్లే పర్మనెంట్ ఇల్లుండదురా.  అవి పిల్లల్ని పెట్టేటప్పుడు చెట్టు కొమ్మల మధ్య గూడు కట్టుకుంటాయి.”

మరి చెట్టు మీదకి సిమెంట్, నీళ్లు ఎలా తీసుకెళ్తాయి?”

దేనికి  గూళ్ళు కట్టుకోవటానికా!?  అవి సిమెంట్ తో కట్టుకోవు.  చిన్న చిన్న పుల్లలతో, పక్షి ఈకలతో, దారాలతో అన్నీ, ఒక్కొక్కటీ ముక్కుతో తీసుకెళ్ళి పేర్చి కట్టుకుంటాయి.  వాటిలో గుడ్లని పెట్టి వాటి మీద కూర్చుంటాయి.   ఈ పిట్ట కూడా ఆ చెట్టు కొమ్మల్లో గూడు కట్టుకోవటానికి చూస్తున్నట్లుంది.  అదిగో చూడు .. ఆ పిట్ట ముక్కుతో పుల్లని పట్టుకెళ్తోంది. 

అమ్మో, గుడ్లు పగిలిపోయి అంతా కేక్ కాదూ?”  వరుణ్ అనుమానం తీరలేదింకా.

కాదు నాన్నా..పగలకుండా నెమ్మదిగా కూర్చుంటాయి.  ఆ వేడికి గుడ్లల్లోంచి పిల్లలు బయటకొస్తాయి.

మరి పిల్లలకీ వాటికీ ఆ గూడు సరిపోతుంతా?  చిన్నదేగా.

సరిపోతుందిరా.  పిల్లలు చిన్న చిన్నవికదా.  పైగా మీకు మల్లే వాటికి మంచాలవీ వుండవుకదా.  ఆ గూట్లోనే, అలాగే నిద్రపోతాయి.

టూ బేడ్ కదమ్మా.  పాపం పుల్లలు గుచ్చుకోవూ?”

వాళ్ళమ్మ చాలా తెలివిగలదిరా.  ఆ పుల్లలు వాటికి గుచ్చుకోకుండా సర్ది అల్లుతుంది ఆ గూడుని.

మరి పిట్టలయితే గింజలూ, పురుగులూ తింటాయన్నావుకదా.  పిల్లలేం తింటాయి?  అవీ ఎగిరి వెళ్తాయా?”

పిల్లలు వెంటనే ఎగరలేవురా.  అవి కొన్ని రోజులు అలా గూట్లోనే వుంటాయి.  వాటి రెక్కలకి బలం వచ్చాక అవీ ఎగిరిపోయి వాటి ఆహారం అవే సంపాదించుకుంటాయి.  అప్పటిదాకా వాటికి అమ్మా, నాన్నా, నోటితోనే ఆహారం తీసుకొచ్చి వీటి నోట్లో పెడతాయి.  బలే బాగుంటుంది చూడటానికి. నేను నీకు వీడియోలో చూపిస్తానులే.   పిట్టలు గూడా కట్టుకోవటం, పిల్లలకి ఆహారం పెట్టటం అన్నీ.  

నాకు వీడియోలో వద్దమ్మా.  నిజంగా చూస్తాను.  బలే బాగుంటుంది కదా..

బాగుంటుంది.  మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం.  పిట్టలు మంచి ఇంజనీర్లురా. అవి ఎక్కడా చదువుకోకపోయినా,  రకరకాల పిట్టలు రకరకాల గూళ్ళు కడతాయి.  ఇప్పుడు ఎవరికీ చెట్లు పెంచే తీరిక లేదు.  స్ధలం లేదు.  ఎక్కడా చెట్లకి ఖాళీ లేకుండా ఇళ్ళు కట్టేస్తున్నారు కదా.  అందుకే పాపం పిట్టలు కూడా గూడెక్కడ కట్టుకోవాలో తెలియక వెతుక్కుంటున్నాయి.  మీరు చక్కగా చెట్లని పెంచాలిరా.  బోలెడు చెట్లని పెంచుతే ఆ చెట్లమీదకి పిట్టలొస్తాయి.  మీరు రకరకాల పిట్లల్నీ, అవి గూళ్ళు కట్టుకోవటాన్నీ చూడచ్చు.

అలాగేనమ్మా, ఇవాళే మనం మంచి మొక్క కొనుక్కొచ్చి మనింటి ముందు పెడదాం.  నేను రోజూ నీళ్ళు పోసి పెంచుతాను.

పెడదాం నాన్నా.. నువ్వు పెద్దవాడివైనా, నీ పిల్లలయినా వాళ్ళ చిన్నతనంలో ఈ చెట్లమీద పిట్టల్ని చూస్తారు.అన్నది ఇప్పటి పిల్లలకి నేర్పితే ముందు తరం పిల్లలన్నా ప్రకృతిసౌందర్యాన్ని చూస్తారనే ఆశాభావంతో. 

***

No comments:

Post a Comment

Pages